మమత
-----నండూరి విఠల్

'....' అన్నారు రఘుపతి గారు ఆప్యాయంగా .
'అదృష్టవంతుణ్ణి ' అనుకున్నాడు స్వామి.
అనందం కూడా తనను గురించి అలాగే అనేవాడు.
ఎన్నడో చిన్ననాడు రంగాజమ్మ చెప్పిన కధ గుర్తుకు వచ్చింది స్వామికి.
'అనగనగా ఒకరాజు. పిల్లలు లేకుండా కన్ను మూశాడు. మహామంత్రులవారు ఒక ఏనుగును పూలదండతో నగరంలోకి పంపారు. ఆ పూలదండను -- ఆ ఏనుగు - ఎవరి మెళ్ళో వేస్తె -- అతగాడు - ఎవరైనా సరే - ఆ రాజ్యానికి రాజు కావాలి- అదీ నిర్ణయం.
జనసందోహంతో కిటకిట లాడాయి నగరవీదులన్నీ. వీరాధివీరులు మెడలు చాచుకుంటూ -- బారులు తీర్చి నిలబడ్డారు. ఏనుగు బయల్దేరి నడుస్తుంది అదృష్టదేవతలా.
నడిచి నడిచి ఒక మారుమూల బక్క పేగులతో - చింకి జుట్టుతో - మూలుగుతున్న ఒక అనాధ మెడలో వేసింది ఆ పూలదండ! అంతవరకూ అడుక్కుతింటున్న ఆ కుర్రవాడు - ఆ రాజ్యానికి ప్రభువైపోయాడు. అ తర్వాత జరిగిన స్వయవరంలో - అప్సరస లాంటి రాజకుమారి ని అతగాడు వివాహమాడాడు. కలకాలం సుఖశాంతులతో రాజ్యం చేసి....
'అదృష్టవంతుణ్ణి ' అనుకున్నాడు ఆ రోజే. ఆ ఊరి మిడిల్ స్కూల్లో ఏదో టీచరుగా చేసిన స్వామి.
శిఖరేశ్వరస్వామి!
బళ్లో పిల్లలకు ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటిసారి పాఠం చెప్పి -- తృప్తిగా అలసిపోయి, రఘుపతిగారింట్లో భోజనం చేసి - పడుకుంటున్న సమయంలో గూడా అలాగే అనుకున్నాడు మళ్ళీ.
ఇన్నాళ్ళ కు తానూ ప్రయోజకుడయ్యాడు.
'కాని వూళ్ళో ఎలా బ్రతుకుతావోరా బాబూ! అభం శుభం తెలియని వాడివి. అంటూ ఆడపిల్లను అత్తగారింటికి సాగనంపుతున్నట్లు బెంగపడిపోయింది తల్లి సీతమ్మ గారు. ఆ ఊరు వస్తున్నప్పుడు. తన మనస్సు కూడా రవ్వంత తికమక పడిన మాట నిజం.
ముందు సత్రంలో మకాం పెట్టి -- మరునాడే తోటి టీచరు పరాంకుశంతో కలిసి అద్దెకు గది వెతుక్కుంటూ బయలుదేరాడు.
రావిచెట్టు దగ్గర ఎదురయ్యారు రఘుపతి గారు -- తనను చూసి 'ఎవరయ్యా ఈ అబ్బాయి' అన్నారు. తన భోగట్టా అంతా వినయ విదేయలతో చెప్పుకున్నాడు స్వామి.

'అన్నప్ప శాస్త్రి మనవడివిటోయ్చ?చెప్పావు కాదేం! మనం చుట్టాలమయ్యా' అని భుజం చరిచారు రఘుపతిగారు. ఆ తర్వాత ' మా యింటి ముందు గదిలో ఉండవయ్యా నిక్షేపంగా ' అంటూ సాదరంగా ఆహ్వానించారు. గది బాగుంది. 'అద్దె ఎంతండి?' అన్నాడు.
'ఎంత అజ్ఞానివి బాబూ' అన్నట్లు నవ్వి - ' ఆద్దె దేముందయ్యా? నీలాంటి బుద్ది మంతుడు యింట్లో ఉండాలి గానీ' అనేశారు అతి తేలికగా.
'కాదండీ ! ఒకరోజు రెండురోజులూ అయితే ఫర్వాలేదు గాని--'
'రెండు రోజులు కాకపోతే రెండేళ్ళు ఉండవయ్య. పది అయిదు నువ్వు నాకు అద్దెయివ్వకపోతే గడవదంటావా?'
అద్దె లేకుండా ఉండటం న్యాయమని పించాలా స్వామికి. నలుసంత చుట్టరికం వుంటే మాత్రం - ఒకళ్ళ మంచితనాన్ని అంతగా వాడుకునే తత్త్వం కాదు తనది. కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత అన్తాగా ఒకళ్ళ కెందుకు బుణపడాలి?' అనే అభిప్రాయం నీకుంటే - మా అమ్మాయికి నాలుగు ముక్కలు ట్యూషన్ చెప్పు.
దానికే దానికి సరిపోయిందనుకో పోనీ' అంటూ తనకు తృప్తి కలిగించే రాణి మార్గం కూడా చూపించారాయన.
'కలసోచ్చే రోజులొస్తే- అన్నీ అలా కలిసోస్తాయిగామల్సు. అప్పుడే ట్యూషన్లు కూడా దొరుకుతున్నాయి.; అనుకున్నాడు నిండుగా.
పాపం ఆనందం కంటే తాను అదృష్టవంతుడు . ట్రయినింగు పూర్తీ చేయకుండానే -- అతగాడు చదువు మానుకుని - ఎక్కడో కాంట్రాక్టరు దగ్గర గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ - బ్రతికాల్సి వచ్చింది. ఆ సంవత్సరం కష్టపడి చదివుంటే ఈపాటికి తనతో పాటు ఉద్యోగం చేస్తుండేవాడు నిక్షేపంగా. పాపం!
'ఎలా బ్రతికిన వాణ్ని నీకు తెలియదులే బాబూ, నిక్షేపంగా సామానులు తెచ్చుకో మరో ఆలోచన పెట్టుకోకు' అంటూ ఆపేక్షగా ఆహ్వానించారు రఘుపతి గారు.
ముందు నా యింట్లో ముందు గది శుభ్రం చేయించి ఒక మంచం - మేజాబల్ల- కుర్చీ - మరచెంబు - వగైరా సరంజామా ఏర్పాటు చేయించారు గూడా.
అంతేనా! బజారుకుపోయి సంచెడు సామాను బియ్యం కొనుక్కుని స్వయంపాక యజ్ఞానికి సమిదిలు పెర్చుకుంటున్న తనను చూసి ' ఎందుకయ్యా అంత రభస పడుతావూ? ఒంటరివాడివి. పట్టెడు మెతుకులు పెట్టలేక పోతామా? అంటూ మందలించారు గూడా.
రఘుపతిగారి భార్య శారాదమ్మ గారు కూడా అదే అపేక్షతో ' ఈ మాత్రానికే నువ్వు చేతులు కాల్చుకోవాలా బాబూ? బిడ్డ లాంటి వాడివి' అంటూ భార్యకు వంతపాడింది.
పార్వతీ పరమేశ్వరులు గుర్తుకు వచ్చారు స్వామికి. ఆ దంపతుల ఆదరణ చూస్తె, కేవలం మొహమాటం కొద్ది వంచిన తల ఎత్తకుండా , రఘుపటిగారి సరసన కూర్చొని - అవబెట్టిన పనసకాయ కూరతో సహా కడుపు నిండా అన్నం తిని, నూతి దగ్గర చేయి కడుక్కుంటూ 'ఎటువంటి మనుష్యులు !' అని ఆశ్చర్యపోయాడు. మంచినీళ్ళు త్రాగి పలమారగా 'అమ్మ' తలచుకుంటుంది. ఇటువంటి యింట్లోయింత వసతిగా ఉంటూ యిలా కడుపు నిండా భోజనం చేసినట్లు తెలిస్తే, ఎంత సంబర పడి పోతుందో వెర్రితల్లి అనుకున్నాడు స్వామి.
భోజనాలయ్యాక , పడక కుర్చీలో ఠీవిగా కూర్చున్న రఘుపతి గారు 'రావయ్యా రా! తాంబూలం వేసుకో' అంటూ ఆహ్వానించారు. ముందున్న కుర్చీ చూపెడుతూ.
'అలవాటు లేదండి' అంటూ కుర్చీలో బెరుకు గా ఒక మూలకు ఒదిగి కూర్చున్న స్వామి వినయ సంపత్తిని మెచ్చుకుంటున్నట్లు మందహాసం చేశారాయన.'
'చూడబ్బాయ్! నాకు మాత్రం తిండి లేకపోయినా తాంబూలముండాలనుకో. రవ్వంత పచ్చకర్పూరం ఎలకులూ అందులో పడి తీరాలి. తాంబూలం తగినంత పడకబోయిందో తిన్నది అరిగి చావదనుకో. పెద్ద పులులూ సింహాలు రంకెలు పెడుతున్నట్లే పొట్టలో పేగులు పెట్రేగి పోతాయనుకో. అది కాపరాని కొచ్చినప్పటి నుంచీ యిదే వరుస. ఈ పాడు శరీరాలు ఏముంది బాబూ! మైనపు ముద్దలనుకో. అదీ వరస. ఎలా అలవాటు చేస్తే అలా తయారై ఊరేగుతాయి. మా బుజ్జీలు అల్లుడున్నాడు --అప్రాచ్యుడు - ఫ్యాక్టరీ గొట్టం లా పాడు సిగరెట్లు కాలుస్తూ - ఇల్లంతా ఊదర పెడుతూనే వుంటాడు. మళ్ళీ తెల్లవార కుండానే అంటించాలి ఆ కాష్టం. ఆ కాష్టం మండకపోతే -- సూర్యభగవానుడు ఉందయించడు అతగాడికి. కాలకృత్యాలు బందైపోతాయట.'
రఘుపతి గారి మాటలు వింటున్న స్వామిని ఒక ఆలోచన పట్టుకు పీడిస్తున్నది.
'అద్దెకు బదులుగా అమ్మాయికి నాలుగు ముక్కలు చెప్పు బాబూ' అన్నాడాయన. ఆ అమ్మాయి అలికిడి గూడా యింట్లో ఎక్కడా కనిపించింది కాదు. తనకు తెలియకుండా కళ్ళు వెతికాయి.
అందుకు కారణముంది.
ఉద్యోగంలో చేరీ చేరగానే ఆవిధంగా ట్యూషను దొరికి 'పై సంపాదన' కు కూడా మార్గం కనిపించడం అల్పమైన అదృష్టంగా కనిపించలేదు స్వామికి. తన చిన్నతనంలో రామబ్రహ్మం మాష్టారు ఇంచుమించు పాతిక మంది పిల్లలకు అరుగుమీద పాఠాలు చెపుతూ , చుట్టూ పట్ల పల్లెటూళ్ళలో గూడా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నిజానికి యింటి సంపదనంతా ఆ ట్యూషన్ల మీదనే గడిచిపోయేది. తమ గ్రామంలో ఉన్న పది సంవత్సరాలలో ముగ్గురు కూతుళ్ళ కు పెళ్ళిళ్ళు చేసి, అరా ఎకరం సుక్షేత్రం లాటి మాగాణి అయన కోనగలిగారంటే అయన ట్యూషన్లే కారణం.
తనకు అయన ఆదర్శ పురుషునిలా కనిపించారు . 'శ్రద్దగా చెప్తారు మాష్టారు చదువు -- అనే పేరు రావాలి ముందు. ఆ తర్వాత అవే పరిగెత్తు కొస్తాయి ట్యూషన్లు ...' అనుకున్నాడు. తనకు పట్టిన అదృష్టాలను తలుచుకుంటూ నిద్రరాక రఘుపతి గారిచ్చిన మంచం మీద అటూ ఇటూ వట్టిగిల్లితున్న స్వామి.
'యా అమ్మాయి కూడా శ్రద్దగా చదువు కుంటే -- తన శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. అనుకున్నాడు. 'అమ్మాయి బుద్ది పాదరసమనుకో. దానికి ముందు మనిషి మీద గురి కుదరాలి. లేకపోతె యెటువంటి వాణ్ణి లెక్క చేయదు.' అన్న రఘుపతిగారి మాటలు గుర్తుకొచ్చాయి. మనస్సు రవ్వంత చెదిరినట్లనిపించింది.
అనిపించడం కాదు. మర్నాడు తన శిష్యురాలిని చూసీ చూడగానే -- నూటికి నూరు పాళ్ళూ బెదిరిపోయాడు స్వామి.
* * * *
మర్నాటి ఉదయం గూడా తాను ట్యూషను ప్రారంభించే అవకాశం కలుగలేదు. అసలు రఘుపతి గారింట్లో పిల్లలున్న జాడే కనిపించలేదు. భోజనం చేస్తున్న సమయంలో గూడా ఆ సంగతి దంపతులలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు. తనంత తాను ఆ విషయాన్నీ మాట్లాడటం మర్యాద కాదని ఊరుకున్నాడు.
