అమెరికాపై మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు
posted on Dec 4, 2015 9:21AM
.jpg)
ఆర్.ఎస్.ఎస్.అధినేత మోహన్ భగవత్ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలని, అందుకు భారతీయులు అందరూ ముందుకు రావాలని కోరారు. గుజరాత్ లోని సుప్రసిద్ధ సోమనాద్ దేవాలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా ఆయన అమెరికాపై కూడా ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. ప్రపంచంలో ఎక్కడయినా ఆ దేశ విలువలపైనే దాడులు జరుగుతుంటాయి. అమెరికా మూలాలు దాని వ్యాపారంలోనే ఉన్నాయి కనుక ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ ట్రేడ్ సెంటర్ పై దాడులు చేసారని అన్నారు. అంటే భారతీయ మూలాలు హిందుత్వంలో ఇమిడి ఉన్నాయి కనుక హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని కనుక దానిని కాపాడుకోవాలని ఆయన చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అందరూ అభివర్ణిస్తుంటారు. కానీ ఆయన ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశమని, దానిని అందరూ గౌరవించాలని ఆయన చెప్పడం గమనిస్తే ఈ భిన్నత్వాన్ని ఆదరిస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందరూ గౌరవించాలని చెపుతున్నట్లు భావించవచ్చును.
శ్రీరాముడు కొందరికి దేవుడయితే, మరి కొందరు ఆదర్శనీయమయిన సత్పురుషుడుగా భావిస్తారని అన్నారు. కనుక ఆ మహాపురుషుడు జన్మించిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగితే చూడాలని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. తన జీవిత కాలంలో ఈ కోరిక తీరుతుందో లేదోననే అనుమానం కూడా వ్యక్తం చేసారు. ఆర్.ఎస్.ఎస్.కి చెందిన అధికారిక ట్వీటర్ ఖాతాలో ఆయన ఇవ్వన్నీ పేర్కొన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని ఆయన కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దాని వలన దేశంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయో ఆయనకి, ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి అందరికీ తెలుసు. అందుకే అటువంటి ఆలోచనలు ఎవరూ చేయడం లేదు. కానీ ఇరు మతగురువులు, పెద్దలు కలిసి చర్చించుకొని ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటే తప్ప ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం దొరకడం కష్టం. అది సాధ్యం కాదనుకొన్నప్పుడు యధాస్థితిలో వదిలిపెట్టడమే ఉత్తమ పరిష్కారం.