Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 17

దాంతో,

శివరావు వాళ్ళూ ఎక్కిన బస్సు డ్రైవరుకి ఎంతగా కోపం రావాలో అంతగానూ కోపం వచ్చింది. దానికితోడు అంత క్రితం త్రాగిన ద్రవం కూడా మనస్సు మీద ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

"అరే! బద్మాష్! నా వెనుక రావలసిన వాడివి నాకన్నా ముందు వెళతావుటరా! నేను నడిపేది బస్సు కాదురా విమానం. నీకన్నా ముందు పోయి నిన్ను అడ్డగించక పోతే నా పేరు పైడయ్యే కాదు" అంటూ తనకితానే గట్టిగా ప్రమాణం చేసుకుని బస్సుని ముందుకి దూకించాడు.

రెండు బస్సులూ పోటాపోటీగా పందెం గుర్రాల్లా పరిగెత్తటం మొదలుపెట్టాయి.

డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలకి తెగించి, ముందుకు వెళ్ళే ప్రయత్నంలో వుండగా ప్రాణాల మీద తీపివున్న ప్రయాణీకులు సగంమంది "ఇంత స్పీడుగా పోనివ్వదంటూ" అరవటం మొదలుపెట్టారు. కుర్రకారులాంటి ప్రయాణీకులు "స్పీడు పెంచు; స్పీడు పెంచు" అంటూ డ్రైవరుని ఉత్సాహ పరచటం మొదలుపెట్టారు.

రెండు బస్సుల డ్రైవర్లూ పిచ్చిపట్టినట్లు బస్సులని నడపటం మొదలుపెట్టారు. రెండు మూడుసార్లు బస్సూ బస్సూ గుద్దుకున్నంత పనిచేసి రెప్పపాటులో ప్రమాదాన్ని తప్పించుకున్నాయి.

నాలుగోసారి.

వెనుకవున్న బస్సు ముందు బస్సుని బలంగా ఢీ కొంది. దాంతో ముందు బస్సు పల్లంలోకి దూసుకుని వెళ్ళటం, వెనుకనున్న బస్సు పెద్ద చెట్టుకు వెళ్ళి గుడ్డుకోవటం ఏకకాలంలో జరిగింది.

ఒక్కసారిగా హాహాకారాలు, ఆక్రందనలు ఆ ప్రదేశం అంతా మారుమ్రోగాయి.

ఇద్దరు బస్సు డ్రైవర్ల-పంతానికి ఫలితం ఎందరికో చావులు, మరి ఎందరికో గాయాలకీ దారితీసింది.

చనిపోయిన వాళ్ళ మరణ ముహూర్తం పెట్టింది.

ఆ దేవుడు కాదు ఈ బస్సు డ్రైవర్లు.

అంతేకాదు ఆ బస్సులోకి ఒక డ్రైవరు కూడా తనకుతానే మరణ ముహూర్తం పెట్టుకున్నాడు.

ఏవూరూ రాకముందే అక్కడ ఆ ఘోరం జరిగిపోయింది.

                                       10

పుండరీ కాక్షయ్య కౌంటర్ వైపు చూశాడు.

కౌంటర్ లోంచి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ఫోన్లో గట్టిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

అది చూడంగానే పుండరీ కాక్షయ్య కళ్ళు మెరిశాయి. ఆదరాబాదరాగా లేచి కౌంటర్ వైపు నడిచాడు.

లోపలతను ఫోన్లో మాట్లాడుతూ వుంటే,

"ఇటు చూడు బాబూ!" అంటూ పిలిచాడు పుండరీకాక్షయ్య.

ఫోన్లో మాట్లాడే అతని వినిపించుకోలేదు.

మరోసారి గట్టిగా పిలిచాడు పుండరీ కాక్షయ్య.

ఫోన్లో మాట్లాడుతున్న అతనికి చిరాకెత్తింది.

"కాసేపు ఉండవయ్యా!" కోపంగా అని తిరిగి ఫోన్ లో ఎవరితోనో ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెట్టాడు.

పుండరీ కాక్షయ్య వింటూ నించున్నాడు.

అతను మాట్లాడే ఒక్క ముక్కా పుండరీ కాక్షయ్యకి అర్థం కాలేదు.

కారణం ఆయనకి ఇంగ్లీషు మాట్లాడటం రాకపోవటమే. ఆ కుర్రాడు ఫోన్ లో అంతగట్టిగా ఏ విషయం మాట్లాడుతున్నాడో అర్థంకాక పోయినా ఫోన్ లో మాటల మధ్యలో బస్సు అన్నమాటవిని, ఇంక మౌనంగా ఉండలేకపోయాడు.

"బస్సు గురించేనా బాబూ! మాట్లాడుతున్నావు!" గట్టిగా అడిగాడు.

పుండరీకాక్షయ్య గట్టిగా అడిగినా అతను పండరీకాక్షయ్య మాటలు వినిపించుకోలేదు.

కౌంటర్ తలుపుమీద చేత్తో టకటకా చప్పుడు చేస్తూ, మరింత పెద్దగొంతు వేసుకుని, "గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో కనుక్కో బాబూ!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS