Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 16


    రవి వెళ్ళి అక్కడున్న కాసేపూ వాకిట్లోనో వీదిలోనో కాంటీన్ లోనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటాడు. తప్పనిసరై మర్యాదకి, అప్పుడప్పుడు ముందు గదిలోకి తెస్తుంటాడు.
    ఐతే, విధిగా రాత్రికి గంగిని తీసుకుని రాంనగర్ వెడతాడు. గంగి వాళ్ళమ్మా వాళ్ళింట్లోనో పాకలోనో గడుపుతుంది. రవి వాడకట్టు చుట్టబెట్టి వస్తుంటాడు. వొచ్చేసరికి బాగా పొద్దుపోతుంది.
    "రోజంత యింట్ల వున్నగూడ దిక్కులేదు. యిక అన్ని రాత్రులు మంది ముచ్చట్లతోటి బయటనే సరిపోతె...యింట్ల పెండ్లమొకతున్నదనుకుంటున్నవో, చచ్చిపోయినదనుకుంటున్నవో!" అంది గంగి ఒకసారి.
    "నీ గొడవ నీదే. వస్తూనే వున్నాగా ఇంటికి?" అన్నాడు రవి.
    "నిద్రపోయేటందుకు!" అని పరిహాసంగా నవ్వింది గంగి.

