"దిస్ ఈజ్ క్లోజర్ టు ది సైంటిఫిక్" అన్నాడు వెంకటేష్ సంతృప్తిగా.
"సైంటిఫిక్ మహ ప్లిప్పరీ. బొత్తిగా నిలకడ లేకుండా పోతోంది. సైంటిఫిక్ కి క్లోజర్ గా లేనిదంతా కొట్టిపారెయ్యక్కరలేదు. కొన్నాళ్ళకి సైంటిఫికే అలాంటి దానికి క్లోజర్ గా వెళ్ళొచ్చు. ఇటీవలి రష్యన్ సైన్స్ పరిశోధనల్లో సగభాగం పెరా....యెంపిరికల్, పెరా__యిండక్టివ్ రీతిలో సాగుతోంది__" అంటున్నాడు శ్రీపతి.
అటునుంచి వస్తున్న జ్ఞానేశ్వర్ "హలో కామ్రేడ్స్" అని శ్రీపతి వంక చూసి, "నిన్ను కాదులే" అన్నాడు.
"నేను కామ్రేడ్ ని కాదని నేనెప్పుడూ అనలేదే!" అన్నాడు శ్రీపతి.
"అట్లకాదు. కామ్రేడ్ అంటే ఫ్రెండ్ అని గూడనట గద! ఆ మీనింగ్ ల కాదు! వాళ్ళోలె" అన్నాడు జ్ఞానేశ్వర్.
"వాళ్ళూ నాలాంటి నీలాంటి మనలాంటి వాళ్ళే. నీ పేరు జ్ఞానేశ్వర్. నా పేరు శ్రీపతి. వాళ్ళ పేరు మరొకటి. అంతా మట్టిలో కలిసేదే. అందుకే సినిమా మట్టిలో కలిస్తే పోదూ జ్ఞానేశ్వర్! ఏ సినిమాకి?" అని నవ్వాడు శ్రీపతి.
"శ్రీపతీ నువ్వంటే నాకు ఇందుకోసమే చాలా యిష్టం" అని ఇంగ్లీషులో అని, "ఇష్క్ ఇష్క్ ఇష్క్_కి పోదామనుకుంటున్న _ దేవ్ జీనత్ లున్నారు" అన్నాడు జ్ఞానేశ్వర్.
"ముసలోడికి దసరా పండగన్నట్లు ఆ దేవానంద్ కి ఆ కుర్రగుంట దొరికితే వాళ్ళేదో గొడవ పడుతున్నారు. నీకేం ప్రేమ గొడవోయ్ జ్ఞానేశ్వర్, రేపో ఎల్లుండో మీవాళ్ళు చూసిన ఓ కనక గజలక్ష్మిని లక్షణంగా సంతోషంగా పెళ్ళాడబోయేవాడికి!" అన్నాడు శ్రీపతి.
ఆ దగ్గిర్లో కనిపించిన ఇరానీ హోటల్లోకి వెళ్ళారు అందరూ. బన్ను తిని టీ తాగారు. యెవరి బిల్లు వాళ్ళే ఇచ్చుకున్నారు.
అందరూ సినిమాలకి సిద్ధమయ్యారు.
మోహన్ రెడ్డి యింటికి వెడతానని వెళ్ళాడు. గాయత్రిని రెండురోజుల క్రితం దాకా జైల్లోనే వుంచారు. ఒంట్లో బాగాలేదు. అందుకే యీ సభకి ఆమె రానిది కూడా.
విజయ్ కుమార్ "జీవనజ్యోతి" సినిమాకి తయారయ్యాడు. మరో యిద్దరు.
వెంకటేష్ సుధీర్ లు అమితాబ్ సైరాబనుల జమీర్ కి తయారయ్యారు.
"మరి నువ్వూ సినిమాకేనా?" అన్నాడు సుబ్బారెడ్డి శ్రీపతిని.
"నేను ఒకటీ అరా సినిమాలు చూడను. అన్నీ రంగుల సినిమా చూస్తాను_అప్నే రంగ్ హజార్" అన్నాడు శ్రీపతి.
అప్నే రంగ్ హజార్ సినిమాలో లీనా చందావార్కర్ సంజీవ్ కుమార్ లు వున్నారు.
"ఇంటి దగ్గర పనుండాది" అని నడక సాగించారు సుబ్బారెడ్డి.
ఈ నైట్ కి లేట్ అవుతుందనీ తనకి వంట చెయ్యొద్దని ఇంట్లో చెప్పి వచ్చాడు సుబ్బారెడ్డి.
అబిడ్స్ దగ్గిరి చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. గంటసేపు__పద్దెనిమిది రూపాయల బిల్లు. యిరవై రూపాయల నోటు బిల్లు పళ్ళెంలో వదిలి, బేరర్ సెల్యూట్ అందుకుని బయటికొచ్చాడు. తన స్కూటర్ ఆ పక్కనే వున్న తాజ్ లో వదిలి వెళ్ళాడు మీటింగుకి.
టోకెన్ యిచ్చి స్కూటర్ తీసుకున్నాడు. పావుగంటలో మలక్ పేటలో వున్నాడు. తలుపు తట్టాడు. నిద్ర కళ్ళతో తలుపు తెరిచింది, భార్య కౌసల్యమ్మ.
బట్టలు మార్చుకున్నాడు. ముఖమూ కాళ్ళూ చేతులూ చల్లని నీళ్ళతో కడుక్కున్నాడు. పడకగదిలోకి వచ్చాడు.
మంచం మీద భార్య పక్కన, ఫ్యాన్ గాలి కింద నిద్రపోతున్న కూతుర్ని చేతులతో జాగ్రత్తగా యెత్తి పక్కనున్న చిన్న మంచం మీద పడుకోబెట్టి_భార్య పక్కన చేరి దగ్గిరికి లాగి బుగ్గ కొరికాడు నొచ్చకుండా.
"యిప్పుడేంది, అద్దరాత్తిరి మద్దెల దరువన్నట్లు_నాకు నిద్రమత్తుగా వున్నది" అంది.
"యేదో ఒక మత్తు వుంటేనే బాగు. నిద్రమత్తులో మరీ బాగుంటది."
"యేమి, మీరు మందుమత్తులో వున్నారా?" అంది.
సుబ్బారెడ్డి, సాధారణంగా సొంత డబ్బుతో ఒంటరిగా తాగడు.
"లేదు నీ మత్తులో వున్నా" అన్నాడు.
సుబ్బారెడ్డి ఉదయం లేచి కాలకృత్యాలు ముగించుకుని_ యిటీవల విరసం నుంచి విడిపోయిన కవులు కొందరి ప్రకటనలకి సంబంధించి ఘాటుగా ఓ వివరణ వ్యాసం రాయటానికి కూర్చున్నాడు.
"మీకోసం మన పక్క వీధిలో కడాకు వుండెటాయన వచ్చినాడు." అంది భార్య కౌసల్యమ్మ వచ్చి.
"యెవడు? లేనని చెప్పలేకపోయినావా?" అని కసిరాడు.
"మంచీ మర్యాద అక్కర్లేదా? ఒకే వీధిలో వుంటాం. మంచికీ చెడ్డకీ తోడుగా వుండాల్నా వొద్దా? ఆయనెవరనుకుంటున్నారు? ఆరోజు మీరు వూరిలో లేరు. అర్దరాత్రి టైంలో మన పాపకి సీరియస్ గా అయితే ఆయనే వచ్చి డాక్టర్ని పిలుచుకువచ్చి ఎంత సాయం చేసినాడు! లెండి" అంది.
"లేనని చెప్పు."
ముందు గది గుమ్మంలో నుంచుని వున్న అతనికి యిదంతా వినిపిస్తోంది. ఎందుకొచ్చానా యరక్కపోయి_అని అనుకుని తిరిగి గప్ చిప్ గా వెళ్ళిపోవాలనుకుంటూండగా_
కౌసల్యమ్మ వచ్చి, ఆప్యాయంగా చూస్తూ, "బాత్రూంలో వున్నారు. వస్తారు కూర్చోండి" అంది.
యిప్పుడు వెళ్ళిపోయినా బాగోదనిపించి, లోనకి అడుగులు వేసి కూచున్నాడు అతను.
మూడు నిమిషాలకి వచ్చి, "మీరా యెవరో వచ్చారంటే యెవరో అనుకున్నాను" అన్నాడు సుబ్బారెడ్డి, నవ్వు ముఖం పెట్టి.
కూచున్నాడు. అతనిని చూడగానే సుబ్బారెడ్డికి ఓ పని గుర్తొచ్చింది.
"మీ ఆఫీసరు గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఆయనతో నాకు తెలిసినవాళ్ళకి ఒక పని కావాలి. యెవరితో చెప్పించితే వింటాడో_" అని ఆగిపోయాడు సుబ్బారెడ్డి.
సుబ్బారెడ్డికి అతనితో అంతగా పరిచయం లేదు. వీధిలో కనిపించటం బస్సు దగ్గిర నుంచో, కూరల సంచితో వస్తూనో కనిపిస్తాడు. తనెప్పుడూ స్కూటర్ మీద ఎప్పుడన్నా తారసపడితే నాలుగు మాటలు. నలభైయేళ్ళ లోపే వుంటాయి గాని చూడటానికి యింకా చాలా యెక్కువ వయసులాగా అనిపిస్తాడు. బాగా నెరిసిన తల. ముడతలు పడుతున్న చర్మం. హెడ్ క్లర్కుగా వుద్యోగం.
