జగన్ కి షాకివ్వనున్న ఆ నలుగురు!
posted on Sep 11, 2015 11:28AM
.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలబోతోంది. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు గోడ దూకినా, ఏపీలో మాత్రం ఎవరూ ఆ సాహసం చేయకపోవడంతో ధీమాగా ఉన్న జగన్ కు నలుగురు ఎమ్మెల్యేలు కచ్చితంగా షాకివ్వబోతున్నట్లు విశ్వసనీయయంగా తెలిసింది. కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతలు... మొదట్లోనే ఝలక్ ఇవ్వగా, ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చిందని, దసరాకి కొంచెం అటూఇటుగా గోడ దూకేయడం ఖాయమని అంటున్నారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన జరిగే రోజే....పార్టీలో చేరేలా తెలుగుదేశం పెద్దలు ప్లాన్ చేశారని చెబుతుండగా, ప్రకాశం జిల్లా నుంచే అధికంగా ఈ వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతోపాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ లు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, గొట్టిపాటి, పోతుల... చంద్రబాబు సామాజిక వర్గానికే చెందినవారే కావడం విశేషం. ఇక కొద్దిరోజులుగా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు కూడా గోడ దూకేయడం ఖాయంగా తెలుస్తోంది. ఆ నలుగురితోపాటు... మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్ కి షాకివ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే.