"జర్నలిస్ట్ ని కాదు. యిప్పుడు జర్నలిజం చదువుతున్నాను. అదీ ఐపోవొచ్చింది. యింతకుముందు అవీయివీ చదివినట్లుగా." అన్నాడు శ్రీపతి. అని, అక్కడే స్థిరంగా నుంచుని, చూపుడువేలు కణుపుతో పెదవిమీద వొత్తుకుంటూ అంతా పరిశీలనగా చూస్తున్నాడు.
దయానందభారతి ముందుకు నడిచాడు. చుట్టూ పదిమంది జనసంఘీయులున్నారు. వెళ్ళి ఓ ముగ్గురు జనసంఘ్ లీడర్లని కలుసుకున్నాడు. వీళ్ళని పరిచయం చేశాడు.
వాళ్ళ దగ్గిర మొరార్జీ నిరవధిక నిరాహార దీక్ష ప్రసక్తి వచ్చింది.
"ఇట్ ఈజ్ హాయ్ టైం దట్ ఆల్ నాన్ కమ్యూనిస్ట్ అప్పోజిషన్ పార్టీస్ షుడ్ యునైట్__అని జె.పి.గారు అంటున్నారట" అన్నాడు, ఒక ఆంధ్ర ప్రాంతపు జనసంఘ్ నాయకుడు.
"గుజరాత్ లో ఇందిరమ్మకి మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేసేశాడు మొరార్జీభాయ్. ప్రజలంతా ఆయన వెనక వున్నారు. నిస్వార్థ వృద్ధ నాయకుడు. అన్యాయంగా కిందకి నెట్టేసింది ఇందిర" అన్నాడు ఒకతను హిందీలో.
"నేను కాషాయం బట్టల సన్యాసినే గానీ నా కొడుకు దొమ్మరి గుడిశల్లో దూరతాడన్నట్లు_తనయుడు కాంతిభాయ్ సంగతేమిటి!" అన్నాడు ఒక జనసంఘీయుడు.
"అది వేరే అంశం. ఈ పరిస్థితుల్లో అనవసరం. అదుగో కార్యక్రమం మొదలవుతోంది. జయప్రకాష్ జీ ఏం చెప్తాడో విందాం." అన్నాడు ఒకతను.
సభ_ప్రారంభమైంది ; ముగిసింది.
జనం గుంపులు గుంపులుగా విడివిడిగా, తోసుకుంటూ తప్పుకుంటూ తిరుగుముఖం పట్టారు.
"టోటల్ రెవల్యూషన్ అంటున్నాడే జే.పీ. రెవల్యూషన్ _ పావు రెవల్యూషనూ అర రెవల్యూషనూ వుంటదా? రెవల్యూషనంటే? సర్వోదయం కూడా రెవల్యూషనే అనగలడు!" అన్నాడు మోహన్ రెడ్డి.
"రాడికల్ ఛేంజ్ అంటున్నాడు. రాడికల్ అంటే ఏమిటని_జ్ఞానోదయం వంటి మానసిక పరివర్తన కాబోలు. వినోబా ఈడనే పోచంపల్లిలోనే గదా మొదలెట్టినాడు భూధాన యజ్ఞమంటూ. వాళ్ళది కాని భూమి, అసలు ఈభూమ్మీదలేని భూమిహృదయ పరివర్తనం పేరుతో దానంచేసినారు భూస్వాములు" అన్నాడు సుబ్బారెడ్డి.
"యింతకీ రాడికల్ అంటే యేఁవిఁటి?" అన్నాడు శ్రీపతి చిన్నగా.
శ్రీపతి అలా యేదన్నా చిన్నగా అడిగితే, చమత్కారంగా దెబ్బతీసి భుజంమీద ఆప్యాయంగా చెయ్యేసి తట్టటానికే అన్న అనుభవం బాగావున్నవాడు, సుబ్బారెడ్డి.
"ఈ కాంటాక్ట్స్ లో వేరే మీనింగ్_" అని సుబ్బారెడ్డి తప్పుకో బోతుంటే ; వెంకటేష్ అందుకుని, "రాడికల్ అంటే రెవల్యూషనరీ నాన్_కన్ ఫార్ మిస్ట్, నాన్ కన్ వెన్షనల్, నాన్_ఫేసిపిక్, ఫియర్ లెస్ నెస్ రేదర్ ఫెరోషియస్" అన్నాడు.
"ఫెరోషియస్ నెస్ రెవల్యూషనరీ తనం కాదనుకుంటాను. రాడికల్ అంటే వన్ హూ గోస్ టుది రూట్స్ అని అర్థం అని విన్నాను_అంటే రాడికల్ అంటే తీసుకున్న అంశపు మూలతత్వంలోకి వెళ్ళి లోలోతుగా నిశితంగా సమగ్రంగా గమనించి గ్రహించి_దాన్ని నిర్భయంగా చెప్పి ఆచరించగలవాడని చెప్పగా విన్నాను. మీరంతా రాడికల్స్ మీకు తెలియాలి అందుగురించి బాగా. నాదేదో వినికిడి జ్ఞానం" అన్నాడు శ్రీపతి.
సుబ్బారెడ్డి విషయం తప్పిస్తూ, "శ్రీపతీ లాస్ట్ వీక్ లో నీకోసం వచ్చినా, యాడికో పోయినావట. బాంబేకా?" అన్నాడు.
