Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 24


    "ఒకే వీధిలో వుంటాం. తెలిసినవాళ్ళు అడుగుతున్నారని అరమరికలు లేకుండా చెప్పేస్తున్నాను. వాడు డబ్బుకే వింటాడు. కత్తుల సారథి అని ఒకడున్నాడు. యింకా అట్లాగే కొందరున్నారు. వాళ్ళలో ఒకణ్ని పట్టుకోండి. వాడి కమీషన్ వాడు పుచ్చుకుని రేటు మాట్లాడి పని చేయించిపెడతారు" అన్నాడు అతను.
    అతని ముఖంలో మంచితనం యెందుకో చాల దిగులుగా అనిపిస్తున్నాడు. దిగులుగానూ కాదు. చాలా బాధగా.
    "థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. యెట్లా అడగటమా మీవంటి వారిని_అపార్థం చేసుకుంటారేమో అని కాస్త వెనుకాడాను" అన్నాడు సుబ్బారెడ్డి.
    రెండు కప్పులతో కాఫీ తెచ్చి బల్లమీద పెట్టింది కౌసల్యమ్మ.
    "ఇప్పుడీ శ్రమ దేనికి తల్లీ? వస్తూ యింట్లో పుచ్చుకునే వచ్చాను" అని, సుబ్బారెడ్డితో, "చెప్పటానికి వెనకాడాల్సింది యిందులో యేముందండీ! మరొకరికైతే ఇదే విషయంలో ఇంకోలాగా చెప్పివుందును. మీకు యివాళ కాలేజీలకి సెలవా? మీరేదో స్టూడెంట్లకి రెవల్యూషనరీ లీడర్ అని విన్నాను" అన్నాడు అతను.
    "యిఁహీఁ" అని, "రెవల్యూషనరీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటాను. ఆ రకంగా స్టూడెంట్స్ తో కాస్త సంబంధాలు యెక్కువగా వుంటాయి" అన్నాడు సుబ్బారెడ్డి.
    "యేఁవిఁ స్టూడెంట్లో యేఁవిఁటో__ ఛీ"
    "చిన్నవాళ్ళు కదా__"
    "యీ ఇల్లు అమ్మేసెయ్యాలనిపిస్తోంది. మీకు తెలిసినవాళ్ళకి యెవరికన్నా కావలిస్తే చెప్పండి కాస్త. ఆ రోజుల్లో యిదంతా యిట్లా అభివృద్ధి చెందలేదు. అప్పట్లో తక్కువలోనే దొరికింది. యీ చిన్న కొంపా దొడ్డీ. ఆ తరవాత తరవాత యీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేచాయి. అవతల ఆవైపున__ ఆ పుణ్యాత్ముడెవడో కాలేజీకి పాత మహలు దానం చేశాడు."
    పాపభీతి వల్లనో, టాక్స్ ఎగ్జెంప్షన్ పొంది బ్లాక్ మనీ మరింత పెంచుకోటానికో"
    "యెందుకన్నా చెయ్యనీండి, యిటు ప్రక్కన యీ కాలేజీ పెట్టడం మా చావుకొచ్చింది. ఛీ, ఛండాలపు వెధవలు_ మీ స్టూడెంట్స్ ని తిడుతున్నానని మీకు కోపమొస్తుందేమోగానీ_" అని ఆగిపోయాడు.
    అతని ముఖంనిండా విషాదం. కలవరపెట్టే విషాదం లాంటి విషాదం.
    "ఏదో స్టూడెంటు కుర్రాళ్ళు కదా__"
    "స్టూడెంటు కుర్రాళ్ళైతే మాత్రం_ఛీ_మనుషుల్లాగా ప్రవర్తించనప్పుడు_ఛీఛీ_పోనీండి_మాస్టర్లు మీ దగ్గిర దేనికి_వీళ్ళ న్యూసెన్సు వల్ల కొంప అమ్ముకుపోదామనిపిస్తోంది" దుఃఖ భారానికి కుంగినట్టుగా అనిపించాడు.
    "చెప్పండి ఫరవాలేదు. మాస్టర్లనేముంది. యేమన్నా గొడవ__"
    "ఆ యెదురుగా మూడో ఇల్లు లేదూ_పైన స్టూడెంట్లకి యిచ్చి తగలడ్డారు. వాళ్ళకేం పిల్లాపీచూ లేని ముసలివాళ్ళు...."
    యితనికి ఇంటర్ చదువుతున్న అమ్మాయి వుంది పదిహేడేళ్ళుండవచ్చు. ఇంకో అమ్మాయి, పదకొండు. యెనిమిదేళ్ళ పిల్లడు.
