Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 17


    "ఏం చెయ్యవలసిందీ రామ్ సింగుకు చెప్పాను. చెప్పటం వరకే నా వంతు. తిరిగి రామ్ సింగు ఏమన్నదీ వినిపించుకోలేదు. రెండు చేతులూ గుండ్రంగా చుట్టి నోటిదగ్గరకు చేర్చుకొని, తలకాస్త పైకెత్తి నా శక్తినంత కూడదీసుకొని "ఓ...ఓ...ఓఓ__" అంటూ బాకాలాగా వూదినట్లు అరిచాను.


    ఎంత పెద్దగా అరిచానంటే నా అరుపుకి నా చెవులే పూర్తిగా దిబ్బళ్ళు వేసి అసలు వినపడకుండా పోయాయి. అదేమీ నేను పట్టించుకోలేదు. అలా అరుస్తూనే వున్నాను.


    రామ్ సింగు కూడా "బచావో! బచావో!" అంటూ అరవడం మొదలు పెట్టాడు.


    గది గోడలు చీల్చుకుని, నేను చేసిన శబ్దం బయటకి వెళ్ళిందనే అనుకుంటున్నాను. ఒక ప్రక్క ప్రాణం కడగట్టుకుని పోతున్నా, నా ప్రయత్నం నేను చేస్తూనే వున్నాను.


    నన్ను చూసి రామ్ సింగ్ కి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు వుంది. వీలైనంత పెద్ద పెట్టున అరుస్తూనే వున్నాడు.


    మా అరుపులు తప్ప, రెస్పాన్స్ లాంటిది ఏమీ రాలేదు. ఆఖరికి చిన్న శబ్దం కూడా వినిపించలేదు.


    నాకు అనుమానం వచ్చింది. "రామ్ సింగ్! నీ చెవులు వినిపిస్తున్నాయా?" ఆత్రుతగా అడిగాను.


    "ఇప్పుడు నీవన్న మాటలు శుభ్రంగా వినిపించాయి! ఏం భాయ్" ఆత్రుతగా అడిగాడు రామ్ సింగ్.


    నా మాటలు రామ్ సింగ్ కి, రామ్ సింగ్ మాటలు నాకు చక్కగా వినిపిస్తూనే వున్నాయి. అరవటం వల్లే ఇప్పుడు క్రొత్తగా నోరు నెప్పి పుడుతున్నది. చెవులు దిబ్బెళ్ళు వెయ్యటమన్నది. చెవులో "గుయ్!" అన్న శబ్దమూ, నీరసం వల్ల ఏర్పడ్డవి. అది అలానే వున్నది. అవి అలా వున్నా వినికిడి శక్తి మేము కోల్పోలేదు.


    "ఇష్!" అన్నాను.


    రామ్ సింగ్ మౌనం వహించాడు.


    ఇరువురం ఏదైనా శబ్దం వినపడుతుందేమో అని, చెవులు రిక్కించి వుండిపోయాము. అరవటం వల్ల మాకు వచ్చిన ఆయాసం యొక్క ధ్వని తప్పించి ఏ చిన్న చప్పుడూ వినరాలేదు. ఒక్కసారి అంతటా పూర్తి నిశ్శబ్దం ఏర్పడినట్లు అయ్యింది.


    "పోలీసులు కాని, మరో దొంగల ముఠాగానీ, మన బాస్ తో ముఖాముఖీ తలపడి వుంటారు. ఆ పోరులో వీళ్ళో వాళ్ళో హతమయి వుంటారు. ఆ తరువాత వాళ్ళెవరూ మన అరుపులు వినిపించుకోక వెళ్ళిపోయి వుంటారు. వాస్తవంగా జరిగింది ఇది కాకపోతే, మరోటి కూడా జరిగి వుండవచ్చు. టేప్ రికార్డ్ లోంచి రివాల్వర్ ప్రేల్పులూ, అరుపులూ, అడుగుల చప్పుడూ మనం వినేలాగా బాస్ ఏర్పాటు చేసివుంటాడు. మనకి ఆశ పుట్టించి చంపడం బాస్ ఉద్దేశ్యం అయి వుంటుంది 'బాస్టర్డ్' ఇలాంటి వెధవ పనులు ఆ బాస్టర్డ్ కి చాలా వచ్చు." మాటలు కూడబలుక్కొని నెమ్మదిగా అన్నాను రామ్ సింగ్ తో.  


    అంతే_


    రామ్ సింగ్ కి అణువణువునా నిస్సత్తువ ఆవరించగా, మళ్ళీ చాప చుట్టలాగా క్రిందకి దొర్లి, కాళ్ళు చేతులూ బార్లా చాపి వెల్లికింతలా పడుకుండిపోయాడు.


    నేనూ నెమ్మదిగా నేల మీదకి వరిగాను.


    నా బుర్ర ఫెటేల్ మని పగిలిపోయేలాగా వుంది. రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకొని వుండిపోయాను.


    ఐదు నిమిషాలు గడిచిపోయింది.


    "హాండ్సప్!"


    నా చెవులకి కొత్త మాట వినిపించింది. గట్టిగా తలను నొక్కుకున్నాను. ఓహో! చావబోయే వాడికి ఇలాంటి మాటలు వినిపిస్తూ వుంటాయి కాబోలు అనుకున్నాను.


    "హాండ్సప్! హాండ్సప్" మళ్ళీ వినిపించింది.


    నన్ను ఆటలు పట్టిస్తున్నది రామ్ సింగ్ కాదుకదా? తల త్రిప్పి చూసి నిర్ఘాంతపోయాను.


    రామ్ సింగ్ లేచి నిలబడిందే కాక, రెండు చేతులూ పైకెత్తి వుంచాడు.


    "వరేయ్! పందీ! లేవరా పైకి" భీకర స్వరం వినవచ్చింది.


    చటుక్కున తలత్రిప్పి గుమ్మం వైపు చూశాను. ఆ వెంటనే స్ప్రింగ్ లాగా పైకి లేచి నిలుచున్నాను.


    "ఎత్తు చేతులు పై కెత్తు!" మరో అరుపు వినబడింది.


    నా చేతులు నెమ్మదిగా పైకి లేచాయి. గుమ్మం అవతల వున్న వాళ్ళని పరికించి చూస్తూ వుండిపోయాను.


    మామూలు ఎత్తులో కాస్త లావుగా, ఎత్తుగా వున్న పొట్టకి బిగించిన బెల్టు, బజ్జీ ముక్కు, పెద్ద తలకాయ ఇన్ స్పెక్టర్ దుస్తుల్లో...దుస్తుల్లో ఏంటి? ఇన్ స్పెక్టరే! సాక్షాత్తూ ఇన్ స్పెక్టరే. చేతులో రివాల్వర్ పుచ్చుకుని సూటిగా రివాల్వర్ మొనని నా వైపు చూపిస్తూ నవనాడులూ బిగపట్టినట్లు, ముఖం గాండ్రించినట్లు పెట్టి నిలుచొని వున్నాడు. ఆయనకీ ఒక అరడుగు వెనుకగా రమణారెడ్డి కన్నా సన్నగా వుండి, ఆయనకన్నా గుప్పెడు ఎత్తు ఎక్కువగా వున్న కానిస్టేబుల్ చేతిలో తుపాకీ పుచ్చుకుని ఆ తుపాకీని కటకటాల్లోంచి లోపలికి సగం దూర్చి బిగుసుకుపోయి నిలుచొని వున్నాడు. ఇంకో నలుగురు కానిస్టేబుల్స్ వాళ్ళ వెనుక నిలబడి వున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS