అన్నయ్య తప్పు చేశాడు..తమ్ముడు సరిదిద్దాడు

 

 

 

సాధారణంగా తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య సరిదిద్దుతూ వుంటాడు. కొణిదెల ఫ్యామిలీ విషయంలో మాత్రం అన్నయ్య చిరంజీవి తప్పుచేస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ సరిదిద్దాడు. ఇంతకీ చిరంజీవి చేసిన తప్పేంటి.. పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా సరిదిద్దాడు? 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.

 

అప్పట్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా వున్నాయి.  మధ్యలో పానకంలో పుడకలా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఓట్లు చీలేలా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయేలా చేసింది. ఇంతా చేసి ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికలలో సాధించింది బోడి 18 అసెంబ్లీ సీట్లు అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది.


రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి తనవంతు పాత్రని పోషించింది. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించకుండా వుంటే ఇలాంటి ఉపద్రవాలు సంభవించి వుండేవే కావు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వుండేది కాదు.. ఎన్నో స్కాములు జరగకుండా వుండేవి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోకుండా వుండేది. ఆ రకంగా ప్రజారాజ్యం పార్టీ తద్వారా చిరంజీవి తప్పు చేశారు. ఆ తప్పును ఇన్నేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సరిదిద్దారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సహకారాన్ని అందించారు. ఆ రకంగా అన్నయ్య చిరంజీవి ఐదేళ్ళక్రితం చేసిన తప్పుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ పరిహారం చేసేశాడు.