                                 77

    రాష్ట్రంలోని స్కూళ్ళకీ కాలేజీలకీ ఏప్రిల్ పధ్నాలుగు నుంచి వారంరోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం__ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా.
    ఫతే మైదాన్ లో చాలా అట్టహాసంగా ఏర్పాటుచేశారు. సర్క్యూట్ టి.వీ. యేర్పాటుతో సహా_దూరంగా కూచున్న వాళ్ళకి సరిగా కనిపించటం కోసం. ఊరంతా అర్చీలతో తోరణాలతో అలంకరించారు.
    నాంపల్లి రోడ్డు పుట్ పాత్ మీద నడుస్తూ, "ఏమిటి ఈ హంగామా అంతా? తెలుగుకీ తెలుగు దేశానికీ ఇప్పుడేం భోగం పట్టినదని? లేక, ఏమి ఆపద వచ్చినదని? ప్రజల ధనాన్ని ఇట్లా వృధా చేస్తున్న ప్రభుత్వాన్ని నిలువునా ఉరి తియ్యాలి" అన్నాడు మోహన్ రెడ్డి.
    "స్టెన్ గన్ పట్టుకొని మినిస్టర్లందర్నీ ఫట్ ఫట్ కాల్చిపారెయ్యాల ఒక్కొక్కర్ని గిసుమంటి పన్లు చేస్తే దీనికోసం. జబర్దస్తీ తోటి మంది దగ్గర__వుద్యోగస్తుల తాన పైసలు గుంజుకున్నరు గవర్నమెంట్ ఆఫీసర్లు" అన్నాడు వెంకటేష్.
    వాళ్ళతోపాటు మరికొందరు.
    ఫతే మైదాన్ వైపు వస్తున్నారు. లక్డీకపూర్ వైపు నుంచి వస్తున్న రంగారెడ్డి మరో యిద్దరు ఎదురయ్యారు.
    "నువ్వు వూర్లో వుండటంలేదా రంగారెడ్డీ? సిటీలో వుంటున్నావా?" అన్నాడు మోహన్ రెడ్డి.
    "మస్తు భూమి వున్నది. అంత భూమి నేనేడ దున్నగల! అందుకోసం మా నాయన్నే దున్నిపిస్తున్నడు. యేం జెయ్యాల? బి.ఏ. ఎగ్జామ్ యింక వున్నదికదా. కంప్లీట్ చేస్తున్న యీడనే వుండి" అన్నాడు రంగారెడ్డి.
    "యెన్ని దశాబ్దాలు పడుతుంది నీ పరీక్షకి?" అన్నాడు మోహన్ రెడ్డి.
    "అన్ని భూములుంటే నేరం" అన్నాడు వెంకటేష్.
    "తీసుకోన్రి. యెవరొద్దన్నారు!"
    "యీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం" అన్నాడు వెంకటేష్.
    "మార్చున్రి. కాదంటున్ననా!" అన్నాడు రంగారెడ్డి.
    "ఎక్కడికి బయల్దేరావు?" అన్నాడు మోహన్ రెడ్డి రంగారెడ్డితో.
    "యీ సభలు కలర్ ఫుల్ గా వుంటవని యీ పోరగాళ్ళు అనంగ వస్తున్న. యీ పాపపు కండ్లతోటి చూసి జన్మ తరించిపోదామని!"
    "ఆడవాళ్ళని వేరే దూరంగా వుంచుతారు" అని మోహన్ రెడ్డి చిన్నగా నవ్వాడు.
    "ఐతే యేమాయె!" అని భుజానికి వేళ్ళాడుతున్న ఆకుపచ్చ రంగు చేనేతబట్ట సంచిలోంచి బైనాక్యులర్ బయటికి కాస్త తీసి చూపెట్టి_నవ్వాడు రంగారెడ్డి.
    అక్కడినుంచి విడిపోయి విప్లవ రచయితలు సమావేశం కావాల్సిన చోటుకి వెళ్ళారు మోహన్ రెడ్డి వెంకటేష్ లు.
    మరో గంటకి అంతా కలిసి నిరసన ప్రదర్శన యాత్ర ప్రారంభించారు__శ్రీశ్రీని వెంటబెట్టుకుని.
    వాళ్ళు వెళుతూండగా ఒకతను వచ్చి, మోహన్ రెడ్డిని పక్కకి పిలిచి, "గాయత్రిని పోలీసులు అరెస్టు చేశారు" అని చెప్పాడు.
    "దేనికి? యెక్కడ? మాతో బయల్దేరలేదా?" అన్నాడు మోహన్ రెడ వివరించటంలోనే ఆ వివరించటం ఉపన్యాస ధోరణిలోకి మళ్ళిందట. అప్పుడు పోలీసులొచ్చి అరెస్టు చేశారట."
    "ఆ మాత్రానికేనా!"
    "అందుకో యెందుకో__అరెస్టయితే అప్పుడు చేశారు."
    "సరే నువ్వు వెళ్ళు. యీ పని ముగియాలిగా. ఆ తర్వాత చూద్దాం. ఏ స్టేషన్లో వుంచినారో తెలుసుకుని వుండు" అని మోహన్ రెడ్డి వడివడిగా నడిచి ఆ అందరిలో కలిశాడు.
    ఆ మీదట....వీళ్ళందర్నీ పోలీసులు అరెస్టు చేశారు.
    శ్రీశ్రీతో సహా అందర్నీ విడుదల చెయ్యాలని విరసం నగరశాఖ కన్వీనర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
    మాజీ విరసులు కూడా నిరసన తెలియజేశారు.
    ఆ తరవాత ఎందుకన్నాగానీ, ప్రభుత్వం అందర్నీ విడుదల చేసింది.
    ఆస్థానకవి విశ్వనాథకి, యీ సభల్ని సమర్ధిస్తూ శ్రీశ్రీ రాశాడని చెబుతున్న లేఖ గురించి వాదోపవాదాలు చర్చలు జవాబులూ సాగుతున్నాయి.
    గాయత్రిని వుంచిన పోలీస్ స్టేషన్ వాళ్ళు, మోహన్ రెడ్డి గాయత్రి భర్త అని తెలిసి అతనినీ అరెస్టు చేశారు. యిద్దర్నీ వేరు వేరు గదుల్లో ఆ స్టేషన్లోనే వుంచారు.
    ఆ విషయం తెలిసిన మోహన్ రెడ్డి పినతండ్రి, మినిస్టరుగా వున్న వాళ్ళ బంధువు ద్వారానూ __ తెలిసిన ఒక పోలీసు అధికారి ద్వారాను మోహన్ రెడ్డిని విడిపించాడు. అంతేకాక గాయత్రిని అరెస్టు చేసి జైలులో పెట్టి వుంచమని చెప్పించాడు. ఆ విషయం మోహన్ రెడ్డికీ మరెవరికీ తెలియదు.
    విడుదలయిన మోహన్ రెడ్డి బయటికొచ్చి మిత్రులను కలుసుకుంటే __గాయత్రిని విడుదల చెయ్యలేదని చెబితే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
    కలుసుకోటానికి వీల్లేదన్నారు.
    యెందుకు ఏ సందర్భంలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో చెప్పమని అడిగితే__అవన్నీ నీకు సంజాయిషీ ఇచ్చుకోం పొమ్మన్నారు.
    గాయత్రి తండ్రి రామనాధం వెళితే, కలుసుకోనిచ్చారు.
    యివన్నీ నచ్చకపోయినా; పసిబిడ్డ తల్లి, కన్నకూతురు అని ప్రాణం పీకిన మీదట, భార్య పోరిన మీదటా, వచ్చాడు. గాయత్రి ఆ గుమ్మం దాటాక వాళ్ళు కలుసుకోవటం ఇదే మొదటిసారి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS