Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 1


                                      ఏటి ఒడ్డున నీటిపూలు
                             సీరియల్

                                                ---కొలిపాక రమామణి

                
    

    "మేం పూలు తీసుకుని ఓ గంటలో వస్తాం" అంటూ పెళ్ళి ఇంటిలోంచి బయట పడ్డారు చారుమతీ, శ్రీదేవీ. వాళ్ళ స్నేహితురాలు పద్మ పెళ్ళి ఉదయమే అయింది.
    "తొందరగా రండి. చీకటి పడగానే బంతులాట వేడుకలు ఉంటాయి. వెనకనించి పద్మ తల్లి వరలక్ష్మిగారి గొంతు వినిపించింది.
    చారుమతీ, శ్రీదేవీ రిక్షా కట్టించుకుని మసీదు వీథికి వచ్చారు. మసీదుకు ఎదురుగా ఉన్న అంగట్లో మల్లెమొగ్గలు, జాజులు, గులాబీలు, సంపెంగలు గుట్టలుగా పోసిఉన్నాయి.
    "ఏం పూలు తీసుకుందాం?" శ్రీదేవీ పూలవంక చూస్తూ అడిగింది.
    "పద్మావాళ్ళ నాన్నగారు సర్పవరంనించి మల్లెలు, కనకాంబరాలు, గులాబీలు తెచ్చారుగా. మనం సంపెంగలు తీసుకుందాం" అంది చారుమతి.
    రెండురూపాయలు పెట్టి కొమ్మసంపెంగలు కొని పొట్లం కట్టించారు. అప్పటికే చీకటి పడుతూంది. గబగబా నడుస్తూన్న చారుమతిని ఆపింది శ్రీదేవి.
    "ముందు మనం రాములవారి ఆలయంలోకి వెళ్ళి పద్మకోసం భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం, రా" అంది.
    అక్కడికి కొంచెం దూరంలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళారు ఇద్దరూ. అప్పుడే పూజారి ఆలయం తలుపులు తీసి సీతారాముల విగ్రహాలకు పూలమాలలు అలంకరిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లల్ని చూడగానే పూజారి పళ్ళెం తీసుకువచ్చాడు. చారుమతి తన చేతిలో ఉన్న సంపెంగపూల పొట్లం విప్పి, సగం పూలు పళ్ళెంలో ఉంచింది. పూజారి నిర్లక్ష్యంగా వెళ్ళి ఏవో మంత్రాలు అస్పష్టంగా గొణుగుతూ పూలు విగ్రహాల పాదాలముందు విసిరేశాడు. పళ్ళు, కొబ్బరికాయ దొరకలేదని అతని చింత.
    చారుమతి బాధపడింది. "చూశావా, అంత మంచిపువ్వులు నిర్లక్ష్యంగా ఎలా విసిరేశాడో! చక్కగా విగ్రహాలకి అలంకరించకూడదా?" అంది శ్రీదేవి వైపు తిరిగి.
    "మనం మాల కట్టి ఇస్తే మెడలో వేసేవాడేనేమో పూజారి. మనదే తప్పు" అంది శ్రీదేవి కళ్ళు మూసుకుని భగవంతుడికి నమస్కరిస్తూ.
    "పద్మకి మంచి భర్తని ఇయ్యి. వాళ్లిద్దరు చిలకాగోరింకల్లా, పిల్లాపాపలతో సుఖంగా కలకాలం బ్రతికేటట్లు చెయ్యి పద్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి." చారుమతి కూడా భగవంతుణ్ణి మనఃస్ఫూర్తిగా ప్రార్ధించి కళ్ళు తెరిచింది.
    స్నేహితురాళ్లిద్దరు రామారావుపేటలో ఉన్న పెళ్ళివారి ఇల్లు చేరేసరికి లోపల పందిట్లో సన్నాయి వినిపిస్తూంది. ఆడవాళ్ళంతా చక్కగా అలంకరించుకుని పట్టుచీరలు గరగరమంటూ ఉంటే హడావిడిగా తిరుగుతున్నారు. అందరి తలలలోను మల్లెలు, గులాబీలు గుబాళిస్తున్నాయి. పందిరిమధ్య తివాసి పరిచారు. అక్కడే అగరువత్తులు, పన్నీరుబుడ్డి, గంధము, పూలదండలు, తమలపాకులు, పళ్ళు పళ్ళాలలో అమరుస్తున్నారు ముత్తైదువులు.
    "అమ్మయ్య! వచ్చారా!" అంది పద్మ, స్నేహితురాళ్ళిద్ధరినీ చూసి సంతోషంగా.
