Next Page 
తామరకొలను పేజి 1


                                                       తామరకొలను
                                                          ---శర్వాణి  

                     

    ఆఫీస్ ఉద్యోగి కృష్ణమూర్తి అతని తమ్ముడు రమేష్. భార్య పేరు శాంత. బాగా పెరిగిన చనువువల్ల రమేష్ తన వదిన శాంతను వేళాకోళం చేయటం, కపటంలేని దురుసుతనంతో కూడిన అతని మాటలకు శాంతి ఒక్కొక్కప్పుడు నొచ్చుకోవటం అలవాటు.

                                        2

 

                

    రమేష్ కాలేజీకి వెళ్ళేవరకు శాంతకు తీరిక చిక్కేది కాదు. అంత హడావిడి చేసేవాడు అతడి గొడవలతో ఎవరికీ ఏమీ తోచేదికాదు. అన్నీ ముగించుకుని అతడు కాలేజీకి వెళ్ళాడంటే అందరూ గొప్ప పని ముగించినట్టు హాయిగా ఊపిరి పీల్చుకునేవారు. రమేష్ తన బూటు పాలిషునుండి "గైనకాలజీ" నోట్ బుక్ వరకూ వదిననే ఎక్కడుందని అడిగేవాడు.
    ఒక్కోసారి శాంత విసుక్కునేది.
    "ఏమిట్రా చోద్యం! నీ పుస్తకాలు, రేజర్లు, బ్లేడు, పాలిషు-అంతా నన్నడుగుతావేం? అవన్నీ నేను వాడనని తెలీదూ?"
    "ఏమో, ఎవరికి తెలుసు. గోళ్ళు కత్తిరించుకోవడానికి నా బ్లేడు తీసి ఉండచ్చుగా."
    "రామ, రామ! నేను శూర్పణఖ నయినా కూడా నీ బ్లేడు మాత్రం ముట్టుకోను."
    "అన్నయ్యకోస మేమైనా......"
    "ఇంకా నయం. ఆయన వస్తువులు నువ్వు ముట్టకుండా ఉంటే చాలదూ" అనేది శాంత.
    ఆమె మాటలు అక్షరాలా నిజం. జేబు రుమాలు, పెన్సిలు, పెన్ను, బ్లేడు-ఏది కావాల్సివచ్చినా తనని వెతుక్కోకుండా, సుళువుగా దొరికే అన్నయ్య వస్తువులమీద దాడి చేసేవాడు రమేష్. తనకు కావాల్సిన వస్తువు తీసుకుని!
    "వదినా, అన్నయ్య పెన్ను తీసుకుంటున్నా; మళ్ళీ వెతుక్కునేరు" అనేవాడు.
    "ఆయన పెన్ను ముట్టకయ్యా. మళ్ళీ నన్ను కోప్పడతారు."
    "అహ, నాకు తెలియక అడుగుతాను-నేను పెన్ను తీసుకుంటే మిమ్మల్నెందుకు కోప్పడతారు?"
    "నేను నీకు ఇంత చనువిచ్చి నెత్తి కెక్కించుకున్నానని, అందువల్లే నువ్విలా తయారయ్యావని అంటారు. మీ అన్నయ్యనే అడిగి తీసుకో బాబూ."
    "ఉహుఁ. నేను అన్నయ్యను అడగను మీ దగ్గర పెన్నుంటే ఇవ్వండి."
    "నే నేం రాసుకుంటానని నా దగ్గర పెన్నుంటుందనుకున్నావ్."
    "ఇంటిలెక్క రాయటానికి పెన్నక్కర్లేదా మీకు?"
    "అక్కర్లేదు; అసలు ఇంటిలెక్క రాసే అలవాటే లేదు నాకు. లెక్కంతా నా నోట్లోనే ఉంటుంది."
    "మీరు డాక్టరు కావాల్సింది వదినా! మంచి జ్ఞాపకశక్తి మీకు."
    "ఇంటికి ఒకరు డాక్టరైతే చాలు. నీ చదువు ఎప్పటికి పూర్తవుతుందని ఇంట్లో అందరం కాచుక్కూర్చున్నాము."
    "ఎందుకో వాళ్ళకంత ఆత్రం?"
    "ఆత్రం కాదా మరి? ఉదయం నీ హడావుడిలో చచ్చిపోతున్నాం. నువ్వు డాక్టరై, నీకో పెళ్ళయితే మేమంతా బ్రతికిపోతాం....
    "వదినా! నాకు వెన్నెలకాంతిని విరజిమ్మే....."
    "కాలేజీకి టైమవుతోంది వెళ్ళరా బాబూ" అని మైమరచి మరిదిని హెచ్చరించి అక్కడ నుండి పంపేది శాంత.
    ఆమె అనుకున్నట్టే కృష్ణమూర్తి అడిగేవాడు!
    "నా పెన్నేది?"
    "రమేష్ పట్టుకెళ్ళాడు."
    "ఇకమీదట నా వస్తువులేవీ ముట్ట్ద్దద్దని చెప్పు వాడికి."    
    "మీరే చెప్పకూడదూ. నే చెపితే వినడు మరి.'
    "ఎలా వింటాడూ? అలా చనువిచ్చి నెత్తికెక్కించుకుంటే!"    
    "పోనివ్వండి. ఈ సంవత్సరం గడిచిపోతే, వాడెక్కడో! మన మెక్కడో!'
    "నువ్విలా అంటూనే వాడిని ఇలా తయారు చేశావు" అని ఊరుకునేవాడు కృష్ణమూర్తి.
    శాంత అన్నమాటా నిజమే. రమేష్ తన భవితవ్యాన్ని గురించి వదినతో చర్చించేవాడు. తన మనసులోని ఆరాటాన్నంతా వదిన ముందుంచే వాడు వదినతో తప్ప మరెవరితోనూ తన విషయాలు చెప్పుకునేవాడు కాదు. తల్లి తనకన్నా చాలా పెద్ద గనుక ఈ కాలానికి తగినట్టుగా సలహా లివ్వలేరని అనుకునేవాడు. తండ్రితో రమేశుడికి చిన్నప్పటినుండి చనువన్న మాటే లేదు. ఇక అన్నయ్యవాళ్ళెప్పుడూ ఎక్కువగా కలుసుకునే వారే కాదు. కలుసుకుని మాట్లాడుకున్నా, అన్నయ్య తమ్ముడిని చిన్న కుర్రాడికింద కట్టి మాట్లాడే వాడు. ఇహ మిగిలింది శాంత. తన మనసులోని ఆలోచనలన్నీ ప్రేమతో వినే వదినతోనే చెప్పుకునేవాడు.
    "మెడిసిన్ పూర్తిచేశాక ఇక్కడే పనిలో చేర్తావా, ఏం చేస్తావు రమేష్?" అని అడిగేది శాంత.
    "ఇక్కడే ప్రాక్టీసు చేసుకున్నా, జీవనం నడిచిపోతుంది. కాని, వదినా! పని మాత్రం రాదు. జలుబు, దగ్గు-    ఇలాటివి నయంచేస్తూ కూర్చో వచ్చు. కాని నాకు సర్జన్ కావాలనుంది ఈ ఊరు వదిలిపెట్టాలని లేదు గాని, ఈ ఊళ్ళో కులాల గొడవలు ఎక్కువైపోయాయి. అందుకనే ఉత్తరాదికి వెళ్ళాలని ఉంది."
    "హస్తవాసి, నైపుణ్యం ఉంటే, ఏ ఊళ్ళో ఉంటే మాత్రం ఏమిటి చెప్పు."
    "మీరు ఎప్పుడూ ఇంట్లో ఉంటారు. మీకేమీ తెలీదు వదినా! బయట ప్రపంచాన్ని కాస్త కళ్ళు తెరచి చూడండి. మా హాస్పిటల్ లోనే ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయని! కాని, ఏమీ చేయలేక అందరూ ఊరుకుంటారు. ఇవన్నీ చూస్తూ, చూస్తూ మళ్ళీ నేను అదే కూపంలోకి దూకలేను వదినా!"
    "నువ్వు వెళ్ళిపోతే, నా కేమీ తోచదురా రమేష్."
    "నిజమే, నాకూ కష్టమే. మీరు రుచి రుచిగా వండిపెట్టే టిఫిన్లు, వంట-ఇవన్నీ వదిలిపోవటం,"
    శాంత నవ్వేసేది.
    "పోనీ, వాటికోసమైనా ఉండిపో"-అని సలహా ఇచ్చేది.
    "మీలాటివారు ఉండేవరకూ, ఎక్కడున్నా జీవించేందుకు కావాల్సినంత డబ్బు సంపాదించుకోగలను. ఉత్త డబ్బు సంపాదించడం ఒకటే కాదు నాకు కావలసింది."
    "కావచ్చు; కాని ఈ ఆదర్శం ఎన్ని రోజులు నిలబడుతోందననే నా అనుమానం. వృత్తిలోకి దిగే ప్రతి డాక్టరు అలాగే అనుకుంటాడు. కాని తరువాత పేదవాళ్ళను కన్నెత్తి కూడా చూడరు."
    "మీ మాట నిజమే వదినా! సామాన్యంగా హాస్పిటల్ లో జనరల్ వార్డులోని రోగుల్ని డాక్టర్లు మొదల్కొని నర్సులు, ఆయాల వరకూ అందరూ అలక్ష్యంగా చూస్తారు."
    "మీ డాక్టర్ల ఇంకో రోగం కూడా నాకు అర్ధంకాదు. ఒక డాక్టర్-పేషంట్ ను ఇంకొకడు చచ్చినా చూడడు. పేషంటు-ప్రాణం పోతున్నా ఇతడు నా పేషంటు కాదు' అని వెళ్ళిపోవటం న్యాయమంటావా? అంతెందుకు, ఓమారు మా మామయ్యా బెంగుళూరు విక్టోరియా హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఉండేవాడు. ఆయన కోసం తెప్పించిన ఇంజక్షన్ ఇవ్వటానికి డాక్టరే గతిలేకపోయాడు. ప్రతీవాడు 'ఈయన మా పేషంటు కాదు' అంటూ వెళ్ళిపోవటమే. ఇదేం న్యాయమో చెప్పు."
    'న్యాయంకాదు గాని, అలా ఒకరి పేషంటుని ఇంకొకరం ట్రీట్ చేస్తే, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకు భిన్నాభిప్రాయాలు, గొడవలు వస్తాయి."
    "వీళ్ళ గొడవల్లో మధ్య చచ్చేది మనం. నువ్వు మాత్రం అలా చేయకు. రమేష్."
    "నాకు మంచి సర్జన్ గా కావాలనుంది."
    "చాలా ధైర్యం ఉండాలి-కదూ సర్జన్ కావాలంటే?"
    "అవును రెండు కేసులు సక్సెస్ కాకపోతే ఇహ వాడికా ఊళ్ళో ఉప్పు కూడా పుట్టదు."
    "అయితే మరి ఏ ధైర్యం మీద సర్జన్ గా అవుదామనుకుంటున్నావు. నా కేమో భయమే బాబూ."
    "భయపడకండి వదినా! నేను నా మొదటి ప్రయోగం మాత్రం మీమీద చెయ్యను."
    "నా భయం అది కాదు రమేష్. ఒకవేళ నీ కేమయినా చెడ్డ పేరొచ్చి....."
    "అపుడు మీ రుంటారు. నాకు కావలసినంత డబ్బివ్వటానికి."
    "తమాషాక్కాదు రమేష్. ఏది ఏమైనా, నీకు ధనదాహం లేకుండా ఉండాలనే నా కోరిక."
    "వదినా, ఖచ్చితంగా చెపుతున్నా వినండి. డబ్బు గల వాళ్ళ దగ్గరుండి ఒక్క పైసా కూడా వదలకుండా వసూలు చేస్తాను. బీదవాళ్ళను పైసా కూడా అడగను. సరేనా?"
    "అలా అని ప్రామిస్ చెయ్యి."
    "ఏం, నా మాటమీద మీకంత నమ్మకం లేదా?'
    రమేష్ నవ్వుతూ అన్న శాంత నొచ్చుకుంది.
    "నిన్ను నొప్పించానేమో" అంది.
    "అవును."
    "క్షమించు."
    "రవ్వలడ్డూలు, కారంగింజలు పెడితే గాని, క్షమించను."
    "నా దగ్గరే ఇంత లంచం వసూలు చేస్తావే! ఇహ బయట-వాళ్ళను వదలిపెడతావా నువ్వు!"
    "మీరేమన్నా, నా పేషంటు కావాలీ ...."
    "రామ, రామ డాక్టర్ల చేతికి చిక్కకుండానే దేవుడు నన్ను తీసుకుపోతే చాలు."
    "మీరు అలా అంటే డాక్టర్లు బ్రతికేదెలా? మీరు నా పేషంటయితే నేను అడిగేదింతే. వారానికో సినీమా, రెండుమార్లు హోటల్ ఖర్చు. వారానికి నాలుగుమార్లు రవ్వలడ్డులు చేసిపెడితే చాలు. అంతే నా ఫీజు."
    "నీ ఫీజు ఇవ్వటంతో నేను దివాలా తీస్తానంతే."
    "మీకు తెలీదు కాని, వదినా! మీకు దేవుడు సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని నేను ఎప్పుడూ దేవుడిని ప్రార్దిస్తూంటాను."
    "చాలా సంతోషం కాని, తమరికి దేవుడిమీద ఈ నమ్మక మెప్పటినుండో"-శాంత కొంటెగా అడిగింది.
    "నేను ఫైనల్ ఎం.బి. స్టూడెంటు నయి నప్పటినుండి" అని జవాబు చెప్పాడు రమేష్.
    సుశీలమ్మగారు ఎందుకనో పిలవటంతో శాంత లోపలికి వెళ్ళింది.
    రమేష్ ఆఖరి సంవత్సరం చదువులో పడ్డాక, మునుపటిల్లా వదినతో కబుర్లు చెబుతూ కూర్చో వటం పడేది కాదు. ఉదయం హాస్పిటల్ డ్యూటీ మధ్యాహ్నం కాలేజీ, సాయంకాలం టేబుల్-టెన్నిస్ వీటితో సరిపోయే దతనికి. రాత్రి భోంచేసే టపుడు, పడుకునేందుకు ముందు కబుర్లు చెప్పే వాడు. ఒక్కోసారి భోంచేయగానే తన గదిలోకి వెళ్ళిపోయేవాడు-చదువుకోవటానికి. అప్పుడు శాంతకు ఏమీ తోచేదికాదు. పాలు ఇవ్వటమనే నెపంతో అతడి గదిలోకి వెళ్ళేది.
    "రమేశ్! పాలు తీసుకో."
    "అక్కడే ఉంచండి" అన్నాడు  రమేష్ పుస్తకంలో నుండి తలెత్తకుండానే.


Next Page 

WRITERS
PUBLICATIONS