నిర్మల కావాలి. తను జీవించే తమ తృణీకరించలేని సమాజానికి నిర్మల చిహ్నం. కాగా, ఒక ప్రాధమికపు వొత్తిడి తీర్చుకోటానికైనా నిర్మల కావాలి.
రామ్మూర్తికి నిర్మల చాలా చప్పగా వుంది. తన జీవితం కూడా చాలా చప్పగా వుంది.
నలుగురు పిల్లలు పుట్టుకొస్తే కాస్త ఉప్పదనంగా కూడా వుంటుంది.
79
వూళ్ళో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జయప్రకాష్ నారాయణ్ సభ ఏర్పాటైంది. చాలాకాలం తరవాత అతని సభ యీ వూళ్ళో. అదీ, యిటీవల రాజకీయ పరిస్థితులు_ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనోద్యమాల దృష్ట్యా ఆ ఉద్యమాలకి రధసారధిగా వున్న దేశ రాజకీయ కురువృద్ధ నాయకుడు_అందునా యిన్నాళ్ళు అస్త్రసన్యాసం చేసి ఈనాడు రంగంలోకి దిగటం ఒక ప్రత్యేకత. ప్రజాబాహుళ్యం కదిలిరావటం మరో ప్రత్యేకత. అతను ఉద్యమం ప్రారంభించినంతమాత్రాన, ప్రజాబాహుళ్యం కదిలివస్తుందా? తెరమరుగున పడిపోయిన ఈ ముసిలాయన యిప్పుడు బయటికొస్తే, యెవరు పట్టించుకుంటారసలుకి? అందుకు తగిన కారణాలు, పరిస్థితులు వుండబట్టి అతనికి ఆ ప్రాముఖ్యం వచ్చి వుండాలి. పరిస్థితి అలాంటిది కాబట్టే అసలు దిగాడు. ఇలాంటి ప్రశ్నలతో మీమాంసతో నలుగురూ అనుకుంటున్నారు.
ఉస్మానియా నుంచి దయానందభారతి కులశేఖరరావు వేదపారాయణ నిరంజనరావు శ్రీపతి గుర్లింగం తదితరులు మూడు నాలుగు వందల విద్యార్థులు బయల్దేరారు. జె.పీ సభకిగానూ, ఆర్టీసీ వాళ్ళని అడిగితేనో ఏమో అదనంగా బస్సులు వేశారు.
బస్సులు ఖాళీగా వస్తున్నాయి సిటీలోంచి. వస్తూనే విద్యార్థులు చొరబడుతున్నారు. బస్సులు వెళ్ళిపోతున్నాయి వెంటవెంటనే.
ఒక బస్సులో ; టిక్కెట్లు కొనం__అని మొరాయించారు విద్యార్థులు పదిమంది. కొనకూడదంటే కొనకూడదన్నారు ఇరవైమంది డ్రైవరు బస్సు ఆపేశాడు. అందులో యెక్కువగా జనసంఘ్ అభిమానులున్నారు. దయానందభారతి తదితరులున్నారు.
"యిది మనం యేదైనా వుద్యమం ప్రారంభించిన సందర్భమైనా కాదు__వుత్తరాన ప్రారంభమైంది. యింకా దిగువకి వచ్చి దక్షిణాదినకూడా ముమ్మరంగా ప్రారంభమయ్యే సమయం రాలేదు. మనం వెళ్తున్నది ఒక మహానాయకుడు ఒక మహా మనిషి ఉపన్యాసం వినటానికి. దయచేసి టిక్కెట్టు కొనండి. లేదంటే మీరు మన్నిస్తే అందరికీ టిక్కెట్టు నేను తీసుకుంటాను." అని హిందీలో విజ్ఞప్తి చేశాడు దయానందభారతి.
వీడెక్కడ దొరికాడు?__అని ఒకరు, జిద్దుగాడు__అని ఒకరు, క్యాంపస్ జె పీ_అని ఒకరు, జూనియర్ వాజ్ పేయ్_అని ఒకరు అంటున్నా; అందరూ టిక్కెట్లకి డబ్బులు తీశారు. బస్సు కదిలింది.
శ్రీపతి చొరబడిన బస్సులో నిరంజనరావు, గుర్లింగం తదితరులు వున్నారు.
కోఠీలో దిగి నడుస్తున్నారు. కోఠీ మూలమీద పాత పత్రికలు అమ్మే చోట__ఒకక్షణం శ్రీపతి ఆగబోతే__"యిప్పుడేం పుస్తకాలు పదవయ్యా బాబూ" అన్నాడు నిరంజనరావు__అంటూ ఒక దిసమొల బొమ్మ వున్న పుస్తకం వంక చూస్తున్నాడు. ఆ పక్కనే రాధాక్రిష్ణన్ బొమ్మ వున్న పుస్తకం వుంది_పత్రికలాంటిది. వెడల్పాటిది. ఆ మొన్న అతను చనిపోయిన సందర్భంలోది.
"మీ రాధాక్రిష్ణన్ ఫైలాస్ ఫర్ కి మన క్యాంపస్ లో ఒక స్టాట్యూ పెట్టమని అడగరాదూ?" అన్నాడు గుర్లింగం, శ్రీపతితో.
"మా ఫైలాసఫరేఁవిఁటి?" అన్నాడు శ్రీపతి.
"నీది ఫిలాసఫీగా__"
"నాది ఫిలాసఫీ కాదు. ఏదీకాదు. చదివి వదిలేసెయ్యటమే అంతటితో సరి." అని, "అయినా రాధాక్రిష్ణన్ యేమంత చెప్పుకోతగిన ఫిలాసఫర్ కాదు" అన్నాడు శ్రీపతి.
చుట్టూ వున్న అయిదారుగురు ఆశ్చర్యంగా చూశారు.
"అదెట్లా? వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్ కదా" అన్నాడు గుర్లింగం.
"యూనివర్శిటీ పంతులు. వైస్ చాన్సలర్. మంచి స్కాలర్. భారతీయ దర్శన గ్రంథాలు బాగా చదివినవాడు. పెడాన్టిక్__వక్త. ఎంబాసిడర్ గా పైకి ప్రాకాడు. వైస్ ప్రెసిడెంట్ మెట్టు ఎక్కాడు. ప్రెసిడెంటు సింహాసనం అధిష్టించాడు, అలాంటి ఉన్నత రాజకీయస్థితిలోని వాడి ప్రాపకం కోసం గొప్ప తత్వవేత్త అంటూ వందిమాగధగీతాలు ఓండ్రపెట్టటం ప్రారంభించారు. ఆయన సొంత సిద్ధాంతం__కపిలుడికో కణాదుడికో __ ఉపనిషత్కారుల కున్నట్లు, శంకరాచార్యుడి కున్నట్లు ప్లేటోకో కాంట్ కో హెగిల్ కో హెడెగ్గర్ కో__అలా యెందరికో వున్నట్లు__తన సొంత తత్వశాస్త్రం__మెటఫిజిక్సో, యెపిస్టమాలజీనో, యీస్థటిక్సో, పాలిటిక్సో మరొకటో వుండాలి. ఆయన సొంతం అని చెప్పతగింది, చెప్పుకోతగినదేం లేదు. గొప్ప స్కాలర్. ఫిలాసఫీ గురించి పుస్తకాలు రాశాడు. ఫిలాసఫీ చరిత్ర రాశాడు. వ్యాఖ్యానాలు రాశాడు. సొంతంగా చెప్పిందేం లేదు. ప్రపంచంలోని సవాలక్ష తత్వ మహాచార్యులలో ఆయనా ఒకడు. మత సంబంధంగా ఓ పిసరంత సొంతంగా వుంటే వుందేమో. యింకో యాభై యేళ్ళు పోయాక ఫిలాసఫీలో ఒక స్కాలర్ గా బహుగ్రంథ కర్తగా మిగులుతాడు. ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ ని ఇస్రాయిల్ దేశపు ప్రెసిడెంటు పదవిని అధిష్టించమని అర్ధించి ఆహ్వానిస్తే చిరునవ్వుతో తిరస్కరించాడు." అని శ్రీపతి వాళ్ళ మొహాలు చూసి, 'బుద్ధిలేని తనంగా యెందుకీ సోది చెప్పాను వీళ్ళకి! పాపం, వాళ్ళ మొహాలు జాలేస్తోంది, చూస్తోంటే_ ఐనా కదలకుండా నుంచున్నందుకు అందరికీ టీ యిప్పించుతాను__ప్రత్యేకంగా__మీటింగు తరవాత.' అని అనుకుని, కదిలాడు_శ్రీపతి.
శ్రీపతి యెప్పుడో పొరపాట్న సుదీర్ఘంగా మాట్లాడతాడు. సాధారణంగా ఎలాంటి విషయాన్నీ ఒక ముక్కలో వరికేసో విరిచేసో మెరిపించో జార్చేసో చెరికో క్షణంలో ముగిస్తాడు. అందుకేనేమో శ్రీపతి మాటలంటే చాలామంది యిష్టపడతారు.
సభా ప్రాంగణంలో జనసందోహం.
ఆడవాళ్ళు ఎక్కువగా వున్న వైపుల, అంకినీడు మరి నలుగురితో గిరగిరా తిరుగుతున్నారు. చూసి, 'వీడింకా యీ చీదర తిరుగుడు మానలేదన్నమాట!' అనుకున్నాడు శ్రీపతి.
అటునుంచి తన జుట్టుతో వస్తూ దయానందభారతి, "హలో శ్రీపతీ జర్నలిస్ట్ వి.... ప్రసంగంలోని సూక్ష్మమర్మాలు గ్రహించి వుంచుకుంటావని తలుస్తాను." అన్నాడు హిందీలో.