    పద్మని లోపల గదిలో కూర్చోబెట్టారు. చుట్టూ అత్తగారూ, వారివైపువారూ కూర్చున్నారు.
    'ఎంత అందంగా ఉంది పద్మ!' అనుకుంది చారుమతి, పద్మని ఆశ్చర్యంగా చూస్తూ. మల్లెపువ్వుల జడ కుట్టారు. అప్పుడే విచ్చుకుంటున్న ఎర్రగులాబీ మొగ్గల దండ గుచ్చి జడపైన మాల అమర్చారు. లేతనీలం పట్టుచీర కట్టారు. మెడలో తెల్లటి పొడవైన మల్లెపూల దండ వేశారు. అసలే పెద్దవైన పద్మ కళ్ళు తీర్చిదిద్దిన కాటుకతో ఇంకా అందంగా చేశారు. నుదుటిపైన ఎర్రటి తిలకంబొట్టు, బుగ్గన దిష్టిచుక్కలతో అప్పుడే దివినించి దిగివచ్చిన దేవతలా ఉంది పద్మ.
    "ఎక్కడివర్రా సంపెంగపూలు! అబ్బ, ఒకటే సువాసన!" అన్నారు ఎవరో.
    అప్పటిదాకా పద్మనే తన్మయత్వంతో చూస్తున్న చారుమతి ఒక్కసారి మేలుకొని సంపెంగపూల పొట్లం తీసి, పళ్ళెంనిండా పూలు పోసి పద్మ చేతిలో పెట్టింది.
    "ఇన్ని పూలు నేనేం చేసుకోను?" అంది పద్మ ప్రీతిగా పూలవంక చూస్తూ.
    "పెట్టుకో!" అంది శ్రీదేవి, దారం తీసుకుని సంపెంగలు గుచ్చబోతూ.
    "అవి అలా ఉంచవమ్మా రాత్రికి పక్కలమీద వెయ్యచ్చును" అంది పద్మ మేనత్త.
    "అయ్యో! అన్ని పూలు పక్కమీద వేస్తే పాములు రాగలవు" అన్నారు ఎవరో హాస్యంగా.
    అప్పుడే యౌవనంలో అడుగుపెట్టిన స్నేహితురాళ్ళు ముగ్గురు ఆ సంభాషణ విని ఎందుకో తెలియకుండానే సిగ్గుపడ్డారు. శ్రీదేవి మాల కట్టకుండా సంపెంగలు పళ్ళెంలోనే ఉంచేసింది.
    "లేవండి వదినగారూ, వేళ మించిపోతూంది" అంటూ అంతలోనే వరలక్ష్మిగారు వచ్చి అందరిని లేవదీశారు. పద్మని చేయి పట్టుకుని ఆప్యాయంగా ముందరి పందిట్లోకి నడిపించుకుని తీసుకువెళ్ళారు. పందిట్లో తివాసీమీద పెళ్ళికొడుకు మాధవరావు కూర్చుని ఉన్నాడు. పద్మని అతనికి ఎదురుగా కూర్చో బెట్టారు.
    'రతీమన్మథుల్లా ఉన్నారు' అనుకున్నారు చుట్టూఉన్న స్త్రీలు వాళ్ళిద్దరిని చూసి. పద్మ చామనచాయ. చక్కటి పొడుగూ, తగ్గ ఒళ్ళూ, తీర్చిదిద్దిన కనుముక్కుతీరులతో అందంగా ఉంటుంది. ఆమెకంటే ఒక చాయ ఎక్కువ మాధవరావు. పద్దెనిమిది ఏళ్ల పద్మకి ఇరవై అయిదేళ్ళ మాధవరావు ఈడూ జోడూ.
    ఆ సాయంకాలం బంతులాట తంతు అంతా ఆడవాళ్లదే. మగవాళ్ళంతా దూరంగా తప్పుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయిన పెళ్ళికొడుకుకూడా పద్మలాగే సిగ్గుపడుతూ ముభావంగా కూర్చున్నాడు. మాధవరావు తల్లి కాంతమ్మ అతనిపక్కనే కూర్చుంది. మగపెళ్ళి వారి తాలూకు పెద్దావిడ ఒకరు పెళ్ళికొడుకుని ప్రోత్సహించింది.
    "బాబూ! ఇంకొంచెం గంధం పుయ్యి. మెడ చేత్తో వంచి మరీ వెయ్యాలి దండ. సెంటు బాగా రాయి. దెబ్బ తగలదులే, ఆ పూలబంతి గట్టిగా విసురు."
    మాధవరావు ప్రతి పనీ చెయ్యబోయేముందు 'ఆజ్ఞ కావాలి' అన్నట్టు తల్లివేపు చూస్తున్నాడు. కాంతమ్మగారు ఇవేవీ ఇష్టంలేనట్టు ముఖం చికాకుగా పెట్టుకుని కూర్చుంది.
    దూరంగా కూర్చుని తల్లీ కొడుకులను చూస్తున్న చారుమతి, శ్రీదేవి నవ్వుకున్నారు.
    "అబ్బాయి మరీ అమ్మకూచిలా ఉన్నాడే" అంది శ్రీదేవి మెల్లిగా.
    "పూర్వకాలం సరదాలని ఆవిడికి అయిష్టమేమో" అంది చారుమతి.
    బంతులాట తంతు అవగానే విందుభోజనం చేసి, పద్మ దగ్గిరా, తక్కినవాళ్ళ దగ్గిరా సెలవు తీసుకుని ఇళ్ళకు బయలుదేరారు చారుమతీ, శ్రీదేవీ.
    "పద్మ ఎంతో మంచిది. అతనితో సుఖపడుతుందంటావా?" అంది చారుమతి రిక్షాలో కూర్చోగానే.
    "ఎందుకు సుఖపడదూ? ఇది వాళ్ళ అమ్మకి, నాన్న గారికి ఒక్కర్తే కూతురైతే, అతను వాళ్ళమ్మకి ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పద్మకి ఏ కొరతా ఉండదు" అంది శ్రీదేవి, తనకు పద్మ సుఖపడడంమీద ఏమీ అపనమ్మకం లేనట్టు.
    చారుమతి కాస్సేపు ఊరుకుని, "పద్మ పెళ్ళి అయిపోయింది. తరవాత నీదే!" అంది.
    "ఏమో, నీదే ముందవుతుందేమో?"
    "నాది ఎలా అవుతుంది, దేవీ! నాకు లైన్ క్లియర్ కావాలిగా! నీకైతే ఈ బెడద లేదు. మీ అక్కలకు పెళ్ళి అయిపోయింది. బావ సిద్ధంగా ఉన్నాడు."
    చారుమతి మాటలకు శ్రీదేవి నవ్వేసి ఊరుకుంది.
    సూర్యారావుపేటలో తన ఇంటిముందు రిక్షా దిగబోతూ శ్రీదేవి చారుమతిని ప్రశ్నించింది:
    "నువ్వు రేపు విశాఖపట్నం వెళ్ళడం ఖాయమేనా? దేని కిప్పుడు ప్రయాణం?"
    "రేవతక్క ఉత్తరం వ్రాసింది. అక్కడ స్కూళ్ళలో ఏవో ఖాళీలు ఉన్నాయిట. నే నక్కడికి వెళితే బావ సహాయం చేస్తాడుట."
    "పంతులమ్మ ఉద్యోగంకోసం అంతదూరం విశాఖపట్నం వెళ్ళడం అనవసరం అనిపిస్తూంది నాకు. ఉద్యోగం దొరికినా మీ నాన్నగారికి అక్కడినించి ఎంతో కొంత పంపాలి కదా? ఎంత పంపగలవు?"
    "నిజమే, దేవీ కాని అమ్మ ఒప్పుకోవడం లేదు. ముందు ఎక్కడో అక్కడ ఉద్యోగంలో చేరిపోతే, నెమ్మదిగా కాకినాడలో చూసుకోవచ్చు అంటుంది. ఆవిణ్ణి చిన్నబుచ్చలేక విశాఖపట్నం బయలుదేరుతున్నా, నా కిష్టం లేకపోయినా."
    "సరే, తిరిగి రాగానే మా ఇంటికి రా. విశేషాలన్నీ చెప్పాలి. విష్ యు గుడ్ లక్."
    "థాంక్స్ గుడ్ నైట్."
    శ్రీదేవి ఇంటి లోపలికి వెళ్ళగానే, "గంజాంవారి వీథికి పోనీయ్" అని రిక్షావాడితో చెప్పి తన ఆలోచనలో పడిపోయింది చారుమతి.
    చారుమతి, పద్మ కాకినాడలోనే పుట్టారు. ఒకే హైస్కూల్లో చదివారు. ఫోర్తు ఫారంలో మధ్యలో వచ్చి కలిసింది వాళ్ళతో శ్రీదేవి. ఆమె నాన్నగారికి తరుచు బదిలీలు అయ్యే ఉద్యోగం. చదువుకోసం తన అక్కగారింట్లో కాకినాడలో ఉంచారు శ్రీదేవిని.
    శ్రీదేవి మేనత్తగారి ఇల్లూ, వెనక పెరడూ పెద్దవి. పెరట్లో పెద్దమామిడిచెట్టుకింద కూర్చుని చారుమతీ, శ్రీదేవీ, పద్మా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ప్రతి సాయంత్రం ఒక అరగంటేనా ఆ చెట్టుకింద గడపకపోతే ముగ్గురికీ ఆ రోజు వెలితిగా తోచేది. వయస్సుతోబాటు వారి స్నేహంకూడా పెరిగింది. ఒకేరకంగా పయనిస్తున్న వారి జీవితాలు మూడు మార్గాలుగా చీలిపోయాయి, ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలు అవగానే. శ్రీదేవి కాలేజీలో ఇంటర్ మీడియట్ క్లాసులో చేరింది. చారుమతి టీచర్ ట్రైనింగ్ లో చేరింది. అమ్మ, నాన్నల ఆదేశం ప్రకారం పద్మ ఇంట్లో కూర్చుని వరునికోసం నిరీక్షించింది. రెండేళ్ళ నిరీక్షణకి ఫలితం మాధవరావు లభ్యం కావడం వేసంగిలో కళ్యాణ గడియ వచ్చింది.
    'ఇక పద్మ మాకు దూరమయిపోతుంది' అనుకుంటున్న చారుమతి, "ఏ ఇల్లమ్మా?" అన్న రిక్షావాడి కేకతో ఈ లోకంలో పడింది.
    "అదే, కొళాయి పక్కయిల్లు."

                                  2

    చారుమతి తలుపు శబ్దం చెయ్యగానే డాబామీది మంచి దిగి వచ్చి శాంతమ్మ తలుపు తీసింది.
    "నిద్రపోతున్నారా అంతా? ఇంత నిశ్శబ్దంగా ఉంది" అంది చారుమతి లోపలికి అడుగుపెడుతూ.
    "గంట ఎంత అయిందనుకున్నావ్! పది దాటింది. అందరు పడుకున్నారు. పెళ్ళి ఇంట్లో కూచున్న నీకు ఎంత పొద్దుపోయిందో తెలిసి ఉండదు" అంది శాంతమ్మ.
    చారుమతి గబగబా బట్టలు మార్చుకుని కింద దీపం ఆర్పి, డాబామీదికి వెళ్ళింది. వాళ్ళ డాబా చిన్నది. సన్నగా పొడుగ్గా ఉంటుంది. మనిషి అడ్డంగా పడుకుంటే, కాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి. డాబా అంతా ఇంట్లో మనుషులతో నిండిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఇరుగ్గా ఉంది. చారుమతి తల్లిపక్కనే పడుకుంది. శాంతమ్మ పద్మ పెళ్ళి విషయాలు అడిగింది.
    "అయితే మామగారు లేరా? అత్తగారేనా? ఒక్కడే కొడుకా? పోనీలే, ఆడబడుచుల పోరు ఉండదు మీ పద్మకి. అత్తగారు మంచిదిలాగే కనబడిందా?"
    "ఆవిడ చాలా చిన్నదానిలా ఉందమ్మా. నలభై ఏళ్ళు ఉంటాయేమో! చాలా అందంగా ఉంది. పాపం, బొట్టూ అదీ పెట్టుకుంటే ఇంకా బాగుంటారేమో."
    "మీ పద్మ అదృష్టవంతురాలు! మంచి మొగుణ్ణి సంపాదించింది."
    శాంతమ్మ గొంతులో కొంచెం ఈర్ష్య కూడా తొంగిచూసినట్లు అనిపించింది చారుమతికి.
    మాట్లాడుతూనే నిద్రపోయింది శాంతమ్మ. చారుమతికి నిద్ర రాలేదు. "ఆ సంపెంగపూలు అలా ఉంచమ్మా! రాత్రి పక్కలమీద వెయ్యచ్చు." పద్మ మేనత్త మాటలు జ్ఞాపకంవచ్చాయి. అంటే, ఈ రోజు శోభనం చేస్తారు. పద్మని గదిలోకి పంపించి ఉంటారు. తెల్లచీర కట్టారేమో! భర్తతో ఏం మాట్లాడుతుంది? ఇద్దరూ ఓకే గదిలో ఎలా గడుపుతారు?
    పద్మ పెళ్ళిలోనించి తనకు జరగబోయే పెళ్ళిలోకి వెళ్ళిపోయాయి చారుమతి ఆలోచనలు. తను ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది? అతను ఎలా ఉంటాడు? శోభనం నాడు రాత్రి తాను ఎలా ఉంటుంది? తరవాత ఏం ఆలోచించాలో తెలియలేదు. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.
    
                            *    *    *

    చారుమతి ఊహించినట్టు ఆ రోజు రాత్రి పద్మ శోభనంగదిలో ప్రవేశించలేదు. రాత్రి పది గంటలకు వరలక్ష్మి సావకాశంగా కూచున్న వియ్యపు రాలి దగ్గిరికి వెళ్ళి అడిగింది:
    "ఏమండీ, వదినగారూ, సావకాశంగా కూర్చున్నారు? రాత్రి ఏర్పాట్లు ఏం చెయ్యాలో చెప్పలేదు."
    "రాత్రికి ఇంకేం ఏర్పాట్లు ఉన్నాయి? రేపు తెల్లవారు ఝాము బండికి అమ్మాయిని తీసుకుని మేం మద్రాసు వెళతాం" అంది కాంతమ్మ.
    వరలక్ష్మి ఆశ్చర్యపోయింది. కొంచెం తటపటా యించింది.
    "ఏదో ఆ కార్యం అడ్డుకూడా ఈ రోజే తీర్చెయ్యాలనుకున్నాము" అంది మెల్లిగా.
    "పిల్ల అత్తవారింట్లో శోభనం వేడుక చేసుకోడం మా ఆచారం. మా ఇంట్లోనే చేసుకుంటాం." ముభావంగా అంది కాంతమ్మ.
    వరలక్ష్మి నిరుత్సాహపడింది. కాని రోజంతా పెళ్ళి హడావిడిలో అలిసిపోయిన పద్మ ఇవేవీ పట్టించుకోకుండా ఆదమరిచి నిద్రపోతోంది అప్పటికే.
    చారుమతీ, శ్రీదేవీ ప్రేమతో ఇచ్చిన పువ్వులు వ్యర్ధంగా వాడిపోతూ ఆమెపక్కనే ఉండిపోయాయి.

                                    3

    చారుమతికి మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారి పోయింది. పక్కన చూస్తే డాబా అంతా ఖాళీగా ఉంది. దూరంగా మాత్రం శంకరం ముఖం నిండా ముసుగు పెట్టుకుని పడుకుని ఉన్నాడు.
    'అయిదుగురి అమ్మాయిల మధ్య అపురూపంగా అబ్బాయిగా పుట్టడం ఎంత అదృష్టం!' అనుకుంది మనసులోనే. శంకరం పొద్దున పదిగంటలదాకా నిద్ర లేవడు. ఎంత ఆలస్యంగా లేచినా అడిగేవాళ్ళుండరు. శంకరం ఏం చేసినా చెల్లుతుంది ఇంట్లో. నెలకు అయిదు, ఆరు సినిమాలేనా చూస్తాడు. "వాడికేమే మగమహారాజు!" అంటూ శంకరానికి మద్దతు వస్తుంది మామ్మ. చారుమతికి ఆ మాట వింటే ఒళ్ళు మండుతుంది. అబ్బాయి పొడిచేసిం దేమిటో?


Next Page 

WRITERS
PUBLICATIONS