"మనకి తెలిసిన లాయరు ఒకాయన వున్నాడు. మాట్లాడతాను!" అని చిన్నగా అన్నాడు రామనాధం.
"లాయరేం చేస్తాడు పోలీస్ స్టేషను వాళ్ళని?" అంది గాయత్రి.
ఆ రాత్రి పొద్దుపోయాక, సబిన్ స్పెక్టర్ డ్యూటీ ముగించుకుని వెళుతూ లోనకి వచ్చి "యేం చిలకా!" అన్నాడు.
తీక్షణంగా చూసింది.
"బందరు చిలక. పంచదార చిలక. కాకపోతే కారంలో పడింది." అని ఆమె చెయ్యి అందుకున్నాడు.
చాచి లెంపమీద కొట్టింది.
ఠక్కున అతని చెయ్యి వీడిపోయింది గానీ__
కోపంతో వూగిపోతూ__నాలుగు మూడు నంబర్లు అరిచాడు.
ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చారు.
"దాన్ని రెక్కలు విరిచి పట్టుకోండిరా. దీని బట్టలు పీకేసి__"
కానిస్టేబుల్స్ రాబోతున్నారు.
"ఆగండిరా కనిష్టపు వెధవలూ." అని అరిచింది. కంచు లోహానికి ప్రాణమొచ్చి ఉగ్రంగా ఐతే యెలా వుంటుందో అలా వుంది ఆ గొంతూ, రూపమూ.
కానిస్టేబుల్స్ జంకారు.
"మీరు నన్ను గానీ ముట్టుకుంటే డి.ఎస్.పి.కో కమిషనర్ కో హోంమినిష్టరుకో యేడ్చుకుంటూ మొరెట్టుకుంటాననుకోకండి. నేను_నేనే స్వయంగా ప్రాణాలు తీసేస్తాను" అని అంటూ గుప్పెట బిగిసిన కుడిచెయ్యి పైకెత్తుతూ "కత్తితో పొడిచి చంపుతాను." అంది.
యీ మహావ్యవస్థ కవచం తొడుక్కున్న వాడు కదా యస్సై పకపకా నవ్వి_తిడుతున్నాడు బూతులు.
పోలీసు బూతులు. అవటానికి అవి మామూలు బూతులేగానీ పోలీసోళ్ళ బూతులు వేరు. అవే బూతులు పడకగదిలో సంభోగవేళ పొదుపుగా వాడితే వాటికో రాణింపు వస్తుంది. డ్రాయింగ్ రూంలోనో డైనింగ్ హాల్లోనో అయితే ఒకరకం జుగుప్స వస్తుంది. చదువురాని కార్మిక కర్షకుల్లో అన్నివేళలా, ఎబ్బెట్టులేని ప్రత్యేకం గమనించని ఒకరకపు వాడుకతనం వస్తుంది. పోలీస్ స్టేషనులో పోలీసు నోళ్ళలో వాటికి ఓ నీచత్వం అవమానం కిరాతకం అమానుషం వస్తాయి __ పోలీసు దెబ్బలకి మల్లే.
గాయత్రి ఉగ్రంగా చూసింది. ఆ మండే శక్తివంతమైన చూపుల్లో వాళ్ళ శవాల నీడలు కనిపించినట్లయ్యాయి వాళ్ళకి.
"లేదూ ఆలోగానే నేను చచ్చిపోతే మరికొందరి చేతుల్లో చస్తారు. మీరు ప్రాణాలతో బతికుండరు. యస్, కమాన్, ప్రాణంమీద ఆశలేనివాళ్ళు రండి ఒక్కొక్కరే వరసగా __ మిమ్మల్నెలా చంపాలో నాకు తెలుసు రండిరా" అంది.
"అసలిది ఆడది కాదురా! లాక్ చెయ్యండి. నో ఫుడ్" అని వెనక్కి తిరిగాడు యస్సై కచ్చగా.
మరసటిరోజు ఉదయం మళ్ళీ వెళ్ళాడు మోహన్ రెడ్డి. యస్సైతో వాదించటం మొదలెట్టాడు__ యెందుకు అరెస్టు చేశారు, ఏ సెక్షన్ కింద__ అంటూ.
"అవన్నీ చెప్పక్కర్లా."
"మీసా కిందా?"
"మీసానో గీసానో యేదైతే నీకెందుకు?
"నా భార్య."
"భార్యని అదుపులో వుంచుకోవాలి. నీ పెళ్ళాంమీద చాలా కేసులున్నాయ్__బ్రోతల్ కేసూ క్రిమినల్ కేసులతోపాటు."
"పచ్చి అబద్ధాలు. మీకు ఆధారాలేమిటి?"
"అవన్నీ కోర్టులో.
"ఒక వ్యక్తిని అరెస్టు చేసిన యెంత సమయంలో మేజిస్ట్రేటు దగ్గిర హాజరు పరచాలో రూల్స్ నాకు తెలుసు" అన్నాడు మోహన్ రెడ్డి.
"రూల్స్ పోలీస్టేషన్లో కాదు. మీ కా కాలేజీలో. అక్కడికి పో."
"నేను గాయత్రితో మాట్లాడాలి."
"వీలు కాదని చెప్పానా? యే టూ నాట్ ఫోర్.
"బాహర్ చలో సాలా" అంటున్నాడు కానిస్టేబుల్.
