కాకినాడ GGH లో నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్

  కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై  నలుగురు ఆర్ఎంసి  ఉద్యోగులు  సస్పెన్షన్ విధించారు. ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తి,  టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో A1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు.  ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నివేదిక ఆధారంగా నిందితులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్‌పి బిందుమాధవ్‌ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు  
Publish Date: Jul 11, 2025 10:50PM

గవర్నర్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

  రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు  వివరించారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి, పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. బనకచర్ల అంశంపై గవర్నర్‌‌తో చర్చించినట్లు తెలుస్తోంది
Publish Date: Jul 11, 2025 10:16PM

ఎంపీ రేణుకా చౌదరికి ఊరట

  మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. 2014 లో ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది.  2014లో తనకు, లేదా తన భర్తకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి రేణుకా చౌదరి చీటింగ్ చేశారంటూ భూక్య రాంజీ భార్య కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. అయితే రేణుకపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పును వెలువరించారు. రేణుక తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు.   
Publish Date: Jul 11, 2025 9:42PM

అల్లు అస్సలూహించలేదు కదూ!?

  నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లు తున్నట్టుగానూ భావిస్తున్నారట ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మేటరేంటంటే.. ఈయనగారి ఈమాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేని పోని గొడవకు కారణమయ్యాం కదాని తెగ ఫీలవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్.  పుష్పరాజ్ గా ఫేమస్ అయిన దానికంటే.. నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్లినపుడే ఎక్కువగా ట్రోల్ అయ్యారాయన. అంతేనా కుటుంబంలో లేని పోని గొడవలు. నానా యాగీ జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే.. మెగాహీరోల్లో సాయి ధరమ్ వంటి కొందరు హీరోలు అల్లువారబ్బాయిని అన్ ఫాలో చేయడం వంటి పరిణామక్రమాలు. ఆపై అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చుకోవల్సి రావడం.. ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటి భార్యామణి బంధువు కదాని.. వెళ్లినందుకు ఇంత హైరానా హంగామా జరిగాయి. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరా? అన్న క్వశ్చిన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్ట్రబ్ చేస్తోందట.  తాను సపోర్టుగా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కయిన టీడీపీలోకి వెళ్లడమంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతి పెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. మరొక పక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపుల్లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా.. నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్- స్టేట్ అవార్డులు రెండొచ్చినా.. రవీ తీసిన ఈ ఎదురు దెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు.  ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే, ఒకటికి రెండు దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాలనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒక వేళ టీడీపీలోకి వెళ్లిపోతే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లినట్టా? లేక ఫ్యాన్ పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ.
Publish Date: Jul 11, 2025 9:27PM

కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్

  హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఏఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది. కల్తీ కల్లు ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ   ఇప్పటికే  హైదర్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది . నలుగురు వ్యాపారులు  రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.  కల్తీ కల్లు తాగి 8 మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.   
Publish Date: Jul 11, 2025 9:16PM

చెలరేగిన బుమ్రా..ఇంగ్లండ్ ఆలౌట్

  లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు 251/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో 102 పరుగులను ఇంగ్లాండ్‌ జోడించింది. ఆ మూడు వికెట్లనూ బుమ్రానే తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్‌(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.  
Publish Date: Jul 11, 2025 8:24PM

కొత్త రేషన్​కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

  తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్‌ పంపిణీ చేసింది.  త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల కార్డు రేషన్ కార్డులిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
Publish Date: Jul 11, 2025 8:10PM

వీసా ఫీజుల బాదుడు.. మరో షాక్ ఇచ్చిన ట్రంప్

  బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు  ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచింది. ఈ ఫీజును రూ. 26 వేలకు పెంచింది. ఇది వచ్చే ఏడాది అంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు సైతం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. అంటే.. యూఎస్‌లో పర్యటన, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వెళ్లే వారు ఈ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పర్యాటన కోసం వెళ్లే వీసా ఫీజును రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది.  యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. అయితే వీటిని వెనక్కి ఇవ్వరు. దీనికి సర్ ఛార్జ్ సైతం అదనంగా వసూల్ చేస్తారు. వీసా జారీ సమయంలో ఈ మొత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ ఫీజు ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి.బీ 1, బీ 2 అంటే.. టూరిజం, బిజినెస్ వీసాలు.. ఎఫ్, ఎమ్ అంటే.. స్టూడెంట్ వీసాలు.. హెచ్ 1 బీ అంటే వర్క్ వీసాలు.. జె అంటే విజిటర్ వీసాలకు తప్పకుండా ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిప్లమాటిక్ వీసా కలిగిన వారికి అంటే.. ఏ, జీ వీసా కలిగి వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పర్యటకులు, వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారిపై ఈ ఫీజుల ప్రభావం పడనుంది. బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ప్రస్తుతం సుమారు రూ. 15 వేలు ఉంటే.. దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ పీజు కింద రూ. 21 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో మొత్తం ఖర్చు రూ. 35 వేల వరకు ఉండనుంది. 2025లో హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ ఫీజు స్వల్పంగా ఉంటే.. ప్రస్తుతం ఆ ధర భారీగా పెరిగినట్లు అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ తరహా ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల హెచ్ 1 బీ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.ఇక వీసా ఇంటిగ్రిటి ఫీజును కొన్ని సందర్భాల్లో మాత్రమే వెనక్కి చెల్లించనున్నారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించిన వారికి చెల్లించనున్నారు. అలాగే ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కన్నా ముందుగా అమెరికాను విడిచి వెళ్లేవారికి తిరిగి చెల్లిస్తారు.  అదే విధంగా ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగించే వారితోపాటు శాశ్వత నివాస అనుమతి పొందిన వారికి కూడా ఈ ఫీజును తిరిగి చెల్లించే అవకాశముంది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేడంతోపాటు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ కొత్త ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టానంటోంది. అలాగే ఈ ఫీజు ద్వారా అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని చూస్తోంది. ఇది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఖర్చులు భరించడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కానీ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎంతో మంది అమెరికా వెళ్లాలనుకునే సామాన్యుల కలలను ఛిద్రం చేసినట్లు అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Publish Date: Jul 11, 2025 7:37PM

కుక్కల దాడి... క్రిందపడి 4 ఏళ్ల పాప మృతి

  నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామంలో జయరాముడు, రామేశ్వరి దంపతులకు కూతురు మధుప్రియ ( 4 సంవత్సరాల) పై వీధి కుక్కలు గుంపు ఒకసారిగా దాడి చేయడం జరిగింది. తీవ్ర భయాందోళనకు గురైన పాప  పరుగులు పెడుతూ కింద పడింది.వెంటనే గమనించిన స్థానికులు కుక్కలను తరిమి పాపను రక్షించారు. అప్పటికే సృహ కోల్పోయిన పాపను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లడం జరిగింది.ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. బాదిత బంధువులు మీడియాతో మాట్లాడుతూ... గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం  వల్ల భయాందోళనకు గురవుతున్నామన్నారు. నంద్యాల, బనగానపల్లె వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలపై కుక్కలు దాడికి చేస్తున్నాయన్నారు.బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు.అదేవిధంగా ప్రధాన రహదారిపై ఉన్న స్కూల్ ఎదుట స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నామని రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించాలని  అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు.  
Publish Date: Jul 11, 2025 7:27PM

కొడాలి నాని మౌనం.. భయమా? జ్ణానోదయమా?

అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని..  అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. ఆ అధికారం అండ చూసుకుని తెలుగుదేశం అధినాయకత్వంపైనా, జనసేనానిపైనా నోటికి అడ్డూ అదుపూ లేదన్న రీతిలో రెచ్చిపోయిన కొడాలి నాని.. రాష్ట్రంలో వైసీపీ ఓటమి, గుడివాడలో తన ఓటమి తరువాత దాదాపు అడ్రస్ లేకుండా పోయారు. ఓటమి తరువాత ఇంచుమించు ఏడాది పాటు తనను వరుసగా ఐదు సార్లు గెలిపించిన గుడివాడ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్న సమయంలో  విపక్ష పార్టీల నాయకులపై బూతుల వర్షం కురిపించడం తన హక్కు అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని.. ఆ అధికారం దూరమయ్యేసరికి నోరెత్తితే ఓట్టు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నానిలో ఈ మార్పు జ్ణానోదయమా? అని కొందరు ఒకింత అనుమానపడ్డారు కూడా.. కానీ అది జ్ణానోదయం కాదనీ, జాగ్రత్త మాత్రమేననీ కొడాలి నానే ఒక సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు. తాను మౌనంగా ఉండటానికి కారణం అధకారం లేకపోవడమే తప్ప.. మరోటి కాదని కుండబద్దలు కొట్టారు. ఒక సందర్భంలో మీడియాతో ముక్తసరిగా మాట్లాడిన నాని జనం తమ అధికారాన్ని పీకేశారనీ, అంటే ఉద్యోగం నుంచి తొలగించారనీ అందుకే మౌనంగా ఉన్నాననీ చెప్పారు. అది కూడా గత ఫిబ్రవరిలో అప్పటికి రిమాండ్ ఖైదీగా ఉన్న తన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జనగ్ తో పాటుగా విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన సందర్భంలో కొడాలి నాని ఓటమి తరువాత తొలి సారిగా మీడియాతో మాట్లాడారు. అప్పుడు కూడా తన శైలికి భిన్నంగా ఒక్క బూతు మాట కూడా లేకుండా అతి జాగ్రత్తగా మాట్లాడారు.  ఆ సందర్భంగానే జనం తన ఉద్యోగం పీకేశారనీ..అందుకే మాట్లాడటం లేదని చెప్పారు. అక్కడితో ఆగకుండా కేసులంటే భయం లేదని గప్పాలు పోయారు. అయితే పరిశీలకులు మాత్రం కొడాలి నానిది మేకపోతు గాంభీర్యం మాత్రమేననీ, ఏ క్షణంలో పోలీసులు అరస్టు చేస్తారా అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందనీ అప్పట్లో విశ్లేషించారు. ఆ కారణంగానే  జగన్ ఆదేశించినా కూడా తెలుగుదేశం కూటమి సర్కార్ పై చిన్నపాటి విమర్శ కూడా చేయకుండా.. యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.   ఇదంతా పక్కన పెడితే.. తెలుగుదేశం కూటమి అధకారంలోకి వచ్చిన ఏడాది కాలం పూర్తయినా కొడాలి నాని అరెస్టు కాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు, కబ్జాలు, దౌర్జన్యాలు సహా కొడాలి నానిపై లేక్కలేనన్న ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయా కేసులలో నిందితులుగా ఉన్న పలువురు అరెస్టయ్యారు. అలా అరెస్టైన వారిలో నానికి అత్యంత సన్నిహితులుగా ఉణ్న వారు కూడా ఉన్నారు. అయినా కొడాలి నాని విషయంలో పోలీసులు అరెస్టు వరకూ వెళ్లకపోవడానికి కారణమేంటన్న చర్చ తెలుగుదేశం శ్రేణుల్లోనే జరుగుతోంది. అయితే అరెస్టు అవుతారు అన్న సమయంలో కొడాలి నాని అనారోగ్యం కారణంగా తొలుత హైదరాబాద్, ఆ తరువాత మంబై ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత నుంచీ ఏం మాట్లాడితే ఏ మౌతుందో అన్న భయంతో పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. సరిగ్గా ఇక్కడే.. కూటమి ప్రభుత్వం కూడా కొడాలి నాని అరెస్టు విషయంలో తొందర ఎందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నది. వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన గుడివాడ నియోజకవర్గంలోనే కొడాలి నాని పట్ల పిసరంతైనా సానుభూతి వ్యక్తం కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో.. అందునా ఆనారోగ్యంతో ఉన్న నానిని అరెస్టు చేసి ఆయనకు జనంలో సానుభూతిని ప్రోది చేసేలా వ్యవహరించడం ఎందుకు? అన్నట్లుగా తెలుగుదేశం కొడాలి నాని విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Jul 11, 2025 5:39PM

ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోలు లొంగుబాటు

  ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోలపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.  వీరు కుతుల, నెలనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.25,000 ఆర్థిక సహాయం, ఇళ్ళు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా కొంత కాలంగా కేంద్రం మవోయిజంపై ఉక్కుపాదం మోపుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేస్తున్న సంగతి తెలిసిందే.
Publish Date: Jul 11, 2025 5:35PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన రజత్ భార్గవ

  ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు. కానీ, తప్పనిసరిగా హాజరుకావాలని సిట్‌ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్‌ భార్గవ ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో లిక్కర్ పాలసీ విడుదలైన జీవోలు, లావాదేవీలు తదతర విషయాలపై సిట్‌ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్‌ విచారించి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
Publish Date: Jul 11, 2025 5:15PM

బీసీలకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం : టీపీసీసీ చీఫ్‌

  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు  కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు అని టీపీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రేవంత్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు.  బీసీ రిజర్వేషన్లు రాహుల్‌ అజెండా, రేవంత్‌ నిబద్ధత’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆర్టినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్సులు, బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్తకాదని మళ్లీ ఉద్యమం చేస్తామని రైళ్లు, బస్సులను స్తంభింపచేస్తామన్నారు. ఆర్డినెన్స్ రూపంలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత అన్నారు.     
Publish Date: Jul 11, 2025 4:38PM

తమిళ తెరపై తెలుగు రాజకీయం !

తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది.  ముఖ్యంగా.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన  హీరో విజయ్, ఆయన స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ పరిస్థితి ఏమిటి?  తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత?  టీవీకే 2026 ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుంది. అధికార డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఎఐడిఎంకేల సారథ్యంలోని కూటములలో, ఏ కూటమిని ఏ మేరకు టీవీకే ప్రభావితం చేస్తుంది?  అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి  ఇప్పడు తమిళనాడు రాజకీయాల గురించిన ఏ చర్చ వచ్చినా..  విజయ్ ప్రస్తావన లేకుండా ముగియడం లేదనడం ఇసుమంతైనా అతిశయోక్తి కాదు.   నిజానికి తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి సినీతారల ప్రభావం బలంగా ఉంటూనే వుంది. హీరో ఇమేజ్ తో అనేక మంది ప్రముఖ హీరోలు రాజకీయ అరంగేట్రం  చేశారు. అయితే, సుక్సెస్ రేట్  చాల తక్కువ. విజయ్ కు ముందు ఐదేళ్ళ కిందట 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలహాసన్  పొలిటికల్ ఎంట్రీ  ఇచ్చారు.  ఎంఎన్ఎం (మక్కల్ నీతి మైమ్) పార్టీని స్థాపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆయనతో సహా ఎంఎన్ఎం టికెట్ పై పోటీ చేసిన ప్రతి ప్రతి ఒక్కరూ ఒడి పోయారు. ఎంఎన్ఎం ఖాతా తెరవలేదు. చట్ట సభల్లో కాలు పెట్టాలనే కమల్ హసన్  కల అప్పుడు  తీర లేదు. చివరకు డిఎంకే’ పంచన చేరి రాజ్యసభలో అడుగుపెట్టారు.  అయితే విజయ్ పరిస్ధితి కూడా అంతేనా.. అంటే కాక పోవచ్చని తమిళనాడు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు.. విజయ్ రాజకీయాలను కమలహసన్  రాజకీయంతో కంటే..  మెగా స్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంతో పోల్చవచ్చని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మెగా స్టార్’ చిరంజీవి ప్లే చేసిన రోల్..  తమిళనాడులో విజయ్ ప్లే చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గతిని మార్చి వేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి,ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఆశించిన మేరకు సీట్లు గెలుచుకోలేదు. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.  కానీ..  16.32శాతం  ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా  శాతం  చీల్చడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ విజయానికి.. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షగా దోహదం చేసింది. ఆ తర్వాత మొత్తానికే చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి..  రాజ్యసభ సీటును, కేంద్రంలో మంత్రి పదవిని కానుకగా పొందారు. అది వేరే విషయం. ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఎంట్రీ వలన.. అప్పటి  ప్రతిపక్ష  తెలుగు దేశం పార్టీ భారీగా నష్ట పోయింది. ఒకటి రెండు కాదు.. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 235 స్థానాల్లో పీఆర్పీ, ప్రతిపక్ష టీడీపీ ఓటును 10,000 కంటే ఎక్కువ చీల్చించి.. వాటిలో 147 స్థానాల్లో 20,000 మరో 92 స్థానాల్లో 30.000 ఓట్లను చీల్చింది. మరో వంక ఇంచు మించుగా 40 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం 5000 ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడాతో అప్పటి ఎన్నికలలో ఓడిపోయింది. అదలా ఉంటే తాజా సర్వేల ప్రకారం హీరో విజయ్  పార్టీ ఓటు షేర్  16 శాతం క్రాస్ చేసింది. ఈ నేపధ్యంలో.. ఇదే ట్రెండ్ 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే,విజయ్ తమిళ చిరంజీవి అవుతారని అంటున్నారు. అయితే, విజయ్ పూర్తిగా ప్రతిపక్షం ఒటునే చీలుస్తారా? అధికార పార్టీ ఓటును కొల్లగొడతారా? అంటే..  రెండు ప్రధాన ద్రవిడ పార్టీలకు విజయన్ గండి కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉన్నందున ఈలోగా ఏదైనా జరగచ్చని.. విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తమిళరాజకీయాలపై చెప్పుకోదగ్గ ఆసక్తి చూపుతున్నారు. నటిగా రోజాకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో హీరోయిన్ గా ఆమెకు తమిళ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టారు. అంతకు మించి రోజా భర్త సెల్వమణి మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. తమిళ సినీరంగంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రోజా తమిళ రాజకీయాలపై దృష్టి సారించారని అంటున్నారు.  గతంలో అంటే గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కొంత కాలం పాటు రోజా పూర్తిగా తమిళనాడుకే పరిమితమయ్యారు. అప్పటిలోనే ఆమె విజయ్ పార్టీలో చేరి చక్రం తిప్పుతారన్న వార్తలు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించాయి. అయితే తరువాత ఆమె యథా ప్రకారం వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాను ఒక వైపు ఏపీ రాజకీయాలలో ఉంటూనే , తన భర్త సెల్వమణిని విజయ్ పార్టీకి దగ్గర చేస్తున్నారని అంటున్నారు.  మొత్తం మీద రోజా ఏదో ఒక మేరకు తమిళ రాజకీయాలలోనూ తన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 
Publish Date: Jul 11, 2025 4:22PM

టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి : బండి సంజయ్

  తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా అన్య మతస్తులు ఉన్నారు.. వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదన్నారు. వారికి స్వామి వారి మీద విశ్వాసం, నమ్మకం లేదు.. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదని కేంద్ర అన్నారు. అలాంటి వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పురాతన ఆలయాలను గుర్తించి, టీటీడీ నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు. కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందునే ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని సంజయ్ అన్నారు. స్వామిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదని అన్నారు. బొట్టు పెట్టుకుని వెళితే మసీదులు, చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందిని ఆయన పేర్కొన్నారు
Publish Date: Jul 11, 2025 4:03PM