విజయానికి ఓటమికి తేడాను స్పష్టంగా చెప్పే కథ!!

విజయం సాధించాలంటే ఎలాంటి మనస్తత్వం వుండాలి? వ్యక్తి ఏరకంగా ఆలోచిస్తే గెలుపు పొందగలడు? అతనిలో ఎలాంటి భావనవుండాలి? ఈ విషయాల గురించి ఒక్కొక్కరు ఒకో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారు. అయితే జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి, ఎంతో పరిణితి కలిగిన వ్యక్తి అయితే దానికి చెబుతున్న వివరణ సరైనదేనా కాదా అని చెప్పగలుగుతారు. 


ఒకానొకప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక గెలుపుకూ ఓటమికీ తేడా ఎంత??  అనే విషయం గురించి జరిగిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వ్రాసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దానికోసం ఎంతోమంది ఎన్నో విషయాలను కథలుగా రాసి పంపారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు రాసిన కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ఆ రెండు కథలలో ఒక కథను మనం చదివితే మనకు గెలుపు, ఓటమి గురించి ఓ నిర్ధిష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి. 


ఒక నట్టనడి సముద్రంలో ఒక ఓడ మునిగిపోయింది. అక్కడ అందరూ తమని తాము కాపాడుకోవడానికి అందులో ఏర్పాటు చేసిన లైఫ్ బోట్ లను, చిన్న పడవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కొద్దిమొత్తమే ఉండటంతో ఆ ఓడలో ఉన్న అందరికీ అవి సరిపోలేదు. దాంతో ఎంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సముద్రపు నీళ్లలో ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. సముద్రపు ఒడ్డు ఎంత దూరంలో ఉందొ తెలియకపోయినా ఆశతో ఈదుకుంటూ పోతున్నారు.  


ఐదుగురుమాత్రం ఎలాంటి రక్షణ లేకుండా సముద్రంలో  ఈదుతూ వున్నారు. వారికి జీవితం మీద ఆశ వారిని అలా ఈదేలా చేస్తోంది. ఒడ్డు అనేది వారికి వందల మైళ్ళ దూరంలో ఉంది. వారిలో నలుగురికి నిరాశ ఏర్పడింది. ఆఖరుకు మొసళ్ళకు ఆహారం కావలసివస్తుందే అని ఒకడు, ఈనీటిలో చావాలని భగవంతుడు రాసిపెట్టాడని మరొకడు, భార్యాపిల్లలు ఆఖరు క్షణంలో దగ్గరలేక పోయారే అని ఇంకొకడు, తన బ్యాంకులో డబ్బు ఖర్చు చేయకపోతినే అని మరొకడు, ఇలా వాళ్ళకళ్ళముందు తాము అనుభవించని సంతోషాలు, సుఖాల గురించి గుర్తు తెచ్చుకుని బాధపడసాగారు. నలుగురూ తామిక జీవించే ఆశలేదని మనస్సులో నమ్మకానికి వచ్చారు. ఆఖరుకు తమకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం భగవంతుడే అని ఆ భగవంతుని నిందించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మనస్సులో బలహీనత వచ్చిందో అప్పటినుంచీ వాళ్లు సరిగా ఈదలేక మరణించారు.


అయితే ఆ ఐదో వ్యక్తిమాత్రం “నేను చావను. భగవంతుడు నన్ను అనవసరంగా సృష్టించాడంటే నమ్మను. నేను బ్రతికి తీరాలి" అంటూ శక్తినంతా కూడగట్టుకొని ఈదడం ప్రారంభించాడు.


అతడలా ఈడుతూ ఉన్నప్పుడు దృఢనిశ్చయం లేని ఆ నలుగురూ మరణించిన ఐదు నిముషాలకే ఒక విమానం అటు రావడం, దానిలోనివారు ఈదుతున్న వ్యక్తిని చూసి రక్షించడం జరిగింది! ఓడ మునుగుతున్నపుడు కెప్టెన్ వైర్ లెస్ ద్వారా చేసిన విజ్ఞప్తి వలన ఆ విమానం అక్కడికి వచ్చిందని అతడు తర్వాత తెలుసుకున్నాడు. మరణించిన నలుగురిని గుర్తు చేసుకొని విజయానికీ ఓటమికీ తేడా ఐదు నిముషాలని అతడు చెబుతాడు.


ఇదీ ఓ కథ. మనిషి జీవితంలో విజయం కోసం పోరాడుతూ మధ్యలో ఏదో నిరాశను తెచ్చుకుని దానికారణంగా పోరాటాన్ని అపకూడదని చెప్పే కథ.


                               ◆నిశ్శబ్ద.