Next Page 
ఇంద్రధనుస్సు పేజి 1

                                                ఇంద్రధనుస్సు

                                                                      పల్లంపాటి వెంకట సుబ్బయ్య

                     
    వేకువ జాము రైలుకు ఉమాపతి బావ వస్తాడని తెలియగానే శారదకు ఆ రాత్రి నిద్రరాలేదు. అనేక రకాల భావాలు -- మంచివి, చెడ్డవి; తియ్యనివి, చేరువి -- తెరలు తెరలుగా ఆ లేత మనస్సు లోకి తొంగి చూడడం ప్రారంభించాయి. తెల్లవారీ తెల్లవారక ముందే ఉమాపతి బావ వస్తాడు. వచ్చీ రాకముందే తనకోసం వెతుకుతాడు. తాను కనపడీ కనపడక ముందే ఎవ్వరూ చూడకుండా తన కేదో యిస్తాడు. తాను ఎన్నోసార్లు తీసుకోకూడడనుకోంది. కానీ, ఉందిగా అమ్మ -- మారెమ్మ-- ఏ తలుపు సందులో నుంచో తీసుకోమని సైగ చేస్తుంది. తాను తీసుకుంటుంది. బావ వెళ్ళగానే అమ్మ వచ్చి, "బుద్ది లేదూ?' -- అంటుంది.
    "ఎవరికి?" తన ప్రశ్న.
    "నీకే! లేకుంటే నాకనుకున్నావా?"
    ఔన్నన్నట్లుగా తను తల ఊపుతుంది.
    ఆకలి గొన్న పులిలా చూచి ఆమె వెతుకుతుంది. బావ వచ్చిన ఐదు నిమిషాల్లో మాములుగా జరిగే తతంగ మిది.
    శారద రాత్రల్లా ఇలా ఆలోచిస్తూనే ఉంది. అందులో అది పుష్యమాసపు రాత్రి! పుష్యమాసం లో పగలు ఎంత కురచో రాత్రి అంత పొడుగు! శారద ఎంత ఆలోచించినా అ రాత్రి తరగలేదు. శారద ఏమీ తోచక తలుపు తీసుకొని పెరట్లోకి వచ్చింది. తలుపు తీసి తియ్యగానే చలిగాలి కొరడా కొసలా తాకింది. శారద శరీరంతో బాటు మనసు గూడా జిల్లు మంది చలిగాలి తాకిడికి. కొంగు తీసి బాగా కప్పుకొని పెరట్లోకి వచ్చింది. పెరట్లో ఉన్న సన్నజాజి పందిరిని పొగమంచు కౌగలించుకొంది. ఎత్తుగా నిల్చున్న బాదం చెట్టు మీద చీకటి కుండపోతగా కురుస్తుంది.
    ఉమాపతి విషయంలో శారదకు ద్వంద్వభిప్రాయాలున్నాయి. ఉమాపతి బావకేం తక్కువ? అని ఒక్కోసారి ఆలోచిస్తుంది. అవును, ఏం తక్కువ? అందం ఉంది. ఆస్తి కాస్తో కూస్తో ఉంది. తనంటే ఆకర్షణ ఉంది. మాములుగా ఈ మూడు లక్షణాల కోసమే వెదుకుతుంది ప్రతి స్త్రీ. ఉమాపతి లో ఈ మూడూ ఉన్నా శారదకు కావలసినదేదో లేదు. ఆలోచనల్లో మునిగి తేలుతున్న శారదను ఆ ఎముకలు కోరికే చలి ఏమీ చేయలేక పోయింది. అలాగే ఆలోచిస్తూ చాలాసేపు బాదం చెట్టు మొదట కూర్చుంది. కాస్సేపటికి ఆలోచనల వేడికి శారద మనస్సు వేడెక్కి పోయింది. లోపల కెళ్ళి పడుకుందామని లేచింది. తలుపు  గడియ వేసి పడుకుందే గాని నిద్ర రాలేదు. కాలం నత్త నడక నడుస్తుంది. ఆలోచనలతో అలసి అలాగే కునికింది శారద.

