ఫోన్ లో మాట్లాడుతున్న అతనికి చిర్రెత్తుకొచ్చింది.
ఫోన్ లో మాట్లాడటం ఆపేసి పుండరీకాక్షయ్య వైపు చూశాడు.
పల్లెటూరి బైతులాగా వున్న పుండరీకాక్షయ్యను చూడగానే "ఫోన్ లో మాట్లాడేటప్పుడు, అడ్డం వచ్చి మాట్లాడటం తప్పని తెలియదా? మానర్ లెస్ బ్రూట్!" అని తిరిగి ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెట్టాడు.
అతను మాట్లాడింది ఇంగ్లీషులో కావటం వల్ల తనని తిట్టాడు అన్న విషయం పుండరీకాక్షయ్యకి అర్థంకాలేదు.
విసుక్కున్నాడని మాత్రమే అర్థం చేసుకున్నాడు పుండరీకాక్షయ్య.
ఒక్క క్షణం ఆగి,
"బాబూ! నువ్వేమీ అనుకోకు. నాకు ఇంగ్లీషు రాదు. గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో కాస్త తెలుగులో చెప్పుదూ! బాబ్బాబు?" అన్నాడు పుండరీకాక్షయ్య.
ఫోన్ లో మాట్లాడుతున్న అతను అవతల వాళ్ళ నుంచి బానే చివాట్లు, తిట్లు తిన్నట్టున్నాడు, రుసరుసలాడుతూ ఫోన్ పెట్టేశాడు.
అతను అలా ఫోన్ పెట్టేశాడో లేదో, పుండరీకాక్షయ్య ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా అడిగాడు. గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో అడిగావా బాబూ!
కౌంటర్లో వున్న అతనికి వళ్ళు బాగా మండిపోతున్నది. అదే సమయంలో, పుండరీకాక్షయ్య అతనిని జిడ్డులాగా పట్టుకున్నట్లు అనిపించింది.
అంతకుముందే ఫోన్ లో చివాట్లు తినివున్నాడేమో, ఆ కసి అవతలి వాళ్ళమీద తీర్చుకోలేక, పుండరీకాక్షయ్యని ఏడిపించి తనకసి తీర్చుకోవాలనుకున్నాడు.
"ఏం కావాలి?" బహు మర్యాదగా అడిగాడు అతను.
కోపంగా వున్న మొహం కాస్త ప్రసన్నంగా పెట్టుకుని అతను అడిగేసరికి, పుండరీకాక్షయ్య కాస్త తబ్బిబ్బు అయ్యాడు. "బస్సు, బస్సు." అన్నాడు కాస్త కంగారుగా.
"బస్సు కావాలా? దేనికి?" నెమ్మదిగా అడిగాడు అతను.
"అదికాదు. నేను__"
"నువ్వేలేవయ్యా! బస్సు దేనికని అడుగుతున్నాను?"
"ఎక్కటానికి, ఎక్కటానికి" అన్నాడు పుండరీకాక్షయ్య. ఇంక ఎలా చెప్పాలో తెలియక.
"బస్సు ఎక్కటానికి కాకపోతే, ఎక్కడన్నా ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారటయ్యా!"
"అదికాదు__"
"అదికాదు, ఇదికాదు. లేకపోతే బస్సు. ఏమిటయ్యా నీవు మాట్లాడేది? సరిగ్గా చెప్పటం రాదా? అసలు బస్సు ఎప్పుడన్నా ఎక్కావా?" అతను ఎకసెక్కంగా అడిగాడు.
అప్పటికర్ధమయింది పుండరీకాక్షయ్యకి, అతను తనని మాటలతో ఎగతాళి పట్టిస్తున్నాడన్న సంగతి.
"గుంటూరు వెళ్ళే బస్సు కావాలి!"
"గుంటూరు వెళ్ళే బస్సు ఇప్పుడప్పుడేరాదు. అసలు ఈరోజు వస్తుందో రాదో కూడా."
అతను చెప్పేతీరు అబద్ధమని స్పష్టంగా తెలిసిపోయింది పుండరీకాక్షయ్యకి.
ఆయనకి ఇంగ్లీషు చదువులు రాకపోవచ్చు, పల్లెటూరు వాడే కావచ్చు. కానీ తెలివితక్కువ వాడేం కాదు. కాకపోతే ఆయనకి వున్నదల్లా కాస్త చాదస్తం. కొన్ని విషయాల్లో అమాయకత్వం.
"పోనీ గణపవరం వెళ్ళే బస్సు వస్తుందా?" పుండరీకాక్షయ్య అడిగాడు.
"గణపవరం వెళ్ళే బస్సా?" అతను రవ్వంతసేపు ఆలోచించాడు.
అతను గణపవరం పేరెప్పుడూ వినలేదు. పైగా ఆ వూరికి బస్సు వెలుతుందనీ తెలియదు. "ఓహో ఈ ముసలాయన బస్సు పట్టుకుని గుంటూరు వెళ్లి అక్కడినుండీ గణపవరం వెళ్ళాలి కాబోలు" అనుకున్నాడు.
