Next Page 
విరామం పేజి 1


                                 విరామం
                                                                      ---అంగర వెంకట కృష్ణారావు

 

                       

    పున్నమరాత్రి. వెన్నెల్లో పద్మావతిమిలమిల మెరుస్తూంది. దూరంగా యిటూ అటూ తీరంమీద చెట్లూ, చేమలూ చీకటి ముద్దల్లా వున్నాయి. వాటివెనక పల్లెల్లో దీపాలు మినుకు మినుకు మంటున్నాయి.
    "గర్ గర్ -డబ డబ" మని శబ్దం చేస్తూ 'లాంచి' నిశ్చింతగా వెళ్లిపోతూంది.
    తల్లిలా ప్రజల్ని పోషించే యీమెత్తని మనసుగల పద్మ ప్రతియేడూ విరుచుకుపడి అనేక పల్లెల్నీ పశువులనీ, మనుషుల్ని, ఆస్తుల్ని జాలి నాలిలేకుండా తుడిచిపడుతుంది. ప్రకృతి చాలా విచిత్రమైంది.
    చందమామ మబ్బుల్లో దూరిపోతూన్నప్పుడూ, పైకొస్తూన్నప్పుడూ, పద్మ మొహంలో హావభావాలూ, రంగులూ మారుతున్నాయి.
    లాంచిలో నా బెర్తుకి యెదురుగా వొక అమ్మాయి పడుకుంది. తెల్లని శరీరం, తెల్లచీర, ఆమె మొహంమీద వెన్నెల పడినప్పుడు తెల్లకలువ పువ్వులా వుంది. ఆమెపేరు పద్మ. లాంచి కింద పద్మజాబిల్లి వెలుగులో మొలక వజ్రాల నవ్వులొలుకుతూంటే, లోపల పద్మ నాకెదురుగా ప్రపంచాన్ని మరిచి నిద్రపోతూంది. ఈపద్మ వెడల్పైన నుదిటినీ, చెంపకుచారడేసి కళ్ళ నీ సన్నగా తీరుగా విలుల్లా వంగిన కనుబొమ్మలు వేరు చేస్తున్నాయి.
    పద్మకి పెళ్ళికాలేదు. మరైతే పక్క బెర్తుమీద పడుకున్న దెవడు? అతనాపిల్ల కేమౌతాడు! ఏమీ కాకపోవచ్చనుకున్నా, పరిగెడుతూన్న పద్మ కేసి లాంచి కిటికీలోంచి చూస్తూ.
    ఎన్నేళ్ళనించీ పరిగెడుతూందీ పద్మ. ఎండా కాలంలో అమాయకంగా పెళ్లినడక నడుస్తూ వానాకాలం రాగానే వురుములతో తన హోరు     జతచేస్తూ, మెరుపులవేగంతో పరుగు పందెం వేస్తూ, గట్లుకోసుకుని వురకలేస్తూ. 'కీర్తినాశ" అనే బిరుదు సంపాదించింది.
    పాపం లాంచిలో పద్మ అలాంటిదికాదు. నిద్రపోతూన్న ఆమె మొహం చూస్తే. ఆమె హృదయంలొ ప్రశాంతత వుందనిపిస్తోంది...
    అంతేకాదు. బాధ్యత వుందని నేనంటే అతనొప్పుకోలేదు. పెదిమలు విరిచి అనంకారంగాగీ తలూపేడు. పక్కనున్న తను.
