Previous Page Next Page 

కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 4

   
                                       పుత్రోత్సవము
    
    ఆ శుభవర్తమానము రయమ్మున దూతలు వచ్చి తెల్ప భూ
    మీశుఁడు పుణ్యముల్ పులకరించినయట్లు, చిరంతనమ్ములౌ
    ఆశలు పూఁచినట్లు, మధురాశయముల్ ఫలియించినట్లు, రా
    కా శశి కౌముదీయ లతికల్ బ్రతుకంతయుఁ బ్రాకినట్లుగాన్-
    
    తళతళలాడు మంగళపతాకలతో, మణితోరణాలతో
    కళకళలాడు శాక్య కటకంబునకుం గొనితేరఁ బంచె ము
    ద్దుల హృదయేశ్వరిన్; పసిఁడిదోసిళులన్ నిజమోదబాష్పపుం
    గళికలవంటి రత్నగుళికల్ వెదజల్లుచు బీదసాదకున్.
    
    పంకజపత్రనేత్ర లిరుప్రక్క పరామరిసింప, రత్న ప
    ల్యంకిక నెక్కి రాణి జయలక్ష్మివలెన్ నగరమ్ము సొచ్చె, ప్రే
    మాంకమునందు స్వీయహృదయప్రతిబింబమువంటి బాలమీ
    నాంకమనోజ్ఞమూర్తి జననాంతరభాగ్యము లొల్కవోయఁగన్.
    
    చల్లనితల్లి పెద్దదొరసాని కుమారుని గన్నవార్త యు
    త్ఫుల్ల సరోజ సౌరభము పోలిక, వెన్నెలవాక కైవడిన్,
    పిల్లనగ్రోవిపాట వలె, ప్రేమ సుధారస మాధురీ క్రియన్
    పల్లెల పట్టణావళులఁ బ్రాకె క్షణక్షణవర్దమానమై.
    
    "నేఁటికి శాక్యవంశ రజనీద్విజరా జుదయించె నమ్మ! యే
    నాఁటి తపఃఫలమ్మొ వినినాముగదే వరహాలవార్త; నో
    పాటలగంధులార! పసిపాపను జూతము రం" డటంచు న
    వ్వీటివధూటు లెల్ల నృపవేశ్మముఁ జొచ్చి రలంకృతాంగులై.
    
    కొందరు పద్మలోచనలు, కొందరు బాలరంగలోచనల్,
    కొందరు మీనలోచనలు, కొందరు చారుచకోరలోచనల్,
    వందలు వేలుగా కపిలవస్తువు మేడలు డిగ్గివచ్చి రా
    నందమునం గుమారుని గనంగ నపాంగరుచుల్ చెలంగఁగన్
    
    అందము చిందులాడినది; ఆశలు రాసులువోసికొన్న; వా
    నందము పొంగులెత్తినది; నవ్వులు పువ్వులవానలైన; వే
    మందిరమందుఁ గన్న సుకుమార శుభోదయ కౌతుకమ్ములే!
    విందులె! దానధర్మములె! వేడుకలే! ప్రియభాషణంబులే!
    
    అంచితభక్తిమై నృపతులందరు దూతచయమ్ము వెంటఁ బు
    త్తెంచిరి పూజ్య శాక్యజగతీపతి పుత్త్రమహోత్సవార్ధమై
    కాంచన ఘంటికా కలిత గంధగజాళి, మణి ప్రసాథనో
    దంచిత వాజిరాజి, సముదాత్త మనోహర మాలికావళిన్.
    
    పిల్లనగ్రోవులున్, నెమిలిపించెములున్, గురువిందపేర్లు, గల్
    గల్లున మ్రోగుగంట, లరకాటుకకన్నులు, గవ్వపోగులున్,
    తెల్లని పాలపూసలు, సుదీర్ఘ శరీరము లుల్లసిల్ల శో
    భిల్లిరి భిల్లు లెల్ల జయపెట్టుచు రాజగృహాంగణమ్మునన్.
    
