గూడు చేరిన పక్షులు
యర్రం చంద్ర శేఖరం


శశిరేఖ:
ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది- కారణం ?-- ఒకటి......ప్రసాదు దగ్గరి నుండి వచ్చిన ఉత్తరం -- రెండు..రక్షణ నిధి సేకేరణ కై మేము ప్రదర్శించిన నాటిక .....అంచనాలను మించి నిధి సేకరణ ....హో .....నిజంగా నేడెంతో సుదినం .
నాటిక ప్రదర్శనాంతరం నా క్లాసు మేట్సు పొగడ్తలు ....యువకులు నన్నభినందించేందుకు పడిన తాపత్రయం ...ఆ క్షణంలో ఏదో తెలియని ఆవేశం ... ఆనందం.... ఎంతో కష్టం మీద అందరినీ తప్పించుకొని బయటపడ్డాను..ఒక గంట తర్వాత, కారులో కూర్చొని బరువుగా శ్వాస పీల్చాను.
కారును ట్యాంకు బందు మీదుగా యింటి వైపు మళ్ళించమని డ్రైవరు కు చెప్పాను. అంతే ...ఇంటికి చేరాక నాన్నగారు తట్టి లేపెంతవరకు నేను ఈ లోకంలో లేను. నాన్నగారు.......అవును. అమ్మ గుర్తు తెలియదు. ఎంత ఆప్యాయత? ఎంత ఆదరణ ; నాకోసం రాత్రి ఒంటి గంట వరకు కాచుకుని ఉన్నారు కారులో నిద్రపోతున్న నన్ను తట్టి లేపారు.
"అమ్మాయి గారూ! కాఫీ .....'
".................."
"అమ్మాయి గారూ!"
"...................."
"లేవండమ్మాయి గారూ! చూడండి ఎంత పోద్దుపోయిందో?'
నా ఆలోచనలకు అంతరాయం కలిగింది.' మెల్లిగా దుప్పటి తొలగించి చూశాను. సీతమ్మ -- చిరునవ్వుతో -- ట్రేలో -- కాఫీ కప్పుతో.
"ఇంత పొద్దెక్కింది కదమ్మా..........! ఇంకా నిద్దురోతున్నా రెంటి?"
"మెళుకువ వచ్చి అరగంటైంది సీతమ్మా ....! లేవబుద్ది వేయడం లేదు. ఒళ్ళంతా బద్దకంగా ఉంది.'
మెల్లిగా లేచి వాష్ బేసిన్ వైపుకు అడుగులు వేశాను. 'పిచ్చిపిల్ల ' అన్న మాటలు చెవిన పడ్డాయి. సీతమ్మ క్రిందకు దిగి వెళ్ళిపోవడం కనుపించింది.
కాఫీ త్రాగి దుసులు మార్చుకొని నేనూ క్రిందికి వెళ్ళాను. నాన్నగారు ఎవరో స్నేహితులతో మాట్లాడుతున్నారు.
నన్ను చూడగానే 'రామ్మా.......! యిలా కూర్చో' సోఫా చూపించారు.'
నాన్నగారి స్నేహితులు ప్రదర్శించిన నాటికను నా నటనను మెచ్చుకోవడం ..... నేను థాంక్స్ చెప్పగానే శలవు తీసుకుని వెళ్ళడం జరిగింది.
"చాలా సేపైందమ్మా వారొచ్చి.....! అందుకే సీతమ్మను పంపి నిన్ను లేపమన్నాను నీకేమైనా యిబ్బంది కలిగిందా?"
'లేదు నాన్నగారూ .......! ఇప్పటికే చాలా ఆలస్యంగా లేచాను.'
టేబులు పైఉన్న డక్కన్ క్రానికలు తీసి చదవ నారంభించాను. అన్నీ యుద్ద వార్తలే. పూర్తిగా చదివి బల్ల పై ఉంచేశాను.
"నీళ్ళు తోడాను. స్నానానికి రండమ్మాయి గారూ!'
సీతమ్మ పిలుపుతో బాతురూము వైపు నడిచాను. స్నానం ముగించి నాన్నగారితో ఫలహారానికి కూర్చున్నాను.
"ఏమమ్మా! అలా మౌనంగా ఉన్నావెం? నీలో యిదివరకటి చురుకుదనం కనుపించడం లేదు. కారణం......ప్రసాదు లేకపోవడమా? పిచ్చి తల్లి -- త్వరలోనే తిరిగి వస్తాడమ్మా! ఎందుకంత బెంగ?'
"అదేం లేదు నాన్నారూ....నాకు బెంగే మిటి?"
చిరునవ్వుతో తప్పుకో చూశాను.
"పెదబాబుగారూ! చిన్న బాబుగారు యుద్ద ప్రాంతాలకు పోయిన దగ్గర నుండి అమ్మాయి గారు యిలా అయ్యారండి. ఆ చిలిపితనం ....హుషారు మచ్చుకైనా లేవు."
మంచినీళ్ళు గ్లాసుల్లో నింపుతూ అంది సీతమ్మ--
'అంతా ఉత్తదే నాన్నారూ .........! అదేమీ కాదు.'
'అతని విషయంలో ఎందుకమ్మా అంత బెంగ? కులాసాగా ఉన్నాడు కదా!"
"................"
సిగ్గుపడుతూ లేచి నా గది వైపు నడిచాను --
'అమ్మాయి గారికి, చినబాబు గారికి ఆ మూడు ముళ్ళూ వేయించండి బాబూ! ఆ తర్వాత నేనేమైనా ఫరవాలేదు.
'అలాగే సీతమ్మా........! ప్రసాదు తిరిగి రాగానే ఆ పని కాస్తా పూర్తీ చేస్తాను.'
పై మాటలు విన్న నా హృదయం కలవరపడింది సంతోషంతో -- సీతమ్మ ఎవరో......? నా చిన్న తనంలో నాన్నగారు ఆమెను చూపిస్తూ 'మనింట్లో నే ఉంటుంది తల్లీ -- నీకు తోడుగా ' అన్నారు. ఎవరు? ఏమిటి? అని ప్రశ్నించలేదు నేను. ఫలానా అని చెప్పలేదు నాన్నగారు. సీతమ్మ సార్ధక నామదేయురాలు. నాపై ప్రసాదు పై ఎంత ప్రేమ? ఎంత ఆదరణ? ఇద్దరమూ మా తల్లులు లేని లోటును మరిచిపోయాము. అందరూ ఆమెను గౌరవిస్తారు. ఆమె అందరినీ ప్రేమతో చూస్తుంది.
ప్రసాదు ఫై గల తీయని తలపులతో ఆరోజంతా మధురంగా గడిచిపోయింది. స్నేహితురాళ్ళ బలవంతం వల్ల సినిమాకు బయలుదేరాను. సినిమాకు రానని ఎంతగానో మొండి కేత్తాను. ఎంత ప్రయత్నించినా తప్పుకోలేకపోయాను. బలవంతం చేశారు. దెప్పారు. తప్పేది లేక చివరకు బయలుదేరాను.
న్యూస్ రీలు ప్రారంభించారు --
నాకు సినిమా చూడడానికీ మనస్కరించడం లేదు. నా మనసు పరిపరి విధాల పరిభ్రమిస్తూ వేగంగా గతంలోకి దారి తీసింది.
ఒకరోజు నేను మొదటిసారిగా ప్రసాదుతో సినిమాకు వచ్చాను. నేను మొదటి సంవత్సరం ప్రసాదు మూడవ సంవత్సరం మెడిసిన్ లో ఉన్నాం.
'ప్రసాద్! సినిమాకు వెడదాం; త్వరగా తెములు.' రక్తప్రసరణ మండలాన్ని తదేకంగా గీస్తున్న ప్రసాద్ కళ్ళలోకి ఆశగా చూస్తూ చనువుతో అజ్ఞాపించాను.
"లేదండమ్మాయి గారూ ! మీరు వెళ్లి రండి. రేపటి నా కాలేజీ స్టడీస్ చాలా మిగిలి ఉన్నాయి.' నా వంక చూడకుండానే సమాధానం చెప్పాడు ప్రసాదు.
'అదేమీ కుదరదు. నీ ఈ స్టడీస్ రోజూ వుండేవే, ఈరోజు నా కోరిక తప్పకుండా తీర్చాలి. తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు-- ఏమంటావ్?'
'అమ్మాయి గారూ! నన్ను క్షమించాలి .....ఈరోజు రాలేను.' తన పనిలో నిమగ్నమౌతూ అన్నాడు ప్రసాదు. సినిమా టైం దాటిపోయింది. నే తలచిన పని జరగనందుకు కోపంతో పిచ్చి దాన్నయ్యాను.
'మిస్టర్ ప్రసాద్! మీరు నన్ను ఫూల్ ని చేశారు. నా కళ్ళు తెరిపించారు కూడా ...శలవ్!' కోపంగా చూస్తూ పౌరుషంగా మాట్లాడి, నా గది వైపు వేగంగా నడిచాను.
'చిన బాబూ! అమ్మాయి గారి మనసు నొప్పించావు ' సరళంగా ప్రసాదును మందలిస్తూ ఉన్న సీతమ్మ స్వరం వినిపించింది నాకు.
అంతే! రెండు రోజులు నేను ప్రసాద్ తో మాట్లాడలేదు. అతను కనిపించినప్పుడల్లా ముఖం త్రిప్పేసుకొనేదాన్ని. అలా చేయడానికి ఎంతగానో నటించవలసి వచ్చేది. అయినా మొండి కేత్తాను.
ప్రసాదు ఎంతగానో బ్రతిమిలాడాడు. నేను మాత్రం నా పట్టు సడలించలేదు. ఒక శుక్రవారం రోజు జరిగిన సంఘటన కళ్లకు కట్టునట్లు కనుపించసాగింది . తలంటు కొని జుట్టు అరబెట్టు కుంటున్నాను సోఫాలో కూర్చుని . అడుగుల సవ్వడి వినిపించి వెనుదిరిగి చూశాను. ప్రసాద్ ఎంతో వినయంగా వచ్చి నా ముందు నిలబడ్డాడు. ఆ రోజు కాలేజి శలవు ....కారణం ...ఏదో క్రైస్తవుల పండుగ.
'అమ్మాయిగారూ! మీరు నాతొ మాట్లాడడం లేదు. నేనది భరించలేను. నన్ను మన్నించండి."
నావైపు తదేకంగా చూస్తూ వినయ విధేయతలు ఉట్టిపడుతూ ఉండగా పై మాటలన్నాడు ప్రసాదు. నేను నా ముఖం ప్రక్కకు త్రిప్పుకొని నా మామూలు మౌనం కొనసాగించాను.
"మీరు మాట్లాడడం లేదు...నా అపరాధాన్ని మన్నించ లేరా?'
"..............."
"దయచేసి మాట్లాడండి.....నా నేరానికీనాడు తగిన శిక్ష విధించండి.'
'...............'
'నిజమే...! మీరు నాతొ మాట్లాడడానికి అభిమాన పడుతున్నారు. నేను అంతటి అదృష్టానికి నోచుకోలేదు. మీరు మాట్లాడని ఈ రెండు రోజులు రెండు యుగాలయ్యాయి నాకు. నేను దురదృష్ట వంతుడను."
