LATEST NEWS
బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపక్ ప్రకాష్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.  అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడు కానప్పటికీ ఆయనను మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు   మంత్రి దీపక్ ప్రకాష్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి  నోటీసులు జారీ చేసింది. అసలు ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి  సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) పరిధిని మరోసారి చర్చకు తెచ్చింది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి.  గత ఏడాది నవంబర్ 20, 2025న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా నియమించారు. ఆ సమయానికి ఆయన చట్టసభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ ఆరు నెలల లోపు అంటే ఈ ఏడాది మే 20 నాటికి అసెంబ్లీ లేదా మంండలికి ఎన్నిక కావాలి.  అయితే, ఈ ఆరు నెలల గడువు ముగియడానికి ముందే బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాత మంత్రివర్గం  రద్దయింది. ఆ సమయంలో దీపక్ ప్రకాష్ కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 22 రోజుల విరామం అనంతరం బీహార్‌లో  సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పాత కేబినెట్‌లో ఉన్న దీపక్ ప్రకాష్‌ను మళ్లీ అదే పంచాయతీరాజ్ మంత్రిగా కొత్త ప్రభుత్వంలోకి తీసుకున్నారు.   రాజ్యాంగ నియమాల ప్రకారం ఆయనకు లభించిన మొదటి ఆరు నెలల మినహాయింపు గడువు మే 20తో ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని, చట్టసభ సభ్యత్వం లేని వ్యక్తికి మళ్లీ కొత్తగా మరో ఆరు నెలల సమయం లభిస్తుందా అనే అంశంపైనే ఇప్పుడు న్యాయపోరాటం నడుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది. దీని ప్రకారం చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మాత్రమే మంత్రిగా కొనసాగేందుకు వీలుంటుంది. ఆ నిర్ణీత గడువులోగా అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యత్వాన్ని సాధించాలి. ఈ మినహాయింపు అనేది ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందనీ..  కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన ఈ రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి, ఆరు నెలల గడువును పునరుద్ధరించడం కుదరదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇలాంటి నియామకాలను అనుమతిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తూ, రెండోసారి ఇలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
  ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అయితే, స్పోర్ట్స్ కోటా కింద జరిగిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దీనికి అదనంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పోస్టుల కేటాయింపులో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి (కమ్మ వర్గానికి) కొమ్ముకాసారనే సరికొత్త కుల సమీకరణాల కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో జర్నలిస్ట్ గోపీ విశ్లేషణ. రాజకీయ వ్యూహాలు - ప్రతిపక్షాల దాడి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మెగా డీఎస్సీని "దగా డీఎస్సీ"గా అభివర్ణిస్తూ సుదీర్ఘ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని అమలు చేశారు. కేవలం అర్హత లేని వారికి, చివరి ర్యాంకుల్లో ఉన్న వారికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు కట్టబెట్టారని, యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి, అనుకూల వాలంటీర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ప్రకాశం జిల్లా వంటి ఉదాహరణలతో అధికారిక జాబితాలు తిరుగుతున్నప్పటికీ, రాజకీయంగా ఈ అంశాన్ని మరింత పెద్దది చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం పెంచాలనేది ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ప్రకాశం జిల్లా లిస్టులో ఎంపికైన 16 మందిలో అత్యధికులు బీసీ, ఎస్సీ అభ్యర్థులే ఉన్నప్పటికీ, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఆపడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వ స్పందన - పరిణామాలు ఈ ఆరోపణలపై కోనా శశిధర్, అజయ్ జైన్ వంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి 2012 నాటి జీవో ప్రకారమే నియామకాలు జరిగాయని వివరణ ఇచ్చినప్పటికీ, అది కేవలం పాలనాపరమైన వివరణగానే మిగిలిపోయింది. రాజకీయంగా వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి కేవలం అధికారులు సరిపోరు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ వివాదంపై స్పష్టత ఇవ్వకపోవడం ప్రజల్లో అనుమాన బీజాలు నాటడానికి కారణమవుతోంది. గతంలో (2014-19 మధ్య) కూడా పింక్ డైమండ్ వివాదం, సీఐల ప్రమోషన్ల విషయంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ ఇలాగే మౌనం వహించింది. ఆ మౌనమే ఆనాడు ఆ పార్టీ కొంపముంచింది. ఇప్పుడు కూడా అదే తప్పు పునరావృతమవుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకునే చందంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విపక్షాల అబద్ధపు ప్రచారాలను లేదా సామాజిక మాధ్యమాల దుష్ప్రచారాన్ని ప్రారంభంలోనే ఖండించకపోతే, అవే కాలక్రమేణా నిజాలుగా చలామణి అయ్యే ప్రమాదం ఉంది. ఐటీ కంపెనీల పెట్టుబడులు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, తమ ప్రతిష్టాత్మక మొదటి సంతకంపై వస్తున్న నిందలను కడుక్కోలేకపోవడం పెద్ద మైనస్. నారా లోకేష్ ఇప్పటికైనా స్పందించి పూర్తి వివరాలతో పారదర్శకంగా ప్రెస్ మీట్ పెట్టకపోతే, ఈ "మెగా డీఎస్సీ అవినీతి" ముద్ర కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తు ఎన్నికల్లో తీరని నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షం నాటిన అనుమానపు మొక్కలు వృక్షాలుగా మారకముందే ప్రభుత్వం మేల్కొనాల్సి ఉంది. ఈ అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ వి.వి.రావు మరో జర్నలిస్ట్ గోపీ మధ్య జరిగిన పూర్తి చర్చను  టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
  భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది. స్థానిక ఆకాంక్షలు, ప్రాంతీయ సెంటిమెంట్లు జాతీయ పార్టీల ద్వారా నెరవేరవనే నమ్మకంతో ఒకప్పుడు వెలుగులోకి వచ్చిన ప్రాంతీయ శక్తులు, నేడు తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో బలమైన జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకే దేశం - ఒకే పార్టీ అనే దిశగా అడుగులు పడుతున్నాయనే ఆందోళన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఢిల్లీ పెద్దల వ్యూహాత్మక ఎత్తుగడలు మరియు వాటి పర్యవసానాలపై ఒక లోతైన ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ  విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర అధికార పీఠంపై ఉన్న జాతీయ పార్టీ, ఎన్డీఏ కూటమిని విస్తరించడమే కాకుండా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏ పార్టీ ఏ దిశగా నడవాలి, ప్రజలు ఏ విషయాలను చర్చించాలి అనే అంశాలను సైతం ఢిల్లీ నుంచే నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన ప్రాంతీయ శక్తులు నేడు రక్షణాత్మక ధోరణిలో పడిపోయాయి. గతంలో ఇందిరా గాంధీ హయాంలో ప్రాంతీయ పార్టీలలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రస్తుత కాలంలో అది ఒక వ్యవస్థీకృత నమూనాగా మారిపోయింది. ఢిల్లీ వ్యూహాలు మరియు ఆపరేషన్ విధానం ప్రతిపక్ష పార్టీలలోని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, అంతర్గత కలహాలను వాడుకోవడంలో ఢిల్లీ పెద్దలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఇంచార్జులను నియమించి, సమాంతర నిఘా వ్యవస్థల ద్వారా నిత్యం నివేదికలు సేకరిస్తున్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య వైషమ్యాలు ఉన్నా, తక్షణమే రంగంలోకి దిగి ఆపరేషన్లు పూర్తి చేసేంత వేగంగా ఈ యంత్రాంగం పనిచేస్తోంది. మరోవైపు, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచేందుకు అనుకూలమైన సరికొత్త పార్టీలను తెరపైకి తీసుకురావడం (పొలిటికల్ ఫ్లోటింగ్) ఈ వ్యూహంలో భాగమే. తమిళనాడులో అన్నామలై లాంటి నేతల ద్వారా కొత్త సమీకరణాలను సృష్టించడం, బెంగాల్ మరియు ఏపీ లాంటి రాష్ట్రాలలో స్థానిక నాయకత్వాలను ఇరుకున పెట్టడం దీనికి ఉదాహరణలు. దీనికి తోడు, జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలను తమ అదుపులో ఉంచుకుని ప్రజాభిప్రాయాన్ని సైతం ప్రభావితం చేస్తున్నారు. నిర్దిష్ట నాయకులకు అనుకూలంగా సర్వేలు సృష్టించడం, వారు ఢిల్లీ అడుగులకు లొంగిపోక తప్పదనే వాతావరణాన్ని మీడియా డిబేట్ల ద్వారా ప్రచారం చేయడం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. వ్యూహాత్మక పర్యవసానాలు (Implications) ఈ తరహా కేంద్రీకృత రాజకీయాల వల్ల ప్రాంతీయ పార్టీల నాయకులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు ఒక స్థిరమైన రాజకీయ వైఖరిని తీసుకోలేక, తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. లొంగిపోతే తమ ఉనికి పోతుందనే భయం, ఎదురిస్తే ఎదురయ్యే పరిణామాలను తట్టుకోగలమా అనే సంశయం వారిని వేధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లాంటి రాష్ట్రాలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత మరియు దాడులు కూడా స్థానిక స్వయంకృత అపరాధాలు మరియు రాజకీయ ఒత్తిళ్ల కలయికేనని చెప్పవచ్చు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కేవలం కేంద్ర పెద్దల అవసరాలపైనే ఆధారపడే ప్రమాదం ఉంది. "మీరు ఎవరికి ఓటు వేసినా, చివరికి వారు మా కాంపౌండ్ లోనే ఉండాలి" అనే నియంతృత్వ ధోరణి బలపడితే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు అవుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన నిధులు, హక్కుల గురించి నిలదీసే బలమైన ప్రాంతీయ నాయకత్వం కరువవుతోంది. ఒకప్పుడు "కేంద్రం అనేది ఒక మిథ్య" అని ధైర్యంగా ప్రకటించిన ఎన్టీఆర్ లాంటి నాయకులు నేటి కాలంలో ఊహకు కూడా దొరకడం లేదు. రాబోయే కాలంలో 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అనే నినాదం నిజమైతే, అది క్రమంగా ఏకపార్టీ ఆధిపత్యానికి దారితీసి ప్రాంతీయ ఆకాంక్షలను పూర్తిగా సమాధి చేసే అవకాశం ఉంది. పూర్తి ఇంటర్వ్యూ టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి  
ALSO ON TELUGUONE N E W S
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పరిచయమైనా జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " అనేసరికి నెటిజన్స్ చాలామంది చాల ప్రశ్నలే అడిగారు. "మేడం మీకు ఇష్టమైన  ఏదైనా క్యారెక్టర్ గుండు చేయించుకోవాలి అని డిమాండ్ చేస్తే మీరు చేయించుకుంటారా " అని అడిగారు ఒక నెటిజన్. "లేదు నేను చేయించుకోను. నటన ఇష్టం ఫ్యాషన్ ఉంది కానీ నా పరిధి దాటి పర్సనల్ గా ఎక్స్పీరిమెంట్ చేయను " అని చెప్పింది జ్యోతి పూర్వాజ్. "కిల్లర్ మూవీ విఎఫ్ఎక్స్  ఎడిట్స్ లో ఉంది . అది చాలా టైం తీసుకుంటుంది కొంచెం టైం పడుతుంది." "టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకే హీరోతో చేయాలనుకుంటున్నారు " "పవన్ కళ్యాణ్ గారితోనే నటించబోతున్న" అని చెప్పింది. "నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ" అని అడిగేసరికి "ఓజి మూవీలోని ఇన్ ది స్ట్రీట్స్  ఆఫ్ ఫైర్ " అనే సాంగ్ పెట్టింది. "మీరు ఓజి 2 లో నటిస్తున్నారా " "ఏమో " అని చెప్పింది. "లవ్ , అటాచ్మెంట్ మీ దృష్టిలో ఏంటి " "అటాచ్మెంట్ లో గ్రోత్ ఉండదు డిపెండెన్సీ ఉంటుంది. లవ్ లో అలా ఉండదు. లవ్ అంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎగరడానికి రెక్కలు ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఎంచుకున్న దారిలో ప్రయాణించేలా ప్రేమ ప్రోత్సహిస్తుంది " అని చెప్పింది. "మాయ అనే మైక్రో మూవీలో ఎక్కువగా రొమాన్స్ లేదు ఎందుకు " "రొమాన్స్ కోసమో ఇంటిమసీ కోసమో మైక్రో ఫిలిమ్స్ తీయడం లేదు. లాంగ్ రన్ లో నిలబడడానికి అన్ని రకాల ఎమోషన్స్ ని అందించడానికి ఆడియన్స్ కి ఏది ఇష్టమో అది అందించడానికి " అని చెప్పింది. "పూర్వజ్ అన్నలో మీకు ఇష్టమైనది ఏంటి అతని కథలా అతని మనసా " "అతను సినిమాల కోసమే పుట్టాడు. మాస్టర్ పీస్ మూవీ విఎఫ్ ఎక్స్ లో ఉండగా   కిల్లర్ మూవీ స్టార్ట్ చేసాడు. అది కూడా ఇప్పుడు  విఎఫ్ ఎక్స్ లో ఉండగా ఇప్పుడు మైక్రో మూకీ మూవీస్ స్టార్ట్ చేసాడు. అతని సినిమాలోనే జీవిస్తాడు చాలా డెడికేటెడ్. " అని చెప్పింది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా ,హీరోగా సత్తా చాటుతూ ఫుల్ బిజీ మోడ్ లో ఉన్నాడు జి.వి. ప్రకాశ్ కుమార్(Gv Prakash kumar). రీసెంట్ గా  రాజకీయ రంగ ప్రవేశంపై జీవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ కుమార్ మాట్లాడుతు నా సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేను. ఆ తర్వాత నా పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయిస్తాను. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవుల కోసం కాదు. ప్రజలకి నిజాయితీగా సేవ చేయడమే నా ఉద్దేశ్యం.భవిష్యత్తులో నా వ్యక్తిగత ఆలోచనలు,  ఆశయాలకి  ఖచ్చితంగా సరిపోయే ఒక సరైన వేదిక దొరికితే, కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కీలక వ్యాఖ్యలతో భవిష్యత్తులో  పాలిటిక్స్‌లోకి రావడం 100 శాతం ఖాయమని బలమైన సంకేతాలు ఇచ్చాడు. Also read: ఈ వారం థియేటర్స్ మూవీని మిస్ అవ్వకండి  ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమకి  చెందిన  రాఘవ లారన్స్ కూడా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరికొందరు స్టార్ హీరోలు కూడా తమిళనాడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, తమిళనాట రాజకీయాలను శాసించే దిశగా అడుగులు వేస్తోందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.   