    అతనంతవరకూ పల్చటి కండువా కప్పుకు పడుకున్నాడు. అప్పుడేలేచి కూచున్నాడు. నేను కిటికీదగ్గిర నిలబడి, బైట పద్మవెంపు. లోపలి పద్మ వెంపు చూస్తూ వరస పెట్టి సిగరెట్లు కాలుస్తున్నా.    
    "టై మెంతైంది?" అతను
    "పన్నెండున్నర..." నేను చేతివాచీ చూసి చెప్పా. అతనికో సిగరెట్టిచ్చా, అతను అలా కూచునే శంఖం వూదినట్టు దమ్ములాగుతున్నాడు. పైలా పచ్చీసులో వున్నాడు. పొడగరి కాదుగాని దొడ్డుగా లేడు. ఆరోగ్యంగా వున్నాడు. చిన్న నల్ల గుడ్లు, విశాలమైన తెల్లగుడ్లు. తెల్లగ్రుడ్లమీద యెర్రజీరలు.
    లాంచి "గర్రు గర్రు డబ డబ" మనివెళ్ళి పోతూంది.
    "నేను ఈ యుద్ధాన్ని ద్వేషిస్తున్నా....అని దమ్ములాగి యేదో చెప్పబోయి పొలమారి దగ్గేడు.
    "నేనుమాత్రం ప్రేమిస్తున్నానా?" సిగరెట్టు కొసకిటికీ మీదనొక్కి. నదిలోకి మీటించి అన్నా.
    "మరి మీరు మిలిట్రీ వాళ్ళలా వున్నారు. ఆ సంగతి మీ దుస్తులవల్ల తెలీకపోయినా మీలగేజివల్ల తెలుస్తూంది..."
    "ఔను. నేను మిలిట్రీవాణే."
    "అయితే మీరు తుక్కు మాట్టాడుతున్నారు..."
    "కారణం?"
    "మరేవిటి? యుద్ధాన్ని ప్రేమించరట. మిలిట్రీలో పనిచేస్తారు. ఇదిగో ఈ పద్మకూడా మీలాంటి జడ్జిదే...."
    నన్నతను జడ్జివాడన్నా, పద్మ లాంటిదాని నన్నందుకు సంతోషం వేసింది.
    "బాధ్యత మనిషిని మెడలొంచుతుంది. ఇష్టంలేనిపని చేయిస్తుంది. జీవితం అంతా మనం అనుకున్నట్టూ సాగదు." "అదే తుక్కువాదం, మీరంతా దేశద్రోహులు..." అతను చర్రున లేచి, ఒక్క అరుపు అరిచేడు. నేను చలించలేదు. పద్మ తుళ్ళిపడి లేచింది.
    "కమల్! ఎవరిమీదా కేకలు!.... క్షమించండి....ఇతనికి ప్రధమకోపం ఎక్కువ. మరోలా అనుకోకండి. అతని మాట తీరే అంత..." తడబడుతూ నాతో అంది పద్మ.
    "నే నేమీ అనుకోడంలేదు..."
    "ఎవరేమనుకున్నా నాకేం భయంలేదు..." కమల్ ముసుగు తన్ని మళ్ళీ పడుకున్నాడు.
    "మీరెక్కడి కెళుతున్నారు..." పద్మ
    "అగర్తలా..."
    "మీది ఆర్టిలరీవా..."
    "కాదు, ఆర్టిలరీ వర్కుషాపు. ఐ.ఈ.ఎమ్.ఈ.

 

      
    "అలాగా...."
    "మీకు మిలిటరీ విషయాలు తెలిసినట్టుంది..."
    "నేను కలకత్తాలో ఆర్టిలరీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్సులో పని చేస్తున్నా..."
    "నిజం! నాకు మీ ముసిలాన్ని తెలుసు. బ్రిగేడియర్ గోల్డెన్. మీరు సివిలియను ఉద్యోగం చేస్తున్నారా?"
    "కాదు నేను "నాకై"ని
    నేను వుద్యోగ రీత్యా అయినా ప్రయాణం మాత్రం సివిలియను దుస్తుల్లోనే, సివిలియన్ రైళ్ళు. లాంచీల్లోనే చేస్తాను. మూడు నాలుగు సార్లు మిలిటరీ రైల్లో ప్రయణం చేశా, కాని ఆ ప్రయాణానికీ, యీ ప్రయాణానికీ యెంతో తేడా. రైలు పరుగెడుతూంటే కనిపించే కొండలూ, చెరువులూ, తోపులూ, పక్షులూ, ఆకాశం అన్నీ యెంతో వింతగా తోస్తాయి. హాయిగా వుంటుంది మామూలు ప్రయాణం. మిలిటరీ స్పెషలులో ప్రయాణం సదుపాయంగా ఉంటుంది. కాని అందులో యీ హాయి లేదు. అందుకే కామోను పద్మ నాలాగే ప్రయాణం చేస్తూంది.
    "మీరెక్కడికి కెళుతున్నావరూ?" నేను.
    "కొమిల్లా- మా వూరు...."
    కొమిల్లా.....బావుంటుందా?"
    "కొమిల్లా..... విశాలమైన, అందమైన వూరు! మా వూరు! చుట్టూ యెత్తైన గుట్టలున్నాయి. కని యిప్పుడా వూరు ఆలివ్ ఆకుపచ్చతో నిండిపోయింది..." భారంగా అంది.
    "మీరెందుకు సర్వీసులో చేరేరు?" ప్రశ్నవేసి నాలిక్కరుచుకున్నా.
    లాంచి డబ డబ శబ్దం ఎక్కువైంది. చందమాన మబ్బు వెనుక మరుగుపడ్డాడు.
    మీరెందుకు చేరేరు?" ఎదురు ప్రశ్న వేసింది పద్మ.
    "ముఖ్యం డబ్బుకోసం. తఃరువాత దేశం నాలుగుమూల్లా చూడొచ్చని కొంతకాలం సాహస జీవితం గడపొచ్చనికూడా పద్మ తలొంచుకుంది.
    "నాకు దేశం అంతా చూడాలని తపనలేదు. కాని పరిస్థితులే ఈ సాహసానికి పురికొల్పేయి. నాకు ఐదుగురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు వున్నారు. తూర్పు బెంగాలులో పరిస్థితి మీ కంతగా తెలిసినట్టులేదు. మీరీ వైపు యిదే రావడమా?"
    "ఔను..."
    "సరే....మీకే తెలుస్తుంది. మా తల్లి గతించింది. మా నాన్నగారు గంపెడు సంసార భారంతో కుంగిపోయేరు. ఆయన కోర్టులో చిన్నగుమాస్తా. ఆయన సంపాదన యెందుకూ చాలదు. నాకు సంసార పరిస్థితి బాగా అర్ధవైంది. ఉద్యోగం చేసి నేనూ సంపాదించితీరాలి. ముంద టేడు ఇంటరు పూర్తి అవగానే మిలటరీలో చేరా..."
    మీ వూళ్ళోనే యేదో వుద్యోగం సంపాదించలేకపోయారా?"
    "అసంభవం, మా నాన్న గారసలు వుద్యోగమే చెయ్యొద్దన్నారు. ఆయన కది పరువు తక్కువ. కాని నేనెలాగో వొప్పించా, సర్వీసులో చేరిందగ్గర్నించీ నెలకి నూర్రూపాయలు పంపుతున్నా యింటికి. అప్పుడప్పుడు అదనంగా కూడా సంపాల్సొస్తుంది."
    అప్పుడే మబ్బులోంచి బైట కొచ్చిన చందమామ వెలుగులో పద్మ మొహం మీద విచారం కనిపించింది.
    "క్షమించండి, మీకు బాధ కలిగించేను."
    నాకు నాకైల్ని బాగా తెలుసు. కలకత్తాలో మా బ్రిగేడు ఆఫీసులో ఇరవై మందున్నారు. బెంగా లీలు, మళయాలీలు, తెల్లతొక్క ఆంగ్లోయిండియన్లు. నేపలీలుం అన్ని ప్రాంతాల వాళ్ళూ వున్నారు. వాళ్ళు సాధారణంగా చాలా స్వేచ్చగా వుంటారు. ఎలా పడితే అలా మాట్లాడగలరు. ఏ మాటపడితే ఆ మాట సూటిగా తమని గురించైనా విని చిరునవ్వు నవ్వగలరు. ఏ నవ్వు వెనక యెంత అగ్ని జ్వాల వుందో చెప్పలేం. ఒక స్త్రీని వేలుపెట్టి చూపించడం సుళువు, చెయ్యి ఆసరాయిచ్చి లేవనెత్తడం కష్టం.
    "మీరు శలవల్లో వెళుతున్నారా?..." నేను. పద్మ ఔనని తలూపింది, నేను మరొక సిగరెట్టు ముట్టించేను.
    "ఇతను మీ బంధువా?...."
    "కాదు స్నేహితుడు......"
    "బాయ్ ఫ్రండ్?"
    "నో ప్లీజ్!...." గాభరా పడింది.
    "గాభరా పడకండి. అతనొక బాయ్. మీకు ఫ్రండు. అందికే అలా అన్నా..."
    పద్మ కలువపువ్వు వికసించినట్లు నవ్వింది.
    టాలీగంజ్ లొ వున్న మా బ్రిగేడు ఆఫీసు చూసే వుంటారు ఆ భవనం వీళ్ళదే. వీళ్ళకి డార్జిలింగు దగ్గర చిన్న తేయాకుతోట కూడా వుంది. కమల్ తండ్రిపోయి చాలా కాలమైందిట. తల్లి చాలా తెలివైంది. అన్ని వ్యవహారాలూ స్వయంగా చూసుకుంటుంది. ఇతను తెగిన గాలిపటంలా తిరుగుతాడు. బొగ్గు బస్సులా అరుస్తూంటాడు."
    "అంతేకాదు. త్వరలో మిమ్మల్ని వివాహం ఆడతాడు..." అని నేను నవ్వుతూ పంట్లాం జేబులోంచి చాకెట్లు తీసి పద్మ కిచ్చా. ఆమె అవి అందుకొంది. కాని ఆమె మొహంమీద విచారపు మబ్బు వాలింది.
    "నేనితన్ని ఎలా వివాహం చేసుకుంటా జెప్పండి...."
    "ఎందుక్కూడదూ?..."
    "కమల్ గొప్ప  ధనవంతుడు."
    "ఓహ్- అదా- పెళ్ళయ్యాక మీరూ ధనవంతులౌతారు..."
    "క్షమించండి. మీ కర్ధం కాలేదు. నా కింకా ఐదుగురు చెల్లెళ్ళూ, తమ్ముడూ వున్నారు. వాళ్ళ చదువులూ, పెంపకం జరగాలి. మాది ఒక సామాన్య కుటుంబం. మామూలు రోజుల్లో యింట్లో సంగతి బైటికి రాకుండా గడిచిపోయేది. మాకు తూర్పు బెంగాలు ఘోరపరిస్థితి తెలీదు. అచిరకాలంలో తెలుస్తుంది. పశ్చిమ బెంగాలు పరిస్థితి బాగుందని నే ననడం లేదు. కాని ఇక్కడి పరిస్థితి చూడాలి. ప్రతి మనిషికీ ఈ విషయాలు తెలియాలి. నేను వివాహం చేసుకుంటే నాకు బాగానే వుంటుంది. కాని నాన్నగారు, చెల్లెళ్ళు, తమ్ముడు, వాళ్ళేమవుతారు?....
    "వాళ్ళని కలకత్తా తీసుకెళ్ళిపోవచ్చేమో..."
    "అసంభవం..." చాలావిసుగ్గా అంది.
    తెల్లవారుఝాము మూడు కావస్తూంది. గతరోజు మధ్యాహ్నం రెండు గంటలకి లాంచి చాంద్ వూరు రేవు విడిచి పెట్టింది.
    "గొలందో చేరేసరికి బాగా తెల్లారిపోతుందా? నేను.
    "ఔను. ఐదు గంటలకి చేరుతాం,"
    "అగర్తలా రైల్వే మ్యాపులో లేదు..."
    "అగర్తలా కి రైలులేదు, మీరు అభేరాలో దిగి బస్సుమీద వెళ్ళాలి.మనం కలిసి ఒకే రైల్లో "లక్షమ్" జంక్షన్ వరకూ వెళతాం. అక్కడ నేను వేరే రైలెక్కి కోమిల్లా వెడతా, కాని మీరా రైలు మారక్కర లేదు. మరొక ఐదారు గంటల్లో అఖేరా చేర్తారు, అక్కడ మీదారి మీరు చూసుకోవలసిందే..."
    ఆమె చిన్నగా నవ్వింది. నేనూ నవ్వేను.
    నే నొక చిన్న కునుకుతీసి లేచి సిగరెట్టు ముట్టించేను. పద్మకూడా లేచి అటూ ఇటూ చూసింది.
    తెల తెలవారుతూంది! పద్మ కిరుప్రక్కలా వున్న చెట్లూ, వూళ్ళూ రూపు దేరుతున్నాయి. గుంపులు గుంపులుగా పక్షులెగురు తున్నాయి. దూరంగా "గొలండో ఘాట్" కనిపిస్తూంది. వుండుండి లాంచి యెద్దులా రంకె వేస్తూంది.
    "ఈయన కూడా కొమిల్లా వస్తున్నాడా?"
    "లేదు లక్షమ్ వరకూ వస్తాడు. నన్నక్కడ రైలెక్కించి తిరిగి కలకత్తా వెళ్లిపోతాడు. అంత వరకూ నాకు సాయం. తను రాకపోతే వెళ్ళలేనని..." హేళనగా నవ్వింది.
    "పోనీ మీతో తీసుకెళ్ళకూడదూ...."


Next Page 

WRITERS
PUBLICATIONS