                             
    శారదకు మెలకువ వచ్చేసరికి దాదాపు నాలుగు గంటలైంది. ఇంట్లో అంతా లేచి హడావుడిగా తిరుగుతున్నారు. శారద అలాగే పరుపు మీద కూర్చుంది.
    "ఏమిటే, అలాకూచున్నావు? లేలే! ముఖం కడుక్కొని మంచి బట్టలు కట్టుకో." రత్నమ్మ అంది.
    శారదకు నవ్వు వచ్చింది. రత్నమ్మ కోపంగా చూసి వెళ్ళిపోయింది. శారదకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మరి కాస్సేపట్లో ఉమాపతి వస్తాడని. ఎందుకో ప్రశాంతంగా , హాయిగా ఉన్న శారదకు మనస్సు అదోరకంగా మారిపోయింది. లేచి ముఖం కడుక్కుని కొంగుతో తుడుచుకుంటూ వంటింటి దగ్గరి కొచ్చేసరికి సుందరమ్మ పిలిచింది.
    "శారదా , ఇలారా. కాఫీ తాగుదూ గానీ."
    "కాఫీ! అప్పుడే చేశావా అత్తయ్యా?' అంది శారద.
    'చెయ్యకపోతే ఎలాగమ్మా? వస్తున్నాడుగా మన అలంకార విద్యార్ధి!"
    శారద కాఫీ తాగింది.
    "ఇదిగో ఈ కాఫీ తీసికెళ్ళి మీ మామయ్య కివ్వు."
    కాఫీ లోటా తీసుకొని తాళవారం లోకి వెళ్ళింది శారద. విశ్వనాధం గారు స్తంభానికానుకొని కూర్చున్నారు.
    "ఇదుగో మామయ్యా కాఫీ."
    "అప్పుడేనా అమ్మా?"
    "అత్తయ్య చేసింది మామయ్యా."
    లోపలినుంచి రత్నమ్మ వచ్చింది. విశ్వనాధయ్యగారు కాఫీ తాగుతున్నారు.
    "ఒరే విశ్వనాధం ! స్టేషనుకు బండి పంపావా?" ప్రశ్నించింది రత్నమ్మ.
    "పంపాను."
    "ఐదు గంటలకు పైగా కావస్తుంది. ఇంకా రాలేదేం మరి?"
    "ఏమో!"
    "రైలు లేటా?"
    "ఉండొచ్చు."
    "మదరాసు లో మన వాడు బయల్దేరినప్పుడు టెలిగ్రాము.... అదో మువ్వల శబ్దం వినిపిస్తోంది. ఏమేవ్ శారదా! శారదా! ఏదీ, ఇది ఎక్కడి కెళ్ళింది? సుందరా! ఉమాపతోచ్చాడే, ఉమాపతి! సుందరా! సుందరా!"
    మువ్వల శబ్దం దగ్గరైంది. మంచు  తెరలను చీల్చుకుంటూ బండి ముందుకు వచ్చి, ఇంటి ముందు నిలిచింది. తలకు కట్టుకున్న మప్లర్లు విప్పుకుంటూ ఉమాపతి బండి దిగాడు.
    "బాగున్నావటయ్యా, అల్లుడూ?" అంది రత్నమ్మ.
    ఉమాపతి చిరునవ్వు నవ్వాడు. రత్నమ్మ శారద కోసం వెదికింది. కానీ కనపడలేదు. లోలోపలే శారద ను తిట్టుకుంది.
    "బాగున్నారా నాన్నా! అమ్మా నువ్వు!"
    "బాగానే ఉన్నాము" అంది సుందరమ్మ.
    ఉమాపతి లోపలికి వెళ్ళాడు. పాలేరు సామాన్లు లోపల పెట్టాడు. శారద గదిలో నుంచి అంతా చూస్తుంది. రత్నమ్మ వచ్చి నాలుగు వడ్డించి, కాఫీ లోటా యిచ్చి ఉమాతికి యిచ్చి రమ్మంది.
    "ఉహు.... నాకదో రకంగా ఉంటుంది" అంది శారద.
    'ఏమిటీ మాయరోగం వెళ్ళు!"
    కుక్కిన పెనులాగా కాఫీ లోటాతో బయలు దేరింది శారద.
    శారద వెళ్ళేసరికి ఉమాపతి ముఖం తుడుచుకుంటున్నాడు. చేతితో కాఫీ లోటాతో నిలబడింది శారద. ఉమాపతి తలెత్తి చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఝల్లు మంది. మొదట శారదను పోల్చుకోలేక పోయాడు.
    "ఎవరు నువ్వు? రంభవా? మేనకవా? తిలోత్తమవా? లేక భూచారి నిర్జర కాంతవా?"
    "కాఫీ"
    "దేవకన్యలు కాఫీ తాగరు. అమృతం తప్ప, అది అమృతమేనా?"
    "......"
    కాఫీ లోటా అందుకున్నాడు ఉమాపతి చుట్టూరా చూసి శారదను గట్టిగా ముద్దెట్టుకున్నాడు. అతడి బహుబంధంలో నుండి తప్పించుకొని శారద పరుగెత్తింది.గదిలోకెళ్ళి కూర్చునే దాకా మనస్సు కుదుట పడలేదు. దేహం కొట్టుకొంటుంది. ఒడిలో చేతులుంచుకుని అలాగే గొంతు కూర్చుంది. సుందరమ్మ వచ్చి ప్రశ్నించే వరకూ తనకే తెలిని  స్థితిలో ఉంది శారద.
    "అత్తయ్యా! బావ నన్ను బలవంతంగా ముద్దెట్టు...." బావురుమంది శారద.
    "ఉమపతే!"
    "ఏమిటీ సంగతి?" లోపలికి వచ్చారు విశ్వనాధయ్యగారు.
    "ఏమీ లేదు. " అంటూ పెరట్లోకి వెళ్ళింది సుందరమ్మ.
    శారద కేసి అలాగే చూస్తూ నిలబడ్డారు విశ్వనాధయ్య గారు.

                              *    *    *    *
    విశ్వనాధయ్యగారి కుటుంబానికి రొంపిచర్ల ప్రాంతంలో ఏడేడు పద్నాలుగు గ్రామాల్లో పేరుంది. విశ్వనాధయ్య గారి తాత సుబ్బావదానులు గారు యాగం చెయ్యకపోయినా వేదాలూ, శ్రాస్తాలు క్షుణ్ణంగా చదువుకున్నవారు. వారికి వాక్భుద్ది ఉందని, వారి తిట్టు శాపంగా తగులుతుందని ఆ కాలంలో అనుకొనేవారు. వారి కాలంలో వారి పెరట్లోని బావి నీళ్ళు దివ్విటీకి కూడా వెలిగాయి. సుబ్బావధానులు గారికి ఇద్దరు కూతుళ్ళు. ఒక కొడుకు. కొడుకు పేరు రామనాధయ్య. అంటే విశ్వనాధయ్య గారి నాన్నగారు. అయన కాలంలో వారింట్లో శాస్త్రాధ్యయనం మూల పడిపోయింది. ఆయనకు గ్రామ రాజకీయాలు , కక్షలు శాస్త్రాల కన్నా ఎక్కువై పొయ్యాయి. కుటుంబానికి ఉన్న మంచిపేరు చెడ్డ పేరుగా మార్చేశాడు అయన. ఆయనకు ఇద్దరే సంతానం-- ఒక కొడుకు , ఒక కూతురు. కొడుకు విశ్వనాధయ్య, కూతురు రత్నమ్మ.
    రామనాధయ్య గారికి బిడ్డల మీద మాత్రం చాలా ప్రేమ ఉండేది. తన కొడుకు బాగా చదివి లాయరై ఆ వైపు గ్రామాల నన్నిట్నీ తన వ్రేళ్ళ సందున ఇరికించుకొని, వీధిలో అరుగు మీద కూర్చుని మధ్యస్తాలు తీరుస్తుంటే చూడాలని వారికి ఉండేది. బిడ్డల మీద ఉన్న ప్రేమ ఆయనకు ఆస్తి పాస్తుల మీద ఉండేది గాదు. వారు కులానికి బ్రాహ్మణులైనా వారి కుటుంబం ఏనాడూ వృత్తి చేత బ్రాహ్మణులు కారు. వారి వృత్తి ఏనాడూ వ్యవసాయమే! తన 'కులవృత్తి' ని రామనధయ్యగారు పూర్తిగా నిరధరించారు. వారిది "బాపన సేద్యం-- బత్తెం చేటు; ఉత్తర చూసీ- ఎత్తర గంప' -- అయింది.
    విశ్వనాధయ్యగారు మెట్రిక్ పాసయి మదనపల్లె కాలేజీ లో చేరడానికి వెళ్ళాడు. ఆ నాడు ఈ ప్రాంతానికి అంతా ఒక్క మదనపల్లె లోనే ఉండేది కాలేజి. అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి కూడా మదనపల్లె కాలేజీ కి విద్యార్ధులు వచ్చేవారు. ఆ కాలంలో మదనపల్లె కాలేజీలో చదవడమే ఒక గొప్ప!
    విశ్వనాధయ్య గారు కాలేజీలో చేరేవరకూ వారికీ రొంపిచర్ల , చెల్లెలి నిచ్చిన పీలేరు తప్ప మరొక ఊరు తెలీదు. కాలేజీ వాతావరణం,విద్యార్ధుల ఆలోచనా పద్దతి, వాటి బ్రిటీష్ ప్రభుత్వ విధానం, అతను చదివిన పుస్తకాలు అతనిలో ఒక కల్లోలాన్ని రేపాయి. అతనిలో పాదుకు పోయిన కొన్ని విశ్వాసాలను కూకటి వేళ్ళతో లాగి పారేశాయి. తన కాలేజీ విశ్వాసాలను గూర్చి చెబుతూ విశ్వనాధయ్య గారు ఈ నాటికీ ఒక సంఘటనను గూర్చి చెబుతారు.....
    ఒకరోజు విశ్వనాధం మదనపల్లె నుంచి దిగాడు. మనవడి మూతి మీద 'తల్వార్ కట్' మీసాలను చూసిన సుబ్బావదాన్లు గారి అగ్గి రాముడై పోయారు. మనవణ్ణి పిలిచి అడిగారు.
    "ఏమిట్రా భడవా! మూతి మీద మీసాలు?" విశ్వనాధం జవాబు చెప్పలేదు.
    మీసాలు తీయించి, స్నానం చేసేవరకు విశ్వనాధాన్ని ఇంట్లోకి రానివ్వలేదు. సుబ్బావదాన్లు గారి అంతటి చండశాసనుడు!
    విశ్వనాధం కాలేజీలో పూర్తిగా మారిపోయాడు. కూడా చదువుతున్న వాళ్ళల్లో ఓబులు రెడ్డి అని కర్నూలు జిల్లా విద్యార్ధి ఒకడు ఉండేవాడు. అతడు విపరీతమైన 'ఆవేశి' అతనికి కోపం వచ్చిందంటే ప్రళయదుద్రుడై పొయ్యేవాడు. తెల్లవాణ్ణి చూస్తె చాలు, వాడి రక్తం కళ్ళ చూస్తాననే వాడు. బ్రిటీష్ ప్రభుత్వం పేరు చెబితే చాలు, అతని మాటల్లో, కళ్ళల్లో నిప్పులు కురిసేవి. అతడి నేస్తం వల్ల చదువులకు దూరమై రాజకీయాలకు దగ్గరయ్యాడు విశ్వనాధం.
    అంతటితో అతని జీవిత గతి మారిపోయింది. పూర్తిగా రాజకీయావాదై పోయాడు. తన కొడుకేదో లాయరై ఊళ్ళే లుతాడనుకుంటే అతడి లాగై పోయినందుకు చాలా విచార పడ్డారు, రామనధయ్య గారు. కాలేజీలో ప్రారంభమైన రాజకీయ జీవితం నిరాటంకంగా సాగింది. పెళ్ళి చేస్తే కొడుకు ఇంటి పట్టున పడి ఉంటాడనుకుని రామనధయ్య గారు కొడుక్కు పెళ్ళి చేశారు. లాభం లేకపోయింది. ఈ పదిహేనేళ్ళ లో విశ్ననాధయ్య పాల్గొనని సభలు లేవు. చేయించని హత్తాళ్ళు లేవు. కలుసుకొని మాట్లాడని నాయకులు లేరు. స్తాపించని సంఘాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తూరు జిల్లా రాజకీయసౌధానికి విశ్వనాధయ్య ఒక స్తంభమై పోయారు. కానీ --
    రాజకీయాలు అతి ప్రమాదకరమైనవి. అందులో పైకి రావాలంటే ఒక్క ఆత్మశుద్ధి చాలదు. మరింకెన్నో కావాలి. అవి విశ్వనాధయ్యకు లేవు. అందులోనూ రాజకీయాలు ఏనాడూ మధ్యతరగతి కుటుంబీకునికి అచ్చి రాలేదు. రాజకీయాలలో పైకి వచ్చిన వాళ్ళు లక్షాధికారులు , కొద్దిగా బిక్షాదికారులు. విశ్వనాధయ్య రాజకీయాలలో పైకి రాలేకపోయారు. "వర్కర్' గా చేరిన విశ్వనాధయ్య పదిహేనేళ్ళ తరువాత కూడా 'వర్కర్' గానే మిగిలి పొయ్యాడు. కాని అతనికున్న ఆస్తి యావత్తూ హరించుకు పోయింది.


Next Page 

WRITERS
PUBLICATIONS