Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 5


    
    అక్క మరొక్క వింతవిధమై యిటుపల్కుచునుండ నశ్రువుల్
    చెక్కులఁ జాలువారుటలు చెల్లి ప్రజావతి సంశయించి, యా
    ప్రక్కకుఁజేరి కన్నుగవ పైట చెరంగున నొత్తి, మెల్లఁగా
    నక్కునఁ జేర్చుకొన్నది ప్రియమ్మున సోదరి యుత్తమాంగమున్.
    
    అది విభ్రాంతియొ! విహ్వలత్వమొ! యనన్యాసక్తియో! భక్తియో!
    హృదయావేగమొ! పారవశ్యమొ! రసోద్రేకమ్మొ! సమ్మోహమో!
    తుది పర్యాయము దేవి ముద్దుగొని పుత్త్రున్ నేత్రముల్ మూసికొ
    న్నది; పారాడిన వామె ఫాలఫలకానన్ దివ్యలావణ్యముల్!
    
    మూసిన లోచనద్వయము మూసిన యట్లనె యుండె; మోవిఁ గై
    సేసిన హాసరేఖ గయిసేసిన యట్లనె యుండె; రాదు ని
    శ్వాసము; లేదయో హృదయ సంచాలనంబును; దేవి జీవితా
    శ్వాసము పూర్తియయ్యె; భగవంతుని దెంతటి రాతిగుండెయో!
    
    కలకలలాడు మేడల మొగమ్ములు నీడల కాలవాలమై
    వెలవెలబోయె; శాక్యపురవీథుల ఖేదపయోదమాలికల్
    వలఁగొనె; నాఁటి రే కపిలవస్తురమ్ము శ్మశానవాటిలో
    వెలుతురు గాంచి గుండెలు  ద్రవించెను కొండలచక్రవర్తికిన్!!
    
                                                             ప్రజావతి
    
    'శారద చంద్రబింబ' మనఁజాలిన బాలుని మోము కాంతు లిం
    పారుచునుండ, తండ్రి హృదయమ్మునఁ గ్రమ్మిన చిమ్మచీకటుల్
    దూరములై చనందొడఁగె; దుఃఖసుఖమ్ములు శాశ్వతమ్ములై
    మారకయున్న మానవుల మానసముల్ భరియింపఁగల్గునే!
    
    ఘనమగు గాలివానకుఁ బ్రకంపితమై ధృతి దూళి వంగి క్రుం
    గిన వటవృక్ష మెట్టులో చిగిర్చి సముత్థితమై యథాస్థితిన్
    గనెడి విధమ్మునన్ ధరణికాంతుఁడు ప్రాణసతీ వియోగ సం
    జనిత విషాదమున్ విడి ప్రసన్నత నందె క్రమక్రమమ్ముగన్.
    
    'సర్వార్ధమ్ములు వీని కారణమునన్ సంసిద్ధమౌ' నంచు నం
    తర్వాణుల్ పలుకంగ, ముద్దులొలుకంగన్ 'సర్వ సర్వంసహా
    సర్వస్వ'మ్మగు నాత్మనందనునకున్ ' సర్వార్ధసిద్ధుం'డటం
    చుర్వీశానుఁడు పేరుపెట్టె మదిలో నుత్సాహ ముప్పొంగఁగన్.
    
    అనుఁగుంబిడ్డకు కన్నతల్లి యనురాగాంకమ్ము లేదన్న లో
    టు నివారించెను పిన్నతల్లి; తల్లిదండ్రుల్ కూర్మి పాలింపఁగా
    జననాథాత్మజుఁ డొప్పె నెల్లరు తనున్ 'సర్వార్ధసిద్ధుం' డటం
    చును 'సిద్ధార్దుఁ' డటంచు 'గౌతముఁ' డటంచున్ బేర్మి లాలింపఁగన్.
    
    పండెను యాచకప్రతతి భాగ్యఫలంములు; కర్షకాళికిన్
    నిండెను బండ్లు పాఁతరలు; నిత్యము బానలనిండ దుగ్ధముల్
    పిండెను గోగణమ్ము; నిరుపేదకు "లే"దను పల్కొకండె లే
    కుండెను, శాక్యరాట్తనయు డూయలలోఁ జిరునవ్వులొల్కఁగన్.
    
