కొడాలి నాని, వల్లభనేని వంశీ నోళ్లకు తాళాలు.. భయమా జాగ్రత్తా?

posted on: Feb 6, 2026 9:50AM

బూతులు, దూషణలు వైసీపీ ఎకో సిస్టమ్ లో భాగంగా మారిపోయాయి. అయితే అలా నోరు పారేసుకునే వారిలో చాలా మంది అనూహ్యంగా సైలెంటైపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో బ్యాడ్ మౌత్ లీడర్లలో చాలా మంది మౌనమే నా భాష అన్నట్టుగా మారిపోయారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోరెట్టుకు పడిపోవడమే కాకుండా... ఇష్టారీతిగా దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన నేపథ్యంలో వారిప్పుడు పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉండటమే. మౌనంగా ఉంటే మేలు.. బయటకు వచ్చి కేసుల చిక్కులను కోరి ఆహ్వానించడం ఎందుకన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.

అయితే వైసీపీలో అంబటి రాంబాబురూటే సెపరేటు.  ఆయనకు నోటిని అదుపులో పెట్టుకోవడం అన్న సంగతి తెలియదు. జగన్ మెప్పు కోసం, జగన్ ప్రశంస కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించు కోకపోవ డానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు. అది పక్కన పెడితే తాజాగా గత నాలుగు రోజులుగా ఏపీలో అంబటి వ్యవహారమే పెద్ద చర్చగా, రచ్చగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నోరు పారేసుకున్నందుకు ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రోడ్డు మీదకు వచ్చారు. రాజమహేంద్రవరం వెళ్లి అంబటిని పరామర్శించలేదు కానీ, గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడమే కాకుండా... అంతకు అంతా బదులు తీర్చుకుంటామంటూ చంద్రబాబు, తెలుగుదేశంలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ వైసీపీయులలోనే ఒక సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ సరే గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజకీయమైలేజీ కోసం చేయగలిగినంత చేసి వెళ్లారు. మరి పార్టీలో మిగిలిన వారి సంగతేంటి? బూతుపురాణాల స్పెషలిస్టుగా పేరుపొందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంబటికి మద్దతుగా కనీసం గొంతు కూడా సవరించుకోలేదేంటి? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమయ్యారు? కనీసం అంబటికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా వారికి ఎందుకు మనసు రావడం లేదు?  

సాక్షాత్తూ పార్టీ అధినేత గుంటూరు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే కనీసం అటువైపు తొంగి చసేందుకు కూడా వారు ఎందుకు ధైర్యం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా హద్దూపద్దూ లేకుండా బూతుపురాణంతో రెచ్చిపోయిన ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి,  జగన్ హయాంలో పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదెందుకని అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

ఇప్పుడు వైసీపీలో గొంతు వినిపిస్తున్న వారు అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ లు మాత్రమే. అంబటికి మద్దతుగా పేర్నినాని, జోగి రమేష్ లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వీరే వైసీపీ ఎకో సిస్టమ్ లోని బూతుల పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగులోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...