ఇంతసేపు చూస్తున్నా వాళ్ళిద్దరి భాగోతం అంతుపట్టలేదు నాకు. "ఎయ్ పిల్లా నీకు బుద్ధుందా లేదా? ఆ మోపు నీవు మోయలేని దానివి మీ అమ్మ ఎత్తుకొస్తానంటే యీయవేం, నీవు మోయలేవు మీ అమ్మకీయవు, దానికోసం చచ్చేట్లు దెబ్బలు తింటూ కూడా వదలవేం, హాయిగా మీ అమ్మ ఎత్తుకొస్తానంటే నీకేం బాధ" కసిరాను. ఇందాకటినించి ఆ పిల్లమీద జాలి దాని మొండితనం చూడగానే కోపంగా మారింది. చూసేవాళ్ళకి ముందు అలా కొట్టడం తల్లి తప్పులా కనిపించినా ఇప్పుడు కూతురి మొండితనం విసుగు కల్గిస్తూంది. అసలా కర్రలు వదలక పోవడంలో ఆ పిల్ల ఉద్దేశం ఏమిటో అర్థంకావడంలేదు. ఆ కర్రల మోపు తన ప్రాణంలా విడవకుండా పట్టుకోవడం, ఎంత బరువున్నా తనే మోసుకొస్తాననడం ఏదో వింతగా కన్పించింది.
"నా నీయనం డమ్మగోరూ.... అ మోపు నాది.... పొద్దుటేలంతా కర్రలు కొట్టాను. యీ కడకి లాక్కొచ్చినాను నా నమ్ముకుంటే నాకు రెండు రూపాయలొస్తాయి.... నాను మోపు ఒగ్గను...." ఏడుస్తూనే అంది ఆ పిల్ల!
"మీ అమ్మ ఎత్తుకెళ్ళి అమ్ముతుందిగా. మీ అమ్మే గదా, దానికీయడానికేం...." మా ప్రక్కింటావిడ ఆశ్చర్యంగా అడిగింది.
"నాను డబ్బులు ఈయకపోతే మా అమ్మకూడెట్టదు.... కర్రలమ్ముతే రూపాయిస్తే ఆ డబ్బు లట్టిగెడితేనే కూడెట్టతది...." ఆ పిల్ల ఏడుస్తూనే అంది.
"ఏటే నంజా....నీకు కూడెట్టకుండానే గాలికి పెరిగావుటే ఇన్నాల్లు....నీకు కూడు పెట్టకుండా మాడ్చి సంపుతున్నానని సెపుతున్నావా.... అంటూ మీద మీదకివచ్చి కూతురి జుట్టు పట్టుకుంది.... "పూటకి మూకుడు సెల్లిస్తావు నీ అబ్బ ఎవడే నీకు పెడ్తున్నాడు...."
"ఊరికే ఎడ్తున్నావేటి. నాను డబ్బులట్టుకొస్తే పెడతావు నేకపోతే ఇన్ని గంజి నీళ్ళు పోస్తావు నా మొహాన.... ఇప్పుడీ కర్రలట్టుకెళ్ళి నీవమ్ముకుంటావు. నాను డబ్బులు ఈయనేదని నాకన్ని గంజినీళ్లు పోసి నీవు కూడు మెక్కుతావు".... తల్లిని కొరకొర చూస్తూ ఆ పిల్ల ఆవేశంగా అంది.
"నీజిమ్మడ...." అని కూతుర్ని మెటికలు విరిచి తిట్టి సూసారమ్మగోరూ గుంటనంజ మాటలు. కూతురికి తిండెట్టకుండా తల్లి మాడ్చి పంపేస్తదా.... నలుగురినీ చూస్తూ అంది తల్లి.
"ఎప్పుడెట్టావు నాకు? డబ్బునీయక పోతే చావు ముండా అంటూ మూకుట్లో యిన్ని గంజినీళ్ళు పోస్తావు. డబ్బులిచ్చిన నాడు కూడెడతావు.... నిన్న డబ్బులీయలేదని కూడెట్టా?" నిలేసింది కూతురు....
అందరం విచిత్రంగా ఆ తల్లీ కూతుళ్ళని చూస్తూ, వాళ్ళ వాదనని వింతగా వింటున్నాం. అప్పటికి వాళ్ళిద్దరి గొడవ అర్థం అయింది నాకు. కూతురు రోజూ సంపాదిస్తే తప్ప తల్లి తిండి పెట్టదన్న మాట! తను కర్రలమ్మి డబ్బిస్తేగాని తల్లి తిండి పెట్టదన్న భయంతో కర్రలు ఎత్తుకోని ఓపిక లేకపోయినా ఆ కర్రలు తనే పట్టుకెళ్ళి అమ్ముకోవాలని ఆరాటపడ్తూంది ఆ పిల్ల. అందులో నిన్ననుకూడా తిండిలేదు కనక. యీ పూటన్నా డబ్బులు యిచ్చి తిండి తినాలని ఆ పిల్ల ఆశ! ఆ ఆశతో చచ్చే దెబ్బలు తింటుంది! ఆహా, ఆకలి మహిమ అనుకున్నాను. ఆ తల్లిని చూస్తుంటే ఏవగింపు కల్గింది! పట్టుమని పదేళ్ళు లేని పిల్ల తన తిండికి తను డబ్బులు సంపాదిస్తేనే తిండి పెడ్తాననేటంత కఠినంగా ఏ తల్లేనా వుంటుందా.... ఇంత కర్కోటకపుదా అనిపించింది. అందరి మొహాలలోనూ అదే భావం తొంగిచూసి ఆ తల్లిని ఏవగింపుగా చూశారు అందరూ. మా మొహాలు చూస్తూ మా భావం గ్రహించినదానిలా ఆ తల్లి....
"ఏటి సెయ్యనండమ్మగారూ, నలుగురు పిల్లలు, అంతా సంటివాళ్లు. యిదే కాస్త చేతికందొచ్చింది. నల్గురు పిల్లల్ని కన్నాం మొగసచ్చినోడు నన్నొగ్గి మరొకత్తిని తెచ్చుకున్నాడు. ఈ పిల్లలు నాపాల పడ్డారు, నలుగురు గుంటెదవల్ని ఏటిపెట్టి పోసించను. కాయకష్టం సేసుకుని ఏ రోజు డబ్బు ఆరోజు తెచ్చుకుంటే తప్ప నోటి కాడకి కూడు రాదు. నానొక్కదాన్ని నలుగురు సంటిపిల్లల్ని ఎలా సాకను! ఇది సేతికందొచ్చింది కాస్త దీన్ని యింకా కూకోపెట్టి తిండెట్టడానికి నేను మీలా వున్నదాన్నా తల్లీ, దీని తరువాతది కుండా మండా కడిగి యింత ఉడకేసి సంటిపిల్లల్ని చూసుకుంటుంది యింటికాడ. దీన్ని నాతో పుల్లలు ఎరుకు రావడానికి తీసికెడతాను. ఇదో రూపాయి డబ్బులు తెస్తే, నానో రెండు రూపాయలు తెచ్చి అవి ఇవి కలిపి అందరం యిన్ని గంజినీళ్ళు త్రాగుతున్నాం.... యీ గుంట సచ్చింది తిని కూకుంటానంటే నే నేడినించి తెచ్చి దీనికి ఎడతాను! ముండ పుల్లలేరే అంటే ఏ చెట్టు చాటునో కూకుని ఆటలాడుకొని, పూలు ఏరుకుంటూ నాలుగు పుల్లలు కొట్టేది. ఓ మోపట్టు కెళ్ళి అమ్ముకుంటే రూపాయి డబ్బులు వస్తాయి కొట్టే అంటే నాలుగు పుల్లలు కొడితే నాను ఏటి సేస్తాను చెప్పండమ్మగారూ, నేనేడనించి తెచ్చి యీ గుంట వెధవల్ని మేపను! దొంగ నంజకి ఇదే మందని రూపాయట్టుకురాని నాడు కూడెట్టను పో అని గంజినీళ్ళు పోసేసరికి నంజ నొంగి వచ్చింది. ఇప్పుడు రోజూ మోపటుకెళ్ళి అమ్ముకొస్తుంది. రూపాయి డబ్బులు తెస్తది...."
"మరి___రోజూ మోపు మోసుకెళ్లేది కదా యివాళ ఎందుకు ఎత్తుకోలేక పోతూంది" ఒకావిడ అడిగింది.
"గుంటకి ఆశ లావు అయింది-రూపాయి నాకిచ్చి మరో రూపాయెట్టి చిరుతిళ్ళు కొనుక్కుతిండానికి యింత లావుమోపు కట్టింది. ఎత్తుకోనేవే నంజా అంటే యినుకుంది కాదు. ఎండ మాడిపోతంది.కాల్లు బొబ్బ లెక్కాయి. యీడదాకా పడుతూ లేస్తూ మోసుకొచ్చింది. కల్లు తిరుగుతూండాయి. కాళ్లు తేలిపోతండాయి అని యీడ కూలబడింది. మోపు ఎత్తుకోలేక పోతుంది. నాకీయే అమ్ముకొస్తా అంటే ఒగ్గదు, దాని రూపాయి డబ్బులు నే తినేస్తానని భయం దానికి...."
అంతా పూర్తిగా అర్థం అయింది. ఆ తల్లి నీ తప్పు పట్టేందుకు కనపడలేదు. రూపాయి పెట్టి చిరుతిండి తినాలనే ఆపిల్ల ఆశ అత్యాశ కాదు!.... డబ్బు లేకుండా కూర్చుండబెట్టి పోషించలేని తల్లి అశక్తత అన్యాయం అనలేం.
అంతా కలిసి ఆ కూతురికి తల్లికి రాజీ కుదిర్చి మోపులో సగం తల్లి మోసేట్లు, రోజూ ఇచ్చే రూపాయి కాక మిగతాది కూతురికే తల్లి వదిలేసేట్టు బోధ పరిచాం అందరం కలసి. కూతురి మోపులో సగం కఱ్ఱలు తన మోపులో కట్టుకుంది తల్లి. మిగతా సగం మోపు ఎత్తుకుని పిల్ల బయలుదేరింది.
"వెధవలు ఆలగా వెదవలు తల్లి కూతురు చూడు రూపాయ డబ్బుల కోసం ఎలా కొట్టుకు చస్తున్నారో" అంది ఎదురింటావిడ. (ఆవిడ మొగుడికి వెయ్యి రూపాయలు జీతం)
నిజమే, రెక్కలొచ్చిన పక్షులని పొడిచి పొడిచి గూట్లోంచి తరిమే పక్షులకి, పిల్ల పెద్దయ్యాక దగ్గరకొస్తే కొమ్ములతో పొడిచే పశువులకీ వీళ్ళకి తేడా ఏముంది అన్పించింది. అందరం లోపలికి వెళ్లబోయాం_
అంతలో కాన్వెంట్ బస్సు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ దిగారు. మా రవి దిగి వచ్చాడు.... 'అయ్యయ్యో.... ఏమిటిరా ఆ మొహం, అలా మాడిపోయిందేమిట్రా,ఈ చెమటలు ఏమిట్రా, ఏం స్కూళ్లో సగం ఎండాకాలం అయ్యేదాకా శలవలు యీయరు. ఈ పిల్లలు యీ మండుటెండలో మసిబొగ్గుల్లా తయారవుతున్నారు' అని విసుక్కుంటూ గబగబా వాడ్ని యింట్లోకి తీసికెళ్ళాను. ఫ్యాను వేసి కూర్చోపెట్టాను. ఫ్రిజ్ లోంచి చల్లనినీళ్లు తీసిచ్చాను. వాడి యూనిఫాం, బూట్లు విప్పి చన్నీళ్ళతో మొహం వళ్ళు కడిగి బట్టలు మార్చి, కడుపునిండా పెరుగు, అరటిపళ్లు అవి వేసి అన్నం పెట్టాను. వాడన్నం తింటున్నంతసేపూ__ వాడి వయసే వున్న ఆ పిల్ల తన తిండికోసం ఎంత కష్టపడుతూందో, ఎన్ని దెబ్బలు తిందో కళ్ల ముందు కదిలి, ఆ పిల్లమీద జాలి, ఎంత సమర్థించినా, ఆ తల్లి పట్ల విముఖత కల్గాయి. మాతృత్వంలో మమతని కూడా మరిచిపోయిన ఆ తల్లిని క్షమించలేకపోయాను___ తల్లి బిడ్డకోసం తన ప్రాణాలన్నా అర్పించుతుంది అంటారే!___ ఆమాట అబద్ధమా?!
