ఎంత మాటన్నారు స్వామిగౌడ్ సార్...
posted on Apr 15, 2015 3:15PM

ఉద్యమాలు చేసే సమయంలో ఎలాంటి మాట మాట్లాడినా చెల్లుతుంది. ఎంత ఘోరంగా మాట్లాడినా చెలామణి అయిపోతుంది. ఎవర్ని నోటికొచ్చినట్టు తిట్టినా నడుస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవులు అనుభవిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం వుంది. ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కి కూడా వర్తిస్తుంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో స్వామిగౌడ్ మాట్లాడిన ఘాటు మాటలు విని అందరూ తరించారు. ఆంధ్రప్రాంత ప్రజల్ని, నాయకులని మాగ్జిమమ్ ఏ స్థాయిలో తిట్టచ్చో ఆ స్థాయిలో ఆయన తిట్టేశారు. ఆ స్థాయిలో తిట్టడం వల్లే ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. శానసమండలి ఛైర్మన్ స్థానం మీద కూడా కూర్చోబెట్టారు. అత్యంత గౌరవనీయమైన స్థానంలో కూర్చున్న ఆయన తన ఫ్లాష్‌బాక్ మరచిపోకుండా పాత స్థాయిలోనే మాట్లాడ్డం బాధాకరం.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి స్వామిగౌడ్‌ని పెద్దమనిషి హోదాలో పిలిచారు. అక్కడ ఆయన చేయాల్సిన పని నాలుగు మంచి మాటలు మాట్లాడ్డం. కానీ ఆయన మాట్లాడిన మాటలు మంచి మాటలు కాదు... దారుణమైన మాటలు. ‘‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనడం ద్వారా ముస్లింలను డామినేట్ చేసేయాలి’’ అని అన్నారు. ఏమైనా అంటే, ఫీలవుతారుగానీ, విధానమండలి స్పీకర్ హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఇలా మాట్లాడిన ఆయన తన తప్పు తెలుసుకుని, వెంటనే నాలుక కరుచుకుని తన తప్పును సరిదిద్దుకుంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ పని చేయలేదు. ఈ వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సమాజంలో బాధ్యత వున్నవారు విమర్శించేసరికి రెండ్రోజుల తర్వాత దార్లోకి వచ్చారు. తాను అన్న మాటల వెనుక అసలు ఉద్దేశం వేరని, కన్నబిడ్డలున్నా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో ఉండటం చూసి తన హృదయం చలించిపోయి... గుండె కరిగిపోయి... బాధతో ఆ మాటలు అన్నానని సెలవిచ్చారు. మీరు ఏ ఉద్దేశంలో ఆ మాటలు అన్నా, మీ అసలు ఉద్దేశం ఏమిటో జనానికి అర్థమైపోయింది గౌరవనీయులైన స్వామిగౌడ్ గారూ.