"అదికాదు."
"మరి?"
"మా అమ్మాయికింకా పెళ్ళి కాలేదు. అక్కడ వుద్యోగం చేస్తున్నది." నోటికి వచ్చిన అబద్ధాలాడాడు పుండరీకాక్షయ్య.
నిజం చెప్పాలంటే పుండరీకాక్షయ్యకి అబద్ధాలు చెప్పవలసిన అవసరంలేదు. ప్రక్క కూర్చున్నవాడు ఆకారానికి జులాయి వెధవలాగా వుండటమూ కల్పించుకొని అనవసరం ప్రశ్నలు వెయ్యడమూ, వాడి చూపులు మాటిమాటికి బ్యాగ్ మీద వాలటం, వాడు ఆ చూపులని బలవంతానా ఇంకోవైపు తిప్పుకోవటమూ ఇవన్నీ గమనించాడు పుండరీకాక్షయ్య. పైగా వాడు ఆ గుడ్డలు ఉతుక్కుని ఎన్నిరోజులయిందో చెమట కంపు బాగా కొడుతున్నాయి.
ఇది ఇలా వుండగా,
పుండరీకాక్షయ్య చూపులు అల్లంత దూరాన గోడమీద రాసిన ఎర్రటి అక్షరాల మీద పడ్డాయి. అవి చదవటమూ జరిగింది.
"మీ మధ్యనే దొంగలున్నారు జాగ్రత్త. మీ సామానులు మీరే భద్రపరచుకోవటం మంచి లక్షణం. సామానులు పోయి వగచేకన్నా ముందు జాగ్రత్త ఎంతో మంచిది. సామాను దొంగలతో పాటు జేబుదొంగలున్నారు జాగ్రత్త. మీ జేబులు చాలా జాగ్రత్త."
అది చదివిన తరువాత పుండరీకాక్షయ్య గొడుగుని, బ్యాగ్ ని మరికాస్త దగ్గరికి జరుపుకున్నాడు. బ్యాగ్ ని తన వళ్ళో పెట్టుకుందామని అనుకున్నాడు కానీ, అలా చెయ్యడం వలన ప్రక్కవాడిని అనుమానించినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి ఆ పని చెయ్యలేదు. బ్యాగ్ ని ఒక కంట చూస్తూ కూర్చుంటే సరి అనుకున్నాడు.
పుండరీకాక్షయ్య బ్యాగ్ ని జరపటం ఓరకంటితో గమనించాడు రాజులుగాడు. రాజులుగాడి కళ్ళన్నీ పచ్చ బ్యాగు మీదే వున్నాయి.
మనసు పచ్చ బ్యాగ్ మీద మాటలు వూళ్ళో వాళ్ళమీద సాగిస్తూ కూర్చున్నాడు రాజులుగాడు.
తన ప్రక్క కూర్చున్నవాడు దొంగ వెధవని పుండరీకాక్షయ్య మనసుకు మాటిమాటికీ అనిపిస్తున్నది. రాజులుగాడు అడిగే మాటలకి కొన్నింటికి సమాధానమిస్తూ కొన్నిటిని దాటేస్తూ, మొత్తానికి పుండరీకాక్షయ్య కూడా ఈ జాగ్రత్త వహించి తన బ్యాగ్ ని ఒక కంట చూసుకుంటూ వున్నాడు.
"మీరు గుంటూరు బస్సు వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటారా?" మాటల మధ్య రాజులుగాడు అడిగాడు.
"కూర్చుంటాను, కూర్చోక చస్తానా?" అన్నాడు పుండరీకాక్షయ్య.
కానీ. లోలోపల మాత్రం అనుకున్నాడు. "నీకు ఎందుకు? నేను కూర్చుంటే ఎందుకు? నుంచుంటే ఎందుకు? మధ్యలో లేచి వెడితేఎందుకట? వీడి కళ్ళు నా బ్యాగ్ మీద పడ్డాయి. వీడు దొంగచూపులే చెపుతున్నాయి. వీడో దొంగ వెధవని. నేనేదో ముసలి ముండావాడిని, కాస్త కునికితే ఆ సమయంలో బ్యాగ్ తీసుకునిపోవచ్చు అనుకుంటున్నాడేమో! దొంగ వెధవ, దొంగ వెధవాని.
రాజులుగాడు అక్కడినుండి కదిలే ప్రయత్నం చెయ్యలేదు. "గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో? వయస్సులో పెద్దవారు ఎంతసేపని కూర్చుంటారు. బెంచీమీద పడుకునేటట్టయితే పడుకోండి నేను ప్రక్కకి జరుగుతాను." వినయంగా అన్నాడు.
'అమ్మ దొంగవెధవా! నీ పథకం ఆ మాత్రం నాకూ తెలుసులే. నేను ఒక కునుకు కునికితే, కునికే లోపల బ్యాగ్ ఎత్తుకు వెడమామనా! ఇక్కడ ఇంతమంది వుంటే నీ చూపులు నామీదా, నా బ్యాగ్ మీదా పడ్డాయా!' అనుకున్న పుండరీకాక్షయ్య.
"నాకు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయే అలవాటు లేదు. అసలు నిద్రంటూ పోకుండా రాత్రింబవళ్ళూ అలా కళ్ళు తెరుచుకొని వుండగలను వారం రోజులు. నా శరీరం ఉక్కులాంటిది. ఈ పళాన కొన్ని గంటలు కూర్చోగలను."
నీ ఎత్తులు నాకు తెలుసులే అన్నట్లుగా అన్నాడు నవ్వుతూ పుండరీకాక్షయ్య.
