"యీ వయసుకి వీళ్ళిలా తయారైతే ముందుముందు ఏమయ్యేట్లో_యీ చదువులూ యివీ_"
"యేమీకాదు యీ నాలుగు రోజులూ అల్లరి. అదీ ఒక పదిశాతం. యీ పది శాతానికి ఏదీ ముఖ్యం కాదు. వాళ్ళవి వడ్డించిన విస్తరి లాంటి జీవితాలు. ఐతే వీళ్ళలో కొందరు తమ స్థితి తాము తెలుసుకోకుండా ఇందువల్ల జీవితంలో చాలానష్టపోయేవాళ్ళుంటారు. హర్టింగ్ గా హుమిలియేటింగ్ గా, అసభ్యంగా కాకుండా, అసభ్యంగా కాకుండా, యెవరేమిటి అనే విచక్షణతో మోతాదు మించని రీతిలో చిన్నగా ఏదన్నా చెణుకు విసిరితే పర్లేదు" అన్నాడు సుబ్బారెడ్డి.
"అయితే మీ మాస్టర్లకీ తప్పదన్నమాట!"
"శాస్త్రిగారూ, మీరు మరీ యిదిగా ఫీలవుతున్నారు. అంత యిదిగా ఫీలవ్వాల్సిన విషయం కాదు. ఇటీజ్ వైజ్ టు యిగ్నోర్. అప్పుడు అంతటి భరించలేనంతటి విషయంగా అనిపించదు. నేనేదో యీ విషయాన్ని సమర్ధిస్తున్నానని కాదు. జీవితంలో యెన్నో కూడని స్థితులు వున్నయ్. దానికి యేవేవో కారణాలు వుండొచ్చు. ఆదిమ వ్యవస్థలోనూ, ఆదర్శ స్థాయిలోనూ తప్ప రకరకాల సమస్యలు తప్పవు శాస్త్రిగారూ మరీ అంత యిదవకండి. వాళ్ళెవరో కాస్త గమనించి చెప్పండి. మా కాలేజీ పిల్లలైతే నేను మాట్లాడి చూస్తాను. తమాషా యేమిటంటే వాళ్ళలో సాక్షాత్తూ మీ చుట్టాల పిల్లలేవున్నా ఆశ్చర్యపడక్కరలేదు.
"క్షమించాలి. ఉదయం పూట వచ్చి పట్టుకుని బోరు కొట్టినట్లున్నాను. నా బాదా నా స్థితీ అట్లాంటిది. అదీ కావాలని చెప్పలేదు. యీపూట మనసు మరీ యిదిగా వుంది. వేళకి మీరు__అందునా మాస్టర్లు దొరికినందున మన్నించాలి."
"భలేవారు. అట్లా అనుకోకండి. యెవరో తెలుసుకుని చెప్పండి.
"వస్తాను మరి. మీ సమయం అంతా వృధా చేశాను. మన్నించండి" అని లేచి వెళ్ళాడు.
సుబ్బారెడ్డి అనుకున్న వ్యాసం రాస్తే మూడ్ పోయింది.
దీనికి పరిష్కారంగా కాబోలు పడమటి దేశాల వాళ్ళు విశృంఖలత్వాన్ని ఆచరించితే__అది వెర్రితలలు వేసి మరొక ఘోరస్థితికి దారితీస్తోంది. వీటన్నిటికీ పరిష్కారం ఆదర్శ సమ సమాజమే __ అనుకున్నాడు సుబ్బారెడ్డి.
80
సంగమ్ థియేటర్లో గంగి. దూరంగా తెరమీద బొమ్మలు.
గంగి పక్కన ఓ యువకుడు.
గంగి చూపులు__తెరమీదా అతనిమీదా.
ఆమె పర్సు తీస్తున్నా, అతనే జేబులోంచి నోట్ల బొత్తి తీసి, బుకింగ్ కౌంటర్ దగ్గిర పది నోటు ఇచ్చి రెండు టికెట్లు చిల్లర డబ్బులూ పడికిట్లో పట్టుకుని వచ్చాడు. మ్యాట్నీ ఆట.
నిన్న నాలుగు జల్లులు పడినందున, బయట వేడిగానే వుందిగానీ__లోన చల్లగా వుంది__ ముఖ్యంగా హాల్లో జనం మరీ పల్చగా వున్నందున.
సినిమా కోసం యీ సినిమాకి రాలేదు. జనం రద్దీ వుండదనే వచ్చారు.
"మై డియర్ లవ్లీ బ్లూ బర్డ్." అన్నాడు ఆ యువకుడు.
"యస్ స్వీటీ" అంది గంగి.
ఆమె చేతిని చేతులోకి తీసుకుని పెదాలకి అద్దుకున్నాడు.
అతనంటే గంగికి యిష్టం. కానీ రవి అంటే వున్నంత యిష్టంకాదు. గంగికి రవి అంటే వున్న యిష్టం మరెవరంటేనూ లేదు.
యీ యువకుడంటే వేరే యిష్టం. ఓ అవసరపు యిష్టం. అందుకే, యీ యువకుడనేకాదు ; యింకా నలుగురైదుగురు ఆమె చుట్టూ తిరుగుతున్నవాళ్ళు. కాలేజీ కుర్రాళ్ళు. చక్కగా షోగ్గా బావుంటారు. అందుకనీ కాదు. రవికూడా బావుంటాడు.
వద్దన్నా వినకుండా చిన్న చిన్న ప్రజంటేషన్స్ ఇస్తుంటారు గంగికి. ఇంపోర్టెడ్ యింటిమేట్ సెంట్ యార్డ్ లీ లావెండర్ ఫేస్ పౌడర్ కీచైన్ నెయిల్ పాలిష్ లు లాంటివి. టాక్సీలకీ హోటళ్ళకీ సినిమాలకీ_ అన్ని ఖర్చులు పెట్టుకుంటూ వుంటారు. తనే బయటికి వెళుతుంది. సంకేత స్థలానికి. వెళ్ళకపోతే వాళ్ళే వచ్చేస్తారు క్వార్టరుకి. వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం లేదుగానీ ; వాళ్ళందరికీ గంగికి పరిచయం తనతో మాత్రమే కాదని తెలుసు.
ఏప్రిల్ నెలలో అంతగా గమనించలేదుగానీ, క్రితం నెలలో అనుమానించాడు రవి.
ఒకసారి, "నిన్న టాక్సీలో ఎటో వెళ్తున్నట్లున్నావు?" అన్నాడు.
"అవ్" అంది.
"పక్కనెవరో వున్నట్లుగా అనిపించారు" అన్నాడు.
"అవ్." అంది.
"ఓ యువకుడిలాగా వున్నాడు."
"అవ్" అంది.
"మీ చుట్టమా?" అన్నాడు.
గంగికి అబద్దమాడటం యిష్టంలేదు__ రవితో. రవి అంటే తనకు యిష్టం. కానీ__
"కాదు. దోస్తు!" అంది.
మరోసారి, "నిన్న ఆ దోస్త్ తో నిన్ను ప్యారడైజ్ థియేటర్ దగ్గిర చూశాను" అన్నాడు.
"ఆ దోస్త్ కాదు యింకోక దోస్త్" అంది.
మరోసారి, "మొన్న మధ్యాహ్నం మన క్వార్టర్ లో నుండి వెళ్తుండగా చూశాను__నీ దోస్త్ ని__కాంటీన్ దగ్గరనుండి" అన్నాడు.
"అవ్" అంది.
ఇంకోసారి, "యెట్లాంటి దోస్తులు?" అన్నాడు.
"బాయ్ ఫ్రెండ్స్" అంది.
"ఆల్ట్రా మోడర్న్ నెక్కింగ్, సెట్టింగ్, కిప్పింగేనా!" అన్నాడు వ్యంగ్యంగా.
"అన్నీ, మగనికి తీరికా ఆసక్తీలేని అన్నీ" అంది.
"షటప్ డర్టీ స్లట్" అని చెయ్యెత్తాడు.
లేచిన అతని చేతివంకా ముఖంవంకా నిబ్బరంగా చూసింది గంగి, రెప్పలు పైకెత్తి.
యేదో మహోధృతమైన బలమైన తరంగం వువ్వెత్తుగా లేచి తనని ముంచెత్తివేస్తున్న అనుభూతి.
చెయ్యి కిందకి వాలింది.
"అనదలిస్తే నేను గూడ మస్తు అనగలను. నువ్వంటే నాకెంత యిష్టమో యీ దునియకే కాదు నీకుగూడ తెల్వదు. నేను నా జీవితంల నీ నుండి యేమి కూడా కోరుకొనలె. నాకేమి అక్కరలే. అక్కెరున్న ఒక్కటీ__"
"ఆపు నీ వెధవ వాగుడు." అన్నాడు.
యింకో రోజున, "అయినయ్యా నీ షికార్లు. యివ్వాల్టికి తిరుగుళ్ళు పూర్తి అయినయ్యా?" అన్నాడు__ బాగా పొద్దుపోయి వచ్చిన గంగిని.
"అయినయ్ యీ పొద్దు నీకంటే జరంత లేట్ అయిన" అంది.
మరింకొక రోజున, "యివాళ యింట్లోనే వున్నావు. నీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా వూళ్ళో?" అన్నాడు.
"పాత ఫ్రెండ్స్ తోటి బోర్ కొట్టినది. కొత్త ఫ్రెండ్స్ యింకా మంచిగ యెరిక కాలేదు" అంది.
ఒకసారి వరసగా నాలుగు రోజులపాటు ఎటూ వెళ్ళకుండా క్వార్టర్లోనే వుండిపోయాడు రవి. గంగి కూడా యెటూ వెళ్ళలేదు.
నాలుగో రోజు రాత్రి అతని మంచం దగ్గిరికి వెళ్ళి పక్కన పడుకున్నాడు.
చాలాకాలంగా వాళ్ళకి యెవరి మంచం వాళ్ళదే.
"రవీ." అని తనవైపుకి తిప్పుకుంది.
అతనిని తనమీదకి లాక్కుంటే, జరగకుండా బిర్రబిగుసుకుంటే __ తనే అతని మీదకి జరిగింది.
ఆమె అలలా యెగసినట్లనిపించినప్పుడు అతనికి యేదో మహా ప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.
అలిసిపోయి, తృప్తిగా అతనివంక చూస్తూ, అతని ఛాతీమీద చెయ్యి పరిచి పడుకుని వున్న గంగితో__
"మగాడు చెడాలంటే డబ్బు కావాలి. ఆడది చెడాలంటే ఒళ్లుంటే చాలు" అన్నాడు.
