గోమాతికి సిగ్గు భయం కలుగుతున్నాయి. వంటరిగా ఓ పురుషుడితో తను ఈ అరణ్యంలో....ఆపై ఊహించటం మానేసింది.
"వంటరిగానే ప్రయాణం చేస్తున్నావా గోమతీ!"
"అవును. స్టేట్స్ లో వున్న గిరిధర్ నందన మా అంకుల్, ఇదే మొదటిసారి పరాయి దేశానికి నేను టూర్ బయలుదేరటం"
"విమానం ఎక్కటం?"
"అయిదారు సార్లు ఎక్కాను. అన్నట్లు మన మెక్కిన విమానం...."
"ప్రమాదానికి లోనయింది. కాలిపోయి ముక్కలుగా మారి మానని ప్రాణంతో వుంచి కొందరి ప్రాణం తీసింది."
"ఇప్పుడెలా మనం వెళ్ళటం?"
"కాలినడకన" తాపీగా జవాబిచ్చింది కీర్తి.
గోమతి తలెత్తి కీర్తి వైపు చూసి టక్కున తలదించేసుకుంది. కీర్తి ఎగతాళి కంటున్నదో నిజంగా అంటున్నదో గోమాతికి తెలియలేదు. కాసేపాగి"ప్రమాదం జరిగి ఎంతసేపయింది?" అని అడిగింది గోమతి.
"ఎంతసేపు కాదు గోమతీ! ఎన్ని రోజులయిందనిఅడుగు కరెక్టుగ-చెపుతాను."
"ప్రమాదంలో వున్నాసరే ఆడపిల్ల అనంగానే వేళాకోళం చేస్తారు." గోమతి బాధ పడుతూ అంటుంటే నవ్వొచ్చింది కీర్తికి.
"నుంచోటానికి నాకాలు నెప్పిపుడుతున్నది కూర్చోగోమతీ! వివరంగా చెపుతాను." అనికీర్తి కూర్చుంది.
గోమతి ముడుచుకొని కూర్చుంది.
"ఈ విమాన ప్రమాదంలో బ్రతికి బైట పడటం వింత. ఒకరికి ఇద్దరం ఆ మృత్యువుని జయించటం మరింత వింత. ఇది చూస్తూంటే ఇంకా ఎవరైనా జీవించి వున్నారేమో అనిపిస్తున్నది. నేకూర్చున్న సీటు అలాగే కిందకు పడింది. క్రిందంతా నత్తుగా గరిక వుంది. అందువల్ల నాకేమీ దెబ్బ తగలలేదుకాని అడవి కందిరీగలు నాకాలుని కప్పేస్తూ గూడు కట్టాయి. ఇదిగో కాలు ఎలా దెబ్బతిందో చూడు." అంటూ కీర్తిపాంటు పైకిలాగి చూపించింది.
గోమతి అది చూస్తూనే "బాబోయ్. కాలంతా ఎలా అయిపోయిందో. చీముకూడా పట్టినట్లుంది. ఎలా! ఎంత బాధగా వుందో!" అంది.
"బాధగా వున్నా తప్పదు. చేసేదేముంది. ప్రమాదం లోంచి బైట పడ్డాము. నేను సీటుతో సహా భూమీదపడటం, నీవు ఇంతదూరం విసిరేయబడినా చెట్టుమీద పడటం వల్లవళ్ళు నొప్పులు చేశాఏమోగాని దెబ్బలు తగలలేదు. ఈ తెల్లవారుఝామున నాకు మెలకువ వచ్చింది వాచీలో డేటు వారం ఉండబట్టి ప్రమాదం జరిగిమూడు రోజులయిందని గుర్తించాను. నీకు మూడు రోజులకి స్పృహవచ్చింది ఇప్పుడేనా ఇంతక్రితం స్పృహవచ్చిందా?"
"స్పృహవచ్చి మళ్ళీపోయింది. ఎంతసేపయిందో తెలియదు. మెలుకువ రాగానే భయమేసింది. విమానంలో మంటలు అందరితోపాటు నేనూ అరవటం...విమానంలో పెద్దచప్పుడు గుర్తుకొచ్చాయి. వళ్ళంతా నొప్పులు లేవలేను, తలతిప్పి చూస్తే అన్నీ చెట్లు. అంతే మళ్ళీ నాకేం తెలియదు మళ్ళీ మెలకువ వచ్చి కదులుతున్నాను. మీ మాటవినిపించింది కమల్."
టైమ్ తేడావున్నా ఇద్దరికీ మూడురోజులకి స్పృహ వచ్చినట్లు కీర్తి తెలుసుకుంది.
కీర్తి పొడగరి, పొడుక్కుతగ్గ లావుంది. మగవాడి కంఠలా వుండటానికి ముందే మందు వాడటం జరిగింది. విరుగుడు టాబులెట్ వాడితేగాని తిరిగి స్వరం మారదు. ఒక్క సైడ్ లాక్స్ కి మాత్రం కృత్రిమంగా జుత్తువాడటం జరిగింది. మామూలు తలా క్రాపుగా మారింది. కీర్తి కనుబొమలుకూడా సహజంగా వత్తు వెడల్పు. కీర్తి ఆడదని చెప్పినా ఎవరూ నమ్మరు. అందానికి ప్రతిరూపమైన మన్మధుడిలో ఆడపోలికలున్నాయి. అలాగే టీనేజ్ బాయిస్ చాలామంది ఉత్తఅందంతోనే గాక ఆడపిల్లల్లా కొద్ది పోలికలు కలిసి వుంటారు. అలాంటి వారు ఆడంగి రేకుల్లా వుండరు. అది రకమైన ఆకర్షణగల అందంతోవుంటారు. కీర్తి ముమ్మూర్తులా అలా వుంటుంది.
కీర్తి ఏ రూపం దాలుస్తుందో దానికి సరిపోను హావభావాలు ప్రదర్శిస్తుంది. పొరపాటున కూడ పట్టు పడదు. శరీరాన్ని పరీక్ష చేస్తే తెలియాలిసిందే. దుస్తులు కప్పబడిన శరీరం పైభాగాల్ని చూసి చెప్పలేరు.
గోమతి ఏ మాత్రం గ్రహించలేదు. కీర్తిని మగవాడి గానే తలచింది.
"ప్రమాదం నుంచి ప్రాణాలతో బైటపడ్డా ఉన్నప్రదేశం అడవి. తోడు ప్రాణి వుందంటే కమల్ మగవాడయి పోయాడు. ఏ నిముషాన ఏ వెర్రి బుద్ది పుడుతుందో అప్పుడు తన గతి? కమల్ మంచివాడో చెడ్డవాడో ఎలా తెలుస్తుంది." గోమతి ఆలోచనలలా సాగుతున్నాయి.
గోమతి ఆలోచన గ్రహించి నవ్వుకుంది కీర్తి.
"గోమతీ!"
"ఊ!"
"ఏమనిపిస్తున్నది?"
"మీకేమనిపిస్తున్నది కమల్!"
"నిజం చెప్పాలంటే నేనున్నయీ స్థితిలో ముందు దాహం తీరితే బాగుండు ననిపిస్తున్నది. నాకు నావాళ్ళకు దూరం అయ్యాననే బాధ ఏ మూలో పీడిస్తున్నా దాహం బాదే అధికంగా వుంది."
కీర్తి నాలుకతో పెదవులు రాచుకుంది.
