రాజీనామా చేయనుగాక చేయనంతే...

 

 

 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మటాష్ అయిపోగానే బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు కొంతమంది రాజీనామా బాట పట్టారు. బీహార్‌లో నితిష్ కుమార్ రాజీనామా చేసేశాడు. అస్సాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేస్తానని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా, రాహుల్ కూడా రాజీనామా చేసేస్తామని చెబితే కాంగ్రెస్ నాయకులంతా కాళ్ళావేళ్ళాపడి ఆపారు. వీళ్ళ వరస ఇలా వుంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మాత్రం తన పదవికి రాజీనామా చేయనుగాక చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఓటమి తర్వాత పార్టీ నాయకురాలు సోనియాగాంధీని కలసి వచ్చిన వీరభద్రసింగ్ బయటకి వచ్చాక. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ఓడిపోయినంత మాత్రాన పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌‌లోని నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.