Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 4

   
    సరిగ్గా ఇరవై ఆరున్నాయి.    
    కీర్తి గుర్తుకోసం ఆల్భంలో గోటితో ఇరవై ఆరని గీసింది. తర్వాత మెల్లగా చప్పరిస్తూ రెండు చిలకల్నితింది. ఆకలి తీరకపోయినా కాస్త తృప్తి అనిపించింది.    
    రెండు నిముషాలు గడిచాయి.    
    తీపితిన్న నోటికి దాహం కావాలని వచ్చింది చిలకల్ని తినటం వల్ల రెట్టింపు దాహం అయింది.    
    కీర్తి చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న తన బ్యాగ్ కేసి నిరాశగా చూసింది.    
    కీర్తి బ్యాగ్ లో బికామ్ ప్లెక్స్ టాబ్ లెట్లు విటమిన్ సి టాబ్ లెట్స్ వున్నాయి. టాబ్ లెట్లమీద రంగు, కంపెనీ పేరుగుర్తు మామూలుగానే వుంటుంది. కాని అవి విటమిన్ బి కామ్ ప్లెక్స్ కాదు, సి కాదు. బి టాబ్ లెట్ వేసుకుంటే రెండు రోజులు ఆకలి కాదు. సి వేసుకుంటే దాహంకాదు. అవసరానికి ఉపయోగపడతాయని వెంట తెచ్చుకున్నవి చెట్టెక్కికూర్చున్నాయి.    
    అవి చెట్టుదిగి రావు.    
    కీర్తి చెట్టెక్కలేదు.    
    పోనీ ఒక కాలి ఆధారంతో చేతుల బలంతో చెట్టెక్కుదామంటే చెట్టు చుట్టూ గజం మేర ముళ్ళ పొదలున్నాయి చెట్టు బోదె నున్నగా వుంది.    
    చివరికి కీర్తి ఓ నిర్ణయానికి కొచ్చింది. తనున్న ప్రదేశంలో ప్రమాదం లేదు. కాని నొప్పి తగ్గిందాకా ఈ చోటు విడిచి ముందుకు పోవటం మంచిది కాదు కాబట్టి...    
    బ్యాగ్ ని రెండు సూటుకేసులని ఎందుకైనా మంచిదని గుబురుగా ఉన్న పొదలలో దాచింది. జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి సిగరెట్ లన్ని క్రింద పోసి ఓ సిగరెట్ తీసి మిగిలినవి పెట్టెలో పెట్టి జేబులో పెట్టుకుంది.    
    అచ్చం సిగరెట్ ళా వున్న ఆ సిగరెట్ నిజంగా సిగరెట్ కాదు. అదో రకం చాక్ పీసు. అవసరానికి ఉపయోగ పడుతుందని సిగరట్ లా తయారుచేసి సిగరెట్ల మధ్య దాచివుంచబడింది.    
    కాళ్ళీడ్చుకుంటూ ఎటో అటు బైలుదేరితే ఎక్కడయినా నీళ్ళున్నాయేమో కనిపిస్తాయి. కాలి గాయం నయం కావాలని కూర్చుంటే దాహం తీరదు. టైం వేస్టు ఈ అడవి తుది మొదలు తెలియదు. ఏదో ఒక వైపు బయలుదేరితే మళ్ళీ ఇక్కడికి రావటం కష్టం. ఒకటే రకం చెట్లు ఒకటే రకం పొదలు దారితప్పి ప్రమాదంలో పడొచ్చు. చాక్ పీసు సిగరెట్ తో చెట్లమీద గుర్తులు పెట్టుకుంటూ పోతే కొంత దూరం వెళ్ళి అవసరం అనుకుంటే గుర్తు ప్రకారం తిరిగి రావచ్చు.    
    చాక్ పీసుతో చెట్లమీద సున్నాలు చుడుతూ కీర్తిముందుకు బైలుదేరింది.
    
                                       4
    
    ముందుకు సాగుతున్న కీర్తి కొద్ది దూరంలో వున్న దృశ్యం చూసి ఆగిపోయింది.    
    అప్పటికి సుమారు వంద మీటర్లు నడిచి ఉంటుంది కీర్తి.    
    గుబురుగా పొట్టిగా వున్న ఓ చెట్టుమీద అస్తావిస్తంగా పడివుంది ఓ అమ్మాయి. అప్పుడే తెలివి వచ్చిందో లేక తెలివి తెచ్చుకుని భయపడుతున్నదో లేక శరీరం అధీనంలో లేదో మెల్లగా కదులుతున్నది.    
    కీర్తి చెట్టు క్రిందకి చేరింది. చప్పట్లు చరిచి "భయం లేదు ఇలా క్రింద చూడండి. మీకు తోడున్నాను" అంది.    
    "ఎవరూ?" భయపడుతూ అడిగింది పైనుంచి.    
    "విమాన ప్రమాదం లోంచి బైటపడ్డాను. మెల్లగా క్రిందకి దిగివస్తే మాట్లాడుకుందాం."    
    "కాళ్ళూ, చేతులూ కదిలిస్తే ప్రాణం పోతున్నట్లు వుంది" పైనుంచి అంది.    
    "ప్రయత్నించి చెట్టుదిగితే మంచిది. అలావున్న కొద్దీ బాధ ఎక్కువ కావటం తప్ప ప్రయోజనం లేదు నేను చెట్టు ఎక్కటానికి నా కాలు అధీనంలో లేదు" కీర్తి పైకి వినపడేటట్లు పెద్దగా చెప్పింది.    
    చెట్టు ఎక్కువ ఎత్తులేక పోవటం వల్ల ప్రయత్నించి కొద్ది సేపు తర్వాత ఆ అమ్మాయి చెట్టు దిగింది.    
    ఒకరినొకరు గుర్తించారు.    
    విమానం ఎక్కేటప్పుడు ఆ అమ్మాయి ముందుంది, వెనకనే కీర్తి వుంది. ఒకరినొకరు చూసుకోటం జరిగింది అప్పుడు.    
    "మీరు... మీరు..." చెట్టు దిగంగానే అంది ఆ అమ్మాయి.    
    "విమానంలో నన్ను చూశారు" కీర్తి అంది.    
    "అవును. మీ పేరు....!"    
    తను ఏ పరిస్థితిలో వున్నా పేరు వేషం మరువ రాదన్నది కీర్తికి గుర్తున్నది.    
    "నా పేరు కమల్ మెహ్రూ, మీ పేరు....!"    
    "నా పేరు గోమతి. మీరు మీరు అని మన్నింపుదేనికి గోమతి అని పిలవండి" అంది గోమతి.    
    "ఓ.కే. నన్నుకూడా కమల్ అని పిలిస్తే సంతోషిస్తాను" అంది కీర్తి.    
    "మీ ఇష్టం" సిగ్గుపడింది గోమతి.    
    "మళ్ళీ మీరు..."    
    "అనను"    
    "ఓ.కే."    
    గోమతి తన్ని పూర్తిగా పురుషుడిగానే భావించి ఒదిగి నుంచుని సిగ్గుపడుతూ మాట్లాడుతుందని గ్రహించి నిట్టూర్పు విడిచింది కీర్తి. గోమతిని చూస్తూ వుండిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS