"ఆ బస్ వస్తే నాకు చెప్పండి బాబూ! నేను కూడా అర్జంట్ గా వెళ్ళాలి. నేను కూడా మీతోపాటే వస్తాను." అని వాళ్ళతో చెప్పి పుండరీకాక్షయ్య వచ్చి మళ్ళీ బెంచీ మీద కూర్చున్నాడు.
సమయం గడిచిపోతున్నది.
11
యతిరాజులు వచ్చి బెంచీ మీద కూర్చున్నాడు.
యతిరాజులకి ఇరవై రెండేళ్ళ వయస్సు వుంటుంది. వాడు జేబుదొంగ తనాలలోనూ, చిల్లర దొంగతనాల లోనూ ఆరితేరిన ఘనుడు.
వాడి చూపులు డేగ చూపులను పోలి వుంటాయి. పోలీసులకి పాత పరిచయస్థుడే.
ఇరవై రెండేళ్ళ వయస్సులో యతిరాజులు చిల్లర దొంగతనాలు చేసినా నాలుగు రోజులు అయ్యేసరికి మళ్ళీ చేతిలో పైసా వుండేది కాదు. మళ్ళీ వేటకి బయలుదేరేవాడు.
యతిరాజులని తెలిసిన వాళ్ళందరూ రాజులుగాడు అని పిలుస్తారు. వాడికి చేత్తోపాటు నోరూ వూర్కోదు. వేషం చూడబోతే గౌరవ ప్రదంగా కూడా వుండదు. బాగా బిగుతుగా వున్న పాంట్ వేస్తాడు. ఆ పాంట్ కి షోకుగా పది జేబులు వుంటాయి. పెద్ద పెద్ద పూల డిజైను వున్న ముదురురంగు బుష్ కోటు ధరిస్తాడు. ఒక చేతికి చవకరకం వాచీ. మరో చేతికి రాగి రంగు కడియం, మెడకి చుట్టుకున్న ఎర్ర రంగు రుమాలు, బాగా పెరిగిన తలకట్టు. చూడంగానే బజారు సరుకు అని తెలిసి పోతుంటాడు.
యతిరాజులు గాడు మాత్రం తన గురించి అలా అనుకోడు. అదేదో సినిమాలో తన అభిమాన హీరో ఇదే గెటప్ లో వుండటం వలన తను కూడా చిన్న హీరోని అనుకుంటూ వుంటాడు.
బెంచీ మీద బాగ్ కి ఇటుప్రక్క పుండరీకాక్షయ్య కూర్చొని వుంటే, బ్యాగ్ అటు ప్రక్కగా రాజులుగాడు వచ్చి కూర్చున్నాడు.
"మీరిక్కడికి వెళుతున్నారు?" నోరు వూరుకోక పుండరీకాక్షయ్యని అడిగాడు రాజులుగాడు.
"గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళే బస్సు రెండు గంటలదాకా రాదట... ..." అని చెబుతూ పుండరీకాక్షయ్య రాజులుగాడిని ఎగాదిగా నఖశిఖ పర్యంతం చూశాడు.
యతిరాజులుగాడు స్టూడెంటు కుర్రాడిలా కనిపించకపోవటంతో పైగా వాడి అవతారం పెద్ద మనిషి తరహాకి దగ్గరగా లేకపోవటం, పనిగట్టుకుని ఆ కుర్రాడు తనని పలకరించటం, ఇవన్నీ పుండరీకాక్షయ్యకి అనుమానం కలిగించాయి.
అయినా, ఎవడెట్లాంటి వాడయితే తనకెందుకులే అనుకున్నాడు.
"నేను కూడా గుంటూరే వెళ్ళాలి. మా అప్ప దగ్గరకి వెడుతున్నాను లెండి" పుండరీకాక్షయ్య అడుగకపోయినా చెప్పాడు యతిరాజులుగాడు.
పుండరీకాక్షయ్య నొసలు చిట్లించి వూరుకున్నాడు.
"మీరెవరింటికి వెళ్ళాలి?" యతిరాజులుగాడు అడిగాడు.
"మా అమ్మాయింటికి వెడుతున్నాను." చిన్న అబద్ధం ఆడాడు పుండరీకాక్షయ్య.
"మీ అల్లుడుగారు ఏం చేస్తుంటారు అక్కడ అడిగాడు రాజులుగాడు.
"ఏమీ చెయ్యటం లేదు."
"అదేమిటి? ఓహో మీ అల్లుడిగారికి బాగా ఆస్తి వున్నట్లు వుంది కామాలు. ఆస్తి వుంటే వుద్యోగం లేకపోయినా ఫరవాలేదులెండి.