ఆ మరసతిరోజున గాయత్రిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నాలుగైదు అపరాధాలకి నాలుగైదు సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వివరించాడు.
విరామం వేళ, గాయత్రిని తండ్రి రామనాధం కలుసుకున్నాడు. యివన్నీ యిష్టంలేక గుర్రుగా వున్నా_కన్నబిడ్డ పసిబిడ్డ తల్లి__ ఒకప్రక్కన భార్య కాకిగోల__వచ్చాడు.
"కోటిలింగం అని మాంచి లీడింగ్ లాయరు __ మనకి దూరపు బంధువు అవుతాడులే. అతనికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఏవో లాలూచీ లున్నాయిట. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కట్టుకుని నెగ్గుకొస్తానని నమ్మకంగా చెప్తున్నాడు__నేను వెళ్ళి కలుసుకోగా. ఒప్పుకో తల్లీ" అన్నాడు రామనాథం.
"లాలూచీ నీచం" అంది గాయత్రి నిదానంగా దృఢంగా.
కోర్టులో కేసు వాదన జరుగుతోంది.
"యీ నేరాలే కాదు. తన వయసు కంటే మించిన మానసిక పరిణతి వుంది యీమెకి. యే స్త్రీకీ వుండనంత ధైర్యం వుంది. షి ఈజ్ ఏ పొటెన్షియల్ డేంజర్ టుది నేషన్...." అని ప్రారంభించాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"కంటెమ్ ప్ట్ ఆఫ్ కోర్ట్ అవటానికి నేను అసలు యీ న్యాయవ్యవస్థనీ యీ సమాజ వ్యవస్థనీ ఒప్పుకుంటేగా! యిది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు. యిట్ ఈజ్ కంటెమ్ ప్ట్ ఆఫ్ బగ్స్ అండ్ లీచెస్...." అని గాయత్రి అంటూంటే__
"షీ ఈజ్ క్రేజీ, షి షుడ్ నాట్ బి యెలౌడ్ టు స్పీక్ ఇన్ ది కోర్ట్" అంటూ లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
మరసటిరోజు విరామ సమయంలో రామనాధం, మోహన్ రెడ్డీ, యిద్దరు విరస మిత్రులు కలుసుకోగలిగారు.
"మళ్ళీ యీ గొడవల్లోకి దిగనని హామీ యిస్తే వొదిలేస్తారు. విను" అన్నాడు తండ్రి రామనాధం.
"నేనేం గొడవల్లోకి దిగలేదు. నేను నా మార్గాన నా గమ్యంవైపు ప్రయాణిస్తున్నా. గొడవలు చేస్తున్నది ఆ రాస్కెల్స్" అంది.
"వినమ్మా బిడ్డ తల్లివి. చిట్టితల్లి అరుణ__" ఆగిపోయాడు రామనాధం.
"అవును బిడ్డతల్లిని. ఒక్క అరుణే కాదు, కోట్లాది అరుణలు. అందరూ నా బిడ్డలే. బిడ్డల తల్లిని నా బిడ్డలందరికోసం" అంది గాయత్రి.
"విప్లవోన్మాదం. షి హ్యాజ్ బికం క్రేజీ. లెట్ హెర్ కూల్ డౌన్" అన్నాడు వొకతను.
"పోని నువ్వు తప్పుకో గాయత్రీ. నువ్వు జైల్లో పడటం నేను సహించలేను. వాళ్ళు బనాయించిన కేసులన్నీ, నేను నామీద వేసుకుని_ వొప్పుకున్నట్లుగానూ ఒప్పుకోనట్లుగానూ మాట్టాడి__ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవిస్తాను" అన్నాడు మోహన్ రెడ్డి.
విరసం వాళ్ళ లాయర్లలో ఒకతను వచ్చి కేసు వాదించటం ప్రారంభించాడు. అతను విరసంలోనివాడే. డబ్బు తీసుకోకుండా వీళ్ళ కేసులు వాదించటానికి సిద్ధం. ఐతే చిరసానికి తెలియకుండా, పోలీసు అధికారుల ప్రాపకమూ జడ్జీల అభిమానమూ సంపాదించటానికి__కేసుల్ని తెలివిగా నీరు కార్చేస్తాడు, పైకి చాలా దీక్షగా గట్టిగా అరిచి వాదిస్తూ.
ఆ రోజు రాత్రి ఆ లాయరు విరసంలో కొందరిని సమావేశపరిచాడు__మహాసభల్లో విరసం రచయితలందరూ విడుదలైన సందర్భంగానూ, తను గాయత్రి కేసు యెంత బాగా లాక్కొస్తున్నదీ వివరించటానికి. మందు పార్టీ.
నింపిన విస్కీ గ్లాసుల చేతులు పైకి లేచాయి.
"గాయత్రి విడుదల కోసం, విజయం కోసం. విడుదలైన రచయితల ఆనందం కోసం" అన్నాడు ఆ లాయరు.
గ్లాసులు తాటించి__పెదాలకి ఆనించి గుక్కవేశారు.
"మన ప్రముఖ కవులు అందరూ యీ సమయంలో వుంటే బాగుండును" అన్నాడు ఒకతను.
"గాయత్రిని విడిపించటానికి మనమంతా పోరాడదాం" అన్నాడు విజయ్ కుమార్.
"మోహన్ రెడ్డి కూడా లేడు."