    అలరెన్ దిక్కులు దివ్యదీధితులతో; ఆనందసంధాత్రియై
    వెలసెన్ ధాత్రి సమస్త సస్యములతో; వెల్గొందె సూర్యేందు మం
    డలముల్ కన్నులవిందుగా; పసరుతోటల్ మూఁడుపూ లారుకా
    యలుగా వర్ధిలె - వర్దమానుఁడగు సిద్దార్ధుండు దోగాడఁగన్.
    
    అలకలు దువ్వుచున్, జలకమార్చుచు, చక్కదనాల మోముపై
    తిలకము దిద్ది కజ్జలము దీర్చుచు ముద్దుల బుజ్జగించుచున్,
    పులకితగాత్రయై యనుఁగుపుత్రు ప్రజావతి పెంచుచుండె క
    న్నులఁ గయిసేయుచున్ చిరమనోరథమౌక్తిక మాలికావళుల్.
    
    'చిదిమిన పాలుగారు నునుజెక్కులవే! అవె చిట్టిచిట్టి లేఁ
    బెదవులు! ముద్దుమూతి మురిపింపు లవే;' యని అక్క కళ్ళలో
    మెదల, సవిత్రి పుత్త్రు ననిమేషము గన్గొణు, నెత్తు, ముద్దిడున్,
    చెదరు మనమ్ముతో! వడకు చేతులతో! తడి కన్నుదోయితో!
    
    'అమ్మ' యటంచు ముద్దుకొడు కల్లనఁ బల్కుట గాంచి నేత్రముల్
    చెమ్మగిలెన్ ప్రజావతికి; చిన్నికుమారుఁడు మెల్ల మెల్లగా
    గుమ్మము దాటి తప్పటడుగుల్ వాడిగా నిడుచుండ నేవియో
    కమ్మని సౌప్తికప్రణయగాథలు బాధలు రేపే రేనికిన్.
    
    తల్లి కుమారు నెత్తుకొని దవ్వుల దాగుడుమూతలాడు జా
    బిల్లిని జూపి బువ్వ దినిపింపగ, తెల్లని చందమామలో
    నల్లని మచ్చ గానబడినన్ గడు సందియమంది నందనుం
    డొల్లఁడు భోజనమ్ము, నెదియో మది యోజనసేయునట్లుగన్.
    
    కేలఁ బదాంబుజంబును లగించి ముఖాంబుజమందు; కౌతుక
    శ్రీలు వెలార్చు బాలుని, సుశీలుని మేలి కడాని తూగుటు
    య్యేలల నూపుచున్ జగములే మరచెన్ జనయిత్రి; ప్రక్కయే
    పాలసముద్రమై! యనుఁగుపట్టియె బాలముకుందమూర్తియై!

                                     బంగారు తండ్రి
    
    వేద వీథులందు విహరించు దేవుని
    పొత్తులందు నెత్తి, బుగ్గ గిల్లి,
    యుగ్గుపాలు వోసి యుయ్యేలలో నుంచి
    యాలపించె జనని జోలపాట.
    
    "నన్ను గన్నతండ్రి; నా భాగ్యదేవత!
    చిన్నినాన్న! గోల సేయఁబోకు!
    గోలసేతువేని కొంటెవాఁ డందురు;
    కొంటెవైన మామ కూతు నీఁడు.
    
    ఏడ్వబోకుమయ్య, ఇందీవరేక్షణ!
    కన్నుదోయి నీరు గ్రమ్మునోయి!
    పాలుగారు కనుల నీలాలుగారిన
    చందమామమోము కందునేమొ!!
    
    అదిగొ కొండ! కొండ కల్లంత దూరాన
    కాన గలదు - కానలోనఁ  గలఁడు
    నల్ల మోము దొంగ - పిల్ల లల్లరి సేయ
    పట్టుకొనును పెద్ద బార సాచి.
    
    వెండి గిన్నె నిండ వేడి పాయసముతో
    పైడి గిన్నె నిండ పాలతోడ
    చందమామ రావె! జాబిల్లి దిగి రావె!!
    బోసిబాబు నోట పోసిపోవె!
    
    జోలపాడి నేను జోకొట్టుచుందును
    కన్నుమూయుమోయి! కన్నతండ్రి!
    నిద్రలోన వచ్చి ని న్నెత్తుకొందురు
    స్వర్గసీమలోని చంద్రముఖులు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS