Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 19


    "లేదు సార్! ఇది ఒక్కటే. ఖైదీలం కూడా మేమిద్దరమే!" అన్నాను నేను.


    "ఈ విషయం నీకెలా తెలుసు?" ఈ మాట అడగండి సార్!" ప్రక్కనున్న కానిస్టేబుల్ అహోబిలం అన్నాడు.


    "అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? ఇంతోటి ఐడియా రాకనే నువ్వు నాకు సలహా ఇస్తున్నావా?" అహోబిలాన్ని కోప్పడ్డాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వుంటే నాకు ఆలోచించుకోటానికి టైము దొరికింది.


    "సార్! ఈ విషయం నాకూ సరీగ్గా తెలియదు. ఇక్కడ వుండే దొంగల నాయకుడు మమ్మల్ని బంధించి ఈ గదిలో పడేసి, "దీని పేరు మృత్యు మందిరం. ఈ ఇంటి మొత్తానికి ఇది వక్కటే వుంది. ఈ గదిలో ఎప్పుడో తప్ప ఎవరినీ పడేయం. ఈ గదిలో ఎవరినయినా పడేశామూ అంటే అన్నపానీయాలు లేకుండా అస్థిపంజరాలు కావలసిందే. గది ఒకటి, ఖైదీలు ఇద్దరు. చెరోచోటా పెట్టటానికి కూడా లేదు. మాట్లాడుకుంటూనో, నన్ను తిట్టుకుంటూనో చావండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. దానిని బట్టి నేను అనుకున్నాను సార్! మేమిద్దరమే ఖైదీలమని, ఈ గది ఒకటే అని." నాకు ఓపిక చచ్చిపోతున్నది. అయినా పోలీసులతో వ్యవహారం ఇది. తెచ్చిపెట్టుకున్న శాంతంతో వినయంగా చెప్పాను.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు నేను చెప్పింది నమ్మాడు.


    అయినా ఉత్త అనుమానాల పుట్టలాగా వున్నాడు.


    "ఎంతసేపూ నువ్వు మాట్లాడుతున్నావు గానీ, వాడు పెదవి కదపడేమిటి?" అని అడిగాడు రామ్ సింగ్ ని చూస్తూ.


    "ఇతని పేరు రామ్ సింగ్ సార్! చాలా అమాయకుడు మంచివాడు. హిందీ తప్ప తెనుగురాదు. రెండు మూడు తెలుగు ముక్కలు మాత్రం వచ్చి. తెనుగులో మాట్లాడితే వినలేం! వుచ్చు అనాల్సింది బదులు 'వుచ్చ' అనేస్తాడు..."


    నామాట పూర్తికాకముందే "థూ!" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    మరో రెండు నిముషాల తరువాత ఇన్ స్పెక్టర్ గారి పుణ్యమా అని మేము ఆ చెరలోంచి తప్పించబడ్డాము.


    కాకపోతే ముందు జాగ్రత్తకోసం మా ఇద్దరి చేతులకీ కలిపి బేడీలు వేయటం జరిగింది.


    "చాలా దాహంగా వుంది సార్! మీరు కాసిని మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకోకపోతే, మేము నడవలేము. మమ్మల్ని ఈడ్చుకు వెళ్ళాల్సిందే! మూడు రోజులు అయింది మేము మంచినీళ్ళు త్రాగి" జాలిగా ముఖంపెట్టి అన్నాను.


    "మూడు రోజులు మీరు మంచినీళ్ళు త్రాగకుండా ఇంకా మీరు బ్రతికి వున్నారా?" కానిస్టేబుల్ అహోబిలం ఆశ్చర్యంగా అడిగాడు.


    "నీ బుర్ర అప్పుడప్పుడూ పని చెయ్యదా ఏమిటి? నీవు మాట్లాడేది మనుష్యులతో అనుకుంటున్నావా! లేక దెయ్యాలతో అనుకుంటున్నావా! ముందు వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కోపంగా అన్నాడు.  


    కానిస్టేబుల్ అహోబిలం,మరో కానిస్టేబులూ శబ్దం బయటికి రాకుండా గొణుక్కుంటూ బయటికి వెళ్ళారు.


    మరికాసేపటిలో మా స్థావరంలోనే వున్న మంచినీళ్ళ కుండని మోసుకుని వచ్చారు.

    
    గ్లాసుతో ముంచి ఇస్తే నేను మంచినీళ్ళు నెమ్మదిగా త్రాగాను.


    ఈ లోపలే రాంసింగ్ గబుక్కున కుండని రెండు చేతులతో పైకెత్తి గటగటా, గటగటా కుండలోవున్న సగం నీటిని ఒక్క చుక్క కూడా విడవకుండా త్రాగేసాడు.


    "అన్ని నీళ్ళని ఎట్లా త్రాగావయ్యా!" అంటూ అహోబిలం తెల్లముఖం వేసాడు.


    "చూస్తూ అదేం ప్రశ్న? మన కళ్ళముందు చూసిన దానిని మనమే గ్రహించకపోతే ఎట్లా! మనకి ఈ వుద్యోగాలు దండగ నెత్తిన టోపీ వుండంగానే సరికాదు" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కేకలేశాడు.


    అహోబిలం ఆయనవైపు చూసే ధైర్యంలేక మావేపు గుర్రుమంటూ చూసి. మవునం వహించాడు.


    మరికొద్దిసేపు తరువాత,


    మమ్మల్ని ఎక్కించుకొని పోలీసు వ్యాను నగరంవేపు ప్రయాణించింది.


    పోలీసులకి పట్టుబడ్డా ఇప్పుడు మేము స్వేచ్చాజీవులం. ఇప్పుడు నా ప్రాణం హాయిగా వుంది.


    ముఖ్యంగా రాంసింగ్ ప్రాణం మరీ హాయిగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS