Next Page 
శరన్మేఘం పేజి 1


                                శరన్మేఘం
                                                                 ---పొలోప్రగడ రాజ్యలక్ష్మి

                  

                                        1

    హాస్పిటల్ వార్డులోకి కిటికీల గుండా ఎర్రగా ఏటవాలుగా ప్రవహిస్తున్న సాయం కాలపు నీరెండ. పేషంటు హృదయాల్లో కొద్ది కొద్ధిగా విచ్చుకుంటూన్న ఆశామందారాల్లా వెచ్చగా హాయిగా ఉంది. మెయిన్ గేటు అప్పుడే తెరచినట్టున్నారు పేషంట్లని చూడ్డానికనివచ్చి. ఎంతసేపటినుంచో వేచియున్న స్నేహితులూ, బంధువులూ, బిలబిలమంటూ వార్డులలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళ రాకతో అప్పటివరకూ నిశ్శబ్ద గంభీరంగా ఉంటూవచ్సిన ఆ వాతావరణం అంతా కబుర్లతో ఆప్యాయమైన పలకరింపులతో నవ్వులతో కలకల్లాడుతూ ముచ్చటగా మారుతోంది.
    టి.బి వార్డులో ఉన్న అన్నిబెడ్ లూ ఇలా సందడిగా. చుట్టూ జనంతో చైతన్యవంతంగా ఉంటే. శివరాం బెడ్ మాత్రం నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉంది. లేచికూర్చుని అందరివంకా అసూయగా చూశాడు శివరాం. చూడవచ్చిన ఆత్మీయులతో వాళ్ళంతా తమతమ అనారోగ్యాల్ని మర్చి సరదాగా కబుర్లు చెబుతున్నారు. తమ ఆరోగ్యాన్ని గురించి భోగట్టాచేసి పరామర్శింఛే ఆప్తవర్గం ఇంత ఉందికదా అనే సంతృప్తితో పేషంట్ల అందరికళ్ళూ మెరుస్తున్నాయి. అంధరికీ అందరూ వచ్చారు! తనకి మాత్రం సునంద ఇంకా రాలేదు. శివరాం మనస్సు చిరాకుగా ఏదో వెలితిగా బాధగా ఉంది. కోలాహలంగా ఉన్న ఆ వాతావరణాన్ని ఇంకోమారు చూసి నిట్టూర్చి నడుం వాల్చబోయాడు శివరాం. ఇంతలో పక్క బెడ్ మీద ఉన్న పేషంటు తన వాళ్ళతో కబుర్లు చెప్పడం మధ్యలో ఆపి ఇటు తిరిగి "ఏవండీ మీ వాళ్ళు ఇంకా రాలేదా!" అంటూ పలకరించాడు శివరాంని.
    శివరాం కి ఆ పలకరింపులో ఏదో పరిహాసం ధ్వనించింది. సమాధానం ఇద్దాం అంటే బాధ వల్ల గొంతుకు అంతా నొప్పిగా అయి, శబ్దం కంఠందాటి రాలేదు. అందుకే తల అడ్డంగా ఊపి ఊరుకున్నాడు. శివరాంలో పడగ విప్పుకుంటూన్న అసంతృప్తిని అవతల వ్యక్తి గమనించినట్లు లేదు. సంభాషణ పొడిగించాడు.
    "అదేవిటి? మెయిన్ గేటు తీసి చాలాసేపయిందే! రోజూ అందరికంటే ఆవిడే ముందువచ్చే వారు!"
    శివరాం ముఖం చిట్లించి విసుగ్గా "వచ్చేది." కాని ఇవాళ ఆఫీసులో అర్జంటు పని ఏదైనా ఉందేమో అంటూ ఎర్రశాలువా గుండెలదాకా లాక్కుని అటు తిరిగి పడుకున్నాడు. "సునంద రాలేదు. రోజూ ఈ పాటికల్లా నిండా ఓవల్టిన్ కలిపిన ఫ్లాస్కు పట్టుకుని గబగబా వచ్చేది. పొద్దుటినుంచీ ఆఫీసు పనివల్ల ఏర్పడ్డ బడలిక ముఖంమీద కన్పించ నియ్యకుండా. తియ్యగా నవ్వుతూ మరీ వచ్చేది. ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అనే ఆశా. అయిదారు నెలలు అయింది ఇంకా తగ్గు ముఖం పట్టలేదేమిటి భగవంతుడా అనే భయమూ, రెండూ ఒకదాన్నొకటి వెలుగు చీకట్ల లా తరు ముతూ ఉంటే దిగులు దిగులుగా బిక్కమొహం వేసుకుని వచ్చే, నా అమాయకపు సునంద. ఇంతసేపు ఆలస్యం చెయ్యడానికి కారణం ఏమిటి చెప్మా! ఆఫీసు నాలుగు గంటలకే వదిలేస్తారే. అయిదు కావస్తోంది ఇప్పుడు. గంటసేపు ఏం చేస్తూ ఉంటుంది? ఏదైనా అర్జంటు పని పడిందేమో!......ఎంత అర్జంటు పని అయినా. నాకంటే ముఖ్యమా? నేనిలా తనకోసం ప్రతిక్షణం ఎదురుచూస్తూ నాలుగు ఎప్పుడౌతుందా. నా అందాల సునంద ముఖం, గుమ్మందగ్గర ఎప్పుడు కనిపిస్తుందా. అనుకుంటూ వేచి ఉంటానని తెలియదా? "ఆఫీసులోపని ఒత్తిడివల్ల నాకు ఎలాగా పొద్దు గడుస్తుంది కాని పాపం మీకే సెకను సెకను చొప్పున గడవాలి" అంటూ ఉంటుంది కదా తను? అటువంటిది ఎందుకిలా ఆలస్యం చేసింది!"
    "మిస్టర్! ఇటు తిరగండి. టెంపరేచర్ చూడాలి" అన్న డ్యూటీ నర్స్ పిలుపుతో శివరాం ఆలోచనలకి అడ్డుకట్ట పడింది. కప్ బోర్డు మీద ఉన్న మందుసీసా చూసి "నాలుగు గంటలకి తాగవలసిన మోతాదు తాగలేదేం?" అంది నర్స్ తలమీద హుడ్ సర్దుకుంటూ. ఒక్కక్షణం ఆగి, నోట్లో ఉన్న ధర్మామీటర్ తీస్తూ" రోజూ నా మిసెస్ వచ్చి ఆ మోతాదు ఇస్తూ ఉండేది. ఇవాళ ఇంకా రాలేదు. అందుకని...." అంటూన్న శివరాం ని చూసి చిన్నగా నవ్వి "ఆవిడ రాకపోతే ఔన్సు గ్లాసులో పోసుకుని మీరు తాక్కూడదా యేం?" అంది నర్స్. శివరాం సిగ్గుపడ్డాడు. కాని వెంటనే" ఏం, ఎందుకు రాకపోవాలి ఇంత వరకూ" అన్న ఆలోచన వచ్చి. కోపం తెచ్చుకున్నాడు ఇంకా రాని సునందమీద.

                               
    ధర్మామీటర్ లో రీడింగ్ ని చూస్తూ "ఓ డిగ్రీ పెరిగింది. ఇలా అయితే ఎలా? మీరు మా సలహాని పాటించకపోతే కష్టం" అంది నర్స్ నిష్టూరంగా.
    "ఆఁ ! టెంపరేచర్ పెరిగిందా? నేను పొద్దుటినుంచీ బెడ్ అయినా దిగలేదే మీరు! చెప్పిన ప్రకారం పూర్తి రెస్ట్ తీసుకున్నాను."
    "విశ్రాంతి ఒక్క శరీరానికి మాత్రం తీసుకుంటే చాలదు."
    శివరాం మాట్లాడలేదు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోమంటుంది ఈమె! అదెలా సాధ్యం? ఎంత ప్రయత్నించినా మనస్సు తన స్వాధీనంలో ఉడడంలేదు......ఎప్పుడూ ఏవో ఆలోచనలు.
    ఈ టి.వి. తనకింకా తగ్గదా? పెళ్ళికి ముందునుంచీ సునంద తన చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకుందీ? తనకోసం ఎన్ని రకాల భోగ భాగ్యాలు వదులుకుంది? ఎంతమంది ఆత్మీయుల్ని కాదనుకుంది? రకరకాల రంగుల కలల్ని తనచుట్టూ ఊహించుకున్న సునందకి తనవల్ల ఏం సౌఖ్యం మిగిలింది? పెళ్ళిఅయాక ఆ రెండు మూడేళ్ళూ తనతో ఏం సుఖపడిందో. ఏమో! అంతే ఆ నవ్వులూ ఆ తీపి కబురూ ఆ ముచ్చట్లూ అన్నీ కలలో లాగ మిగిలిపోయి ఇవాళ టి.వి. అనే ఈ భయంకరమైన జబ్బు తనకి ఘనీభవించిన సత్యంలాగ నిలిచిపోయింది. మృత్యువులా భయం నిత్యమూ తన మనసుకు చెదలా తినేస్తూంటే తనని దక్కించుకోవాలనే తహ తహతో మందులకి కావలసిన డబ్బుకొం. చివరికి ఉద్యోగంలో కూడా చేరి. చాకిరీ చేసి. శ్రమపడుతోంది- వట్టి వెర్రి పిల్ల! ఏం అవస్థ పడుతుందో ఏమో ఆ ఉద్యోగంలో.
    సున్నితమైన మనస్సు!
    సర్వజనాకర్ష ణీయమైన సౌందర్యం!!
    మొసళ్ళూ, తిమింగాలాలూ ఉన్న ఈ సమాజంలో ఎలా నెగ్గుకొస్తోందో ఏమో! అందమైన అమ్మాయి, అందులో అనారోగ్యమైన భర్త అనే సరికి మరీ లోకువ చేస్తుంది లోకం. తన అస్వస్థత కారణంగా మానసిక వ్యధకి తోడు. పాపం సునందకి ఈ ఉద్యోగపు బాధ ఒకటి. ఏమేం సమస్యలు ఎదురౌతున్నాయో వాటి నన్నింటినీ పాపం ఎలా ఎదుర్కొంటూందో! ఏం బాధ పడుతుందో! అభిమానవతి అయిన తన సునంద ఏం అవస్థ పడుతుందో!...... సునందా....నా సునందా.......
    "ఏవిటండి? కళ్ళవెంబడి ఆ నీళ్ళేవిటి? మీరు మానసికంగా ఏదో బాధపడుతున్నారు. పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే కాని మీకీవ్యాది నయంకాదు. తర్వాత మీ ఇష్టం" అంటూ ధర్మామీటర్ విది పేసి, ఛార్ట్ లో రీడింగు నోట్ చేసి. పిక్కల దగ్గర తెల్ల సాక్స్ ని పైకి ఓ మారు జారిపోకుండా లాక్కుని. గాలిలో మెత్తగా తేలిపోతూన్న తెల్లని మేఘంలా చప్పుడు చెయ్యని వైట్ కేన్ బాస్ బూట్లతో వార్డ్ చివారికి నడిచిపోయింది డ్యూటీ నర్స్! ఆమె వెళ్ళిన దిక్కే కొంచెంసేపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి "హుఁ!.....విశ్రాంతి.....ఇంక ఏకంగా నాకు ఒకటే విశ్రాంతి" అనుకున్నాడు శివరాం.
    "ఏవిటండీ! రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు. ఏం వుందండీ అటు? అన్న సునంద కంఠం వెనకనుంచి వినిపించేసరికి ఉలిక్కిపడి ఇటు తిరిగాడు శివరాం. పల్చగా నాజూకుగా ఉన్న పచ్చని ముఖంమీద నిలిచినా ముత్యాల లాంటి స్వేదబిందువులతో తడిసి, నుదుటి మీద చిందర వందరగా పడ్తూన్న నల్లని ముంగురూలూ ఒదులుగా వేసుకున్న జడలోంచి ఎర్రగా నవ్వుతూన్న ఒకే ఒక గులాబి పువ్వూ, మెళ్ళో మంగళసూత్రాలూ కనుబొమలమధ్య కుంకుమ బొట్టూ తప్ప వేరేమీ లేకపోయినా అవే వెయ్యి అలంకరణాలుగా వెలుగుతూన్న నిరాడంబర సౌందర్యం వీటితో సునంద శివరాం కళ్ళకి ఏదో కొత్త అందంతో కనిపించింది. అలిసి అలిసి నీరసించిపోయిన ఆ పెద్ధకళ్ళకింద నిలిచిన చిరుచెమటకూడా. ఆమెకి కొత్త అందాన్నే సమకూరుస్తోంది.
    "ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అలా చూస్తారేవిటండి" అంది కొద్దిగా సిగ్గుపడుతూ సునంద.
    "నిర్లిప్తమైన ఈ చిరునవ్వులో ఎంత మధురిమ ఉంది? అనుకున్నాడు శివరాం. బరువైన కనురెప్పలు ఎత్తి కళ్ళనిండా మమత నింపుకొని అతనికేసి చూసి అప్రయత్నంగా పైట సర్దుకుంటూ "ఓవల్టీన్ ఇవ్వనా? మందు తాగారా?" అంది సునంద.
    కళ్ళతో ఆమె అందాన్ని తాగుతూన్న శివరాం జవాబు చెప్పలేదు.
    "అబ్బ! ఒళ్ళంతా గుచ్చుకొనేలాగ ఏవిటా చూపులు?" అంది ఎవరికీ వినపడకుండా అతి నెమ్మదిగా నవ్వుతూ శివరాం దీర్ఘంగా నిట్టూర్చి "శ్రీమంతుల బిడ్డని. ఏ జమీందారుకో ఏ పెద్ద ఆఫీసరుకో శ్రీమతివై, హాయిగా సుఖపడడానికి బదులు, నన్ను చేసుకుని ఏం అవస్థలు పడుతున్నావు సునందా?" అన్నాడు బాధగా.
    "మిమ్మల్ని ఆ మాటే అనొద్దన్నాను. నాకు అవస్థ ఏమిటి? నాలుగు రోజుల్లో మీకు నెమ్మదిస్తుంది. మనం మళ్ళీ హాయిగా ఆనందంగా ఉంటాం" అంటూ కప్ బోర్డు మీద ఉన్న మందు సీసా చూసి" ఏవిటి? సాయంత్రం మోతాదు తాగలేదా?" అంది సునంద.


Next Page 

WRITERS
PUBLICATIONS