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాను షేక్ చేసిన 'దేవర' సినిమాలోని 'ఫియర్ సాంగ్' హంగామాను అభిమానులు ఇక పక్కన పెట్టేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, అంతకు మించిన ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ ఇంట్రో సాంగ్‌ను 'డ్రాగన్' చిత్రం కోసం మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటంతో ఈ ఇంట్రో సాంగ్ ఏ రేంజ్‌లో ఉండబోతోందోనని ఇండస్ట్రీ వర్గాలతో పాటు నందమూరి అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవి బస్రూర్ మార్క్ ఊరమాస్ బీట్స్ ఎన్టీఆర్ ఎనర్జీకి తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ క్రేజీ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రస్తుతం లాక్ అయింది. రాబోయే జూలై నెలలో శ్రీలంకలోని అందమైన, వైవిధ్యభరితమైన లొకేషన్లలో ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నారు. కేవలం ఇంట్రో సాంగ్ మాత్రమే కాకుండా, సినిమాలోనే అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా అదే షెడ్యూల్‌లో శ్రీలంకలోనే ప్లాన్ చేశారు. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ యాక్షన్ బ్లాక్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. పాటతో పాటు ఈ ఫైట్ సీక్వెన్స్‌ను కూడా జూలై నెలలోనే పూర్తి చేసి, సినిమా మేజర్ టాకీ పార్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.  
  ఏమైనా ఈ వారం సినీ ప్రేమికుల రాశి ఫలం ఒక రేంజ్ లో ఉందనుకుంటా!. లేదంటే ఒకటా రెండా ఏడు సినిమాలు సినీ ప్రేమికుల కోసం పోటాపోటీగా థియేటర్స్ లో అడుగుపెడుతున్నాయి. దీంతో ఈ వారం సినీ ప్రేమికులని కదిలిస్తే చాలు సదరు చిత్రాలు విశేషాలని చెప్తూనే ఉంటారు. మరి ఆ సినిమాల లిస్ట్ చూద్దాం. ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న  చిత్రం సమంత లీడ్ రోల్‌లో చేసిన 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి దర్శకత్వంలో 100 శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన యువతి, తన గతాన్ని దాచుకుని ఎలా సర్దుకుపోయింది, ప్రమాదం ఎదురైనప్పుడు తన పోరాట పటిమని  ఎలా చూపించింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యాక్షన్ కామెడీ డ్రామా రూపొందింది. రిలీజ్ డేట్ 19 . మరోవైపు హారర్ కామెడీ జానర్‌ని ఇష్టపడే సినీ అభిమానుల కోసం 'చెట్టు మీద దయ్యం నాకేం భయం' అనే చిత్రం 18 నే వస్తుంది. తల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక పాడుబడిన ఫామ్‌హౌస్‌లో పరిశోధన కోసం వెళ్లిన నలుగురు యువకులకు ఎదురైన భయానక, నవ్వులు పూయించే వింత సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు విలక్షణ నటుడు విజయ్ ఆంటోని  'నూరు సామి' (తెలుగు టైటిల్ నూరు దేవుళ్ళు) 19 న  రిలీజ్ కానుంది. సమాజంలో ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందిస్తూ సాగే ఎమోషనల్ కంటెంట్ డ్రామాగా నిలవనుంది. Also read: నేరుగా ఆహా వేదికగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పేరు తెలిస్తే షాక్ అవుతారు సీనియర్ నటుడు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తూ చేసిన  సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' (త్రిమూర్తులు బదిలీ) సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ జీవితంలో జరిగే బదిలీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 19 రిలీజ్ డేట్. అలాగే వారణాసి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన భావోద్వేగాల చిత్రం 'చిన్న చిన్న ఆసై', వన్ సైడ్ లవ్ స్టోరీ నేపథ్యంతో వస్తున్న రొమాంటిక్ డ్రామా 'దీవానా' కూడా జూన్ 19న విడుదల కాబోతున్నాయి. సామాజిక కోణంలో ప్రయోగాత్మకంగా వస్తున్న 'LGBT: ఒక న్యాయ పోరాటం' అనే మూవీ సైతం 19 నే వస్తుంది. ఇలా ఏడూ  వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన  చిత్రాలు ఒకే వారంలో రిలీజ్ అవుతూ సినీ ప్రేమికులని, తెలుగు  ప్రేక్షకులని చూసి అసూయ పడే పరిస్థితిని కల్పిస్తున్నాయి.  
తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా, జాతీయ అవార్డు గ్రహీతగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ (Dhanush), ఇప్పుడు ఒక తండ్రిగా తన జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు వేయబోతున్నారు. నటనతో పాటు కథా రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన, ఇప్పుడు తన పెద్ద కుమారుడు యాత్ర రాజా(Yatra Raja)ను వెండితెరకు పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మరెవరో కాదు, స్వయంగా ధనుషే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతుండటం విశేషం. ఈ మెగా డెబ్యూ ప్రాజెక్ట్ గురించిన వార్తలు ప్రస్తుతం సౌత్ సినీ వర్గాల్లో ఒక రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ధనుష్, దర్శకుడిగా కూడా మంచి సక్సెస్ రేట్‌ను కలిగి ఉన్నారు. 'పా. పాండి' (2017) సినిమాతో దర్శకుడిగా మారి మొదటి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తన 50వ చిత్రం 'రాయన్' (2024)కు ఆయనే దర్శకత్వం వహించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించారు. ఆ తర్వాత వరుసగా 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (2025), 'ఇడ్లీ కడై' (2025) వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేశారు. ఇప్పుడు యాత్ర హీరోగా రాబోయే ఈ కొత్త చిత్రం ధనుష్ కెరీర్‌లో 5వ డైరెక్టోరియల్ వెంచర్ కావడం విశేషం. నిజానికి యాత్రకు సినిమా వాతావరణం, కెమెరా వెనుక జరిగే పనుల పట్ల ఇప్పటికే మంచి అవగాహన ఉంది. ధనుష్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'రాయన్' షూటింగ్ సమయంలో యాత్ర సెట్స్‌లోనే ఉండి, తండ్రి పర్యవేక్షణలో తెర వెనుక పనులను (Behind-the-scenes) నిశితంగా గమనిస్తూ విలువైన అనుభవాన్ని గడించారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నేరుగా కెమెరా ముందుకు వచ్చి కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు. చెన్నై నగరంలో అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ ప్రోమో షూట్ నిర్వహించనున్నారు, ఆపై గ్రాండ్ లెవెల్‌లో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ భారీ డెబ్యూ ప్రాజెక్ట్‌ను 'ఆర్‌టేక్ స్టూడియోస్' (RTake Studios) సంస్థ నిర్మించనుంది. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ చిత్రం 'D55'ను కూడా నిర్మిస్తుండటం గమనార్హం.  అంతేకాదు, ఈ సినిమాకు అత్యున్నత సాంకేతిక బృందం పని చేయబోతోంది. ధనుష్ సినిమాలకు ఎన్నో అద్భుతమైన విజువల్స్ అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశం ఉంది. కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని బలమైన సమాచారం. ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కోలీవుడ్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ స్టార్ కిడ్ ఎంట్రీ ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.  అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి.   మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.   ఈ వర్షాకాలంలో  తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా,  ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు  కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..   డ్రైనేజీ రంధ్రాలు.. వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా  ఎదురయ్యే  సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి.  కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ  రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి. కలుపు మొక్కలు.. గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి,  ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో  కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి. ప్రూనింగ్.. ప్రూనింగ్ అంటే కత్తిరింపు.  కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు  మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి. సపోర్ట్.. వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ  లేదా తమలపాకు  వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే  తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి. కంపోస్ట్, కొత్త మట్టి.. తరచుగా కురిసే వర్షాల వల్ల  కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి,  మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది. కొన్ని గార్డెనింగ్ టిప్స్.. తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి  బాగా  పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి  మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు  మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.                                            *రూపశ్రీ.
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా.  కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను  వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది.  తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.  తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి  దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది. పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి  లభిస్తాయని భావించడం.  ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం,  ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు,  వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి.. తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు.  అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై  దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి  సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి. ఇది ముఖ్యం.. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం.  ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.                                          *రూపశ్రీ.
  పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్లలకు కొన్ని పనులను నేర్పిస్తారు.  మగపిల్లలకు ఆ పనులతో అవసరం లేదని,  అది మగవారి బాధ్యత కాదని చెబుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరినీ స్వయం సమృద్ధిగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే నేర్పించే కొన్ని పనులు మగపిల్లలకు కూడా నేర్పిస్తే వారు మనుషులుగా ఎదగడమే కాకుండా వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.  ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇంటి పనులలో సహాయం.. చిన్న వయస్సు నుండే పిల్లలకు ఇంటి పనులలో పాల్గొనడం నేర్పించాలి. వారి గదిని సర్దుకోవడం, గిన్నెలను వాటి స్థానంలో పెట్టడం, బట్టలు మడతపెట్టడం లేదా బల్ల సర్దడం వంటి పనులు వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇంటిని చూసుకోవడం అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వంట.. వంట చేయడం అనేది ఒక జీవన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. .  టీ తయారు చేయడం, టిఫిన్  సిద్ధం చేయడం, సాధారణ భోజనం వండటం వంటి ప్రాథమిక వంట నైపుణ్యాలను మగపిల్లలకు కూడా నేర్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటారు. మహిళలను గౌరవించడం.. చిన్నతనం నుండే పిల్లలకు ఇతరుల పట్ల గౌరవం, ఇతరులతో సున్నితంగా ఉండటం వంటివి   నేర్పించాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి, సమానత్వానికి అర్హులని కొడుకులకు నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని సానుకూలంగా తీర్చిదిద్దుతుంది. ఎమోషన్స్.. అబ్బాయిలకు తరచుగా ఏడవకూడదని,  బాధపడకూడదని సలహా ఇస్తుంటారు, కానీ మానసిక ఆరోగ్యానికి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అబ్బాయిలకు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం, సహాయం అడగడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్పించాలి. ఆర్థిక బాధ్యత.. చిన్న వయస్సు నుండే పిల్లలకు పొదుపు చేయడం, బడ్జెట్ వేసుకోవడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం వంటి అలవాట్లను నేర్పించడం వల్ల, వారు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా వరకు ఆర్థికంగా పొదుపు చేసుకోవాలని,  ఎక్కువగా ఖర్చులు పెట్టకూడదని కేవలం ఆడపిల్లలకు చెబుతూ  ఉంటారు. కానీ భవిష్యత్తులో వివాహం తర్వాత ఆడపిల్లలు పొదుపు చేస్తూ.. మగవారు ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదగదు.  అందుకే ఆర్థిక బాధ్యత ఆడపిల్లలకు, మగపిల్లలకు ఇద్దరికీ నేర్పాలి.                                    *రూపశ్రీ.
బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపక్ ప్రకాష్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.  అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడు కానప్పటికీ ఆయనను మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు   మంత్రి దీపక్ ప్రకాష్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి  నోటీసులు జారీ చేసింది. అసలు ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి  సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) పరిధిని మరోసారి చర్చకు తెచ్చింది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి.  గత ఏడాది నవంబర్ 20, 2025న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా నియమించారు. ఆ సమయానికి ఆయన చట్టసభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ ఆరు నెలల లోపు అంటే ఈ ఏడాది మే 20 నాటికి అసెంబ్లీ లేదా మంండలికి ఎన్నిక కావాలి.  అయితే, ఈ ఆరు నెలల గడువు ముగియడానికి ముందే బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాత మంత్రివర్గం  రద్దయింది. ఆ సమయంలో దీపక్ ప్రకాష్ కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 22 రోజుల విరామం అనంతరం బీహార్‌లో  సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పాత కేబినెట్‌లో ఉన్న దీపక్ ప్రకాష్‌ను మళ్లీ అదే పంచాయతీరాజ్ మంత్రిగా కొత్త ప్రభుత్వంలోకి తీసుకున్నారు.   రాజ్యాంగ నియమాల ప్రకారం ఆయనకు లభించిన మొదటి ఆరు నెలల మినహాయింపు గడువు మే 20తో ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని, చట్టసభ సభ్యత్వం లేని వ్యక్తికి మళ్లీ కొత్తగా మరో ఆరు నెలల సమయం లభిస్తుందా అనే అంశంపైనే ఇప్పుడు న్యాయపోరాటం నడుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది. దీని ప్రకారం చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మాత్రమే మంత్రిగా కొనసాగేందుకు వీలుంటుంది. ఆ నిర్ణీత గడువులోగా అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యత్వాన్ని సాధించాలి. ఈ మినహాయింపు అనేది ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందనీ..  కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన ఈ రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి, ఆరు నెలల గడువును పునరుద్ధరించడం కుదరదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇలాంటి నియామకాలను అనుమతిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తూ, రెండోసారి ఇలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
  ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అయితే, స్పోర్ట్స్ కోటా కింద జరిగిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దీనికి అదనంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పోస్టుల కేటాయింపులో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి (కమ్మ వర్గానికి) కొమ్ముకాసారనే సరికొత్త కుల సమీకరణాల కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో జర్నలిస్ట్ గోపీ విశ్లేషణ. రాజకీయ వ్యూహాలు - ప్రతిపక్షాల దాడి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మెగా డీఎస్సీని "దగా డీఎస్సీ"గా అభివర్ణిస్తూ సుదీర్ఘ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని అమలు చేశారు. కేవలం అర్హత లేని వారికి, చివరి ర్యాంకుల్లో ఉన్న వారికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు కట్టబెట్టారని, యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి, అనుకూల వాలంటీర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ప్రకాశం జిల్లా వంటి ఉదాహరణలతో అధికారిక జాబితాలు తిరుగుతున్నప్పటికీ, రాజకీయంగా ఈ అంశాన్ని మరింత పెద్దది చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం పెంచాలనేది ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ప్రకాశం జిల్లా లిస్టులో ఎంపికైన 16 మందిలో అత్యధికులు బీసీ, ఎస్సీ అభ్యర్థులే ఉన్నప్పటికీ, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఆపడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వ స్పందన - పరిణామాలు ఈ ఆరోపణలపై కోనా శశిధర్, అజయ్ జైన్ వంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి 2012 నాటి జీవో ప్రకారమే నియామకాలు జరిగాయని వివరణ ఇచ్చినప్పటికీ, అది కేవలం పాలనాపరమైన వివరణగానే మిగిలిపోయింది. రాజకీయంగా వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి కేవలం అధికారులు సరిపోరు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ వివాదంపై స్పష్టత ఇవ్వకపోవడం ప్రజల్లో అనుమాన బీజాలు నాటడానికి కారణమవుతోంది. గతంలో (2014-19 మధ్య) కూడా పింక్ డైమండ్ వివాదం, సీఐల ప్రమోషన్ల విషయంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ ఇలాగే మౌనం వహించింది. ఆ మౌనమే ఆనాడు ఆ పార్టీ కొంపముంచింది. ఇప్పుడు కూడా అదే తప్పు పునరావృతమవుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకునే చందంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విపక్షాల అబద్ధపు ప్రచారాలను లేదా సామాజిక మాధ్యమాల దుష్ప్రచారాన్ని ప్రారంభంలోనే ఖండించకపోతే, అవే కాలక్రమేణా నిజాలుగా చలామణి అయ్యే ప్రమాదం ఉంది. ఐటీ కంపెనీల పెట్టుబడులు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, తమ ప్రతిష్టాత్మక మొదటి సంతకంపై వస్తున్న నిందలను కడుక్కోలేకపోవడం పెద్ద మైనస్. నారా లోకేష్ ఇప్పటికైనా స్పందించి పూర్తి వివరాలతో పారదర్శకంగా ప్రెస్ మీట్ పెట్టకపోతే, ఈ "మెగా డీఎస్సీ అవినీతి" ముద్ర కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తు ఎన్నికల్లో తీరని నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షం నాటిన అనుమానపు మొక్కలు వృక్షాలుగా మారకముందే ప్రభుత్వం మేల్కొనాల్సి ఉంది. ఈ అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ వి.వి.రావు మరో జర్నలిస్ట్ గోపీ మధ్య జరిగిన పూర్తి చర్చను  టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
  భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది. స్థానిక ఆకాంక్షలు, ప్రాంతీయ సెంటిమెంట్లు జాతీయ పార్టీల ద్వారా నెరవేరవనే నమ్మకంతో ఒకప్పుడు వెలుగులోకి వచ్చిన ప్రాంతీయ శక్తులు, నేడు తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో బలమైన జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకే దేశం - ఒకే పార్టీ అనే దిశగా అడుగులు పడుతున్నాయనే ఆందోళన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఢిల్లీ పెద్దల వ్యూహాత్మక ఎత్తుగడలు మరియు వాటి పర్యవసానాలపై ఒక లోతైన ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ  విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర అధికార పీఠంపై ఉన్న జాతీయ పార్టీ, ఎన్డీఏ కూటమిని విస్తరించడమే కాకుండా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏ పార్టీ ఏ దిశగా నడవాలి, ప్రజలు ఏ విషయాలను చర్చించాలి అనే అంశాలను సైతం ఢిల్లీ నుంచే నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన ప్రాంతీయ శక్తులు నేడు రక్షణాత్మక ధోరణిలో పడిపోయాయి. గతంలో ఇందిరా గాంధీ హయాంలో ప్రాంతీయ పార్టీలలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రస్తుత కాలంలో అది ఒక వ్యవస్థీకృత నమూనాగా మారిపోయింది. ఢిల్లీ వ్యూహాలు మరియు ఆపరేషన్ విధానం ప్రతిపక్ష పార్టీలలోని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, అంతర్గత కలహాలను వాడుకోవడంలో ఢిల్లీ పెద్దలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఇంచార్జులను నియమించి, సమాంతర నిఘా వ్యవస్థల ద్వారా నిత్యం నివేదికలు సేకరిస్తున్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య వైషమ్యాలు ఉన్నా, తక్షణమే రంగంలోకి దిగి ఆపరేషన్లు పూర్తి చేసేంత వేగంగా ఈ యంత్రాంగం పనిచేస్తోంది. మరోవైపు, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచేందుకు అనుకూలమైన సరికొత్త పార్టీలను తెరపైకి తీసుకురావడం (పొలిటికల్ ఫ్లోటింగ్) ఈ వ్యూహంలో భాగమే. తమిళనాడులో అన్నామలై లాంటి నేతల ద్వారా కొత్త సమీకరణాలను సృష్టించడం, బెంగాల్ మరియు ఏపీ లాంటి రాష్ట్రాలలో స్థానిక నాయకత్వాలను ఇరుకున పెట్టడం దీనికి ఉదాహరణలు. దీనికి తోడు, జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలను తమ అదుపులో ఉంచుకుని ప్రజాభిప్రాయాన్ని సైతం ప్రభావితం చేస్తున్నారు. నిర్దిష్ట నాయకులకు అనుకూలంగా సర్వేలు సృష్టించడం, వారు ఢిల్లీ అడుగులకు లొంగిపోక తప్పదనే వాతావరణాన్ని మీడియా డిబేట్ల ద్వారా ప్రచారం చేయడం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. వ్యూహాత్మక పర్యవసానాలు (Implications) ఈ తరహా కేంద్రీకృత రాజకీయాల వల్ల ప్రాంతీయ పార్టీల నాయకులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు ఒక స్థిరమైన రాజకీయ వైఖరిని తీసుకోలేక, తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. లొంగిపోతే తమ ఉనికి పోతుందనే భయం, ఎదురిస్తే ఎదురయ్యే పరిణామాలను తట్టుకోగలమా అనే సంశయం వారిని వేధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లాంటి రాష్ట్రాలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత మరియు దాడులు కూడా స్థానిక స్వయంకృత అపరాధాలు మరియు రాజకీయ ఒత్తిళ్ల కలయికేనని చెప్పవచ్చు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కేవలం కేంద్ర పెద్దల అవసరాలపైనే ఆధారపడే ప్రమాదం ఉంది. "మీరు ఎవరికి ఓటు వేసినా, చివరికి వారు మా కాంపౌండ్ లోనే ఉండాలి" అనే నియంతృత్వ ధోరణి బలపడితే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు అవుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన నిధులు, హక్కుల గురించి నిలదీసే బలమైన ప్రాంతీయ నాయకత్వం కరువవుతోంది. ఒకప్పుడు "కేంద్రం అనేది ఒక మిథ్య" అని ధైర్యంగా ప్రకటించిన ఎన్టీఆర్ లాంటి నాయకులు నేటి కాలంలో ఊహకు కూడా దొరకడం లేదు. రాబోయే కాలంలో 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అనే నినాదం నిజమైతే, అది క్రమంగా ఏకపార్టీ ఆధిపత్యానికి దారితీసి ప్రాంతీయ ఆకాంక్షలను పూర్తిగా సమాధి చేసే అవకాశం ఉంది. పూర్తి ఇంటర్వ్యూ టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి  
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా భోజనం చేయడం,  తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్,  ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి.  గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా  సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.  అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట.  PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని  అధ్యయనాల్లో తేలింది. లివర్ ప్రమాదం కూడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి. రానిటిడిన్.. రానిటిడిన్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది. కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి.                                   *రూపశ్రీ.
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి రకరకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు.  ఈ సమస్యను చాలామంది ఎదుర్కుంటూ ఉంటారు. కానీ ముఖం మీద మొటిమలు తగ్గాలన్నా,  గొండ్ కటీరా లేదా బాదం బంక చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఖరీదైన ఉత్పత్తులు ఎందుకు పనిచేయవంటే.. ఖరీదైన ఉత్పత్తులు  చర్మంపై ఎందుకు పనిచేయడం లేదని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. దానికి సమాధానం ఏమిటంటే ఆ ఉత్పత్తులలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలను తరచుగా చర్మానికి మేలు చేయడానికి కలుపుతారు, కానీ అవి ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఎక్కువ. బాదం బంక ఎలా పనిచేస్తుందంటే.. శరీరంలో వేడి చర్మంపై ఎర్రటి బొబ్బల రూపంలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి బాదం బంకను ఉపయోగించవచ్చు. బాదం బంకను  రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట, ఆ స్ఫటికాలు జెల్లీలా కనిపిస్తాయి. దీనికి కొంచెం చల్లటి నీరు కలపాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని  కలపాలి. ఈ పానీయాన్ని తాగాలి.  దీనిని 3 నుండి 4 రోజుల పాటు తాగడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. బాదం బంక ప్రయోజనాలు.. బాదం బంక తినడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది,  దాని వృద్ధాప్యాన్ని నెమ్మదించే లక్షణాలు కలిగి  ఉంటుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది.            మొటిమలు, ముడతలు, ఎండదెబ్బ వంటి సమస్యలను తగ్గించగలదు. దీని ఫలితంగా కాంతివంతమైన , యవ్వనమైన చర్మం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.                                       *రూపశ్రీ.
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ, టీ లు పేపర్ కప్పులలో తాగుతుంటారు.  దుకాణ దారులు కూడా పేపర్ కప్పులు ఉపయోగిస్తారు.  ఎక్కడో చాలా కొద్దిమంది మాత్రమే స్టీల్ లేదా గాజు గ్లాసులు ఉపయోగిస్తారు. ఉద్యోగం నిమిత్తం బయట ఉండేవారు లేదా రోజూ అలా వాకింగ్ కు వెళ్లి వస్తూ బయట టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా గల వారు రోజూ పేపర్ కప్పులో తాగడం జరుగుతుంది.  ఎప్పుడో ఒకసారి ఇలా పేపర్ కప్పులో తాగితే పర్లేదు.. కానీ. రోజూ పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. పేపర్ కప్పులు ఆరోగ్యానికి కూడా మంచివని అనుకుంటారు, పైగా పర్యావరణానికి కూడా హాని కలిగించవు అనుకుంటారు. కానీ పేపర్ కప్పులను టీ, కాఫీ తాగడానికి ఉపయోగించడం గురించి చాలా షాకింగ్ నిజాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  దాని గురించి తెలుసుకుంటే.. పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం వల్ల కలిగే నష్టాలు.. మైక్రోప్లాస్టిక్.. చాలా కాగితపు కప్పుల లోపల పాలిథిలిన్ లేదా ప్లాస్టిక్  పలుచని పొర ఉంటుంది.  దీనిలో వేడి టీ పోసినప్పుడు, మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలై పానీయంలో కలిసిపోతాయి, ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రసాయనాలు.. కొన్ని కాగితపు కప్పుల పూతలో ఉండే రసాయనాలు, అధిక వేడికి గురైనప్పుడు పానీయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పులలో కాఫీ, టీ  ఎక్కువ కాలం పాటు తాగడం  వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చని వైద్యులు  చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత.. ప్లాస్టిక్ ఆధారిత కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. పేపర్  కప్పులను పదేపదే ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. పర్యావరణం.. కాగితపు కప్పులు అని పిలిచినప్పటికీ, వాటిలో ఉండే ప్లాస్టిక్ పూత కారణంగా వాటిని పూర్తిగా రిసైకిల్  చేయడం కష్టమట. దీనివల్ల పర్యావరణ కాలుష్య సమస్య పెరగవచ్చట. కాఫీ, టీ  ఎలా తాగితే సురక్షితం.. టీ తాగడానికి స్టీల్, గాజు లేదా మట్టి కప్పులను వాడాలి. కాగితపు కప్పులలో వేడి పానీయాలను పదేపదే తాగడం మానుకోవాలి. కాగితపు కప్పులను ఉపయోగిస్తుంటే, క్వాలిటీ  కప్పులను మాత్రమే ఎంచుకోవాలి.  వేడి పానీయాలను కప్పులో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందరగా తాగాలి.                                       *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.