Next Page 
జీవన వలయం పేజి 1


                         జీవన వలయం
                                              ---అక్కల సరస్వతీ బాబూరావ్

                   
    

    ముందు వరుసలో కూర్చున్న మధుమూర్తి తల వెనకకు తిప్పి హాలంతా కలయచూశాడు. తను వచ్చినప్పుడు ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ క్రమంగా నిండిపోయినాయి అయినా జనం ఇంకా వస్తూనే ఉన్నారు. బద్ధకంగా వెనక్కు వాలి టైమ్  చూసుకొన్నాడు. అయిదూ పది. అసలు ప్రోగ్రామ్ అయిదు గంటలకు మొదలు కావలసింది. ఇండియన్ పక్చ్యు యాలిటీ అనుకొంటూ చిన్నగా నవ్వుకొన్నాడు.
    "ఏమిట్రోయ్! నీలో నువ్వే నవ్వుకొంటున్నావ్?" అంటూ ఊడిపడ్డాడు సుధీర్. వాడు తనను అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి అరగంట దాటింది.
    "ఏరా, నాన్నా, ఆ మహారచయిత్రి వచ్చే సూచనలేమైనా కనిపిస్తున్నవా?" అన్నాడు మధు.
    "అఁ బయల్దేరుతున్నట్లు ఇప్పుడే ఫోను చేసింది. వచ్చేస్తూ ఉండాలి. చూడు మధూ, ఇప్పటికే ఆలస్యం అయింది అందరూ ఎంతో ఆత్రుతగా ఆమె కొరకు ఎదురుచూస్తున్నారు. నిన్ను తరవాత పరచయం చేస్తాను." మాట పూర్తికాకుండానే మళ్ళీ మాయమయ్యాడు సుధీర్. ఈ రోజు ఈ క్లబ్బులో జరుగుతున్న ఫంక్షన్ కు హడావిడి అంతా సుధీర్ దే. అటూ ఇటుగా తిరుగుతూ, పనులు పురమాయిస్తూ ఒకటే సతమతమై పోతున్నాడు.
    నాలుగు రోజుల క్రితం మధు హోటల్లో తీరిగ్గా కబుర్లాడుతూ కాఫీ సిప్ చేస్తుండగా సుధీర్ అన్నాడు:
    "ఒరే, మధూ మా క్లబ్ తరఫున 'సునీత'కు సన్మానం చేస్తున్నాం."
    "ఏ సునీత? రచయిత్రి సునీతకే" అంటూ ఆశ్చర్యపోయాడు మధు.
    "అవున్రా.మొన్న నవలల పోటీలో ఫస్ట్ ప్రైజు వచ్చింది గదా. ప్రముఖ రచయిత్రి పైగా, ఆమెది ఈ ఊరే. అందుకే అందరం కలిసి ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం."
    "ఇంతకీ సన్మానం ఏ రోజు?"
    "ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఈ సారి నీవు తప్పించుకుంటే ఊరుకునేది లేదు."
    "ఏం చేస్తావేం?" అన్నాడు మధు నవ్వుతూ.
    కొంచెం ఆలోచించి, "ఏమో, ఏం చేస్తావో నాకే తెలియదు. మధూ, ఈసారికూడా నా ఆహ్వానాన్ని త్రోసిపుచ్చడం నీకు న్యాయం కాదురా ముక్కోటి ఆంధ్రుల అభిమాన రచయిత్రి ఆమె. నీవు తప్పక రావాలి నా కోసం."
    "నీ కోసం కాదు. నా కోసమే వస్తాను. ఆమెను కలుసుకొని మాట్లాడాలి."
    "నిజం" అంటూ ఆనందంగా చెయ్యి పట్టుకొని మృదువుగా నొక్కి వెళ్ళిపోయాడు సుధీర్. చాలాసేపు మధు సునీత గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు.
    "మే ఐ టేక్ దిస్ సీట్?"
    ఆలోచనలో నుండి తేరుకొని, "కూర్చోండి" అన్నాడు మధు. అతడు కూర్చున్న తరవాత ఒక్కసారి అతడిని పరిశీలనగా చూశాడు. బంగారంలో కలిసిపోయె దేహచ్చాయ. అందమైన పెద్ద కళ్ళు. ఆ కళ్ళకు అందాన్ని ఇనుమడింప జేస్తూ ఉన్న చక్కని కళ్ళజోడు. పొడుగాటి ముక్కు అన్నిటినీ మించి అందమైన, ఆకర్షణీయమైన విగ్రహం అతనిది. అతడు పక్కకు తిరగగానే మధు తన చూపు మరల్చాడు.
    "మిమ్ముల నెక్కడో చూసినట్లుంది?" ఆలోచిస్తూ అన్నాడతడు.
    "నన్నా?" ఆశ్చర్యపోతూ అన్నాడు మధు.
    "ఆఁ మిమ్ములనే....ఆఁ గుర్తొచ్చింది. మీరు 'రెయిన్ బో' హాల్లో కనిపిస్తూ ఉంటారు. అది మీ స్వంతమా?"
    "అలాటిదే. మా బాబాయిగారిది."
    కొంచెం ఆగి, "మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా?" అన్నాడు మధు.
    "ఈ రోజుల్లో చూడని దెవరు లెండి! ఇంతకీ మీ పేరు..."
    "మధుమూర్తి ఎమ్. ఎ. పాస్ అయ్యాను. ఉద్యోగం లేదు. తల్లిదండ్రులిచ్చిన ఆస్తి ఉంది. చిత్రాలు గీస్తూ కాలక్షేపం చేస్తున్నాను" అన్నాడు గుక్క తిప్పుకోకుండా.
    "నా పేరు రమాకాంత్. సేల్స్ టాక్స్ ఆఫీసులో క్లర్కుని లలిత కళలంటే నా కెంతో అభిమానం. అప్పుడప్పుడు తీరిక సమయాల్లో కథలు వ్రాస్తూంటాను" అన్నాడు నవ్వుతూ.
    "చాలా సంతోషం..." అంటూండగానే ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండవలసిందంటూ మైక్ లో అభ్యర్ధన వినిపించింది. ఆ తరవాత స్టేజి మీదకు వచ్చిన స్త్రీని సునీతగా పరిచయం చేశాడు సుధీర్ సభికులకు.
    ఆమె అందంగా ప్రేక్షకుల వైపు తిరిగి నమస్కరించింది. ఆ తరవాత తన రచనలు ఇంతమందిని ఆకర్షిస్తున్నందుకు తన కెంతో సంతోషంగా ఉందని, ఇలాగే అందరి ఆదరాభిమానాలతో ఇంకా మంచి రచనలు చేయటానికి ప్రయత్నిస్తానని చెప్పి తన ఉపన్యాసం ముగిసినట్లు కూర్చుంది. తరవాత మామూలు తతంగమంతా పూర్తి అయిన తరవాత ఆమె లేచింది. ఏవో కొన్ని వినోద ప్రదర్శనలు మొదలైనవి.
    సుధీర్ హడావిడిగా మధు దగ్గరకు వచ్చి మళ్ళీ అంతే హడావిడితో మధు చెయ్యి పట్టుకొని లాక్కువెళ్ళినట్లే వెళ్ళాడు.
    అక్కడ పాతిక ముఫ్ఫై మంది వ్యక్తులమధ్య సునీత పార్టీలో పాల్గొంటూంది సుధీర్ మధు, సునీతలను పరిచయం చేసి మళ్ళీ బాణంలా దూసుకుపోయాడు.
    "మీ రేమీ అనుకోనంటే మీ నవల విషయం ఒకటి అడగదలుచుకొన్నాను."
    "నిరభ్యంతరంగా అడగండి."
    "నిజం చెప్పాలంటే మీ నవలకు ప్రథమ బహుమతి రావటం నాకు న్యాయంగా తోచటం లేదు. అంత కంటే కొందరు వ్రాసిన మామూలు నవలలు ఎంతో బాగుంటున్నాయి."
    "అయి ఉండవచ్చు."    
    "అయితే మీ నవలకు ఎలా బహుమతి వచ్చిందంటారు?"
    "నే నెలా చెప్పగలను? .... అంతకంటే మంచి నవల లేకపోయి ఉండవచ్చు. వచ్చిన వాటిలో నాదే వారికి వచ్చి ఉండవచ్చు."
    "అదేమీ కాదు."
    "మరి?"
    "మీకు కోపం రాదంటే ఒక్క సంగతి." ఏమి టన్నట్లు ఆమె మధు వంక చూసింది.
    "మీ కథలు బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు (నాలాటివానికి) -అయినా మీకు రచయిత్రిగా, అందులో గొప్ప రచయిత్రిగా పత్రికలవారు మీకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. దానికి తలలు ఊపారు పాఠకులు. పేరు వచ్చిన రచయిత్రి కాబట్టి మీరు చెత్త వ్రాసినా అది పత్రికల వారికి మహా ప్రసాదం. ముందే డబ్బు పంపి మీరు ఏది వ్రాస్తే అది తీసుకుంటారు .... కాదనగలరా?"
    "అనలేను. కాని మీ రనుకుంటున్నంత చెత్తగా పెద్ద రచయిత లెవరూ వ్రాయరనే అనుకుంటున్నాను."
    "క్షమించండి. నా మనస్సులో మాట చెప్పాను. అంతేకాని మిమ్ములను కించపరచాలని కాదు."
    "ఫర్వాలేదు. ఒక విధంగా నా కెంతో సంతోషంగా ఉంది. నా దగ్గరకు వచ్చే వారు అందరూ నన్ను, నా రచనలను మెచ్చుకొనేవారే కాని మీలా మాట్లాడినవారు లేరు. మీ ఉద్దేశ్యంలో రచన ఎలా ఉండాలో చెపితే విని వ్రాయటానికి ప్రయత్నిస్తాను."
    "నా అభిప్రాయా న్ననుసరించి వ్రాస్తారా? ఆశ్చర్యంగా ఉందే?"
    "ఆశ్చర్యం ఎందుకు? ఒక అభిమాన పాఠకుని మనస్సు ననుసరించి అతని కోర్కె తీర్చగలిగాననే తృప్తి ఎలా వ్రాయాలనుకుంటే అలా వ్రాయగలననే దైర్యం నాకు మిగులుతాయి."
    "థాంక్స్! మరొకసారి కలుసుకొన్నప్పుడు చెపుతాను."
    "మళ్ళీ కలుసుకొంటామా?"
    "ఎందుకు కలుసుకోకూడదూ? ఈ పరిచయం ఇంతటితో అంతం చేయటం నా కిష్టం లేదు."
    "మీ మాట ఎందుకు కాదనాలి? ఇదుగో, నా అడ్రసు. మరి మీది కూడా ఇవ్వండి" అంది.
    డైరీలోని విజిటింగ్ కార్డు అందించి ఆమెకు మరొకసారి నమస్కరించి హాలులో నుండి బయటకు వచ్చాడు మధుమూర్తి.
    
                              *    *    *
    
    సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. ఎండ కిటికీలోనుండి బెర్తు మీద పడుకొన్న రవి మీద పడుతూంది. పుస్తకంలోనుండి తల తిప్పిన ఆమె నొచ్చుకుంటున్నట్లు గబగబా కిటికీ తలుపు మూసి, ఆప్యాయంగా మూడేళ్ళ రవి బుగ్గలను నిమిరింది.


Next Page 

WRITERS
PUBLICATIONS