అతడు కారులోంచి దిగాడు. దిగేముందు కారులోనే కూర్చొని, తనని ఎవరైనా అనుసరిస్తూ వస్తున్నారా అని పరికించి చూసి, సంతృప్తి పడ్డాక దిగాడు. చీకట్లోనే కాదు, వెలుగులో కూడా అనుక్షణం అతడి ప్రాణం ప్రమాదంలోనే వుంటుంది.
ముఖ్యంగా లోహియా గ్రూపు నుంచి.
అతడు కారు దిగి చెత్తకుండి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కొందరిలో అందముంటుంది. కొందరు బలంగా ఎత్తుగా వుంటారు. కానీ అతడిలో ఆ రెండింటికన్నా మించినదీ చాలా తక్కువ మందిలో వుండేదీ వున్నది... ఠీవి! అది అతడి సీరియస్ నెస్ కి సరిగ్గా అతుక్కుపోయింది.
అతడు తల పైకెత్తి పైనున్న కిటికీవైపు చూశాడు. తలుపు మూసి వుంది.
అతడు కుండీ దగ్గర్నుంచి భవంతి దగ్గిరగా వెళ్ళాడు.
గేటు కూడా మూసేసి వుంది. సెకండ్ షో వదిలేసి రెండు గంటలు కావొస్తూన్న ఈ టైమ్ లో దాని తలుపులు తెరుచుకుని వుంటాయని అనుకోవటమే పొరపాటు.
అతడు మళ్ళీ తలెత్తి ఆ కిటికీవైపు చూశాడు. వస్తూంటే చెత్తకుండీలో రక్తం బొట్టులా- ఎర్రగా ఏదో కనపడ్డది. అతడి గుండె ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది. వడివడిగా అక్కడికి వెళ్ళాడు.
ఎంగిలాకులో ఎండు మిరపకాయ. తన భ్రమకి తనే సిగ్గుపడ్డాడు. ఊహు- కాదు-సిగ్గు-భయం-నవ్వు-విషాదం ఇలాంటి భావాలన్నిటికీ అతడు అతీతుడు.
తిరిగి కారు పోనిచ్చాడు. అరగంట తరువాత అతడి కారు ఒక విశాలమైన ఇంటి పోర్టికోలో ఆగింది. దూరం నుంచే దాని శబ్దం విన్న గూర్ఖా, అది దగ్గరకి వచ్చే సమయానికి గేటు తీసి నమ్రతగా నిలబడ్డాడు.
వరండాలోంచి నౌకరు పరుగెత్తుకు వచ్చి తలుపు తీసేడు.
అతడు దిగాడు. వరండా అంచున వరుసగా కుండీలున్నాయి. పాలరాయి తెల్లగా మెరుస్తోంది. అతడు తలుపు తెరుచుకొని లోపలికి ప్రవేశించగానే వెనుక డోర్ శబ్దం చేయకుండా మూసుకుపోయింది. క్రింద నేలమీద తివాచీ ఒక మంచు సముద్రంలా వుంది. ఒక మూల క్రిమ్ సన్ కలర్ సోఫాలున్నాయి. మరో మూల దాదాపు యాభైవేల రూపాయల విలువ చేసే దంతంతో చేసిన విగ్రహం వుంది. దానికున్న వెండి తాపడం కన్ సీల్డ్ లైటింగ్ లో అందంగా మెరుస్తోంది. పురాతనమైన ఇళ్ళలో లాగా పైకప్పు ఇరవై అడుగుల ఎత్తు వుంది. అక్కడ అందమయిన లతలు పెయింట్ చెయ్యబడి వున్నాయి. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ భవంతి అది.
బల్లమీద బంగారపు సిగరెట్ లైటర్ వుంది. పక్కనే బంగారపు టిన్ వుంది, కానీ అతడు చూస్తున్నది వాటిని కాదు. బల్లచుట్టూ అందోళనగా కూర్చున్న ముగ్గురు వ్యక్తుల్ని.
అంత అర్థరాత్రి వాళ్ళని అక్కడ అలా ముందుహాల్లో వూహించని అతడు తబ్బిబ్బు అయ్యాడు.
తండ్రి, తమ్ముడు, చెల్లి. అతడిని చూడగానే వాళ్ళ మొహాలు విచ్చుకున్నాయి. అప్పటి వరకూ అతడి కోసమే ఎదురు చూస్తున్నట్టు తండ్రి లేచి నిలబడి- "నీ కోసమే చూస్తున్నాం" అన్నాడు. అతడు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
"మన కొంపల మీదకొచ్చే విషయం ఒకటి వచ్చి పడింది" అన్నాడు తండ్రి ప్రారంభిస్తూ.
నాకు తెలుసు. లేకపోతే మీరందరూ ఇలా నాకు ఈ అర్థరాత్రి స్వాగతం పలకరు.
"ఏమిటి విషయం" అని అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కూతురి వైపు తిరిగి "ఇదే చేసిందంతా" అన్నాడు తండ్రి. అతడు ఆమె వైపు చూసేడు. బిగుతయిన పంజాబీ డ్రెస్ లో ఇబ్బందిగా కదిలింది ష్యామా.
"అయినా అంత కళ్ళు మూసుకొని ప్రవర్తించటం ఎందుకు" అన్నాడు తమ్ముడు. అతడి పేరు భరత్. అతడు విసుగ్గా సిగరెట్ వెలిగించుకుంటూ. "విషయం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?" అన్నాడు.
"సాయంత్రం ఎవడో ఫోటోలు తెచ్చి ఇచ్చాడు. రేప్రొద్దున్న పేపర్లో రాబోతున్నాయట. ఈ రత్రి ఐమీన్ తెల్లవారుఝామున నాలుగింటి వరకూ మనకు టైముంది. వాళ్ళకి కావల్సింది ఇవ్వకపోతే నాలుగింటికి ప్రింటింగ్ లోకి వెళ్ళిపోతాయి. అది చెప్పి వెళ్ళిపోయాడు".
"ఏం ఫోటోలు"
ఎవరూ మాట్లాడలేదు.
"ఏం ఫోటోలు" రెట్టించాడు.
"నీ చెల్లి ఎవడితోనో హోటల్లో..."
అతడికి అర్థమైంది.
"దీనికసలు బుద్దిలేదు. అంత పబ్లిగ్గా తిరగటం ఎందుకు" తండ్రి అన్నాడు.
ఆ మాటలు పట్టించుకోకుండా అతడు తమ్ముడి వైపు చూసి "ఏవి ఆ ఫోటోలు" అని అనడిగాడు. జి.కె. వెంటనే కల్పించుకొని "వద్దు, నువ్వా ఫోటోలు చూడలేవు" అన్నాడు చప్పున.
తండ్రి ఆ మాట అనటంతో "నువ్వా ఫోటోలు చూసేవా" అని తమ్ముడ్ని అడిగాడు. భరత్ తలూపాడు. చెల్లితో "నువ్వు" అన్నాడు.
ఆమె మొహం ఎర్రబడింది. తలూపింది!
తమ్ముడు చూశాడు. చెల్లెలు చూసింది. నేను మాత్రం చూడకూడదు. సభ్యత కాదు.
"అంత అసభ్యమైన ఫోటోలు మామూలు దినపత్రికల్లో ఎలా వేస్తారు?" అని అడిగాడు.
"ఆ పత్రిక ఎవరిది? లోహియా గ్రూపుది. అసభ్యమైన చోట నలుపు చేసి వివరాలు వ్రాస్తారు. మనం ఎలా కోర్టులో ప్రొసీడ్ అవుతాం?"
"అంత అసభ్యంగా వున్నాయా ఫోటోలు".
ఇక తప్పదన్నట్టు జి.కె. కవరు అతడి ముందుకు తోశాడు. అతడు ఫోటోలు బైటికి తీసి ఒకటి రెండు చూసి, లోపల పెట్టేశాడు. ష్యామాయే మొగవాడిలాగా వుంది. ఆ కుర్రవాడే కాస్త సిగ్గుపడుతున్నాడు. ఇద్దరి వంటిమీదా నూలుపోగు లేదు.
రూమ్ లో కన్ సీల్డ్ కెమెరా పెట్టినట్టున్నాడు" భరత్ అన్నాడు.
జి.కె. మళ్ళీ కూతురి వైపు తిరిగి "అంత హోటల్ రూమ్ లకి వెళ్ళి బరితెగించాల్సిన ఖర్మ ఏం పట్టింది" అని తిట్టాడు.
"వాళ్ళు ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వుండి వుంటారు. ఇది దొరికింది" అన్నాడు అతడు.
ఆమె అతడివైపు కృతజ్ఞతగా చూసింది- ఆ మాత్రం సపోర్ట్ యిచ్చినందుకు.
అతడు లేచి నిలబడి వాచీ చూసుకున్నాడు. నాలుగవటానికి ఇంకా రెండు గంటలుంది.
"ఈ ఫోటోల నెగెటివ్ లు తిరిగి ఇచ్చేయటానికి వాళ్ళకి ఏం కావాలిట?" అక్కడున్న ముగ్గురూ మాట్లాడలేదు.
"ఏం కావాలట?"
