స్పీకర్ వార్నింగ్... అయినా తగ్గేది లేదంటున్న జేఏసీ...

అమరావతి పరిరక్షణ సమితి, విపక్షాలు పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీ, జైల్ భరోపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అసెంబ్లీని ముట్టడిస్తాం... కట్టడి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. చట్ట సభలను అడ్డుకోవడం, ముట్టడికి పిలుపునివ్వడం సభా హక్కులు, రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనాసరే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టసభల్లోకి అగంతకులు ప్రవేశించకూడదనే నియమ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ అవి చట్టాలకు లోబడే ఉండాలని సూచించారు. ముట్టడిస్తాం, కట్టడి చేస్తామంటే అది చట్టసభలనే హెచ్చరిస్తున్నట్లుగా ఉందని, ఇది మంచి పద్ధతి కాదని స్పీకర్ సీతారాం వ్యాఖ్యానించారు.

అయితే, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినాసరే అసెంబ్లీని ముట్టడించి తీరుతామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు అంటున్నారు. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరతామని ప్రకటించిన జేఏసీ నేతలు...  అరెస్టులు చేసినాసరే తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు.