Next Page 
జీవన సంగీతం పేజి 1


                                  జీవన సంగీతం
                                                                      ---సూగూరి శాంతాదేవి

                        


    "గోకుల్! గోకుల్!"
    మధ్యాహ్న భోజనంతరం సన్నగా ఓ కునుకు తీసి కళ్ళువిప్పిన కల్యాణ్ కు ఎదురుగా స్టాండ్ తొట్టెలో బాబు కనిపించలేదు; పిలిచాడు. తన పిలుపు విన్నంతలోనే సంతోషసూచకంగా ఏవో అస్పష్టమైన మూగధ్వనులు వెలువరిస్తూ, కాళ్ళ నున్న గజ్జలుఘల్లు ఘల్లు మంటూండగా దోగాడుతూ పరుగున వచ్చే గోకుల్ వస్తూన్న అలికిడి వినరాలేదు.
    "గోకుల్ ఏడీ, అక్కా? అప్పుడే నిద్రలేచాడా?"
    తమ్ముడి పిలుపు విని బాగా పనిలో మునిగి ఉన్న కృష్ణప్రియ లోపలినుంచే సమాధానం ఇచ్చింది: "ఆఁ లేచాడు. పాలుపట్టి ఆటబొమ్మలు ముందు పడేసి వచ్చాను. హాల్లో ఆడుకుంటూ ఉండాలి."
    కల్యాణ్ మంచం దిగి హాలులోకి వచ్చాడు. ఆట బొమ్మలు చిందరవందరగా పడిఉన్నాయి. గోకుల్ లేడు. కంగారుగా వరండాలోకి వెళ్ళాడు. వరండామెట్ల కింద మందారవృక్షం దగ్గిర చిరు చినుకులకింద మట్టిలో ఆడుకొంటూ కనిపించాడు గోకుల్.
    వేసవి ఎండలకు బీటలువారిన గుండెలతో వరుణ దేవుని పొందుకోసం పరితపిస్తూన్న ధరణీమాత ప్రియుని స్పర్శకు పులకలెత్తుతున్నది. ఆ చల్లని వేళ అతి మనోఘ్నంగా ఉంది ప్రకృతి. ఆనకంలో వర్షజలదాలు పరిగెత్తుతూ ఉన్నాయి, పక్షులు కలకలా రావాలు చేస్తూ పిల్ల గాలులలో పల్టీలు కొడుతున్నాయి. చిరుచినుకులలో కొద్ది కొద్దిగా తడుస్తూ హాయిగా తలలు ఊగిస్తున్నాయి పూలమొక్కలు.
    గేటులోంచి ఇంటికేసి వస్తూన్న ఒక యువతిపై దృష్టి విగిడ్చిన గోకుల్ "గోకుల్" అన్న పిలుపుతో అటు తిరిగాడు. కళ్యాణ్ ను చూస్తూనే మంచులో తడిసిన తెలి మల్లెపువ్వులా బోసినవ్వు ఒకటి నవ్వాడు. ఎత్తుకో అన్నట్లు రెండుచేతులూ పైకెత్తాడు, కేరింతాలు కొడుతూ.
    గోకుల్ ను సమీపించిన ఆ యువతి, ఆప్యాయంగా చేతులు చాచింది. మరుక్షణంలోనే నిస్సహాయంగా కిందికి వాలిపోయింది ఆమె బాహుద్వయం. ప్రేమ పొంగిన హృదయం ముడుచుకుపోయింది.
    ఆమెకంటే ముందే గోకుల్ ను ఎత్తుకొన్న కళ్యాణ్, "ఓ రూపాదేవీ! రండి" అంటూ ఇంట్లోకి దారి తీశాడు.
    చిన్నబోయిన ముఖంతో అతణ్ణి అనుసరించింది ఆమె. వరండా గోడకు ఉన్న 'డాక్టర్ కల్యాణచక్రవర్తి, ఎమ్. బి. బి. ఎస్.' అన్న బోర్డు నిర్లిప్తంగా చూస్తూ హాలులో ప్రవేశించింది.
    "కూర్చోండి."
    ఆమెను సోఫాలో కూర్చోజేసి, లోపలికి వినిపించేలా పెద్దగొంతుకతో అన్నాడు కల్యాణ్ : "గోకుల్ అపర కృష్ణావతారం దాల్చాడు అక్కా, ఒళ్లంతా మట్టి, నోట్లో ఇంత మట్టీ, వరండా మెట్లకింద ఆడుకొంటున్నాడు, వర్షంలో తడుస్తూ."
    బాబు నోట్లో ఉన్న మట్టిబెడ్డ వేలితో మట్టి కొట్టుకొన్న బాబు మలిన వదనాన్ని ముద్దు లతో నింపాడు.
    తడిచేతులు తుడుచుకొంటూ వచ్చింది కృష్ణప్రియ.
    "అంత ఎత్తు గడప ఎల్లా దాటాడు? వరండా మెట్లు సురక్షితంగా ఎల్లా దిగాడో!" అంటూ కళ్యాణ్ చేతులనుండి పిల్లవాణ్ణి తీసుకుంది.
    "ఎల్లా వెళ్తావు నాన్నా, అవతలికి? మెట్లు దిగబోయి దొర్లితే నెత్తి పగిలేకదా? కాళ్ళు వచ్చాయిరా రానీకు. పట్టేది నాకు కష్టమైపోయింది" అంది బాబు బుగ్గమీద గట్టిగా ముద్దు, పెట్టుకొంటూ.
    "మరే! పారే ప్రవాహాన్ని, పారాడే పాపల్నీ పట్టడం కష్టం." నవ్వింది రూప, బాబు ముఖంమీద వాత్సల్య దృష్టి ప్రసరింపజేస్తూ.
    రూపకు కృష్ణప్రియను పరిచయం కావించాడు కల్యాణ్! "ఏమే నా ఏకైక సోదరి, కృష్ణ ప్రియ. ఏదో సరదాగా బి.ఎ. పాసయింది."
    పరిశీలనగా కృష్ణప్రియమీదికి ప్రసరించాయి రూప చూపులు. ముఫ్ఫయి ఏళ్ళు నిండీ నిండని వయస్సు. చామనచాయ కలిగిన ఆ ముఖంలో నిర్వేదగంభీరచ్చాయలేవో అలౌకిక సౌందర్యాన్ని వెదజల్లు తున్నాయి. 'ఆ నొసటికుంకుమ చెదిరి ఎన్నాళ్ళయిందో?' రూపచూపులు జాలిగా, సానుభూతిగా మార్పుచెందాయి.
    "ఈమె కుమారి రూపాదేవి. ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వారం రోజుల క్రితం జ్వరంతో స్పృహ కోల్పోయి ఉన్న ఈమెను స్నేహితులెవరో హాస్పిటల్ కు తీసుకువచ్చారు. నిన్ననే డిస్ ఛార్జి అయింది."
    "చిన్న సవరణ." చిరునవ్వుతో అంది రూప. "-దేవి కాదు. రూపవతి."
    స్మితవదనంతో అందుకుంది కృష్ణ ప్రియ. "రూపాదేవిలో ఉండే నాజూకు, హుందాతనం రూపవతిలో కనిపించడం లేదు నాకు. రూపాదేవి సంబోధనే బాగుంటుంది మీకు."
    రూపా, కల్యాణ్ నవ్వేశారు.
    "ఇప్పుడే వస్తాను. కూర్చోండి." కల్యాణ్ లోపలికి వెళ్ళిపోయాడు ముఖం కడుక్కుందుకు.
    బాబును తీసుకొని కృష్ణ ప్రియకూడా లోనికేగింది.
    విశాలంగా ఉన్న ఆ హాలులో రూపవతి ఒక్కతే కూర్చుంది. నాలుగు సోఫాలమధ్య ఒక టేబిల్. తెల్లగా, నున్నగా ఉన్న గది గోడలకు తగిలించి ఉన్న రెండు మూడు చిత్రపటాలూ ఆ ఇంటివారి కళాభిరుచి తెలియజేస్తున్నాయి.
    తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ వచ్చాడు కళ్యాణ్. "ఏమిటి? ఎల్లా ఉంది ఒంట్లో? డ్యూటీలో జాయిన్ అయ్యారా ఇవ్వాళ?" చిరునవ్వుతో ప్రశ్నించాడు.
    "ఉహుఁ. సెలవు ఇవాళవరకూ ఉంది. రేపు ఆదివారం. ఎల్లుండి వెళతాను......ఒంట్లో విపరీత మైన నీరసంగా ఉంది, డాక్టరుగారూ. గుండెలో ఏమిటో దడ."
    కళ్యాణ్ కళ్ళజోడు అద్దాలు తుడిచి కళ్ళకు పెట్టుకోని రూపచెయ్యి చేతిలోకి తీసుకొన్నాడు. నాడి పరీక్షించి వదిలిపెడుతూ, "జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నే వ్రాసి ఇచ్చిన టానిక్కూ, టాబ్లెట్సూ వాడండి. ఫర్వాలేదు. బలం చేకూరుతుంది" అన్నాడు.
    బాబుకు స్నానం చేయించి పౌడరు అద్ది ఇస్తీ చొక్కా, లాగూ తొడిగించి తీసుకువచ్చింది కృష్ణ ప్రియ. "కాస్సేపు నాన్న ఒళ్ళో కూర్చో, వంటింట్లో నా పని సాగనివ్వవు" అంటూ బాబును కళ్యాణ్ ఒళ్ళో కూర్చోబెట్టీ వెళ్ళింది.
    రూప హాండ్ బాగ్ లోనించి పాతిక రూపాయలు తీసి కళ్యాణ్ కు ఇవ్వబోయింది.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్.
    "శ్రద్దగా, వైద్యం చేసి నాకు ఆరోగ్యం ప్రసాదించారు. ఏదో ..."
    "అది నా విధ్యుక్తధర్మం. హాస్పిటల్ కు వచ్చే ఏ పేషెంటు మీదైనా అంతే శ్రద్ధ చూపిస్తాను. అందుకు ప్రతిఫలంగా నెలనెలా ప్రభుత్వం నుండి గౌరవప్రదమైన వేతనం పొందుతూనే ఉన్నాను. అవినీతి మార్గంలో సంపాదించే హీనదశ నేనింకా పొందలేదు." సూటిగా, ఖండితంగా చెప్పాడు కళ్యాణ్. "మీవంటి విద్యాధికులే ఇటువంటి అవినీతికరమైన పనులకు ప్రోత్సాహం ఇస్తూంటే, ఇక ఏమిటీ మన ప్రగతి గతి?" చిరునవ్వుతోనే వాడిబాణం వదిలాడు.
    సిగ్గుపడింది రూప. "క్షమించండి. అందరు డాక్టర్లలాగే అనుకొన్నాను. ఇస్తే ఇది లంచమే అవుతుందనుకోండి. కాని, తీసుకొనేవాళ్ళు ఏదో కానుక కింద లెక్కకట్టేస్తారు కదా!" డబ్బు బాగ్ లో పెట్టేను కుంది.
    బయట వర్షం జోరుగా కురుస్తూంది. తోడుగా గాలి తీవ్రత కూడా హెచ్చింది.
    రూప ఇంకా కొంచెంసేపు కూర్చోక తప్పలేదు, వచ్చినపని పూర్తి అంటూ. చనువుగా కళ్యాణ్ ఒళ్ళో నుండి బాబును ఎత్తుకొని ఆడిస్తూ "బాబు పేరేమిటి?" అంది,
    "గోపాలకృష్ణ."
    "బాబుకు కొత్తాపాతా ఏమీ లేనట్లుంది?" బాబు పిడికిట్లో చిక్కిన ముంగురులు విడిపించుకోలేక సతమతమవుతూంది రూప.
    "ఎత్తుకోనివాళ్ళే పాపాత్ములు." కాఫీ ట్రేతో ప్రవేశించిన కృష్ణప్రియ జవాబు ఇచ్చింది. కళ్యాణ్ కూ, రూపకూ కాఫీ అందించి బాబును ఎత్తుకొని సోఫాలో కూర్చుంది.
    కాఫీ తాగి, కృష్ణప్రియ ఇచ్చిన వక్కపొడి వేసుకొని, తిరిగి బాబును ఎత్తుకొంది రూప. గోకుల్ ది చక్కటి ఆరోగ్యవంతమైన ఒళ్ళు. తెల్లని ఆ ముఖంపై నల్లని ఆ కళ్ళు పసి అమాయకత ఒకలబోస్తున్నాయి. ఒత్తుగా, నల్లగా ఉన్న ఉంగరాలజుట్టు ముఖంమీద పడుతున్నది.    
    ఈ తడవ రూప పమిటతో సయ్యాట మొదలుపెట్టాడు గోకుల్. రూప వదనంలో మధురమైన లజ్జాభావమేదో క్షణకాలం కదిలి మాయమైంది.
