Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 16


    పైన ఉన్న తలుపు తీస్తే తప్ప, ఈ గదిలోంచి బయట పడటానికి లేదు. బ్రహ్మదేవుడు వచ్చినా, కుమ్మరి రాముడు వచ్చినా గుమ్మం లోంచి రావలసిందేకానీ, ఈ గదికి మరొక మార్గం అంటూ లేదు.


    ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ ఇలా...


    ఆపైన ఆలోచించటానికి బుద్ధి పుట్టలేదు. కళ్ళు తెరిస్తే రామ్ సింగ్ ఎక్కడ మాట్లాడిస్తాడో అని కళ్ళు మూసుకుని పడుకున్నాను.


    ఒక్కొక్క క్షణం తరిగిపోతున్న కొద్ది, ఒక్కో యుగంలాగా  అనిపిస్తున్నది.


                                                                    8


    మాట్లాడే శక్తి మా ఇద్దరికీ పోయింది.


    నేలకంటుకుపోయి పై కప్పుని చూస్తూ పడుకున్నాను.


    "మనం ఇంక ఎక్కువసేపు బ్రతకం భాయ్!" రామ్ సింగు స్వరం బావిలోంచి వినవచ్చినట్లు వినవచ్చింది.


    నా చెవులు దిబ్బెళ్ళు పడుతున్నాయి. పడుకొని వున్నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నెమ్మదిగా చేయి చాచి అతడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.


    "నిన్నటిదాకా అనుకున్నాను. ఏ అద్భుత శక్తి అయినా వచ్చి మనల్ని రక్షిస్తుందేమో అని! అద్భుతశక్తి లేదు, అదృష్ట లక్ష్మీ లేదు. మనకి మృత్యువు తప్పదు. ఇరువురం కలిసి నాలుగు రోజులయినా జీవించాం. పరస్పరం అర్థం చేసుకొని ఒకేమాట, ఒకేబాటగా వున్నాం. ఇప్పుడు కూడా ఒకే బాటలో ప్రయాణించి, మృత్యువుని చేరుకుందాము. మనం మరణించినా, మన చేయీ, చేయీ ఇలా కలిసే ఉండాలి" లో గొంతుకతో అన్నాను.


    "మనిద్దరం కలిసే మరణిస్తాం! ఇంత బాధలోనూ అది ఒక్కటే నాకు తృప్తి!" రామ్ సింగు ఆగి ఆగి అతి కష్టం మీద ఈ మాటలు అన్నాడు.


    "నాకూనూ" అన్నాను.


    ఆ తరువాత ఇరువురం మాట్లాడుకోవటం మానేశాం. మాట్లాడే ఓపిక పూర్తిగా పోయింది. మా ఇద్దరికీ ఇవే మా చివరిమాటలేమో! చివరి చూపులూ, చివరి క్షణాలూ


    ఉన్నట్లుండి...


    దిబ్బెళ్ళు పడ్డ నా చెవులలో ఏవో బరువైన శబ్దాలు చాలా దూరం నుంచి లీలగా వినపడ్డాయి. యమధర్మరాజుగారు ఎక్కి వస్తున్న దున్నపోతు గిట్టల చప్పుడా!


    నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. మృత్యుముఖంలో వుండి కూడా జోక్ గా ఆలోచించగలుగుతున్నానన్న మాట.


    ఉన్నట్లుండి,


    "టిష్ కుం...టిష్ కుం...టిష్ కుం..." చప్పుడు దాంతోపాటు కొన్ని ఆర్తనాదాలూ, దబదబా పరుగెత్తుతున్న బూట్ల చప్పుడు. పరుగుల తాలూకా శబ్దాలూ.

    
    నా చెవులు దిబ్బెళ్ళు పడుతున్నా, ఈ శబ్దాలు దేని తాలూకావో నాకు అర్థం అయింది.


    సాధారణంగా చివరి ఘడియల్లో ఉంటే ఏవేవో భయంకరమైన శబ్దాలూ, దూరంనుంచీ ఏవేవో అర్థంకాని మాటలు వినపడతాయి అంటారు. కానీ ఇవి అవేమీ కాదు.


    నాకేదో అర్థం అయింది.


    ఠక్కున లేచి కూర్చున్నాను.


    తన చేయి వదిలేసి నేను లేచి కూర్చోవటం చూసిన రామ్ సింగు అతి బలవంతంమీద గొంతు పెగల్చుకొని "ఏమిటి?" అన్నాడు.

    
    "జాగ్రత్తగా విను. పైన ఏదో గలాటా జరుగుతున్నది. బూట్ల చప్పుడూ, రివాల్వర్ శబ్దమూ విన్నాను. ఏం నీకు వినిపించలేదా?" ఆతృతగా అడిగాను.


    రామ్ సింగుకి ఏడుపు ఒక్కటే తక్కువ "నీకు సంధి పుట్టింది భాయ్" అన్నాడు.


    జీవితం మీద పూర్తిగా ఆశ చచ్చిపోయింది. మృత్యుముఖంలో ఉండి, నీరసంతో ఉండి పోయాను. "లేచి కూర్చుని జాగ్రత్తగా విను. మనం మాట్లాడుకొంటే వినపడే శబ్దాలు కూడా వినపడవు!" అంటూ చెవి ఒగ్గి వింటూ వుండిపోయాడు.


    మరి కొద్ది సేపటిలో లీలగా మాటలు వినిపించి, ఆ తరువాత దగ్గరిగా గట్టిగా మాటలు వినిపించాయి.


    "ఇక్కడ ఎవరూ లేరు సార్! అనుమానించ తగ్గవి కూడా ఏమీ కనపడటం లేదు సార్! మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాను సార్!"


    "ఎందుకయినా మంచిది, మరోసారి పరీక్షించి, క్షుణ్ణంగా వెతికి చూడండి" ఎవరో అధికారంగా మాట్లాడారు.


    తొందర పడకపోతే లాభంలేదని గ్రహించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS