Previous Page Next Page 
రాక్షసుడు పేజి 4


    జి.కె. కొడుకువైపు ఇబ్బందిగా చూసి, "చాలా దారుణమైన షరతు పెట్టారు" అన్నాడు. అతడికి విసుగేసింది. ఇటువంటి మెలోడ్రామాలు అంటే అతడికి చిరాకు.

 

    "మన కెక్కువ టైమ్ లేదు" అన్నాడు, తొందరగా చెప్తారా అన్నట్టు.

 

    "మన వంశగౌరవం నాశనం కాకుండా ఆపటానికి..."

 

    "ఊ... ఆపడానికి-"

 

    భరత్ లేచాడు. "ఏమవుతే అదవుతుంది. మనం వాళ్ళ షరతులకి వప్పుకోవద్దు అన్నాడు. జి.కె. చిన్నకొడుకు వైపు ప్రేమగా చూశాడు. "నేనూ అదే అనుకుంటున్నాను".

 

    "ఇంతకీ వాళ్ళకి కావల్సిందేమిటో చెప్పలేదు!" విసుగ్గా అన్నాడు అతడు.

 

    "చెప్పటానికి మనసు వప్పటం లేదు. కానీ చెప్పక తప్పదు. ఫోటోలు ఇవ్వటానికి షరతుగా వాళ్ళకి కావల్సిందిప్పప్ కావల్సింది నువ్వే".

 

    ఊహించాను. ఇంతకన్నా పెద్ద బేరం ఏముంటుంది ?

 

    "వెళతాను" ముక్తసరిగా అన్నాడు.

 

    వాళ్ళ మొహంలో రెప్పపాటు వెలిగిన ఆనందాన్ని ఫ్లాష్ కన్నా వేగంగా అతడి కళ్ళు పట్టుకున్నాయి. అయినా గమనించనట్టు నటించాడు.

 

    "వద్దొద్దు. వాళ్ళలోకి వెళితే ప్రమాదం".

 

    "అయితే వెళ్ళొద్దా" ఓరగా చూస్తూ అన్నాడు.

 

    "అమ్మో, రేపు నేను కాలేజీకి ఎలా వెళ్ళను?" అంటూ లేచి అతడి భుజం మీద తలపెట్టి "అన్నయ్యా! ప్లీజ్" అంది. అతడు సుతారంగా "వెళతానులే, కంగారు పడకు" అన్నాడు.

 

    "పిస్టల్ తీసుకెళ్ళు" అన్నాడు భరత్.

 

    అతడింక మాట్లాడవలసిందేమీలేనట్టు ఫోన్ దగ్గరికి నడిచి డయల్ చేసి "లోహియా" అన్నాడు.

 

    "నీ కోసమే చూస్తున్నాను" అట్నుంచి వెంటనే వినిపించింది.

 

    అతడు ముక్తసరిగా "నేను వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేసి వాళ్ళవైపు చూడకుండా బయటికి వచ్చాడు. వరండా మెట్లు దిగి కారు దగ్గరికి నడిచాడు. చర్చి గడియారం అప్పుడే మూడు కొట్టింది. నగరం గాఢ నిద్రలో వుంది. ఒక నిశాచరుడు దూరంగా సైకిలు బెల్లు మోగించుకుంటూ వెళుతున్నాడు.

 

    అతనికి పిస్టల్ తీసుకెళ్తే బావుంటుందేమో అనిపించింది. వాళ్ళ నుంచి రక్షించుకోవటానికి కాదు. వాళ్ళలో చిత్రహింసలు పెట్టే సూచనలు కనపడితే, ముందే ఆత్మహత్య చేసుకోవటానికి.

 

    అతడు కారు దిగి, మళ్ళీ మెట్లు ఎక్కాడు. అప్పటికే జి.కె. బెడ్ రూంలో లైట్లు ఆరిపోయాయి.

 

    ష్యామా రూంలోంచి పాప్ మ్యూజిక్ సన్నగా వినబడుతూంది.

 

    అతడు ఒకసారి బాధ్యత తీసుకున్నాక అందరూ రిలాక్స్ డ్ గా తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అతడు మాత్రం ఆ నిశిరాత్రి కార్లో ఒంటరిగా శత్రుశిబిరం వైపు వెళుతున్నాడు.

 

    ..............

 

    అతడు చేరవలసిన చోటుకి చేరేసరికి సరిగ్గా మూడయింది. కారు శబ్దానికి వీధి కుక్క నిద్రలేచి మొరగటం ప్రారంభించింది. అతడి కారు రావటం చూసి, దానికోసమే వేచివున్నట్టు గూర్ఖా తలుపుతీసి నిలబడ్డాడు. అతడు కారుని పోర్టికోలో నిలిపాడు. వెంటనే దిగలేదు.

 

    తమ ఇంటి పోర్టికోలా లేదు. ఇది కాస్త విశాలంగా వుంది. పూర్వీకులు కట్టించినట్లు ఎత్తుగా వుంది. మెట్లుకూడా ఎత్తుగా వున్నాయి.

 

    అంతలో లోపల్నుంచి ఎవరో రావటం కనిపించింది. లోహియా తాలూకు బాడీగార్డు దగ్గిరగా వచ్చి తలుపు తెరవగానే అతడు కారుదిగాడు. బాడీగార్డు చెయ్యిచాచి "పిస్టల్ ప్లీజ్" అన్నాడు.

 

    లేదందామనుకున్నాడు. ఇవ్వకపోతే ఎలాగూ వెతుకుతారు. అందుకని మాట్లాడకుండా తీసి ఇచ్చేశాడు.

 

    "ఆయియే సాబ్".

 

    నవ్వొచ్చింది. ప్రాణాలు తీసుకునే శత్రువుల మధ్య కూడా గౌరవ మర్యాదలు. ఇతడి యజమానే గానీ ఆజ్ఞాపిస్తే "మాఫ్ కీజియే సాబ్" అని తనతో అంటూ గుండెల్లో పొడుస్తాడు.

 

    మౌనంగా అతడి వెనుకే నడిచాడు. ఇద్దరూ ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించారు. మధ్య సోఫాలో కూర్చుని వున్నాడు లోహియా. అతడి చేతిలో పిస్టల్ వుంది. "గుడ్ ఈవెనింగ్" అన్నాడు.

 

    "గుడ్ మార్నింగ్".      

 

    లోహియా వాచీ చూసుకుని నవ్వుతూ "సారీ. గుడ్ మార్నింగ్" అన్నాడు. అతడు మాట్లాడకుండా ఎదుటి సోఫాలో కూర్చున్నాడు. లోహియా బాడీగార్డు వైపు తిరిగి "నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు హిందీలో "... బాబుగారు పిస్టల్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు తిరిగి ఇద్దుగానీ తీసుకో".

 

    "ముందే తీసుకున్నాను సాబ్" అన్నాడు వాడు తన తెలివితేటలు ప్రదర్శిస్తూ.

 

    "అది కాదు, ఇంకొకటి".

 

    వాడి మొహం ఖంగుతిన్నట్టు మారింది. అయోమయంగా చూశాడు.

 

    లోహియా తెలివితేటలకి ఆశ్చర్యపడుతూ అతడు తన మేజోడులోంచి రెండోది తీసి ఇవ్వగానే లోహియా తనది కూడా ఇచ్చేస్తూ "మనం ఇక స్నేహ సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చుననుకుంటా" అన్నాడు నవ్వుతూ.

 

    అతడు దానికి సమాధానం చెప్పలేదు. లోహియా అతడి దగ్గిరగా వస్తూ "ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావో చెపుతావా?" అన్నాడు.

 

    "ఆ అవసరం నాకు లేదు. నేను పిస్టల్ తెచ్చుకున్నది మీరు చిత్రహింసలు ప్రారంభిస్తే నన్ను నేను చంపుకోవటానికి" అన్నాడు.

 

    లోహియా మొహంలో ఆశ్చర్యం గోచరించింది. "నిన్ను చిత్రహింసలు పెట్టడమా? ఎందుకు? నువ్వు మా అందరికి కావల్సినవాడివి" అన్నాడు.    

 

    'అవును. అందరికీ కావల్సిన వాడిని. దేశపు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీషు దినపత్రిక మీదవటంవల్ల కేంద్రం మీతో కోరుకుంటూన్న "సత్సంబంధాల" ని అడ్డంగా పెట్టుకుని దేశపు రాజకీయాల్ని ఒక ఆట ఆడిస్తున్నమీకూ, రాష్ట్రస్థాయిలో సంతృప్తి చెంది, అంతలోనే లక్షలు గడిస్తున్న నా తండ్రి జి.కె.కీ, మీ ఇద్దరితో సంబంధం లేకుండా కేవలం ప్రజల మూర్ఖత్వం మీద- అంటే రేసులూ, లాటరీలూ, బలహీనతలమీద- అంటే తాగుడూ, జూదమూ వీటిమీద కోట్లు గడిస్తూన్న వంక చెక్కా రామ్మూర్తికీ.... అందరికీ కావల్సిన వాడినే'.

 

    అంతలో బేరర్ ట్రేతో రాయల్ సెల్యూట్ బాటిలూ, రెండు గ్లాసులూ తెచ్చాడు.

 

    "తీసుకో! ఉదయం చాలా ఫ్రెష్ గా ప్రారంభమవుతుంది".

 

    "వద్దు. రాత్రి ఫ్రెష్ గా నిద్రపోవటానికి మాత్రమే తీసుకుంటాన్నేను".

 

    "నేను నీకు శత్రువును కాను. మనం తాగుతూ మాట్లాడుకోవచ్చు".

 

    "అంత టైమ్ లేదనుకుంటాను మీకు. మీ డైలీకి ఈ ఫోటోలు ప్రచురించటానికి టైమ్ అయిపోతుంది. అప్పుడే మూడున్నర కావొస్తూంది. మీరిచ్చిన గడువు నాలుగింటి వరకే".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS