జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఏకగ్రీవానికి బీఆర్ఎస్ బేరసారాలు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన  మాగంటి గోపినాథ్  అనారోగ్యంతో ఇటీవల మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లు పోటీకి రెడీ అవుతున్నాయి. అభ్య ర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించేశాయి.  అయితే బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రిముఖ పోటీలో విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు వచ్చి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది.

 అయితే కాంగ్రెస్ ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  విజయం సాధించి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి కుటుంబంలోని వ్యక్తినే నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. మాగంటీ గోపీనాథ్   సతీమణి పోటీకి సుముఖంగా లేకపోవడంతో మాగంటి గోపీనాథ్  సోదరుడు వజ్రనాథ్ లేదా మాగంటి గోపీనాథ్ కుమారుడిని రంగంలోకి దింపాలని ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

అయినా త్రిముఖ పోటీలో విజయం నల్లేరు మీద బండి నడక కాదన్న ఉద్దేశంతో ‘ఏకగ్రీవం’ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిస్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో  ఆ దివంగత  ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది. దీనిని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ పాటించాయి.  అయితే రాష్ట్ర విభజన తరువాత ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వాస్తవానికి దానిని పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పాలి.  అయితే ఇప్పుడు మళ్లీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి ఆ పాత సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ దిశగా బీఆర్ఎస్ ఎంఐఎం, బీజేపీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తానే గండి కొట్టిన సంప్రదాయాన్ని ఇప్పుడు మళ్లీ తీసుకువచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమౌతాయన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే మాగంట గోపీనాథ్ కు అన్ని రాజకీయపార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కుటుంబం పట్ల సానుభూతి ఉంది. దీనినే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.