9
తెల్లవారింది.
కొంతలో కొంతనయం.
రామ్ సింగ్ నీ, నన్నూ ఒకే సెల్ లో వుంచారు.
మాతోపాటు బాస్ దగ్గరవాళ్ళు నలుగురు మాత్రమే దొరికారు.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి బుర్రలో గుంజువుందో లేదో కానీ తగిన మందీ మార్బలంతో మా స్థావరం మీద దాడిచేశాడు.
దాంతో స్థావరంలోవున్న పక్షులన్నీ ఒక్కసారిగా కకావికలయినాయి.
సమయానికి స్థావరంలోవున్న పదిహేనుమందిలో పదకొండు మంది అక్కడికి అక్కడే తుపాకీ కాల్పులలో మరణించారు.
నలుగురు మాత్రం పట్టుబడ్డారు.
పట్టుబడ్డ మా యిద్దరినీ, ఆ నలుగురినీ ఒకే పోలీసు వ్యాను ఎక్కించడం వల్ల ప్రక్కనున్న వాడిని రహస్యంగా అడిగాను.
"మన బాస్ ఏమయ్యాడు? కాల్పుల్లో మరణించలేదు కదా!"
నన్ను అక్కడ అందరూ చిన్న బాస్ అని, చిన్న గురువని అంటూండేవారు. ఇప్పుడూ అలాగే "చిన్న గురూ! మన బాస్ సంగతి నాకు తెలియదు. కానీ పోలీసులు మనమీదకి అకస్మాత్తుగా దాడి జరిపినపుడు మన స్థావరంలోనే వున్నాడు. తుపాకులు, రివాల్వర్స్ పుచ్చుకుని అకస్మాత్తుగా లోపలికి దూసుకు వచ్చేశారు పోలీసులు. ఎవరికి వాళ్ళం కాళ్ళకి బుద్ధిచెప్పే ప్రయత్నం చేశాము. చూస్తుంటే పోలీసులకి మనం తప్ప ఇంకెవరూ చిక్కినట్లు లేరు. మరి మన బాస్ అక్కడికక్కడే 'హరీ' అన్నాడో, తెలివిగా తప్పించుకు పారిపోయాడో నాకు తెలియదు. అసలు మాట్లాడటానికి, ఆలోచించటానికి టైమ్ వుంటే కదా!" అంటూ వాడు చెప్పుకొచ్చాడు.
బాస్ మరణించాడా? పారిపోయాడా? ఒకవేళ బాస్ మరణించి వుంటే కోటీ యాభై లక్షలు గంగపాలు అయినట్లే. కోటీ యాభై లక్షలకీ నీళ్ళు వదులుకుని తూర్పు తిరిగి దండం పెట్టడం ఒక్కటే శరణ్యం. అలాకాక, బాస్ పారిపోయివుంటే ఎప్పటికైనా......
నా ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ "చినగురూ! నాలుగు రోజులబట్టీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బాస్ ఏదో ముఖ్యమైన పనిమీద నిన్ను పంపించాడని అనుకుంటున్నాము మేమందరం. నీవెక్కడికో వెళితే మరి ఇక్కడికి ఎట్లా తేలావు? అకస్మాత్తుగా అప్పుడే అక్కడికి వచ్చావా?" అని అడిగాడు వాడు.
నేను ఆలోచించే అవసరం లేకుండా వాడే నాకు ఉపాయం చెప్పినట్లయింది. "అవును. బాస్ నన్ను ఓ ముఖ్యమైన పనిమీద పంపించాడు. పని పూర్తిచేసుకుని వచ్చాను. ఇలా వీళ్ళ వలలో చిక్కుకున్నాను" అని చెప్పాను.
నాకు ఒకటి అర్థమయింది. బాస్ నన్ను బంధించిన విషయం వీళ్ళెవరికీ చెప్పకుండా రహస్యంగా దాచాడు కోటీ యాభై లక్షల రహస్యం బయటపడుతుందని నన్ను బందీచేసిన విషయం రహస్యంగానే వుంచాడు. అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాను నేను.
"ఇతనెవరు? మన ముఠాలో మనిషి కాదే?" వున్నట్లుండి ఒక గట్టి ప్రశ్న వేశాడు వాడు.
రామ్ సింగ్ ని వాడు ఎప్పుడూ చూడలేదన్న మాట. లోలోపల అనుకుని "ఇతన్ని తీసుకురమ్మనే బాస్ నన్ను పంపించాడు. మేమిద్దరం కలిసి వచ్చాము. పోలీసుల చేతికి చిక్కుకున్నాము" అంటూ అవలీలగా అబద్ధం ఆడేశాను.
"ఏయ్! ఏమిటా గుసగుసలు? పెదవి కదిపితే మూతి వాచిపోద్ది." చేతిలో లాఠీ ఎత్తి, ఓ పోలీసువాడు అరిచాడు మావంక చూస్తూ. దాంతో మా నోళ్ళు టక్కున మూతపడ్డాయి.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి, అతి తెలివితేటలు చాలానే వున్నట్లున్నాయి. నన్నూ రామ్ సింగ్ ని ఒక సెల్ లో వేసి, మిగతా నలుగురినీ వేరే సెల్ లో వుంచాడు. బహుశా మేము దొంగల దగ్గర బందీలం కాబట్టి దొంగలం కాదని అనుకుంటున్నాడేమో! ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాను.
బాస్ బ్రతికి వున్నాడా?, చచ్చాడా? అది ఒక్కటే నాకు తెలియని విషయం. మృత్యుముఖం నుంచీ బయటపడ్డ సంతోషంకన్నా, బాస్ విషయం తెలియక ఆ విచారమే ఎక్కువయింది. బాస్ విషయం తెలిసేదాకా మనసు మనస్సులో వుండేటట్లు లేదు. బాస్ విషయం తెలుసుకోవటం ఎలా?
నేను అలా ఆలోచిస్తూ వుండగానే, పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా, కలకలం చెలరేగింది. పోలీసులు కంగారుగా అటూ ఇటూ తిరిగారు. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఎవరిమీదనో కేకలు పెడుతున్నాడు. మధ్యలో కానిస్టేబుల్ అహోబిలం కూడా విసుక్కుంటున్నట్లు మాటలు వినపడ్డాయి. ఆ గోలలో అసలు విషయం సరీగా తెలియలేదుగానీ, కొందరు ఖైదీలు పారిపోయినట్లు, ఒక చెవిటి కానిస్టేబుల్ వున్నట్లు, ఆ చెవిటి కానిస్టేబుల్ పేరు కనకలింగం. ఆయనగారికి వున్న తట్టెడు చెవుడు వలన ఏదో జరగరానిది జరిగిందని నాకు కొంతవరకు అర్థమయింది.