    పరధ్యానంగా గోఖుల్ చిలిపిఆట చూస్తున్నాడు కళ్యాణ్.
    ముచ్చటపడి చూస్తూంది కృష్ణప్రియ, బాబు పిడికిటినుండి తన పయిట విడిపించుకోలేక రూప పడుతూన్న మధురమైన వేదనావస్థ అంతా.
    "వదులు, బాబూ కొంగు వదులు. సార్ధక నమధేయుడిని, గోకులాష్టమి చేరువ అవుతున్నది. నీకు చేరెడు వెన్నముద్ద పెడతాలే. వదులు."
    రూప మాటలకు పకాలుమంది కృష్ణప్రియ.
    పిడికిలి సడిలించి రూప మెడలో ఉన్న బంగారు గొలుసుతో నెమ్మదిగా ఆడుకోసాగాడు గోకుల్.
    "మరి, బాబు తల్లిని పరిచయం చెయ్యలేదు?" చనువుగా రూప వేసిన నిష్ఠూరానికి షాక్ తిన్నట్లు వెలవెలబోయాడు కళ్యాణ్. కృష్ణప్రియ వదనం విషాద మేఘాచ్చాదితమయింది.
    ఎవరినుండి సమాధానం రాక సందేహాస్పద హృదయంతోటే, "బాబుతల్లి..." అంటూ ఆగిపోయింది రూప.
    "డాక్టరుకు ఇంకా వివాహం కాలేదు." మెల్లగా జవాబిచ్చింది కృష్ణప్రియ.
    రూప ఆశ్చర్యానికి అవధులు లేవు. "మరి బాబు ..." అర్దోక్తిలో ఆపింది.
    "ముత్యపు చిప్పలో పడిన స్వాతి వానచినుకు."
    "అంటే?" చిత్రంగా చూసింది కృష్ణప్రియ వంక.
    "ఏ తల్లి కన్నదో, ఎందుకు వదిలివేసిందో - అదృష్టానికో, దురదృష్టానికో కళ్యాణ్ చేతిలో పడ్డాడు బాబు. బాబుకు మాతాపితరుల ప్రేమాను రాగాలకు మొహం వాచిపోయే గతి పట్టలేదు. కల్యాణే అతడికి తల్లీ, తండ్రీ, పువ్వులా పెరుగుతున్నా డిక్కడ బాబు."
    "డాక్టరుకు ఏవిధంగా లభ్యమయ్యాడు బాబు?" కుతూహలం అణుచుకోలేకపోయింది రూప.
    "అదంతా ఓ కథ, ప్రస్తుతం పైకి తవ్వడం దేనికి? సాధ్యమైనంతవరకు మరిచిపోవడమే బాబు భవిష్యత్తుకు మంచిది."
    బయట వర్షం వెలిసింది.
    రూప బాబును గాఢంగా చుంబించి కృష్ణప్రియకు అందిస్తూ, "వస్తానండీ" అంది కల్యాణి వంక తిరిగి "వస్తాను, డాక్టరుగారూ సెలవు" అంది.
    ఇంకా పరధ్యాన ప్రపంచంలోనే ఉన్న కళ్యాణ్ మౌనంగా తల ఊపాడు.
    రూప వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలవరకూ ఆ గదిలో ఆవరించిన విషాదపు తెరలు వీడిపోలేదు.
    "పాపం. ఎవరూ లేరా ఆమెకు, కృష్ణా? ఎవరో హాస్పిటల్లో చేర్చారన్నావు?"
    కృష్ణప్రియ మాటలతో పరధ్యానంనుండి తేరుకొన్నాడు కళ్యాణ్.
    "ఉన్నారు. నేనూ మొదట్లో అలాగే అనుకొన్నాను, ఎవరూ లేరేమోనని. ఆమెను హాస్పిటల్లో చేర్చిన రెండురోజులకు ఆమె తల్లీ, తండ్రీ, అన్నగారూ వచ్చారు - ఈ కబుర్లు అందడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. తల్లిదండ్రులకు అపురూపపు బిడ్డ. అన్నగారికి గారాల చెల్లెలు ఆ తల్లిది ఒకటే గోడు. మొన్న నాతో ఒకటే చెప్పుకొని ఏడవడం. అన్నగారితో కలిసి చదువుకొంటానంటే ఎమ్. ఎ. వరకు చదువు చెప్పించారట. చదువు పూర్తి అయింది కదా, పెళ్ళి చేసుకొని ఒక ఇంటిదానివి కమ్మంటే ససేమిరా పెళ్ళి వద్దు అంటుందిట. వాళ్ళు ఆ పల్లెటూళ్ళో, తను ఈ పట్నంలో 'ఏది వచ్చినా ఎవరు చూస్తారు, డాక్టరు గారూ?' అంటుంది ఆ తల్లి."
    'అలాగా పాపం!"
    కృష్ణప్రియ లోనికి వెళ్ళిపోయింది.
    వర్షం వెలిసినా ఇంకా మబ్బులు వీడని ఆకాశంలోకి చూస్తూ వరండాలో నిల్చున్నాడు కళ్యాణ్. అతడి మనః ఫలకంపై ఇంకా ఆ దృశ్యమే కదలాడుతూంది. 'బాబు సహజమైన తల్లి పెంపకంనుండి వంచితుడు కాలేదా? తల్లి ఒడిలో ఆమె మాంగల్యంతో, పైటతో సయ్యాటలాడుతూ ఆమె స్తన్యం గ్రోలుతూ పొందే నిర్మలానుభూతి తన కృత్రిమమైన పోషణలో పొందగలుగుతున్నాడా? తన ప్రేమానురాగాలు ఎంతవరకు ఆ లోటు తీరుస్తున్నాయి?' కళ్యాణ్ మనస్సంతా కలత పడింది. గోకుల్ ఓ చేత ఆటబొమ్మ పట్టుకొని గడప రాలటం కూడా అతను గమనించలేదు. బొమ్మ వదలకుండానే కళ్యాణ్ కాళ్ళకు చుట్టుకొన్నాడు గోకుల్. గోకుల్ ను రెండు చేతులతోను పైకి ఎగరవేసి పట్టుకొన్నాడు కళ్యాణ్. ఆగకుండా నవ్వుతున్నాడు గోకుల్. మాయామర్మం ఎరగని మల్లెవంటి నవ్వు! గోకుల్ ను ఆడిస్తున్నా, ఏవో ముద్దుమాటలతో నవ్విస్తున్నా కళ్యాణ్ మనస్సు మరోవైపు పరుగు తీస్తూంది. మాతృదేవివల్ల పరిత్యజింపబడిన గోకుల్ ఎంతవరకు నా దగ్గిర న్యాయాన్ని పొందగలడు?' అతడికి తెలియకుండానే అతడి నేత్రాలు ఆర్ద్రములైనాయి. రెండు వేడి కన్నీటి బిందువులు రాలి బాబు జుట్టులో పడ్డాయి. కరుణ గద్గదకంఠంతో "గోకుల్" అంటూ ఉద్విగ్న హృదయంతో బాబును వక్షానికి అదుముకొన్నాడు కళ్యాణ్.

                                         2

    హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గోకుల్ ప్రశాంతంగా స్టాండ్ తొట్టెలో నిదురిస్తున్నాడు. కళ్యాణ్ డ్రెస్ మార్చుకొంటూ మార్చుకొంటూనే తొట్టెదగ్గరికి వచ్చాడు. గోకుల్ ను తదేకంగా చూస్తూ నిల్చుండిపోయాడు తన్ను తాను మరిచి!
    'ఏమిటి, ఇంత ఆపేక్ష గోకుల్ పై! గోకుల్ ను విడిచి ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను. బయటికి వెళ్ళితే మనస్సంతా గోకుల్ మీదే. పది నెలలు నిండీ నిండని ఈ పసివాడు నా హృదయాన్ని పూర్తిగా బంధించి వేశాడు!' నిద్రలో ఉన్న గోకుల్ ఎంతో ముద్దు వస్తున్నాడు. కళ్యాణ్ తొట్టెపైకి వంగి గోకుల్ ను ముద్దు పెట్టుకొని సగం విడిచిన షర్టు విడిచి హేంగర్ కు తగిలించి టేబుల్ దగ్గరికి వచ్చాడు, అతడి హృదయానికి అత్యంత సన్నిహితమైన, ప్రీతిపాత్రమైన వస్తువు ఉండవలిసిన చోట లేదు. ఆశ్చర్యపోయాడు కల్యాణ్.


Next Page 

WRITERS
PUBLICATIONS