Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 20


    కానీ ఆమెకి ప్రత్యేకం యేమీ తెలియదు. అతనేమన్నా చేస్తుంటే బాగానే అనిపించింది నిర్మలకి. సిగ్గుగా అనిపించింది.
    రామ్మూర్తికి నిన్నటంత బాగా అనిపించలేదు.
    మూడో రాత్రి__
    "నువ్వు పల్లెటూరి మొద్దువి. రాచ్చిప్పవి" అన్నాడు కసిగా.
    వొంటిన వొక్క నూలుపోగు కూడా లేకుండా పీకేశాడు. ఐనా ఆ వొళ్ళు అతనిని రెచ్చగొట్టటం లేదు. ఆ వొంట్లో ఆ శక్తి వున్నట్లనిపించటం లేదు. తన ఆరాటం కొద్దీ తనేదో తిప్పలు పడటం తప్ప__ఆ ఒళ్ళు తనని ముంచెత్తేసెయ్యాలని యేదేదో వూహించుకునే రామ్మూర్తికి మండుకొచ్చింది__దీనితో జన్మంతా గడపాలి కాబోలు__అనుకుని.
    మరింత ప్రయత్నించాడు__ఆమెని కదల్చటానికి. ఆ ఒంట్లోనూ మనసులోనూ అ ఇదేం కనిపించలేదతనికి.
    మేఘాలమీద తేలిపోతూ అమాంతం నేలమీద పడి కాలిబాటన కాళ్ళీడ్చుకుంటూ పోతున్నట్లుగా అనిపించింది రామ్మూర్తికి.
    రామ్మూర్తికి; వెళ్ళిన వెంటనే ఇల్లు చూసి వుంచమని యిరుపక్షాల పెద్దలూ చెప్పారు.
    గడికోసం యెలాగూ తిరుగుతూనే వున్నాడు. యిప్పుడు అనుకోకుండా మూడు గదుల వాటా ఒకటి దొరికింది. ఆమాటే రాశాడు యింటికి. రామ్మూర్తికి ఒంటరిగా పడుకుంటే బాగాలేదు. యేదో ఒత్తిడి తీర్చుకోవాల్సింది యిబ్బంది పెడుతున్నట్లుగా అనిపించింది. కానీ వూహలు, వుద్రేకాలూ, పొంగులూ, రంగులు లేవు.
    ఫలానా రోజు మంచిరోజు మీ మామగారు అత్తగారు అమ్మాయిని కాపరానికి తీసుకుని వస్తున్నారని తండ్రి రాశాడు.
    స్టేషనుకి వెళ్ళాడు. బోలెడు సామాను. రెండు మంచాలు, పాత్ర సామగ్రి గోదాములు, బుట్టలు, మూటలు. 'పార్శిల్ చెయ్యకూడదూ' __ అనుకున్నాడు అవన్నీ అలా చూస్తే చిరాగ్గా అనిపించింది రామ్మూర్తికి.
    పెళ్ళాం వంక చూస్తే__ఆ చీరకట్టూ తీరూ__చప్పగా అనిపించింది.
    అత్తమామలు వారం రోజులుండి అన్నీ అమర్చి వెళ్ళారు. గ్యాస్టవ్ కూడా పట్టుకొచ్చారు. యెప్పుడో కొని వుంచారట కూతురికోసం. పాత్ర సామగ్రి__స్టీలుది సమంగానే వుంది. మంచం ఒకటి చాలా బావుంది. రెండోది చిన్న మంచం. నిర్మల కంటే వాళ్ళే నయం అనుకున్నాడు.
    వారం రోజులు గడిచాయి. వారం రాత్రులూ గడిచాయి. అతను వూహించుకున్నంత యిదిగా వుండటం లేదు. కాస్త చిరాగ్గా అనిపిస్తోంది.
    ఒకరోజున, "పల్లెటూరి మొద్దులాగా అట్లా చీర బిగదీసి అంత పైకి కట్టుకుంటావేం. కిందకి కట్టుకో అందరిలాగా. ఊరంతా తిప్పి చూపెడతాను. కళ్ళు లేవూ? గమనించలా?" అన్నాడు.
    ఆ మరుసటిరోజు సినిమా ప్రోగ్రాం అనుకున్నారు.
    బయల్దేరారు, హాలుదగ్గిర ఒకరిద్దరు నిర్మల పొట్టకేసి చూస్తున్నారు__చూపు ఆమె బొడ్డులో గుచ్చి.
    రామ్మూర్తి గిలగిల్లాడిపోయాడు. నిర్మల మీద మండుకొచ్చింది.
    ఆమె పవిత పొట్ట మీదనే వుంది, పక్కనుంచి బొడ్డు కనిపిస్తుంది_ప్రత్యేకించి శ్రద్ధగా చూసేవాళ్ళకి.
    సినిమా నుంచి యింటికొచ్చాక, "సిగ్గులేదూ. అట్లా బొడ్డూ గిడ్డూ మగాళ్ళకి చూపెట్టుకుంటూ తిరగడానికి?" అని కసిరాడు.
    నిర్మల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "ఎందుకేడుస్తావ్? ప్రతిదానికీ ఏడుపొకటి. అందరూ పుట్టగానే ఏడుస్తారు. నువ్వు కడుపులోనే ఏడుపు మొదలెట్టి వుంటావు." అన్నాడు.
    రామ్మూర్తి జీవితంలో పైకి యెడాపెడా యేదంటే అది అనగలిగింది యీ నిర్మల నొక్కదాన్ని. తాళి కట్టించుకుని నోరెత్తటం రాని, అతి సాత్వికంగా కనిపించే నిర్మలని.
    ఒకసారి తీక్షణంగా చూసి ఒక చురక అంటిస్తే, రామ్మూర్తి మళ్ళీ అలా ప్రవర్తించలేడని నిర్మలకి యీ జన్మకి స్ఫురించకపోవచ్చు.
    "మాట్లాడవేం?" అని కసిరాడు.
    "మీరే చెప్పారుగా అట్లా కట్టుకోమని" అంది భయంభయంగా, వినిపించీ వినిపించనంత నెమ్మదిగా.
    "యింట్లో కట్టుకోవాలి అట్లా. బయట జనమందరికీ బట్టలిప్పుకుని చూపెట్టుకోమన్నానా?" అన్నాడు.
    పదిరోజులకే__ఆమె రూపం, అవయవాలు__యేవీ అతని దృష్టిని ఆకర్షించటం లేదు. రెచ్చగొట్టటం ఆదిలోనే జరగలేదు.
    రోజులు గడుస్తున్నాయి.
    రాత్రిపూట, ఆమెని సమీపించేముందు_ పొంకంగా బింకంగా వుండి కవ్వించే రెచ్చగొట్టే అవయవాల చూపుల రకరకాల బొమ్మలు, రకరకాల భంగిమల్లో వున్నవి_ అలాంటి పుస్తకాలు కాసేపు చూస్తున్నాడు.
    రామ్మూర్తికి నిర్మల కూడా ఆఫీసరు లాగానే అనిపిస్తోంది. ఒక్కటే తేడా. అక్కడ తను_ చివాట్లు తింటాడు. యిక్కడ చివాట్లు పెడతాడు.
    ఆఫీసరు మగ దుస్తులేసుకుని తనని వాయిస్తాడు. తను నోరెత్తకుండా పడివుంటాడు. నోరెత్తటం రాదు. నోరెత్తలేడు. నిర్మల ఆడ దుస్తులేసుకుని, తను వాయిస్తే నోరెత్తకుండా పడివుంటుంది. నోరెత్తటం రాదు. నోరెత్తలేదు. యీ యిద్దరూ ఒకలాగే అనిపిస్తున్నారు. తన జీవితం కూడా అలాగే అనిపిస్తోంది.
    నిర్మలకి అప్పుడే నెలతప్పింది. అని నిర్మలకి అంత స్పష్టంగా విభజనగా తెలియదు. రామ్మూర్తికి ఆ గమనింపు లేదు.
    రామ్మూర్తికి తన జీవితం_గంతలూ లేవు గానుగా లేదుగానీ_గానుగెద్దు జీవితంలా అనిపిస్తోంది.
    అంతలో ఆ వుద్యోగం వూడింది. ఇళ్ళకి వుత్తరాలు రాశారు అలా అని. ఆమె తండ్రి, రెండు వేల రూపాయలకి డిమాండు డ్రాప్టు పంపించాడు__వుద్యోగం లేదని యిదవకండి, యేదొకటి అదే వస్తుంది మళ్ళీ _ అని. అతని తండ్రి నెలనెలా కొంత పంపుతుంటాను, పోస్టు డాక్టొరల్ ఫెలోషిప్ వస్తుందేమో ప్రయత్నించు__ అని రాశాడు.
    "దారిద్ర జాతకం దానివి నువ్వొచ్చావు వుద్యోగం వూడింది." అని తిట్టాడు.
    ఆమెకి ఏడుపొచ్చింది. ఏడిస్తే ఏడ్చినందుకు తిడతాడు అందుకని ఆపుకుని చాటుగా ఏడుస్తోంది.
    "నాతో పెళ్ళి అనుకున్నాకేగా ఈ ఉద్యోగం వచ్చింది. ఇన్నాళ్ళైనా వుంది నా అదృష్ట జాతకం వల్ల. లేకపోతే మీకు ఏదీ రాకపోను" అని అనటం రాదు నిర్మలకి.
    మళ్ళీ నిర్మల కావాలి. యెవరివైపూ ఆసక్తిగా చూడకూడదు తనవంకే చూడాలి. తనంటేనే ఇష్టపడాలి. తను లేకపోతే ఆమె బ్రతకలేదు_ అన్నట్లుగా వుండాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS