ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యత.. గోవా గవర్నర్ అశోకగజపతి రాజు
posted on Jul 15, 2025 6:17AM

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోక్ గజపతిరాజు విజయనగరంలో సోమవారం (జులై 14) మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ అవకాశాల కోసం అర్రులు సాచలేదనీ, వాటి వెంట పరుగెత్తలేదనీ చెప్పారు. పార్టీ నాయకత్వం, ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా, నిబద్ధతతో నిర్వహించానన్నారు. గోవా గవర్నర్‌గా తనను నియమించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన ఆయన గోవా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని, అయినప్పటికీ ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చానన్న అశోకగజపతి రాజు.. విజయనగరం రాజవంశం నుంచి వచ్చిన తాను, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాననీ, ఇప్పుడు గోవా గవర్నర్‌గా కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతానన్నారు.
గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఆ సమయంలో తాను చేపట్టిన పనులు దేశ విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్నారు.