Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 18


    వాళ్ళని చూడగానే నాకు ఒకటి మాత్రం అర్థమయింది. మా బాస్ గాడి స్థావరం మీద పోలీసుల రైడ్ జరిగింది. బాస్ గాడు, వాడి అనుచరులు వున్నారో, వూడారో కానీ, పోలీసులు మాత్రం మా దగ్గరకు వచ్చారు. ఇదీ కొంతలో కొంత నయం అనుకున్నాను.


    "నా చేతిలో వున్నది ఏమిటో తెలుసు కదా...! పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చె ఎగిరిపోద్ది! మీ దగ్గర మారణాయుధాలు వుంటే వాటిని మర్యాదగా క్రింద పడేయండి" అలా అంటూ ఇన్స్ పెక్టర్ అరిచాడు. ఆయన గర్జన నాకు పిల్లి కూతలాగా వినిపించింది.


    రామ్ సింగ్ ఏదో అందామని నోరు తెరిచాడు. ఎండిపోయిన గొంతు పెగలక నోట్లోంచి మాట రాలేదు రామ్ సింగ్ కి.


    "మీకే చెప్పేది? వినిపించటం లేదా? ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గురించి మీరెప్పుడూ వినలేదా? నేను ఏదైనా పట్టానంటే వుడుం పట్టే."


    ఆ ఇన్ స్పెక్టర్ పేరు వర్ధనరావని,ఆయనకీ వేపకాయ అంత వెర్రి వుందని, నాకు అర్థం కావటానికి అరనిమిషం కూడా పట్టలేదు.


    "నా పేరు అహోబిలం! హెడ్ కానిస్టేబుల్ ని. ఏమనుకున్నారో! తెలుసా?" జెండా బొంగుగాడు అన్నాడు.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి కోపం వచ్చింది." నేను పరిచయం చేసుకుంటూంటే మధ్యలో నీ వేంటి? అసలు నా గురించి నువ్వు పరిచయం చేయాలి. నీకు అది ఎలాగూ చేత కాదని నా గురించి నేనే చెప్పుకున్నా అహోబిలం! డ్యూటీలో వున్నా లేకపోయినా ఒకటి గుర్తుంచుకో. వాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్నవాళ్ళు పెదవి కదప కూడదు. అది కూడా "అహోబిలం నా పేరు. హెడ్ కానిస్టేబుల్ ని" అని పరిచయం ఏమిటి? నీవూ, నీ అవతారమూ, నీ నెత్తిన ఎర్ర టోపీ, నిన్ను చూడంగానే తెలుస్తుంది పోలీసువని. మైండిట్!" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "ఎస్ సార్...!" అన్నాడు కానిస్టేబుల్ అహోబిలం ఏడుపు ముఖంతో.


    దాంతో మాకేసు వాళ్లకి అర్థం కాలేదు గానీ, వాళ్ళ కేసు మాకు బాగా అర్థమయింది. తిక్క ఇన్ స్పెక్టరూ, వెర్రి కానిస్టేబులూ అనుకున్నాను.


    "మీకేం చెప్పాను? మర్యాదగా మీ దగ్గర వున్న మారణాయుధాలని క్రింద పడేయమని చెప్పానా లేదా?" బజ్జీ ముక్కు ఇన్ స్పెక్టర్ గద్దిస్తూ అన్నాడు.


    తొందరపడకపోతే లాభం లేదని "అయ్యా! ఇన్ స్పెక్టర్ గారూ! మేము దొంగలం కాదు. మా దగ్గర ఏ రకమయిన మారణాయుధాలూ లేవు" అన్నాను.


    "చాల్చాలు! దొంగల స్థావరంలో దొంగలు కాక దొరలు వుంటారా!" వర్ధనరావు వ్యంగ్యంగా అన్నాడు.


    "వీళ్ళు దొంగలలాగా లేరు సార్! అయినా దొంగల స్థావరంలో దొంగలే వుండాలని ఏముందీ? మన పోలీసు స్థావరంలో మాత్రం దొంగలు వుండటం లేదా?" అహోబిలం నెమ్మదిగా అన్నా నాకు వినిపించింది.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కోపంగా అన్నాడు "నిన్ను నోరు ముయ్యమనే అధికారం నాకుంది కదా!"


    "ఎస్ సార్...!" కానిస్టేబుల్ అహోబిలం వినయంగా అన్నాడు.


    "అయితే నోర్మూసుకో!" అహోబిలంతో అని, మళ్ళీ మావేపు తిరిగి, "ఏమయ్యా మీరు ఆయుధాలు క్రింద పడేస్తారా! లేక నా ఆయుధానికి పని కల్పించాలా!" ఇన్ స్పెక్టర్ అడిగాడు.


    "ఇన్ స్పెక్టర్ సాబ్! మిమ్మల్ని చూస్తుంటే చాలా తెలివికల వారు లాగా కాన వస్తున్నారు. మేమిద్దరం దొంగలం కాము. ప్రాణ స్నేహితులం. ఈ దొంగల స్థావరంలోవున్న దొంగల బాస్ గాడు కొందరు స్మగ్లర్స్ తో కలిసి బ్రీఫ్ కేసుల్ని మారుస్తుంటే అది చూసి మేము వీడి వెనుక వచ్చాము. వీడు మమ్మల్ని కనిపెట్టినట్లు వున్నాడు. అది మేము గ్రహించలేదు. వీడి నివాసం ఎక్కడో చాటుగా చూసివచ్చి మీలాంటి నిజాయితీ గల ఇన్ స్పెక్టర్ కి వీడి గురించి చెబుదాం అనుకున్నాము. వీడేమో మమ్మల్ని బంధించి, ఈ అండర్ గ్రౌండ్ సెల్ లో బంధించి అయిదు రోజులనుంచీ అన్న పానీయాలు లేకుండా మాడ్చి చంపుతున్నాడు. చావు బ్రతుకుల్లో మేము వుండగా మీరు వచ్చారు. మా దగ్గర మారణాయుధాలు వుండి, మేము దొంగల మనుష్యులము అయివుంటే మేము ఈ గదిలో ఎందుకు వుంటాము. ఈ గది కటకటాలకి బయట తాళంవేసి ఎందుకుంటుంది?" నెమ్మదిగా చెప్పాను.


    నా మాటలు వినగానే ఇన్ స్పెక్టర్ తల పంకించి, ఆ తరువాత తలని క్రిందికీ పైకి ఒకసారి ఆడించి, గట్టిగా ఒకసారి ముక్కులు ఎగ బీల్చి, మావంకా, కటకటాలకి వేసివున్న తాళంవంకా మార్చి మార్చి చూసి, ఈ తఫా తల అటూ ఇటూ అడ్డంగా త్రిప్పి, "ఇందాక అరిచింది మీరేనా?" అని అడిగాడు.


    "మేమే సార్! మా అరుపులు మీరు విన్నారా?" ఆత్రుతగా అడిగాను.


    "ఇక్కడ పని ముగించుకుని వెళ్ళబోతూండగా, "ఓ...' అన్న ఓంకారనాదమూ, "ఓ...ఆ..." అన్న ఆర్తనాదాలూ వినిపించాయి. చచ్చిన దొంగలు చావగా, పారిపోయిన దొంగలు పారిపోగా, ఇంకా కొందరు దాక్కుని వుండి, మమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి, లేక మమ్మల్ని చాటుదెబ్బ తియ్యటానికో అలా అరిచారు అనుకున్నాము. అందర్నీ నిశ్శబ్దంగా వుండమని చెప్పి పిల్లిలా అడుగులు వేస్తూ అంతా వెతుకుతూ ఇటు వచ్చాము. ఇక్కడ మీరు కనపడ్డారు. ఈ అండర్ గ్రౌండ్ లో ఇలాంటి సెల్ ఇది ఒక్కటేనా, ఇంకా వున్నాయా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS