Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 19

పుండరీకాక్షయ్యని మరోసారి ఆటాడించబుద్ధి అయింది.

"మీరు గణపవరం వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళే బస్సు వెక్కనక్కరలేదు. ఇక్కడినుండీ ఒక దగ్గర మార్గం వుంది చెబుతాను" అన్నాడు అతను.

"చెప్పు బాబూ!" ఆత్రుతగా అడిగాడు పుండరీకాక్షయ్య.

"మీరు రిక్షా వేసుకుని తిన్నగా వూళ్ళోకి వెళ్ళండి. వూళ్ళో బాలయ్య హోటల్ వుంది. అక్కడ దిగండి. అక్కడ బాడుగకి టాక్సీలు అంటే చిన్నకార్లు వుంటాయి. వాళ్ళ టాక్సీ ఎక్కితే దగ్గిర దారిన గణపవరం తీసుకువెళతారు. ఆ పనిచేయండి అన్నింటికన్నా బెటర్" అన్నాడు అతను.

"ఏది మళ్ళీ చెప్పు బాబూ!"

అతను వివరంగా మళ్ళీ చెప్పాడు.

"నేను అడగంగానే గణపవరం ఎలా వెళ్ళాలో చెప్పి చాలా సహాయం చేశావు బాబూ! గణపవరానికి బస్సుల్లేవని నాకు తెలుసు. గుంటూరు వెళ్ళాల్సిన బస్సు విషయం అడిగితే ఎలాగూ చెప్పలేక పోయినావు. కనీసం గణపవరం గురించి అడిగితే చెపుతావేమో అని అడిగాను. నేనూహించినట్లే చాలా వివరంగా చెప్పావు. ప్రజలకి ఈ విధంగానైనా సహాయం చేస్తూండు బాబూ! దేవుడు నీలాంటి వాళ్ళని చల్లగా చూస్తాడు పదికాలాల పాటు!" అని శాంతంగా చెప్పి మారుమాటకి ఆస్కారం ఇవ్వకుండా కుడి చంకలో వున్న గొడుగు ఎడమ చంకలోకి మార్చుకుని గబగబా అవతలకి వెళ్ళాడు.

కౌంటర్లో వున్నతను తేరుకోవటానికి సరిగ్గా పదినిమిషాలు పట్టింది.

"అమ్మ! అమ్మ! ఈ ముసలాడు ఎంత దెబ్బతీశాడు. ఈ పల్లెటూరి బైతులకున్నంత తెలివి పట్నం వాళ్ళకు వుండదు" అనుకున్నాడు.

అతను ఆర్.టి.సి.కి సంబంధించినవాడు కాదు. ఆర్.టి.సి.లో వున్న తనకే ఫోన్ చెయ్యాల్సిన అవసరం పడితే అక్కడికి వచ్చి తెలిసిన అతనిని పట్టుకుని ఫోన్ చేసి మాట్లాడుతూ వుంటే సమయానికి పుండరీకాక్షయ్య రావటం జరిగింది బస్ ఎంక్వైరీ నిమిత్తం. అదీ జరిగింది.

కౌంటర్ దగ్గర నుండీ ఇవతలకి వస్తూ పుండరీకాక్షయ్య చేతివంక చూసుకున్నాడు. చేతిలో పచ్చ బ్యాగ్ లేదు.

పుండరీకాక్షయ్య గుండె ఒక్కసారిగా గుభేల్ మంది.

పచ్చ బ్యాగ్ లో నగలు, నాణ్యాలూ లేకపోవచ్చు. కానీ, బాధ్యతగా ఒకరికి అప్పగించవలసిన బ్యాగ్ అది. పార్వతమ్మ ఎంతో ఆప్యాయంగా పిండివంటలు చేసి, అవి కొడుకుకి అందించమని ప్రేమగా ఇచ్చిన బ్యాగ్ అది.

"పార్వతి ఒకటికి పదిసార్లు, కొడుకుకి ఆ బ్యాగ్ జాగ్రత్తగా అందించమని చెప్పింది. తప్పకుండా చంద్రానికి అందిస్తానని మాటిచ్చాడు తను.


ఆ బ్యాగ్ పోతే ఇంకేమన్నా వుందా! తను మాటతప్పిన వాడవుతాడు.


పుండరీకాక్షయ్య మధనపడుతూ అంతక్రితం తను కూర్చున్న బెంచీ దగ్గరకి ఆదరాబాదరాగా వచ్చాడు. బెంచీ మీద పచ్చరంగు బ్యాగ్ ను చూడంగానే ఆయన ప్రాణం తెప్పరిల్లింది.


భగవంతుడంటూ ఒకడున్నాడు. ఈ బ్యాగ్ విడిచి తను అక్కడికి వెళితే పెట్టిన చోటే బ్యాగ్ వుందీ అంటే, ఇంకా న్యాయం, ధర్మం ప్రపంచంలో ఇంకా లోకం ఏలుతున్నట్లే. అలా అనుకుంటూ పుండరీకాక్షయ్య బ్యాగ్ ప్రక్కకి వచ్చి కూర్చున్నాడు.


చంకలో పెట్టుకున్న గొడుగుని తీసి బ్యాగ్ ప్రక్కనే పెట్టి, ఉసూరుమంటూ వెనక్కి చతికిల పడ్డాడు పుండరీకాక్షయ్య.


సరిగ్గా అప్పుడే గుంటూరు వెళ్ళే బస్సు గురించి మాట్లాడుకుంటూంటే ఎవరో, లేచి వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు పుండరీకాక్షయ్య.


ఈ తఫా పుండరీకాక్షయ్య చాలా జాగ్రత్తపడ్డాడు. ఒక కన్ను బ్యాగ్ మీద వేసి చూస్తూ, గుంటూరు వెళ్ళే బస్ గురించి వాళ్ళని అడిగాడు.

మరో రెండు గంటలు ఆలస్యంగా గుంటూరు వెళ్ళే బస్సు వస్తుందని చెప్పారు.

'గుంటూరు వెళ్ళాలంటే ఒక పని చెయ్యొచ్చు. గుంటూరు మీదుగా వెళ్ళే ఎక్స్ ప్రెస్ బస్సులు కొన్ని వున్నాయి. ఆ బస్సుకాక ఇంకొక బస్సు అయితే వేరే రూట్ లోకి పోతాయి. కానీ, మధ్యలో దిగి వేరే ఇంకొక బస్సుని పట్టుకుంటే గుంటూరు తేలికగానే వెళ్ళొచ్చు. ఎప్పుడడిగినా వీళ్ళు గుంటూరు వెళ్ళే బస్సు మరో రెండుగంటల తరువాత వస్తుందని చెపుతున్నారు. అదయినా గట్టిగా చెప్పటం లేదు. అడుగుతున్నాం కదా అని అదికూడా చెప్పటం. ఈ గోల అంతా బదులు ఏదో ఒక బస్సు ఎక్కేసి వెళితే ఈ నిరీక్షణ తప్పుతుంది.' అని వాళ్ళు వివరించారు.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS