లోకేష్ నీ బాడీని గ్యారేజ్ లో చూపించుకో.. మతిస్థిమితం లేని మంత్రి!!

 

'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.
 
కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు.

అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.