"పిలుద్దామనుకున్నాగానీ__పాపం, అతను తాగడుగా!" అన్నాడు ఆ లాయరు జాలిపాడుతున్నట్లుగా.
ఒక వరుస ఐంది. మళ్ళీ గ్లాసులు నింపారు. పుచ్చుకుంటున్నారు. కైపు సమంగా ఎక్కింది అప్పటికే.
ఆంధ్రప్రదేశ్ కాకముందు, ఆంధ్రాలో మద్రాసులో ప్రొహిబిషనున్న రోజుల్లో. శ్రీశ్రీ ఆరుద్రలు హైదరాబాద్ వచ్చిన ఒకసారి వూళ్ళో వరదరాజేశ్వరరావు, యేల్చూరి సుబ్రహ్మణ్యం తదితరులు కలిసి, వీధులలో తిరుగుతూ ఎదురుపడ్డ ప్రతి బార్ గుమ్మమూ యెక్కి దిగుతూ తిరిగారనీ, ఆ సందర్భంలో వాళ్ళు ఏవేవో అనుకుంటూ పోయారనీ, అలా అనుకుంటూ పోయినవన్నీ, "మేమే" అని అచ్చువేసినట్లుగా అనుకునే ఆ "మేమే" లోని చరణాలు వల్లిస్తున్నారు, కొందరు__
"నేనుగానీ ఈ శతాబ్దం మొదట్లో శ్రీశ్రీ కంటే ముందు పుట్టివుంటే శ్రీశ్రీ కంటే గొప్పవాణ్ని అయిపోయుండేవాణ్ని __ సిరిసిరిమువ్వలడి" అన్నాడు విజయ్ కుమార్.
ఆరుద్ర పురుగులం__అన్నాడు వొకతను.
వైతరణి వరదలం__అన్నాడు యింకొకతను.
యెరుపు దిగని సంజలం__అన్నాడు ఆ లాయరు.
యెదిగీ యెదగని లంజలం__అన్నాడు విజయ్ కుమార్.
మృత్యువు రవికలో పగిలిన పాలబుడ్డీలం__అన్నాడు రఘురాం.
"ఆహాహాహా" అని హాలు దద్దరిల్లేలా నవ్వులు.
ఆ పుస్తకం అంకితపు కందపద్యం వల్లిస్తున్నాడు ఒకతను __ "ఏ వీసం కూడా యే నీళ్ళూ యే సోడా కలపని విస్కీ సీసా లేపి నోటికి తగిలించుకోబోయాడు.
మరొకతను, "నీ సొంత సీసా ఐతే అట్లాగే లాగించుదువులే." అని పట్టుకుని సీసా దింపించి, "ఆ కందపద్యం, అంత సొంపుగా శ్రీశ్రీయే రాయగలడు. ఒక బెత్తెడు తక్కువగా ఆ శ్రీశ్రీ అంత గొప్పవాణ్ని నేను" అని ఆ సీసా నోట కరవబోయాడు.
"నేనే శ్రీశ్రీని" అని ఒకతను అన్నాడు, సీసా లాగి బల్లమీద పెడుతూ.
"ఆహాహాహా" అని నవ్వులు అరుపులు కూతలు.
బయట బిచ్చగాడి ఆర్తనాదం,
"కూడులేని గూడులేని పక్షురాల భిక్షురాల" అంటూ గ్లాసు పైకెత్తాడు మరొకతను.
78
ఫిబ్రవరిలో రామ్మూర్తి థీసిస్ పూర్తిచేసి సబ్మిట్ చెయ్యబోతున్న వేళకే అతని తండ్రి పాండురంగశాస్త్రి ఉత్తరం రాశాడు ఓసారి వీలుచూసుకుని యింటికి వచ్చి వెళ్ళమని. థీసిస్ పూర్తి ఐంది. త్వరలో వస్తున్నట్లుగా వుత్తరం రాశాడు రామ్మూర్తి.
థీసిస్ సబ్మిట్ చేశాక, రెండు రోజులు వూరంతా కాళ్ళు నొప్పులు పుట్టేదాకా తిరుగుతూ కళ్ళు నొప్పులు పుట్టేదాకా సినిమాలు చూస్తూ గడిపి__హాస్టల్లో కాషన్ డిపాజిట్ డబ్బు తీసేసుకుని సామాను పుచ్చుకుని వూరికి వెళ్ళాడు.
తండ్రి ఓ పెళ్ళి సంబంధం చూసి" వుంచాడు. అదివరలో ఒక సంబంధం_వచ్చిందిగానీ నచ్చలేదు అతని తండ్రికి. అందువల్ల కొడుక్కి కబురు పెట్టలేదు.
అయిదు వేల కట్నం అంటూంటే: మా అబ్బాయి పిహెచ్. డి. చేశాడు. రేపో మాపో లెక్చరర్ గానీ ఆఫీసరు గానీ కాబోతున్నాడని పదివేలదాకా పలికించాడు అతని తండ్రి.
పెళ్ళిచూపులకి వెళ్ళారు. రామ్మూర్తి దొంగ చూపులు చూశాడేగానీ పెళ్ళికూతుర్ని సమంగా చూడలేకపోయాడు బిడియంవల్ల. బాగానే అనిపించింది అతనికి.
చామనచాయ, సన్నగా పొడవుగా వుంది. పోలికలు బాగానే వున్నాయి. బాగానే వుంది. ప్రత్యేకించి చెప్పుకోటానికి యేమీలేదు.
యిన్నాళ్ళూ యెలాగో గడిపేశాడుగానీ, యిప్పుడు పెళ్ళి సంబంధం ఖాయపడేసరికి__లోన ఆరాటంగా వుంది రామ్మూర్తికి.
పెళ్ళి బ్రాహ్మడితో ఒంటరిగా ప్రసక్తించి, "మరీ దూరంలో ముహూర్తం పెట్టుకుంటే నాకు వీలుపడదేమో. వుద్యోగం కాబోతోంది. వుద్యోగంలో కొత్తగా చేరాక సెలవు పెట్టడానికి వీలుకాదు. అందువల్ల అర్ధసంవత్సరమైనా ఆగాల్సి వుంటుంది __ లేదంటే యిప్పుడే త్వరలో ముహూర్తం వుండి జరిపించినా నాకు అభ్యంతరం లేదు" అన్నాడు రామ్మూర్తి__అన్నాళ్ళూ ఆగరనీ యెలాగోలాగా చేసి త్వరలో జరిపించేస్తారనీ ఆశిస్తూ.
"మీకేం పరవాలేదు. ఆడపెళ్ళివారు యెన్ని చూసుకుని అమర్చుకోవాలి! ముహూర్తానికేం_వొచ్చే నెలలోనే ఒక మంచి ముహూర్తం వుంది. మీ ఇరువురి నాయధేయాల రీత్యా కూడా తగిన లగ్నమే అది." అని అన్నాడు పెళ్ళి బ్రాహ్మడు.
వచ్చిన పదిరోజులకే, సోషల్ వెల్ ఫేర్ డిపార్ట్ మెంటు నుంచి వుద్యోగ నియామకం కాగితం, యూనివర్శిటీ హాస్టలు నుంచి రీడైరక్టయి వచ్చింది. ట్రయిబల్ వెల్ ఫేర్ సెల్ లో స్పెషల్ అసిస్టెంటు వుద్యోగం.
వెంటనే బెడ్డింగూ సూట్ కేసూ చేత పట్టుకుని బస్సెక్కేశాడు. తిన్నగా హాస్టల్ కెళ్ళి శ్రీపతి గదిలో సామాను పడేసి స్నానించి__ఆఫీసుకి వెళ్ళి జాయినింగ్ రిపోర్టు యిచ్చాడు.
పని పెద్ద కష్టమేం కాదు. పదిన్నరకి వెళ్ళాలి. ఐదుదాకా వుండాలి. యెక్కువ రోజులు హాస్టల్లో గెస్టుగా వుండటమూ కుదరదు. అక్కడినుంచి రోజూ యింత దూరం రావటమూ కష్టమనిపించి__గది కోసం ప్రయత్నిస్తున్నాడు సాయంత్రం వేళల్లో.
ఆఫీసరు చెప్పిన పని ఠంచనుగా లక్షణంగా చేసేస్తాడు రామ్మూర్తి. ఐతే ఆ ఆఫీసరుకి కొంచెం తిక్క, కొంచెం పొగరులాంటివి వున్నాయి.
ఒక్కోసారి "యిదేమిటి యిట్లాగేనా? యల్టీసీకి తెలిపిన మాత్రం తెలవదూ?" అని గదమాయిస్తాడు.
తను త్వరలో కాబోతున్న డాక్టర్ రామ్మూర్తి__ అని గుర్తొచ్చి మరింత కోపంగా అనిపించి, 'యేడ్చావులేరా' అని మనసులో అనుకుంటూ, "యస్సర్" అనేస్తాడు.
ఒకసారి "నీది 10__ఎ.టెంపరరీ పోస్టు. వూస్టు చేసేస్తాను అట్లా అయితే" అని వాయించాడు అకారణంగా.