"పూణేకీ. అక్కడ దిలీప్ కుమార్ రాయ్ ఆశ్రమం వుంది_" అని శ్రీపతి అంటూంటే మధ్యలో అందుకుని, "బాబాల మంత్రాలకు చింతకాయలు రాలవు." అన్నాడు సుధీర్.
"చింతకాయలు మంత్రాలు చదివినా రాలవు. కత్తులు ఝుళిపించినా రాలవు. కొంకిర కర్రతోనో, చెట్టెక్కో కోయాలి. బాగా పండితే మాత్రం అవే రాలిపడతాయి. మరీ బాగా పండిపోతే, బుగిలిపోతే_సిద్ధాంతాలైనా రాలిపోక తప్పదు. అది ప్రకృత ధర్మం_" అని శ్రీపతి మొదలెడితే_
"యేదో పూనా ఆశ్రమం అంటున్నావు" అని మళ్ళించాడు సుబ్బారెడ్డి.
"ఆఁ_ఆ పూణే ఆశ్రమంలో దిలీప్ కుమార్ రాయ్ ఇందిరాదేవి అని వున్నారు. పూర్వాశ్రమంలో ఆ ఇందిరాదేవి ఒక యువ జమీందారుభార్య. వయసులోనే వుంది. ఈ దిలీప్ కుమార్ రాయ్ ఆవిడతో ఏదో గ్రంథం సాగించాక పీకలమీదకొచ్చి _ ఇద్దరు కలిసి ఫ్రెంచి భాగమైన పాండిచ్చేరికి చెక్కేశారు. అక్కడ ఆ జోడుకి ఏదో జ్ఞానోదయం ఐందట. ఆ దరిమిలా యీ ఆశ్రమం నెలకొల్పారు. కృష్ణ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తారు రోజూ. వీళ్ళ అనుచర భక్త శిష్యులూ వున్నారు. ఒక్కో శుభఘడియన శ్రీకృష్ణుడు_ బాలశ్రీ కృష్ణుడట__లేకపోతే మానం మీద ఛాయపడుతుందనో ఏమో_ వచ్చి ఆమెని స్పృశిస్తాడట. అంతట ఆ రోజున ఆమె ఒంటి నుంచి గొప్ప పరిమళం వెలువడుతుందిట. అదేదో చూద్దామని వెళ్ళి అక్కడ మఖం వేశాను, ఆ శుభ గడియ కోసం. ఒకరోజున_పగలో రాత్రో సరిగా గుర్తులేదు. ఆమె శయ్యా గృహంలో వుండగా వచ్చి పరామర్శించాడట ఒంటినే ఐవుంటుంది. లేకపోతే పరిమళం ఒంటికెలా అంటుతుంది అప్పుడు ఆమె దగ్గిరికి వెళ్ళి అడిగాను__"
"ముసలిదా?"
"కాదు. వయసుదీ కాదు. వయసు మళ్ళని వేళామించిపోని వయసు!" అని నవ్వి, "ఆమెను అడిగాను__ఆ పరిమళం గురించి. కొద్దిగా నాకూ తెలుస్తోంది ఆ పరిమళం పీలుస్తుంటే. చెయ్యి జాపి, "తాకు బాబూ" అంది. ముంజేతిమీద వేళ్ళు ఆనించాను. తాకిన నా వేళ్ళని ముక్కు దగ్గిర పెట్టుకుంటే అదో చక్కని వింత పరిమళం. చెయ్యి కడుక్కున్నా, స్నానించినా_ రెండురోజుల వరకు వుండిపోయింది వేళ్ళకి ఆ పరిమళం."
"అదేదో బూటకం. నిన్నేదో భ్రమలో పడేసి వుంటుంది" అన్నాడు సుధీర్.
"భ్రమ ఐతే సంతోషిద్దును. భ్రమకంటే మించిన ఆనందం ఏముంటుంది!"
"వూఁ__ఆ ముచ్చటేమైందో చెప్పు."
"ఇంకేం లేదు. ఆ పరిమళం నిజం" అన్నాడు శ్రీపతి.
"ఒంటికి పూసుకుందేమో."
"అలాంటి పరిమళమూ కాదు. నేను భూమ్మీద చాలా పరిమళాలు చూశాను. పూసుకున్నదీ కాదు."
"ఐతే దివ్యమహిమ అని నమ్ముతావా" అన్నాడు సుధీర్.
"దివ్య మహిమల గురించి నాకేం తెలియదు గానీ__వెనక రచయిత శరత్ బాబు ఉత్తరాల పుస్తకంలో చదివిన గుర్తు__ ఈ దిలీప్ కుమార్ రాయీ తనూ, యేవో వనమూలికలుంటాయనీ అవి ఒక పద్ధతిలో తింటే ఒంట్లోంచి పరిమళాలు వచ్చే వీలుంటుందనీ, అవి యెవరో ఒక సిద్ధుడికి తెలుసట అనీ, ఆ సిద్ధుడి ఆచూలీ తెలియటం లేదనీ__వున్న ప్రసక్తి ఆ మూలికలేవో యీ దిలీప్ కుమార్ రాయ్, అప్పటి కుర్ర దిలీప్ కుమార్ రాయ్ సంపాదించి అప్పటి ఆ ఇందిర గుంటకి తినిపించి వుండొచ్చు__"