సాయంత్రం బడి నుంచి తిరిగి వచ్చి గది ఉడ్చుకుంటున్న స్వామికి, లోపల గది కిటికీ లోంచి కిలకిల మంటూ నవ్వుతున్న నలుగురు ఆడపిల్లల సవ్వడి వినిపించింది. చీపురు అలాగే పట్టుకొని వంచిన నడుము ఎత్తి చూశాడు.
మెరుస్తున్న ఆరు నక్షత్రాలు కనిపించాయి.
ముగ్గురే అమ్మాయిలూ, నలుగురు కాదు. ఆ మెరుపుల భంగిమను బట్టి ఎంత కాదనుకున్నా , వాళ్ళు తననే చూసి నవ్వుతున్నట్లనిపించింది. తను తలనేత్తి చూడగానే, అ ఆరు తారకలూ ఒక్కసారి మాయమైపోయాయి. తను మళ్ళీ తలవంచుకుని తన గది పనిలో మునిగిపోయాను. సర్ధుడు అంతా అయాక పిలక జాడించి దట్టించి ముడి పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ ఆడపిల్లలు ముగ్గురూ పడి పడి నవ్వుతున్నట్లనిపించింది. మరోసారి కిటికీ వంక చూశాడు. మళ్ళీ అదృశ్యమై పోయాయి ఆ ఆరు తారకలు. చొక్కావిప్పి పదిలంగా మడతపెట్టి - అరచేతి వెచ్చదనంతో నలిగిన గుడ్డను మాలీషు చేసి మడతలు వేసి , మంచం దిండు క్రింద పెట్టాడు. పెట్టెలోని తల్లి ఫోటో తీసి తుడిచి గోడ మీద మేకుకు తగిలించాడు. ఆ ప్రక్కనే ఎప్పుడో ఆనందం యిచ్చిన యేసు ప్రభువు ఫోటో గూడా ఒకటి అలంకరించాడు.
-- "కాఫీ తీసుకోండి మాష్టారూ'
'వెనకకు తిరిగి చూశాడు స్వామి.-
దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరస లాంటి పిల్ల తళుక్కు,మంటూ మెరిసింది. కళ్ళ ముందు. వస్తున్నా నవ్వును అపుకుంటానికి విశ్వప్రయత్నం చేస్తున్నది ఆ మెరుపు తీగ.
'అలా కొయ్యబారిపోయారేం మాష్టారూ? కాఫీ త్రాగండి' క్రింది పెదవి బిగపట్టి మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఈసారి ఆపుకోలేక పైకి నవ్వేస్తూ అంది ఆమాట. కిటికీ ఆవల నుంచి మరి రెండు కిన్నెర కంఠలు విరగబడి నవ్వుతూ ఆమె నవ్వుకు వంత పాడాయి. కిటికీ కేసి చూశాడు. ఈసారి నాలుగే తారకలు కనిపించాయి.
'భూమి మీద అగండే కాస్త తల్లులూ ఏమిటా వికవికలూ!' రఘుపతి గారి భార్య దొడ్లో నుంచే గావుకేక పెట్టినట్లు అరిచింది.
"మా స్నేహితులు -- "రెండే నాండి ? కరణంగారమ్మాయి అలివేణి- కోనేటిరావు చెల్లెలు భారతి - మా కేవ్వరికీ వంటబట్టలేదు లెండి చదువులు.అందుకే అంత ప్రాణ స్నేహం కలిసింది. మా ముగ్గురికీ. దానికి పెళ్ళి పిచ్చి దీనికి సినిమాలపిచ్చి , నాకేమో బట్టల పిచ్చి. --మా అమ్మ సుభాషితం లెండి. - ఏమైతేనేం ముగ్గురం ఈ పిచ్చిలతోనే అంటుంది అమ్మ - డేకి డేకి ఒక్కొక్క క్లాసూ -- ప్రాణం విసుగొచ్చి ఆ పాడు బడికి తిలోదకాలిచ్చాం. భారతికి పెళ్లై వెళ్ళి పోతుందనుకొండి. రెంన్నెల్లలో. లేకపోతె మేమిద్దరం కలిసే మీ పాదాల దగ్గర పాఠాలు వల్లే వేస్తూ జంట కవుల్లా ఘోషపెట్టేవాళ్ళం.
ఉక్కిరిబిక్కిరైపోయాడు స్వామి. తనకు కాబోతున్న శిష్యురాలు -- రఘుపతి గారి ముద్దుల కూతురు -- ఈమె కాదు గదా?
