జగన్ బస్సు యాత్ర తుస్సుమంటుందా?
posted on Apr 15, 2015 10:46AM

మొన్నటి వరకూ రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో రచ్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భవిష్యత్ తరాలు ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకునే విధంగా రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలకు అడ్డు పడటానికి జగన్ శాయశక్తులా కృషి చేశారు. దొనకొండలో రాజధాని పెట్టలేదన్న బాధ ఒకవైపు, చంద్రబాబుకు మంచి పేరు వచ్చేస్తోందన్న కడుపు మంట మరొకవైపు జగన్ సారుని రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రేరేపించాయి. అయితే స్థానిక రైతులు జగన్ అండ్ బ్యాచ్‌ని రచ్చ చేయనిచ్చీ చేయనిచ్చీ చివరికి చాల్చాల్లే వెళ్ళవయ్యో అనేశారు. దాంతో జగన్ బృందం తోకముడిచేసింది. ఇప్పుడేం రచ్చ చేయాలా అన్న ఆలోచనలో జగన్ సార్‌కి పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు దొరికాయి.
పోలవరం ప్రాజెక్టుగానీ, పట్టిసీమ ప్రాజెక్టుగానీ పూర్తి కావడం, రైతులు బాగుపడటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా వుండటం జగన్ గారికి ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకేనేమో పనిగట్టుకుని మరీ ప్రధాని దగ్గరకి వెళ్ళి ఈ ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన చెడు అంతా చెప్పారు. ఇతర రాష్ట్రాలు ఎలా ఈ ప్రాజెక్టులకు అడ్డు తగలచ్చో ఉప్పు ఇచ్చే విధంగా కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాలకు బస్సు యాత్రని చేపట్టి, అక్కడి రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఒరిగేదేమీ లేదంటూ మొన్నటి వరకూ పాడిన జగన్, ఆ పాటకు తన పార్టీకి చెందిన రాయలసీమ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతాయట. ఉభయ గోదావరి జిల్లాల రైతులేమో సముద్రంలోకి పోయే నీటిని తరలిస్తే మాకేం ప్రాబ్లం అని స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్ మహాశయుడు బస్సు యాత్ర చేపట్టారు.
అయితే జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర తుస్సుమనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎంతమాత్రం వ్యతిరేకత లేదు. ఎవరో తన పార్టీకి చెందిన వారిని నలుగుర్ని వెంటేసుకుని వెళ్ళి అక్కడ హడావిడి చేసినంత మాత్రాన ఒరిగేదేమీ వుండదని అభిప్రాయపడుతున్నారు. అసలు ఎవరికీ సమస్య లేని అంశం మీద బస్సు యాత్ర చేపట్టిన జగన్ తాను అనుకున్న ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదని వారు అంటున్నారు. రాజధాని భూముల విషయంలో జగన్‌కి ఎలాంటి పరాభవం జరిగిందో, అలాంటి పరిస్థితే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జగన్‌కి ఎదురయ్యే అవకాశం వుండొచ్చని భావిస్తున్నారు. తన మీటింగ్‌కి వచ్చే తన సొంత పార్టీ వారికే ప్రసంగాలు వినిపించి జగన్ వెనుదిరగాల్సి రావచ్చని భావిస్తున్నారు.