    కండెలు, కంకులున్, బనసకాయలు, తీయని నారికేళపుం
    బొండము, లారగాచి వడపోసిన కమ్మని యావునేతితో
    నిండినకుండ లౌదలల నింపి, కరమ్ముల ముద్దబంతి పూ
    దండలు దాల్చి, కాఁపుగరితల్ సని రంతిపురమ్ము సేరఁగన్.
    
    తీయనిజున్నులున్, పుటకతేనియలున్, పులిగోళ్ళు, జాళువా
    చాయ కురంగశాబములు, చామరముల్, మృగనాభి, ముంత క
    జ్జాయము, లిప్పపూలు, ఘనసారము, పున్గు, జవాది, యాదిగా
    కోయదొరల్ నృపాలకునకున్ గొనివచ్చి రుపాయనంబులన్.
    
    ఎటు గనినన్ మహోత్సవములే! విజయధ్వజ విభ్రమమ్ములే!
    కటక కలస్వనమ్ములె! సుఖంకర కంకణ నిక్వణమ్ములే!
    భట పటల ప్రమోదభర పర్యటనమ్ములె! ప్రోజ్జ్వల న్నటీ
    నట నటనమ్ములే! మణి గణాంచిత మంగళ తోరణమ్ములే!
    
                                     అసిత మహర్షి
    
    ఎన్ని యుగాలనుండియొ తపించుచు శైల గుహాంతరాలలో
    నున్న మహర్షి దివ్యమహిమోల్లసితుం డసితుండు మాయకుం
    జిన్ని నిసుంగు పుట్టిన విశేష మెరింగి, యపార భక్తి సం
    పన్నమనస్కుఁడై కపిలవస్తువుకున్ విజయమ్ముసేసినన్-
    
    అసితమహర్షి నత్యధికహర్షముతోఁ గొనితెచ్చి యాసన
    మ్మొసఁగెను శాక్యభూపతి; శుభోదయ మాయ ప్రశాంతమాధురీ
    మసృణ మనోజ్ఞ దివ్య సుషమా సుకుమారు కుమారు కౌతుకో
    ల్లసిత విలోచనాంచలములన్ మునిమౌళికిఁ జూపనెంచినన్.
    
    అంతటిలో ప్రజావతియు - అక్క మనస్సు గ్రహించి, వచ్చి బా
    లెంత కరమ్ములందు పవళించిన బాలుఁ బరిగ్రహించి త
    త్కాంతిమయూఖమాలికలు కన్నులవిం దొనరించు, బాల భా
    స్వంతుని దెచ్చి దివ్యమునిచంద్రుని ముందర దోయిలించినన్.
    
    పండిన బ్రహ్మవర్చసము ఫాలము నిండ, సువర్ణపీఠిఁ గూ
    ర్చుండిన మౌని లేచి, కలశోదధి వీచిక మఱ్ఱియాకుపై
    పండిన బాలునిం గురుతుపట్టినటుల్ తలయూచి, యున్నవాఁ
    డుండినయట్లె తన్మయత నొందె నిమేషము నిర్నిమేషుఁడై.

    "అంతటివారు పాల్కడలి నంతయుఁగాదని తల్లిప్రక్కలో
    నింతటివారలై అటమటింతురటే యిటు పాలకోసమై!!
    ఎంతటివారొ నిన్ను ప్రసవించినవారును పెంచువార! లే
    నెంతటివాడ నీ మహిమ లెంచఁగ! నీ కలరూపెరుంగఁగా!"
    
    ఏమి తలంచెనో మరి మునీంద్రుఁడు! బాలుని గాంచి-రాణి నె
    మ్మోమును గాంచి - మింటిదెసమోమయి కన్నులనింపె బాష్పముల్;
    'స్వామి!' యనెన్ మహీపతి ససంభ్రముఁడై కరముల్ మొగిడ్చి; తా
    నా మునినాథుఁ డొక్క దరహాసముతో జననాథుఁ దేరిచెన్.
    
    ముద్దులుమూటగట్టు నవమోహన శాక్యకిశోరమూర్తి క్రొ
    న్నిద్దపు నీలినిగ్గుల కనీనికలం గని విశ్వరూపమున్
    బెద్దయు పొంగె; భక్తిఁ బ్రణమిల్లె; బ్రదక్షిణ సల్పెఁ; బెక్కుమా
    ర్లద్దుకొనెన్ స్తనంధయు పదాంబుజముల్ మునిమౌళి మౌళిపై.
    
    "వీఁడు తమోహరుండు; ప్రభవిష్ణుఁడు; సర్వజగద్విధాతయౌ
    వాఁడు; జనించినాఁడు భగవానుఁడు భారతభాగ్యరాశియై;
    నేఁడు కృతార్ధుఁడన్; జని పునీతము; శాంతిసుధాస్రవంతు లీ
    రేడు జగమ్ములందు వెలయించు ఘనుం గనుఁగొన్న వీకనుల్."
    
                                     మాయాదేవి
    
    అని బహుధా ముదంపడి నిజాత్మ; పదంపడి, రా జొనర్చు న
    ర్చనలు గ్రహించి యేగె మునిరాజు; ప్రజావతి, తల్లి చల్ల చ
    ల్లని యొడిలో మనోరథఫలమ్మును జేర్చెను, మెల్ల మెల్ల వా
    ల్గనులు ప్రమోదబాష్పకణికానవమౌక్తిక శుక్తులై తగన్.
    
    అనుపమ దివ్యదీప్తిమయమై, శతకోటి శశాంక ముగ్ధ మో
    హన కమనీయతాకలితమై, హృదయంగమ మైన యాత్మనం
    దను వదనమ్ము శాంతిసదనమ్ము సవిత్రి సకౌతుకమ్ముగాఁ
    గని కని, కాంచి కాంచి, మరి కన్గొని కన్గొని - స్నేహపూర్ణయై.
    
    "నా మధుమూర్తి! నా జయనినాదమ! నా రతనాలరాశి! నా
    నోములపంట! నా చిరమనోరథసంపద! నా తపస్య! నా
    ప్రేమఫలమ్మ! నా మనసు పెన్నిధి! సన్నిధి సేసినావె కం
    దామరలందు సాత్విక సుధల్ విరజిమ్ముచు నిన్నినాళ్ళకున్!!
    
    చిక్కని ముంగురుల్ మిసిమి చెక్కులు ప్రేమసుధాఫ్లుతమ్ములౌ
    దృక్కులు చూచినన్ తనివిదీరద యెంతకు; నింతకాలమో
    చక్కనితండ్రి! యే తెరలచాటున; ఏ తెలిమబ్బు మాటునన్
    నక్కితివోయి? మాయ నయనమ్ములకున్ గనరాని దొంగవై.

    ఎన్ని భవమ్ములందొ గడియించిన పున్నెము పండి నేఁడిటుల్
    చిన్ని కిశోరమూర్తి! దయచేసితి నా ప్రణయాంకపీఠికిన్;
    పున్నమ చందమామ సరిపోలిన నీ ముఖమందు తీయనౌ
    వెన్నెల త్రావిత్రావి రుచి వీడవు మామక దృక్చకోరముల్!!
    
    మంగళమూర్తి! నీ మధుర మంజుల మోహన రూప మాధురీ
    గాంగ తరంగ డోలల సుఖంబుగ నూగిన యంతరంగ మే
    భంగి భరింపఁగల్గు భవబంధము? నిన్ను లయించుకొన్న క
    న్నుంగవ యెట్లు వెండియు కనుంగొను నీ వికటప్రపంచమున్?"


 Previous Page Next Page