పిల్లలతో ప్రేమయాత్ర
పరిమళ సోమేశ్వర్

"ఏమైనా సరే, యీ వేసవి లో హనీమూన్ కి వెళ్ళి తీరాలి!" అనుకున్నాడు గట్టిగా కాంతారావు.
కాంతారావు కి పెళ్లై మూడు సంవత్సరాలు నిండ వస్తున్నాయి. ఈ మూడు సంవత్సరాలలోనూ అతనికి యిద్దరు పిల్లలు పుట్టేరు.
అసలు పెళ్లవగానే పసుపు బట్టలతోనే తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఆ తరువాత మద్రాసు, బెంగుళూరు, మైసూర్, ఊటీ మొదలైన అందమైన ప్రదేశాలను సందర్శించి పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారంగా "హనీమూన్" కూడా అయిందని పించుకుందామని అతనెంతో ఉబలాట పడ్డాడు.
కాని పెళ్ళయిన కొత్తలో అతనికి ఎక్కువరోజులు సెలవు దొరక నందు వల్ల ప్రయాణాన్ని తరువాతి నెలకు వాయిదా వేసేడు. ఐతే అనుకున్న నెలా గడిచేసరికి కళ్యాణికి నెల తప్పిందన్న వార్త తెలిసింది. ఆ సంతోషం లో ఉక్కిరిబిక్కిరయిన కాంతారావు హనీమూన్ సంగతే మర్చిపోయేడు. పైగా ఆ సమయంలో కళ్యాణి దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదని పెద్దవాళ్ళు సలహా చెప్పటం వల్ల ఆ సంవత్సరమంతా ప్రయాణం మాట తలపెట్టలేదు.
బాబిగాడు పుట్టిన తరువాత మూడు నెలల లోపల తిరుపతి లో నిద్ర చేసి వద్దామని సరిపెట్టుకున్నాడు. భార్యా భర్తలిద్దరూ. కాని ఆ సమయానికి కళ్యాణి కి సుస్తీ చేయటం వల్ల 'హనీమూన్' ని వచ్చే వేసవి లో గడుపుదామని నిశ్చయించుకున్నారు. ఐతే అవేసవి వచ్చే సరికి కళ్యాణి రెండు నెలల గర్బిణి అయింది. దాంతో అప్పుడు కూడా ప్రయాణం ఆగిపోయింది.
కళ్యాణి రెండోసారి ఆడపిల్లను కంది. ఇప్పుడు పాపకి పది నెలలు నిండ బోతున్నాయి. కళ్యాణి లో కూడా 'ప్రమాదకరమైన చిహ్నాలేవీ ' ఉన్నట్లు లేవు. అందుకే బాబిగాడిని, పది నెలల పాపని తీసుకుని తమ చిరకాలంగా కలలు కంటున్నా 'హనీమూన్' కు బయలు దేరాలని గట్టిగా తీర్మానించుకున్నా కాంతారావు దానికి తగ్గట్టు యీ మధ్యనే ప్రభుత్వం వారు మంజూరు చేసిన కరువు భత్యం యొక్క 'ఎరియర్స్' తాలుకూ రెండు వేల రూపాయలు చేతికి వచ్చినయ్.
ఈ డబ్బులు పులుసులోకి పోకముందే తన ముచ్చట తీర్చుకోవటం మంచిదని తోచింది కాంతారావు కి. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా తను జన్మలో చూడలేదు. కాలేజీ లో లెక్చర్ గా తను సంపాదించే ఐదు వందలతో యీ హైదరాబాద్ వంటి మహానగరం లో పెళ్ళాన్ని, డబ్బా పాలు తాగే పిల్ల వాళ్ళను పోషిస్తూ , పైగా విహారయాత్రలకు సరిపడ డబ్బును కూడబెట్టే తాహతు తనకి లేదు. 'దీప ముండగానే చక్క బెట్టుకో" వాలన్నట్లు యీ డబ్బు లుండగానే హనీమూన్ ముచ్చట జరిపించుకోవాలని నిశ్చయించు కున్నాడు కాంతారావు.
ఆమాట అనుకోవటమే తడవుగా భార్యా మణితో చెప్పెసేడు కూడా.
వంట యింట్లో వంకాయ కూరతో కుస్తీ పడుతున్న కళ్యాణి దగ్గరకు పరుగెత్తు కుంటూ వెళ్ళేడు కాంతారావు.
"కల్యాణి! వో కళ్యాణి! నీకో సంగతి చెప్పనా?" అంటూ.
"ఏవిటండీ అ గావు కేకలూ మీరూను!" అంటూ తన మామూలు ధోరణి లో విసుక్కుంటూ అన్నది కళ్యాణి.
కళ్యాణి వంట చేస్తున్నదంటే ఆ కాసేపూ వంటిల్లు వో చిన్న సైజూ కురుక్షేత్రం లా ఉంటుంది. ఆ సమయంలో ఆమె శరీరంలోని బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వంటి నిండా చెమటలు కారుతుంటాయి.తల చెదిరిపోయి ఉంటుంది. పమిట చెంగు నడుముకి బిగింఛి చేస్తుంది. అంతా ఎందుకూ? ఒక్క మాటలో చెప్పాలంటే వంట చేసే సమయంలో కళ్యాణి ని గనుక చూసినట్లయితే ఎవరికైనా అలనాడు నరకాసుర సంహరార్ధం బయలుదేరిన సత్యభామ. మహిషాసుర మర్ధనిగా పేరు పొందిన లోకమాత మొదలు గా గల అలనాటి నారీమణులు జ్ఞప్తికి రాక మానరు.
పైగా ఆ అవతారానికి తగ్గట్టు ఆ క్షణం లో ఆమె 'టెంపర్' కూడా అలాగే ఉంటుంది. భర్త యే మాత్రం పలకరించినా ఖస్సు మంటూ లేస్తుంది. పిల్లలు ఏ కొంచెం అల్లరి చేసినా వాళ్ళ మీద విరుచుకు పడుతుంది.
"ఏమిటో ఆ వంట యింట్లో ఉన్న మహత్యం!' అని తనలో తనే ఆశ్చర్య పోతుంటాడు కాంతారావు.
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు విద్యారణ్యస్వామి 'కుందేలు కుక్క లను తరిమిన చోటు' ను ఎన్నుకున్నాడట. అలాగే మామూలు సమయాల్లో. ఎంతో సౌమ్యంగా (ఎప్పుడో తప్ప) ఉండే కళ్యాణి వంటిట్లోకి వెళ్ళగానే ఆడపులి లా మారిపోతోంది అంటే ఒక్కొక్క స్థలం తీరు అది నమ్మక తప్పలేదు కాంతారావు కి.
'కళ్యాణి ! నీకో మంచి వార్త చెప్తాను కానీ కాస్త నవ్వు ముఖం పెడ్దూ. అలా విసుగ్గా మాట్లాడకూ. నాకు భయం వేస్తుంది.' బ్రతిమాలె ధోరణి లో అన్నాడు కాంతారావు.
"అంటే యేమిటి మీ ఉద్దేశ్యం? నా ముఖం అంత భయంకరంగా వుందనా?' తీక్షణంగా అడిగింది కళ్యాణి.
"సారీ! నా ఉద్దేశ్యం అది కాదు కళ్యాణి ! వంటింట్లో పడి కొట్టుకు లాడుతున్నప్పుడు నీ ముఖం చూస్తుంటే నాకెంతో జాలి వేస్తుంది. నీ సున్నితమైన చేతులు కంది పోతుంటే , పువ్వులాంటి నీ ముఖం స్టౌ మంటల సెగకు మాడిపోతుంటే నేను భరించలేను డార్లింగ్! వంట మనిషిని పెట్టుకుందామంటే నువ్వు వద్దంటుంటివి....'
భర్త ఆ ధోరణి లో మాట్లాడటం మొదలెట్టే సరికి అమాంతం మెత్తబడి పోయింది కళ్యాణి. 'చాల్లెండి, ఎన్నిసార్లు చెప్పెను మీకు వంటమనిషి మాట ఎత్తవద్దని? నేను ఆడదాన్ని కానూ? వంట చేస్తే తప్పా? ఐనా యిలా ఎవరి పన్లు వాళ్ళు చేసుకున్నప్పుడు కలిగే ఆనందం, తృప్తి -- కొనుక్కుంటే వస్తాయా? మీరేన్నైనా చెప్పండి. మన చేతుల్తో స్వయంగా చేసుకున్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా పంచ భక్ష్య పరమాన్నంతో సమానంగా ఉంటాయంటే నమ్మండి.' అంటూ ఆ తన్మయత్వం లో కూరలో వోసారి ఉప్పి వేసిన సంగతి మర్చిపోయి మళ్ళీ రెండు చెంచాల ఉప్పు వేసి కూర కలియ బెట్టింది కళ్యాణి.
'ఇంతకూ అసలు సంగతి చెప్పనివ్వవూ' అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
కళ్యాణి స్టౌ లు ఎత్తైన గట్టు మీద పెట్టి వంట చేస్తుంది. వంట చేసేంత సేపూ నిలబడటం కష్టమని వో కుర్చీ తెచ్చి అసలే యిరుకుగా ఉన్నా వంటింట్లో దానికి కొంత స్థానాన్ని కేటాయించింది. ఐతే కళ్యాణి ఆ కుర్చీ మీద కూర్చో గా కాంతారావు ఎప్పుడూ చూడలేదు.
అదేమని అడిగితె 'కుర్చీ వేసుకున్నా గాని వంట చేస్తున్నంత సేపూ వో నిమిషం అలా కూర్చుంటానికి టైము దొరకదండి.' అంటుంది.
'ఐతే అక్కడా కుర్చీ ఎందుకు? ఇల్లంతా యిరుకుగా వుంది" అంటాడతను.
'అబ్బే ఆ కుర్చీ కనుక అక్కడ నుండి తీసేరంటే నిజంగా నాకు కాళ్ళు నొప్పులు వస్తాయండి. వంట చేస్తున్నంత సెపూ కుర్చీ అక్కడ ఉన్నది అన్న భావం కనుక వస్తే సైకలాజికల్ గా అదో రకం రిలీఫ్ ' కలుగుతుంది. ఐనా మీకీలాటి వన్నీ చెప్తే అర్ధం కావు లెండి. అనుభవించే వాళ్లకి అర్ధమవుతాయి.' అంటూ వో చిన్న ఉపన్యాసం యిస్తుంది!
ఇలాగే చాలా విషయాలు చెప్తే అర్ధం కానివి, అనుభవించే వాళ్ళకు తప్ప తెలియనివి కళ్యాణి చాలాసార్లు అతనితో చెప్తుంటుంది. ఉదాహారణ కి కళ్యాణి గర్బిణీ గా ఉన్నప్పుడు ప్రతిరోజూ కాలు నెప్పి, చెయ్యి నొప్పి నడుం నొప్పి , పొట్ట నొప్పి అని ఏదో ఒక వంక పెట్టి 'అమ్మో! అయ్యో!" అంటూ రాగాలు తీసేది. కళ్యాణి బాధ చూళ్లేక గాబరా పడేవాడు కాంతారావు. 'ఎందుకలా గట్టిగా అరిస్తావు? ఆ మాత్రం చిన్న నొప్పి కూడా భరించలేవా?' అంటే ఖస్సు మని లేచేది కళ్యాణి. "ఔను నా బాధ మీ కంటికి చిన్నగానే కనిపిస్తుంది. మీరు కడుపుతో ఉంటె గాని నా బాధ ఎంత గొప్పదో మీకు తెలిసి రాదు.' అనేది. అలా చెప్పుకుపోతే చాలా ఉంటాయ్ కళ్యాణి లీలలు. ఇంతకీ చెప్పెచ్చేదేమంటే కాళ్ళ నొప్పులకు మర్చిపోయే నిమిత్తం కళ్యాణి వంటింట్లో వేసుకున్నా ఆ కుర్చీని అడపాదడపా వంటింట్లోకి వచ్చినప్పుడల్లా కాంతారావే ఉపయోగిస్తుంటాడు.
ఇప్పుడు కాంతారావు కూర్చున్నది కూడా ఆ కుర్చీ లోనే అలా భర్త వచ్చి కుర్చీలో కూర్చునే సరికి అమితమైన ఆనందం కలిగింది కళ్యాణికి.
కళ్యాణి సిద్దాంతం ప్రకారం మొగుడు అనేబడే మగవాడు, మగువ మనసును చూరగొనదల్చుకున్నవాడైతే ఆమె వంట చేస్త్గున్నంత సేపూ ఆమె కొంగు పట్టుకుని తిరగకపోయినా కనీసం పక్కనే కూర్చుని అవీ ఇవీ కబుర్లు చెప్తుంటే ఆమెకు అలసట అనేది ఉండదట. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలకి అలా భర్తతో కబుర్లు చెప్తూ వంట చేస్తుంటే 'ఇతగాడికి పెళ్ళి చేసుకుని దాసీదాన్లా వంట చేయ్యావలసి వచ్చింది.' అన్న భావం అసలు రానేరాదు- అంటుంది కళ్యాణి. 'ఎందుకలా' అని అడిగితె అది కూడా అనుభవించే వాళ్ళకే అర్ధమవుతుంది. చెప్తే తెలియదు. అదంతే!" అంటుంది.
కుర్చీలో కూర్చున్న భర్త మీద తన మనసులోని ప్రేమ నంతటిని కళ్ళ ద్వారా కురిపిస్తూ గోముగా అడిగింది కళ్యాణి. ఏమిటబ్బా , అంత మంచి వార్తా? కాస్త చేపుదురు?" అని.
కళ్యాణి అలా మృదువుగా అడిగేసరికి "అమ్మయ్య! మళ్ళీ మాములు మనిషి అయింది కళ్యాణి. ఇక ఫర్వాలేదు' అనుకున్నాడు మనసులో కాంతారావు. ఇదో వచ్చే బుధవారమే మన ప్రయాణం.' అన్నాడు గర్వంగా జంధ్యం పోగును సవరించుకుంటూ.
"ఎక్కడి కేమిటి ప్రయాణం?"
"కనుక్కో! చూద్దాం."
"బాగానే ఉంది వరస. చిన్న పిల్లలను ఆటలు పట్టించినట్టు అదేం ప్రశ్న! మీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి నాకేమయినా మంత్రాలు, తెలుసా, తంత్రాలు తెలుసా? ' అంటూ కూర కలియబెట్ట సాగింది కళ్యాణి.
'మరీ అలా విరుచుకు పడకోయ్. కాని వో చక్కని శుభవార్త ను చెప్పబోతున్నాను. అదేమిటో నువ్వే కనుక్కోవాలి మరి.'
'సరి సరి. ఇప్పుడే చేప్తిని కదా, కనుక్కో లేనని.'
'పోనీ రెండు నిమిషాల టైమిచ్చేను కనుక్కో చూద్దాం. ఆ రెండు నిమిషాలూ గడవక ముందే కళ్యాణి 'ఆ మన ప్రయాణాలు ఎక్కడి కుంటాయి? ఏ గార్డెన్స్ కో, గోల్కొండ కో అయి ఉంటుంది.' అన్నది కళ్యాణి.
పిల్లలు పుట్టిన తరువాత నగరం లోనే ఉన్న సుందర ప్రదేశాలను సందర్శించటానికి కూడా పెద్ద యెత్తున నాలుగు రోజుల ముందు నుండే ప్రయాణ సన్నాహాలు చేసుకోవటం ఆ దంపతులకు అలవాటే! ఆఖరికి సినిమాకి వెళ్ళాలన్నా ఆ ఉదయం నుండే పెద్ద వాడికి అన్నం సరియైన టైముకు తినిపించడం, పిల్ల కోసం ఫ్లాస్కు లో పాలు నింపుకోవటం మొదలైన ఏర్పాట్లన్నిటి ని ఎంతో హడావుడి గా చేస్తుంది కళ్యాణి. అలాటిదే ఏదో ప్రయాణానికి భర్త ప్రోగ్రాం వేసి తన అంగీకారం కోసం వెం చేసి ఉంటాడు అనుకుంది కళ్యాణి.
ఛ! మొత్తానికి అడబుర్ర అనిపించావ్. బోడి గోల్కొండ కి గార్డెన్స్ కీ యిప్పుడేవరోస్తారోయ్ . అంతకన్నా మధురమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే చెయ్యబోతున్నాం మనం.... యీసారి చాలా పెద్ద ప్రయాణమే.... ఐమీన్ లాంగ్ జర్నీ!'
'ఎక్కడి కేమిటి అంత పెద్ద ప్రయాణం? కొంపదీసి నెల్లూరు లో ఉన్న మీ మేనత్త దగ్గరికి కాదు కదా? ఆవిడకు జబ్బుగా ఉందని ఎవరో చెప్పారని మీ కాలేజీ లో హిస్టరీ లెక్చరర్ చెప్పారన్నారు కదూ? ' అంది గాభరాగా.