    "....ఆ పైన చేరారు, దాన్లోవుండేవాళ్ళే కాదు. బయటినుండి కొందరొచ్చి చేరతారు కోతిమూక. కోతులే నయం. కుక్క అనుకోండి. అక్కడి నుండి యింట్లోకి_ మా పెద్దమ్మాయి_యెంత వయసండీ_ మొనన్నే పదిహేనెళ్ళాయి. ఆ పసిదాన్ని దొడ్లో మసలనివ్వరండీ. వెధవ మాటలూ వాళ్ళూ_ అక్కడనే కాదు _ ఈ కాలేజీ పుణ్యమా అని ఈ లొకాలిటీ అంతా_ఛీ కుక్క వెధవలు_ అక్కడ వీధి మూలమీదా, అవతల ఆ టిక్కీ హోటల్ ముందరా_ఒకచోటనేమిటి_సర్వాంతర్యాముల్లాగా_ యిటీవల గమనించాను_ అటు బస్టాపు దగ్గిరా అంతటా చీదర కుక్కలు _ ఇకిలింపులూ సకిలింపులూ చొంగ కారుస్తూ తోకాడిస్తూ మొరుగుతూ_ వీళ్ళు కుక్కలండీ_ కుక్కలకి ఒక్క చిత్తకార్తే_ ఈ కుక్కలకి నిత్య చిత్తకార్తె _ బలాదూరు కుక్కలు _ ఆడవాళ్ళు కాలేజీలకి వెళ్ళే వేళా, బజారుకెళ్ళే వేళా_యిట్లా వీధుల్లోపడి నానాగొడవలు చెయ్యకపోతే వీళ్ళ ప్రతాపం యేర్పాటుచేయించుకోకూడదూ యీ దురద రాయుళ్ళు? వీళ్ళూ వాళ్ళూ అని లేదు. విచక్షణే లేదు. యెవరెలాంటి వాళ్ళనేదే లేదు. మొన్నొకరోజున మా ఆవిడ మరీ ఇదై యేదో అన్నదట _ అంతటితో, నీ కూతురు కంటే నువ్వే పసందుగా వున్నావే భామా_ అంటూ కూశారట. తన వయసెంత! వాళ్ళ వయసెంత? కొంప అమ్ముకుని పోదామనిపిస్తోంది గానీ, యీ వెధవ జట్లు వూరంతా నిస్తరించుకుని వున్నారు. ఎక్కడి కవి పోయేది! ఏమైతే ఐంది ఓ కుక్కని పట్టుకుని కత్తితో పొడిచేసెయ్యాలన్నంత మండుకొచ్చింది ఆ రోజునైతే_ నిన్న సాయంత్రానికి సాయంత్రం _ నేను కల్పించుకుందామనుకున్నాను గానీ నా మర్యాద మాత్రం దక్కుతుందనేఁవిఁటీ_" అని బాధ యేకబికిన వెళ్ళగక్కేసరికి, కాస్త భారం దిగినట్లయి, శ్వాస పీల్చుకున్నాడు దీర్ఘంగా.
    "చూడండి శాస్త్రిగారూ యీ కుర్రాళ్ళతో బాధే అనుకోండి_ యెందరో వుండరండీ పది శాతం. అంతే. వాళ్ళే యీ అంతటికీ కారణం. దె ఆర్ నాట్ ఈవెన్ సీరియస్. ఆకతాయితనం_"
    మధ్యలోనే అందుకుని, "ఆకతాయితనం ఏమిటండీ. అన్నేళ్ళొచ్చి అంత నీచంగా ప్రవర్తించడం! ఆ మధ్య ఎగ్జిబిషన్లో _ వెనకనుండి యెవరో తోస్తే పడినట్లుగా మీదకి ఒరుగుతాడొకడు. వీళ్ళూ వాళ్ళూ అని లేదు. ఆడది కనబడితే చాలు. అన్ని చదువుల వాళ్ళూ _ తండ్రులు జీతాలు కట్టి కాలేజీలకి పంపిన పాపానికి _ మీరు మాస్టర్లు_మీకీ బాధలు తెలియవు" అన్నాడు.
    "వాళ్ళకి ఆ విచక్షణా వుండదండీ. ఆమధ్య మా పినతల్లికూతురు మా యింట్లో కాలేజ్ లో చదువుకుంది. తనకీ తప్పలేదు. అంతదాకా దేనికి, మాస్టర్లమి మాకుమాత్రం తప్పుతుందా ఆ దుర్గతి! ఆ మధ్య నేనూ మా ఆవిడ వెళ్తూంటే వెనకనుండి కొంటె వాగుడు, పిల్లికూతురు, నక్క అరుపులు. తీరా చూద్దును కదా అందులో ఒకడు నా క్లాసులోవాడే! అదీ పరిస్థితి. మళ్ళీ విడిగా ప్రతి ఒక్కడూ మహా బుద్ధిమంతుడు!"
    "విడిగా బుద్ధిమంతులో గిద్ధిమంతులో దానివల్ల మనకి ఒరిగేదేమిటి? ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేద్దామనుకుంటున్నాను."
    "మీ యిష్టం, మాస్టరుగా, విద్యార్థులు నాకు మీకంటే సన్నిహితంగానూ, పరిస్థితి మరింత బాగానూ తెలుసు. ది రైట్ థింగ్ ఈజ్ టు యిగ్నోర్. మీరు మరీ ఇదిగా ఫీలవుతున్నారు. అందరూ మీలాగా ఫీలయితే ఈపాటికి యెందరో ఆత్మహత్యలు చేసుకోవాల్సివచ్చును. ఆ పిల్లలలో మన పిల్లలూ వున్నట్లే భావించుకోవాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS